వేరు వేరు కాదు, తల్లివేరు ఒక్కటే!
- సాయిబ్రహ్మానందం గొర్తి
'తెలుగువేరు, ఆంధ్రంవేరు' (నవంబర్ 13) వ్యాసానికి ప్రతిస్పందన ఇది. తెలుగు భాషకి, ఆంధ్రులకి సంబంధించిన అనేక చారిత్రాత్మక, సాంస్కృతిక నిజాలు అంటూ వ్యాసకర్త వారికి తెలిసిన విజ్ఞానాన్ని విశ్లేషణ పేరుతో అందరికీ పంచే సాహసం చేయడం ముదావహం! కులాల రాచపుండుతో అనారోగ్యం పాలయిన తెలుగు సాహిత్య రంగంలో రాజకీయ చెదపురుగులు కూడా ప్రవేశించి వారివంతు సాయం అవి చేస్తున్నాయనడానికి ఇలాంటి వ్యాసాలే ప్రత్యక్ష తార్కాణం. పరికించి చదివితే ఈ వ్యాసం యొక్క ప్రధాన రాజకీయ ఉద్దేశ్యం సుస్పష్టంగా అర్థమవుతుంది.
వ్యాసకర్త దృష్టిలో తెలుగు వేరు, ఆంధ్ర వేరట. ఆంధ్రులు అనబడేవాళ్లు ఆంధ్రంకంటే తెలుగు అన్న పదం లలితంగా సరళంగా ఉంటుందని తెలుగు అన్న పదాన్ని దొంగిలించారట. అంతేకాదు ఒక్క పోతన భాగవతం తప్ప, నన్న య, తిక్కన, ఎఱ్ఱాప్రగడ భారతం తెలుగు కాదట. (ఈ పోతనగారు కూడా ఏ కృష్ణా జిల్లాలోనో జన్మిస్తే అది వేరే సంగతి.) ఇంకా భౌగోళిక అంశాలను స్పృశి స్తూ త్రిలింగ దేశం నుండి తెలుగు అన్న పదం వచ్చింది, త్రిలింగ దేశం అంటే ఇప్పటి కరీంనగర్లోని కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యలో ఉన్న భూభాగా న్ని మాత్రమే తెలంగు దేశమని అన్నారని, అందులో చాలా భాగం ఇప్పటి తెలం గాణలో ఉంది కాబట్టి, తెలుగు అంటే తెలంగాణ వారి భాషే అన్న సరికొత్త అర్థా న్ని ఆపాదించారు. ఉర్దూలో తెలంగి అంటారని, అది కాస్తా తెలుంగు అయ్యిం దని చాలా చక్కగా సులభంగా విశ్లేషించేశారు. కాబట్టి ఇప్పటి తెలంగాణ వారి భాషే తెలుగుభాష అని పనిలో పనిగా నిర్ధారించేశారు.
మనదేశానికి ముస్లిం పాలకులు రాక పూర్వంనుండీ తెలుగు భాష లేదా? అప్పటి ద్రాక్షారామం చుట్టూ ఉన్న వాళ్ళు తెలుగు కాక ఏం భాష మాట్లాడేవారు? అవి కూడా చారిత్రాత్మకంగా నిర్ధారిస్తే బాగుంటుంది. అప్పట్లో ఇప్పటిలాగే నేలతల్లి ఒంటిమీద గీతలు గీయడం అబ్బలేదు కనక దేవాలయాలూ, పుణ్యక్షేత్రాలు అందరికీ తెలుసు కాబట్టి, వాటి ఆధారంగా ఆ మధ్య ప్రాంతంలోని దేశం త్రిలింగదేశం అని పిలిచారు. అంతేకానీ వ్యాసకర్త విశ్లేషణలా భాషని ఎవరూ స్వంతం చేసుకోలేదు. పోతన గారి భాగవతాన్ని మొదట్లో తెలుగు భాగవతమని ప్రచారంలో ఉండేదంటూ చెప్పడానికి ఆధారాలు ఏమిటి? ఆ తరువాతే ఆంధ్ర ప్రచురణ కర్తలు మదాంధ్ర భాగవతంగా మార్చి, పోతన గారిని కూడా ఆంధ్రీకరించేశారట. చక్కటి చారిత్రాత్మక విశ్లేషణ!
