తెలుగు 'హోదా'కి ఏం తక్కువ?
గతంలో ఎన్నడూ చర్చకురాని విశేషాలు పలువురు అధ్యయనవేత్తల సమక్షంలో రెండురోజుల గోష్టిలో వెలికివచ్చాయి. పాతిక మంది పైచిలుకు పరిశోధకులు తమ పత్రాలు సమర్పించి అపురూపమైన అంశాల్ని తెలియచెప్పారు. తెలుగు ప్రాచీన భాష హోదా పొందటానికి చూపించాల్సిన సాక్ష్యాలు, రుజువులతో పాటు ఇప్పుడు అమలులో ఉన్న నిబంధనలపై కార్యాచరణ కూడా చర్చకు వచ్చింది. మన రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు మనసారా సంకల్పిస్తే 'తెలుగు హోదా' పెరగటం సులువైన విషయమే అని తేటతెల్లం అయింది. అత్యంత ప్రాచీనమైన భాషలుగా ప్రపంచం అంతా చెప్పుకొన్న గ్రీకు, లాటిన్, హిబ్రూలలో తెలుగు మాటలు శబ్ధాలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయం చర్చా వేదిక వెల్లడించింది. ఈ వేదికలో పాల్గొన్న అధ్యయనవేత్తలు వెల్లడించిన అంశాలు వారి మాటల్లోనే ...
క్రీస్తూ పుర్వం 4వ శతాబ్దిలోని రచనలు, మెగస్తనీస్ ప్రశస్తిలో త్రికలింగ భాష ఉంది. మెసపటోమియా తవ్వకాల్లో బయల్పడ్డ మట్టి పెళ్లలపై తెలుగు అక్షరాలు ఉన్నాయి. మన ఊళ్ల పేర్లను పరిశీలిస్తే 5000 ఏళ్ల పూర్వమే తెలుగు పలుకుల జాడ ఖాయంగా ఉందని తెలుస్తోంది.
-డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి (చరిత్ర నిపుణుడు)
భాషలకు గుర్తింపు, హోదా ఇదంతా ఇప్పుడు రాజకీయ వ్యవహారం అయిపోయింది. తమిళానికి ప్రాచీన హోదా వెనుక మోతాదు మించిన తమిళుల భాషాభిమానం, ఆపాదించుకున్న గొప్పతనమే కనిపిస్తున్నాయి. నిజానికి భావ వ్యక్తీకరణ, అభివ్యక్తిలో అన్నిభాషల కన్నా తెలుగుకు చేవ ఎక్కువ... తమిళం కన్నా కచ్చితంగా ఎక్కువ.
-ఆచార్య ఆర్.వి.ఎస్.సుందరం
నదీ తీర ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారి నుంచే భాష పుడుతుంది. మనలో జంటపదాల వాడుక చాలా ఎక్కువ త్రిలింగం, కళింగం, అంగయ వంగ, వంక-లంకల వంటివి పరిశీలిస్తే మన మాట వైభవం తెలుస్తుంది. అద్దంకి- పోరంకి, వీరావంక- చంద్రవంక, గోదావరి, కృష్ణ వంటి మాటలను పరిశీలించి చూస్తే వేల ఏళ్ల తెలుగు జాడలు కనిపిస్తాయి.
-డాక్టర్ పి.వి. పరబ్రహ్మశాస్త్రి
తమిళులు తమ భాషకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు. మన వాళ్లు ఆ దిశగా ఆలోచించటం లేదు. ప్రకృతిలోని అందాలకి మన వాళ్లు పెట్టుకున్నా పేర్లు ఇంకెవ్వరికీ లేవు. సముద్రతీరంలోని బెస్తలు, యానాదులలో అచ్చ తెలుగు పుష్కలంగా ఉంది. సంస్కృతం తెచ్చిపెట్టుకున్నా, తెలుగుపుస్తకాల భాష కన్నా ఎంతో ముందు జానుతెనుగు పాట ఉంది. మన తెలుగుకు ఎంత వెతికితే అంత గొప్పతనం ఉంది.
