పిరమిడ్లు ఎలా కట్టారు? ఈ ప్రశ్నకు 4500 ఏళ్ళ నుంచి సమాధానం లేదు.. ఇప్పుడు 'నేను చెబుతా' అంటున్నాడొక శాస్త్రవేత్త! ఏం చెబుతాడో చూద్దామా!
పిరమిడ్ల గురించి చెప్పాలంటే అన్నీ వింతలే. అన్నీ అద్భుతాలే. అన్నీ సందేహాలే. అన్నీ రహస్యాలే. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా కట్టారనే ప్రశ్నలకు ఎన్నో జవాబులు ఉన్నాయి. ఏదీ కచ్చితమైనది కాదు. అందుకే అవంటే ప్రపంచవ్యాప్తంగా అంత ఆసక్తి. వీటి నిర్మాణం గురించి ఇప్పటికి కూడా అంతపట్టని విశేషాలు ఎన్నెన్నో! సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిరమిడ్లను ఇంత కచ్చితంగా, ఇంత చాకచక్యంగా కట్టలేమని చెబుతారు.
ఎన్నో పరిశోధనలు!
భారీ యంత్రాలు, క్రేన్లు, కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు, సిమెంట్‌లాంటి నిర్మాణ పరికరాలు, ఆఖరికి కొలబద్దలు కూడా లేని కాలం అది. అప్పట్లోనే ఈజిప్షియన్లు ఈ భారీ పిరమిడ్లను నిర్మించారు. వీటిని ఎలా కట్టారన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా బోలెడు పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఎంతో మంది రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అయితే ఇవేవీ కూడా అన్ని సందేహాలను తీర్చే విధంగా వివరణలను అందించలేదు.
లోపలి నుంచి బయటికి!
ఇప్పుడు ఒక ఫ్రెంచి శాస్త్రవేత్త జీన్ పియరే హుడిన్ మాత్రం 'పిరమిడ్ల రహస్యాని నేను కనిపెట్టాను' అని చెబుతున్నాడు. 'పిరమిడ్లను లోపలి నుంచి బయటకి కట్టుకుంటూ వచ్చారు' అనేది ఆయన సిద్ధాంతం. కేవలం చెప్పడమే కాకుండా కంప్యూటర్ల సాయంతో త్రీ డైమన్షనల్ (త్రీడీ) పద్ధతిలో ఆయన దాన్ని వివరిస్తున్నారు. త్రీడీ సినిమాలను మనం ప్రత్యేకమైన కళ్ళజోళ్ళు పెట్టుకుని చూస్తాం కదా? అలా ఈయన కూడా పిరమిడ్ల నిర్మాణం గురించి ఒక కంప్యూటర్ సినిమాను చూపిస్తారన్నమాట. పరిశోధకులు, ఇంజినీర్లు త్రీడీ కళ్ళజోళ్ళు పెట్టుకుని ఈయన ప్రదర్శనను చూసి 'నిజమే.. ఇలాగే కట్టి ఉంటారు' అంటున్నారు. అంత బాగుందన్నమాట ఆయన వివరణ.
8 ఏళ్ళ శ్రమ!
పిరమిడ్లలో అతి పెద్దదైన గ్రేట్ పిరమిడ్ నిర్మాణంపై హుడిన్ ఎనిమిదేళ్ళ పాటు పరిశోధన చేశాడు. తాను ఊహించిన సిద్ధాంతం ప్రకారం తెర మీద పిరమిడ్‌ను నిర్మించగలిగే ప్రత్యేకమైన కంప్యూటర్‌ను రూపొందించడానికి ఆయనకు రెండేళ్ళు పట్టింది. ఆ తర్వాత ఓ కంప్యూటర్ సంస్థ సాయంతో ఏడు త్రీడీ కంప్యూటర్లను ఒక నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించి గ్రేట్ పిరమిడ్‌ను కట్టి చూపించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీడీ వర్చువల్ రియాలిటీ ఆడిటోరియంలో సాగే ఆ ప్రదర్శన.. 4,500 సంవత్సరాల క్రితం పిరమిడ్‌ను కట్టిన స్థలం ఎలా ఉందో చూపించడంతో మొదలవుతుంది. ఆ స్థలంలో శాస్త్రవేత్త కలియ తిరుగుతూ ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. ఒకో రాయిని ఎలా పేర్చారో చూపిస్తూ.. మొత్తం పిరమిడ్ నిర్మాణాన్ని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు.
ఇలా కట్టారు
ఒకోటీ రెండున్నర టన్నుల బరువుతో నలుపలకలుగా ఉండే లక్షలాది భారీ రాతి దిమ్మలను ఒకదానిపై ఒకటి పేరుస్తూ 449 అడుగుల ఎత్తయిన గ్రేట్ పిరమిడ్‌ను కట్టారనేంత వరకే మనకు తెలిసింది. క్రేన్లు లేని కాలంలో అంత ఎత్తుకు అంత బరువైన దిమ్మలను తీసుకు వెళ్ళాలంటే ఏటవాలుగా మార్గాలను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. అలాంటి మార్గాలను బయటి నుంచి ఏర్పాటు చేసుకుంటూ, వాటి మీద దిమ్మలను మనుషులచే లాగించి పేర్చుకుంటూ కట్టి ఉంటారని ఇంతకాలం అనుకున్నారు. అయితే కొంత ఎత్తు తర్వాత ఇలా చేయడం అసాధ్యం అవుతుంది. ఇప్పుడు హుడిన్ సిద్ధాంతం ప్రకారం 'కొంత ఎత్తు వరకే ఇలా బయటి నుంచి ఏటవాలు మార్గాలతో కట్టారు. ఆ తర్వాత ఏటవాలు ర్యాంపులను లోపల గుండ్రంగా ఏర్పాటు చేసుకుని దిమ్మలను లాగి కట్టారు'. చెప్పడమే కాకుండా శాస్త్రీయంగా త్రీడీ కంప్యూటర్ నెట్‌వర్క్‌తో నిరూపించడంతో పురాతత్వ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు దీనిని ప్రశంసిస్తున్నారు.