వ్యాసకర్తగారు పోతన గారి భాగవతాన్ని చదివినట్లుగా లేదు. 'నేనాంధ్ర భాషను రచయింపబూనిన శ్రీ మహాభాగవతంబునకుం బ్రారంభమెట్టిదనగా' అం టూ, 'ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్ తెలుగుల్ సేయుచు' అని నన్నయ తిక్కనలకు నమస్కరిస్తూ పోతనామాత్యుడు భాగవత ప్రారంభంలో చెప్పకనే చెప్పాడు. మరి పోతన గారి భాగవతం తెలుగులో రాసిం దా లేక నన్నయాది విరచిత భారతంలోలాగ ఆంధ్రంలో రాసిందా? ఒకవేళ పోతనగారి భాగవతమే అసలు సిసలైన తెలుగు అయితే మరి నన్నయ, తిక్కన భార తం ఏ భాషకి చెందినది? అంతేకాదు వ్యాసకర్త ఇంకాస్త ముందుకెళ్లి నన్నయ తిక్కన సంస్కృత భారతాన్నీ ఆంధ్రీకరించారేగానీ 'తెలుగీ'కరించలేదంటూ అతి తేలిగ్గా ధ్రువీకరించేశారు. నన్నయ భారతంలో 'నన్నయభట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యె' అని సుస్పష్టంగా చెప్పాడు. నన్న య భారతం చదివిన ఎవరికైనా అది ఆంధ్రమో, తెలుగో ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేకుండా తెలుస్తుంది. వ్యాసకర్త ఇవేమీ చదివిన దాఖలాలు ఈ వ్యాసంలో మచ్చుకైనా కనిపించలేదు.
ఆంధ్రం, తెలుగు వేరు వేరు జాతులనీ, భాషలనీ దంటు గారి ఉద్దేశ్యం. మరి అయితే ఆ ఆంధ్ర జాతికంటూ ఒక భాష ఉండాలి కదా? ఆ భాష ఏమిటి? చోళు లు అంటే చోళ దేశ ప్రజలు ఎలాగయ్యారో ఆంధ్ర దేశంలో ప్రజలు ఆంధ్రుల వుతారు. వారు మాట్లాడే భాష ఏదైనా అయి ఉండవచ్చు. వివిధ ప్రాంతాల్లో మాండలికాలు వేరయినా భాషా స్వరూపం ఒకటే అయినప్పుడు, అందునా కేవ లం ఏ 20 శాతమో వాడుక భాషలో వ్యత్యాసమున్నప్పుడు, ఆ మాండలికాలకి మూలం ఒకటే అయిన భాషతోనే పిలవడం పరిపాటి. ఇది భాషలపై పరిశోధన చేసిన ఎవరిని అడిగినా చెబుతారు. అంతేకాదు భాషాపరంగా ఒక ప్రదేశంలో నివసిస్తున్నవారిని గుర్తించడం కోసం ఆ దేశం పేరుతో అప్పట్లో పిలిచేవారు. అం దుకే చోళులు, పల్లవులు, కర్ణాటకులు అంటూ పిలవబడడం చరిత్రలో వింటూనే ఉన్నాం. అంతెందునకు శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగరంలో వాడుక భాష కన్నడ భాష అయినా అక్కడ తెలుగు మాట్లాడేవాళ్లు లేరా? కళింగదేశ విజయం నుండి వెనక్కి వస్తూ శ్రీకాకుళ మహాంధ్ర విష్ణాలయం దర్శించినప్పుడు, 'తెలుగుదేల యన్న దేసంబు ......' అన్నది అందరికీ తెలుసు.
ఇప్పటివరకు వచ్చిన భారతాలన్నీ ఆంధ్రభారతాలు అన్నారు కానీ తెలుగు భారతాలు అనలేదు కాబట్టి ఆంధ్రులు వేరు తెలుగువారు వేరంటూ నొక్కివ క్కాణించేశారు. దానికో మాయబజారు సినిమాలో కల్పిత ఉదంతం చెబుతూ ఆ విషయాన్ని తెలివిగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మాయాబజారు సిని మాలో గోంగూరను ఆంధ్ర శాకంబరీ అన్నారు కానీ తెలుగు శాకంబరీ అనీ, తెలుగు మాతా అనీ అనలేదు కదా అంటూ ఇంకో తర్కం లాగి ఆంధ్రజాతి, ఆంధ్రభాష వేరు అంటూ యావదాంధ్రదేశానికి బూజుపట్టిన తర్కపు పచ్చడి చక్కగా అందించారు.
