"అమెరికా ప్రపంచంలో చాలా రాజ్యాలను ప్రభావితం చేయగలుగుతుంది.. అక్కడ మనగలిగి ప్రచారంలోకి వస్తే ఆ భాష విశ్వవ్యాప్తం కావటం సులభం అవుతుంది'' అంటారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వేమూరి వెంకటేశ్వరరావు. ఆ పని జరగాలంటే అక్కడ తెలుగు పీఠాల అవసరం ఎంతైనా ఉందంటారు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో మాత్రమే తెలుగు పీఠం ఉంది. అది మరికొన్నేళ్లలో మూతపడే అవకాశం ఉన్నందున కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కిలీలో తెలుగు పీఠం ఏర్పాటుకు ప్రవాసాంధ్రులు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. వీటిలో రావు విశేషమైన కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన వేమూరి రావును 'నవ్య' పలకరించింది. ఆ విశేషాలలోకి వెళ్తే.. నవ్య: బర్కిలీలో తెలుగు పీఠం ఏర్పాటు ఎక్కడిదాకా వచ్చింది?
రావు: విరామం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. అనేక మంది మిత్రులు- అమెరికాలోను, ఇక్కడా మద్దతు ఇస్తున్నారు. పీఠం ఏర్పాటుకు సంబంధించి ఏం చేస్తున్నామో స్థూలంగా చెబుతాను. ప్రస్తుతం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో వెల్చేరు నారాయణరావుగారి నేతృత్వంలో ఒక పీఠం ఉంది.
ఆయన పదవీ విరమణ చేసిన తరువాత ఆ పీఠాన్ని తెలుగుకు కాకుండా మరో భాషకు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే అమెరికాలో ఉన్న ఏకైక తెలుగు పీఠం మూసేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల బర్కిలీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యాలని అమెరికాలోని తెలుగువారు ప్రయత్నిస్తున్నారు.
నవ్య: అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాస భారతీయులలోను ఒకరు ఆంధ్రులు. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది..?
రావు: ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విస్కాన్సిన్‌లో తెలుగు పీఠానికి కావాల్సిన సొమ్మును అమెరికా ప్రభుత్వమే ఇస్తూవచ్చింది కాని దాన్ని తెలుగువాళ్లు ఎక్కువగా ఉపయోగించుకోలేదు. అందువల్లనో మరెందువల్లనో ఆ పీఠాన్ని మరొక భాషకు ఇవ్వాలని నిర్ణయించారు.
ఎక్కువ మంది ఎందుకు చదువుకోవటం లేదని విశ్లేషిస్తే - విస్కాన్సిన్ విపరీతమైన చలి ప్రదేశం. అందువల్ల కాలిఫోర్నియా, జార్జియా, అట్లాంటా వంటి ప్రదేశాల్లో ఉన్నట్టుగా అక్కడ మనవాళ్లు ఉండలేరు. దాంతో అక్కడ తెలుగు ప్రజలు తక్కువ, విద్యార్థులు ఇంకా తక్కువ.
నవ్య: బర్కిలీలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడదని ఎలా చెప్పగలం?
రావు: విస్కాన్సిన్‌లో పీఠం అమెరికా ప్రభుత్వ సొమ్ముతో నడుస్తోంది. కాని బర్కిలీలో పీఠం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం - పది లక్షల డాలర్లు ( నాలుగు కోట్ల డెబై ్బ లక్షల రూపాయలు ) మనం సేకరించి ఇస్తే తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేయటానికి ఒప్పుకుంది. అంటే ఆ సొమ్ముతో పీఠానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.