ఎన్నెన్ని వింతలో!
పిరమిడ్ల గురించి ఆశ్చర్యకరమైన నిజాలతో పాటు, విచిత్రమైన నమ్మకాలు కూడా ఉన్నాయి.
* పిరమిడ్లను కట్టడానికి ఉపయోగించిన ఘనాకార రాతి దిమ్మల అంచులన్నీ కచ్చితమైన లంబాకార కోణంలో ఉంటాయి. ఈ రాతి దిమ్మల అమరిక అంగుళంలో వెయ్యింట ఐదు భాగాల వరకు కచ్చితంగా ఉంటుంది. వాటి మధ్య ఉంచిన ఖాళీలు ఎక్కడ చూసినా వందింట రెండు వంతుల తేడా కూడా ఉండదు.
* పిరమిడ్లలోని రాతి దిమ్మలను కలపడానికి ఉపయోగించిన పదార్థమేంటో ఇప్పటికీ తెలీదు. దాని రసాయన మిశ్రమాన్ని కనుక్కోగలిగారు కానీ ఆ పదార్థాన్ని తిరిగి తయారు చేయడం అసాధ్యమని తేలింది. ఇది రాతి కన్నా బలంగా దిమ్మలను పట్టి ఉంచుతోంది.
* ఆధునిక వంతెనల లాంటి నిర్మాణాలో వాడే బాల్, సాకెట్ పద్ధతిలో పిరమిడ్ల మూలల్లోని దిమ్మలను అమర్చారు. భూకంపాలు కూడా వీటిని ఏమీ చేయలేవు.
* గ్రేట్ పిరమిడ్‌ను ఖగోళ పరిశోధనకు కూడా ఉపయోగించారని చెబుతారు.
* గిజాలోని మూడు పెద్ద పిరమిడ్లు ఓరియన్ (వేటగాడు) అనే నక్షత్రసమూహంలోని మూడు ప్రధాన నక్షత్రాలకు (బెల్ట్) అనుసంధానంగా ఉంటాయి.
* భూమి, ఈజిప్టు, గ్రేట్ పిరమిడ్‌లోని రాణి గదుల సగటు ఉష్ణోగ్రత ఒకటే. అది 68 డిగ్రీల ఫారెన్‌హీటు.
* గ్రేట్ పిరమిడ్ నీడలను బట్టి సమయాన్ని తెలుసుకునే విధంగా దాని చుట్టుపక్కల కొన్ని ఆలయాలు, ప్రాంతాలు ఉన్నాయంటారు.
* భూమి మీది ఖండాల ద్రవ్యరాశి కేంద్రస్థానం ఎక్కడుందో అక్కడే పిరమిడ్‌ను కట్టారు.
* సముద్రమట్టానికి పైన భూమి సగటు ఎత్తు 5449 అంగుళాలు. గ్రేట్ పిరమిడ్ ఎత్తు కచ్చితంగా ఇంతే!
* పగలు, రాత్రి సమానంగా ఉన్న రోజు రాత్రి గ్రేట్ పిరమిడ్‌లో ఎత్తయిన ప్రాంతం అల్సియాన్ అనే నక్షత్రాన్ని సూచిస్తుంది. మన సూర్యకుటుంబం ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతుందని చెబుతారు.
* అరవై లక్షల టన్నుల బరువుండే పిరమిడ్‌ను కట్టే స్థలం అంతటి భారాన్నీ మోయగలిగి ఉండాలి కదా? గ్రేట్ పిరమిడ్ కింద పెద్ద గ్రానైట్ పర్వతం ఉండడం చిత్రం.
* సరైన కొలబద్దలు లేకపోయినా పిరమిడ్‌ను ఎంత కచ్చితంగా కట్టారంటే 230 మీటర్ల పొడవులో కేవలం 20 సెంటీమీటర్లే తేడా కనిపిస్తుంది.
* గ్రేట్ పిరమిడ్‌ను ఒక రాతి కంప్యూటర్ అనుకోవచ్చు. పిరమిడ్ పొడవు, ఎత్తు, కోణాలు లాంటి కొలతల సాయంతో గణిత సంబంధమైన చాలా సంగతులను లెక్కించవచ్చు.
* గ్రేట్ పిరమిడ్ సాయంతో భూమి సూర్యుని చుట్టూ తిరిగే దూరాన్ని, కాంతి వేగాన్ని కూడా లెక్కించగలిగేవారని చెబుతారు.
* పిరమిడ్ ఆధారంగా భవిష్యత్తు విషయాలు కూడా తెలుసుకోవచ్చని చెబుతారు. ఏసుక్రీస్తుకు శిలువ వేయడం, మొదటి ప్రపంచ యుద్ధం గురించి పిరమిడ్‌లో వివరాలు నిక్షిప్తమై ఉన్నాయని లండన్‌లోని పిరమిడాలజీ సంస్థ కనుగొంది. 2979లో ప్రపంచం అంతం అవుతుందనేది మరో జోస్యమట!
* పిరమిడ్ కేంద్రంలోని స్థలం అంతుపట్టని ప్రకృతి శక్తులకు నిలయమని నమ్ముతారు. అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయంటారు. పర్యాటకులు చాలామంది ఆ ప్రాంతంలో షాకుకు గురికావడమో, స్పృహకోల్పోవడమో జరుగుతుందని చెబుతారు.
Courtesy: ఈనాడు
Telugu Eenadu computer generated pyramid