-కత్తి పద్మారావు
తెలుగు భాషకు నెత్తురు మరకలు ఉన్నాయి. పాలకులు- పాలితుల భాషల్లోని తేడాలు తెలుసుకోవాలి. మన భాషకు 'టాస్క్‌ఫోర్స్' బలం తేవాలి. అన్ని రంగాలు, విభాగాల్లో తెలుగు వాడుక ఉద్యమంలా రావాలి. మన భాష మన మాధ్యమం కావాలి. తెలుగుభాషా వికాసం కోసం చైతన్యవంతమైన స్పందన వెల్లువెత్తాలి.
- జ్వాలాముఖి
భాషా ప్రేమికులందరూ కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఉద్యమాలు రావు. 'నడుస్తున్న చరిత్ర'లో నాలుగేళ్లుగా భాషా ఉద్యమ వ్యాసాలు వస్తున్నాయి. తెలుగు తల్లి జెండా భుజానికి ఎత్తుకుని భాషోద్యమ కార్యకర్తలు జనంలోకి వెళ్లాలి. గాంధీలా అందరిలో కలిసి పోవాలి.
-డాక్టర్ సామాల రమేష్‌బాబు
అసలు ప్రాచీనత అంటే ఏమిటి... ఏ భాష అయినా ఉనికిలోకి రావాలంటే మూడు వేల ఏళ్ల నేపథ్యం ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళాలు ద్రవిడ భాషా కుటుంబంలోనివే. సోదర, దౌహిత్రంగా గుర్తుంచుకోవాలి. నిన్నటి భాష తరవాతి తరానికి కొత్తగా 'జన్మ' ఇస్తుంది. భాషల విషయంలో ప్రజాస్వామిక దృక్పథం ఆలోచనలు పెరగాలి.
-ఆచార్య జి. ఉమామహేశ్వరరావు
తెలుగు తనం పెంచే పేర్లు ప్రచారం కావాలి. సినిమా కళాకారులు ఇంగ్లీషు పేర్లు వాడుకలోకి తెస్తున్నారు. రజనీకాంత్, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ వంటివాళ్లు చూపిస్తున్న భాషాభిమానం మనకు స్ఫూర్తి దాయకం కావాలి. మండల కేంద్రాల స్థాయిలో భాషకు సంబంధించిన చర్యలు పెరగాలి. చిత్ర పరిశ్రమలోని వారంతా భాషోద్యమంలో కలిసిరావాలి. ప్రాచీనత కోసం మాత్రమే కాకుండా మన తెలుగు ఆత్మగౌరవం కోసం కలిసికట్టుగా కృషి చేయాలి.
-పలువురి సూచనలు
1957లో గిడుగు వెంకట శేషయ్య రూపొందించిన గ్రామలక్ష్మి వాచకంలో శాస్త్రీయ పద్ధతి ఆదర్శనీయంగా ఉంది. ఇప్పటి తెలుగు వాచకాలు ముద్రిస్తున్న ముద్రాపకులు ఎనిమిది మందిదాకా ఉన్నారు. ఐ.సి.ఎస్.సి. సిలబస్, తెలుగు భోధన బాధాకరంగా ఉన్నాయి. తెలుగును ఏ ఉపాధ్యాయుడైనా చెప్పవచ్చనే తేలికభావం పాఠశాలల్లో ఉంది. ముందుగా ఇది మారాలి.
-డాక్టర్ సి. రామచంద్రరావు, డాక్టర్. రెడ్డి శ్యామల
పత్రికల్లో కృతకమైన పదాలు వాడుతున్నారు. టి.వి లలో దారుణమైన సంకర భాష వచ్చేసింది. తెలుగు నుడికారం తగ్గిపోయింది. ఆర్థం తెలియకుండానే పద ప్రయోగాలు చేసేస్తున్నారు. రైతాంగం, విద్యుత్‌కోత, శీతాకాలం, విభావరి వంటి తప్పు ప్రయోగాలు వాడుతున్నామని చాలా మందికి తెలియదు.
-డాక్టర్ కాచినేని రామారావు
అచ్చ తెలుగు భాషలో సంగీతం ఉంది. మన మాటలోనే లయ ఉంది. కర్ణాటక సంగీతానికి జీవం పోసిన ఘనత తెలుగు వాగ్గేయకారులదే. 1941 ప్రాంతంలో తమిళ భాషలో కీర్తనలు పాడాలని టైగర్ వరదాచారి లాంటివాళ్లు ప్రయత్నించి విఫలమయ్యారు. పద్యం తెలుగుకు మాత్రమే ఉంది. పద్యాన్ని పాడడం కూడా మనలో మాత్రమే ఉంది.