ఒకసారి పది లక్షల డాలర్లను మూలధనంగా సమకూర్చుకోగలిగితే శాశ్వతంగా పీఠం ఏర్పడుతుంది. దీని కోసం గత రెండేళ్లుగా మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అందరి సహకారంతో దాదాపు మూడు లక్షల యాభై వేల డాలర్లు ( ఒక కోటీ అరవై నాలుగు లక్షల రూపాయలు ) దాకా సేకరించాం. దీనిని విశ్వవిద్యాలయానికి అందించాం. అప్పుడు వారు తాత్కాలిక ప్రాతిపదికన- తెలుగును బోధించటానికి ఒక బోధకురాలిని నియమించారు. అంతవరకూ బానే ఉంది.
కాని ఇటీవల నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కొన్ని కోట్ల డాలర్లు నష్టపోయింది. అదృష్టవశాత్తు మనం ఇచ్చిన సొమ్మును వారు ఎక్కడా పెట్టుబడి పెట్టలేదు. ఆ విధంగా మనం సేకరించిన సొమ్ముకు నష్టం రాకుండా బయటపడ్డాం. కాని వీలైనంత త్వరలో మిగిలిన సొమ్మును వారికి అందించాల్సిన అవసరం ఉంది.
నవ్య: మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇక్కడివారి నుంచి సాయం అడిగారా?
రావు: గతంలో మన రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయంతో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఈ పీఠానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు విశ్వవిద్యాలయం కొంత సొమ్మును కూడా అందించింది. ఆ తర్వాత నిధుల కొరత వల్ల కాబోలు.. దానిపై కూడా కోత పడింది.
తెలుగు విశ్వవిద్యాలయం ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చి, ప్రభుత్వమూ సహకరిస్తే - తెలుగు పీఠం ఏర్పాటు పెద్ద కష్టం కాదు. ఈ పరిణామాలను వివరించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరడానికి ముఖ్యమంత్రిగారిని కలిసి సాయం అర్థించాల్సి ఉంది. ప్రభుత్వమే కాదు.. తెలుగు భాష మీద మమకారం ఉన్నవారందరూ మాకు సహకరించాలి. అప్పుడే ఈ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
నవ్య: తెలుగు భాషాభిమానుల నుంచి స్పందన ఎలా ఉంది?
రావు: అందరికీ ఈ ప్రయత్నం సఫలమవ్వాలనే ఉంది. కాని పది లక్షల డాలర్లు సేకరించటం అంత సులభమైన పని కాదు. ఇది మాకు ముందే తెలుసు. అయినా పట్టువీడకుండా ప్రయత్నిస్తున్నం లేదు. తెలుగుభాష అమెరికాలో కలకాలం నిలిచిపోవాలంటే ఇదొక మంచి అవకాశం. దీనిని వదిలేసుకుంటే మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అంతేకాకుండా ఈ ప్రయత్నంలో కొంత వరకూ విజయం సాధించాం కాబట్టి మరింత ముందుకు వెళ్తేనే మంచిది.
నవ్య: మీరు తెలుగులో అనేక సైన్స్ పుస్తకాలు రాశారు. ప్రస్తుతం తెలుగులో సైన్స్ పరిభాష మీద మీ అభిప్రాయమేమిటి?
రావు: సైన్స్‌కు సంబంధించిన మరిన్ని తెలుగు పదాలు రావాల్సిన అవసరం ఉంది. కేవలం వీటిని పుట్టిస్తే చాలదు. వాటిని ప్రచారంలోకి కూడా తేవాలి. ఇక్కడ మీకో ఉదాహరణ చెబుతా. వికీపీడియా అనేది మన కళ్ల ముందు పుట్టింది. పీడియా అంటే విజ్ఞాన సర్వస్వం అని మనకు తెలుసు. హవాయ్‌లో వికీ వికీ అంటే చకచక అని అర్థం. వేగంగా వెళ్లే బస్సులను వికీ అని పిలుస్తారు.