వ్యాసకర్త నన్నయ, తిక్కనలతో సరిపెట్టకుండా సరాసరి 'మా తెలుగు తల్లి' పాట రాసిన శంకరంబాడి సుందరాచారి మీదపడి 'తెలుగు తల్లి' ఆయన సృష్టి అంటూ చెప్పేశారు. అంతేకాదు ఆంధ్ర అన్నది సంస్కృతానికి దగ్గర కాబట్టి లాలిత్యాన్ని తన పాటలో జొప్పించడం కోసం 'తెలుగు' అన్న పదాన్ని దొంగి లించి తన పాటలో పెట్టుకున్నారంటూ చచ్చి స్వర్గాన ఉన్నాయనకి దొంగతనం అంటగట్టేశారు. ఇంకానయం త్యాగయ్య, అన్నమయ్యల జోలికిపోలేదు. దూరం గా వేరే రాష్ట్రాల్లో జీవించేశారు కాబట్టి బతికిపోయారు. లేకపోతే వారు కూడా నన్నయ, తిక్కనల్లాగా ఆంధ్రీకరణ వాగ్గేయకారులనీ, తెలుగు దోపిడిదారులనీ ఓ ముద్ర వేసే ప్రయత్నం చేయలేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆంధ్రజాతి గౌరవాన్ని నిలుపుకోవడానికి ఆంధ్రులమనే వ్యవహరించుకోవాలంటూ ఓ ఉచిత సలహా కూడా పారేశారు. తెలుగు వాళ్లంటూ వెన్ను చరుచుకోనవసరం లేదంటూ ఎద్దేవా చేస్తూ కావాలంటే నన్నయ భారతాన్ని తేట తెలుగు పోతన భాగవతంతో పోల్చు కోండంటూ పని పురమాయించారు కూడా. పైగా మతాలు వేరైనా ఏకమవడం సాధ్యం కానీ భాష, సంస్కృతి వేరైతే కలవడం సాధ్యం కాదంటూ అందరి తరఫున వకాల్తా పుచ్చేసుకుని గట్టిగా ఉద్ఘాటిస్తే తేటతెల్లమయ్యేది వారి డొల్ల తనమే! చూడగా వ్యాసకర్త గారి ఉద్దేశం ప్రకారం ఆంధ్రదేశంలో పత్రికలన్నీ 'ఆంధ్ర' అన్న పదం ముందు తొలగించి వాటి స్థానంలో తెలుగు అని చేరిస్తే (ఆంధ్రజ్యోతిని తెలుగు జ్యోతనీ, ఆంధ్రభూమిని తెలుగుభూమనీ... అన్న మాట)నే క్షమించేలా ఉన్నారు. లేకపోతే వారిపై కూడా తెలుగు దోపిడిదారులన్న నిందపడే అవకాశం మెండుగా ఉంది. ఈ వ్యాసం సాహిత్యపరంగా కంటే రాజ కీయపరంగా రాసిందే కానీ, విషయ పరిజ్ఞానంతో రాసిందిలా అనిపించడం లేదు. భాష, సంస్కృతి అనే సున్నితమైన విషయాలను రాసేటప్పుడు ఏదో మన కి అనిపించింది రాసేయడం కాకుండా సరైన పరిశోధన చేసి, రుజువులు చూపిస్తూ తమతమ వాదాలను నిలబెట్టుకోవాలి. కానీ ఇలా రాజకీయ రంగు లేసుకుని రెచ్చగొడితే ఎవరికి లాభం? విభజన మంత్రం పఠించేవారికి భజన పరులుగా చేరి రాసే సాహిత్య వ్యాసాలు ఇలాగే డొల్ల వాదనతో కనిపిస్తాయి. గొంతెత్తి అరిస్తే చరిత్ర బెదిరిపోదు. సాహిత్యం పేరుతో తమతమ అభిప్రాయా లను రాజకీయ నాయకుల్లా ప్రజలపై రుద్దే ప్రయత్నంలో భాగంగా ఇది ఉద్దేశ పూర్వకమైన లొల్లిలా అనిపిస్తోంది తప్ప దీనివల్ల కొత్తగా తెలిసిన విషయమేమీ లేదు. రాజకీయ సాహిత్య ప్రవేశం చేస్తే ఒరిగే ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువ. ఈ విషయంలో రచయితలూ, కవులూ మినహాయింపు కాదు. తెలుగు వేరు, ఆంధ్రం వేరు కాదు, రెండింటికీ తల్లివేరు ఒక్కటే!
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu , Andhra Pradesh , Gorti Brahmanandam , Jyothy Jyothi January 2007 name Telangana Telengana