-డాక్టర్ మృణాళిని
తెలంగాణలో తెలుగు పలుకుబడి అపారం. వృత్తిపదాలు, ఆయా పరిసరాలకు అనువైన మాండలికాలు పరిశీలించి స్టాటస్ పేపర్ రూపొందించాలి.
-డాక్టర్ ఆశీర్వాదం
జానపద సాహిత్యంలో 'భాష' ఎంతగానో పండింది. స్వరాలు పలికే తీరులో చాలా విశేషాలు ఉన్నాయి. రోకటి పాట, విసుర్రాయి, నలుగు పాటలతో పాటు పండుగల పాటలతో మన భాషా సంపత్తి, వైభవం తెలుస్తుంది. ఒక్క పల్లెలో తిరిగితే చాలు వందల పాటలు వినిపిస్తాయి.
-ఆచార్య భక్తవత్సల రెడ్డి
విజ్ఞాన సర్వస్వాలు భాషలో విప్లవానికి దోహదం చేస్తాయి. మరాఠి, మలయాళం, కన్నడిగులు ఈ రంగంలో ఆదర్శనీయమైన కృషి చేస్తున్నారు. మనం తప్పటడుగులు వేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
-ఆచార్య కె. ఆనంద్
అరవ దేశంలో, అరవానికి దగ్గరగా ఉన్నవారి మాట్లాడే తెలుగులో చక్కదనం చాలా ఉంది. 500 ఏళ్ల క్రితం నుంచి తమ మాట తీరును ఆపేక్షను పదిలంగా నిలుపు కుంటున్న వారు లక్షలలో ఉన్నారు. తమిళులుగా కనిపించే వారిలో చెదరని తెలుగుతనం ఉంది.
-ఎ.పరిమళ గంధం
నిఘంటువుల అవసరం ఇప్పుడు బాగా ఉంది. మనకు 200 పై చిలుకు ఉన్నాయి. ఎంఎ, ఎంఫిల్ వారు కూడా మంచి తెలుగు రాయలేక పోతున్నారు. డిక్షనరీల నిర్మాణం ప్రత్యేక శాస్త్రంగా వికసించింది. శబ్దం పదాలకు అర్థంతో పాటు ఉత్పత్తి సాంస్కృతిక నేపథ్యం కూడా తెలియచెబుతాయి.
-డాక్టర్ కె. రామాంజనేయులు
గోష్టిలో పాల్గొన్న అందరి అభిప్రాయాలు, అధ్యయనాలతో సమన్వయ సంకలనం వెలువరించ నున్నామని ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఆవుల మంజులత వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత అధికారిగా బాధ్యతలు నిర్వహించిన తమిళుడు కాశీపాండ్యన్ తెలుగుపై ప్రత్యేక పరిశీలన చేసి ప్రాచీనతకు ప్రామాణికతను నిర్ధారించారు. స్టెర్లింగ్ పబ్లిషర్స్ వెలువరించిన ఆ రచనను తెలుగులోకి అనువదించి అందుబాటులోకి తేబోతున్నామని ప్రకటించారు. చాలా జిల్లాల్లో 'భాష'పై ప్రీతి కలవారు తెలుగువిశ్వవిద్యాలయంతో చేయి కలుపుతున్నారని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వివరించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తెలుగువారంతా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని మామూలు పరిధి దాటి తమ కృషి విస్తరించబోతున్నామని వైస్‌చాన్స్‌లర్ హోదాలో డాక్టర్ మంజులత తెలియచేస్తున్నారు. అందరం కలిసి మెలిసి తెలుగు భాషా వికాసం, పరిరక్షణ కోసం పని చేద్దామని పెద్దలంతా పిలుపునిస్తున్నారు.
-జిఎల్‌ఎన్ మూర్తి
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh India Indian classical ancient language status demand Andhra Jyothy article Feb 2006 views interview tcld2006Labels: tcld2006