ఏ సమాచారాన్నైనా వేగంగా అందించటం వికీపీడియా ప్రధాన లక్షణం. వికీపీడియా రూపకర్త దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఆ పేరును పెట్టాడు. హవాయ్ భాషలో ఉన్న ఒక పదం ఇంత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినప్పుడు..తెలుగు పదాలను మనం ఎందుకు ప్రచారంలోకి తేలేకపోతున్నాం? తెలుగులో గబగబ..చకచక..లాంటి పదాలు ఉన్నాయి. మన ఎక్స్‌ప్రెస్ బస్సులకు గబగబ అనో చకచక అనో ఎందుకు పేరు పెట్టుకోకూడదు? కొందరికి నా వాదన మొండిగా అనిపించవచ్చు.
కాని హవాయ్ భాషకు సాధ్యమైనది తెలుగుకి ఎందుకు కాదు? దీనికి నా దృష్టిలో ప్రధాన కారణం- ఇంగ్లీషు భాషపై మనకున్న మోజు. బ్రిటిష్‌వారికి ఫ్రెంచ్ అంటే మోజు. దానిలో మాట్లాడితే గొప్ప అని వారు భావిస్తారు. మనకి ఇంగ్లీషు.. అంతే తప్ప తెలుగు పదాలను ప్రచారంలోకి తేవటానికి భారీగా ప్రయత్నాలు జరగటం లేదు.
నవ్య: ఇంగ్లిషు విశ్వజనీనమైన భాష అయినప్పుడు దానిలోనే నేర్చుకోవటం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి కదా..
రావు: నేను ఇంగ్లీషు నేర్చుకోవద్దనటం లేదు. అది తిండి పెట్టే భాష. దానితో పాటుగా తెలుగును కూడా నేర్చుకోమంటున్నా. పరిపుష్ఠం చేయమంటున్నా. మీరు పుట్టకముందు సంగతి ఒకటి చెబుతా.
1968లో కంప్యూటర్‌కు సంబంధించిన అంశాలను అచ్చమైన తెలుగులో వివరిస్తూ వ్యాసాలు రాశాను. అవి పత్రికల్లో ప్రచురితమయ్యాయి కూడా. పుస్తకంగా వేద్దామనుకున్నాం కాని కుదరలేదు. అప్పుడే మనం కంప్యూటర్‌కు సంబంధించిన కొన్ని పదాలను ప్రచారంలోకి తెస్తే- ఇప్పుడు ఇంగ్లీషుపై ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా..?
నవ్య: మీ వంతు ప్రయత్నాలు ఇంకా ఏం చేస్తున్నారు?
రావు: నేను ఇండియా వదిలేసి చాలాకాలమయి పోయింది. నెట్‌లో సైన్స్‌కు సంబంధించి అనేక వ్యాసాలు రాస్తున్నా. ప్రస్తుతం మాత్రం తెలుగు పీఠంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించా. మీ ద్వారా పాఠకులకు నా విన్నపం ఒకటే. తెలుగును బతికించుకోవాలంటే అందరం కలిసి సంఘటితంగా ముందుకు వెళ్లాలి.
అందరూ తలో చేయి వేయాలి. ఒక రూపాయా.. పది రూపాయలా అనేది ప్రశ్న కాదు. తెలుగు పీఠానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ కింది ఫోన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు 9491822218.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం - పది లక్షల డాలర్లు ( నాలుగు కోట్ల డెబై ్బ లక్షల రూపాయలు ) మనం సేకరించి ఇస్తే తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేయటానికి ఒప్పుకుంది. అంటే ఆ సొమ్ముతో పీఠానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఒకసారి పది లక్షల డాలర్లను మూలధనంగా సమకూర్చుకోగలిగితే శాశ్వతంగా పీఠం ఏర్పడుతుంది. దీని కోసం గత రెండేళ్లుగా మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అందరి సహకారంతో దాదాపు మూడు లక్షల యాభై వేల డాలర్లు ( ఒక కోటీ అరవై నాలుగు లక్షల రూపాయలు ) దాకా సేకరించాం.
-సివిఎల్‌ఎన్
Courtesy: ఆంధ్ర జ్యోతి
Prof Vemuri Rao UC Davis university california Berkeley Andhra USA America united states classical
Labels: Telugu