"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, May 25, 2005

నారాయణ శతకము- బమ్మెర పోతన

నమామి నారాయణ పాద పంకజం
వదామి నారాయణ నామనిర్మలం
భజామి నారాయణ తత్త్వమవ్యయం
కరోమి నారాయణ పూజనం సదా |S1O|

ఆలోక్య సర్వ శాస్త్రాణి
విచార్యచ పునః పునః
ఇదమేకం సునిశ్హ్పన్నం
ధ్యాయేన్నారాయణం సదా |S2O|

శ్రీ రమా హృదయేశ్వరా - భక్త జన చిత్త జలరుహ భాస్కరా
కారుణ్య రత్నాకరా - నీవె గతి కావవే నారాయణా || [1]

పాప కర్మములఁ జేసి - నరక కూపములఁ బడజాల నిఁకను
నీపాద భక్తి యొసఁగి - యొక్క దరిఁ జూపవే నారాయణా || [2]

దాన ధర్మములఁ జేయ-నేర, నీ దాసులను బొగడ నేర,
నా నేరములఁ దలఁపక - దయ చేసి నన్నేలు నారాయణా || [3]

ఆన యించుక లేకను - దుర్భాశ్హ లాడు నా జిహ్వ యందు,
నీ నామ చతురక్షరి - దృఢముగా నిలుప వలె నారాయణా || [4]

ఒకటి పరిశుద్ధి లేక - నా జన్మ మకట! వ్యర్థం బాయెను
అకలంక మగు మార్గముం - జూపవే సకలేశ! నారాయణా || [5]

వేగి లేచినది మొదలు - సంసార సాగరంబున నీఁదుచు
మీ గుణము నొక వేళను - దలఁపగదె మేలనుచు నారాయణా || [6]

లోక వార్తలకు మరఁగి - కర్ణముల మీకథల విన నేరను,
ఏ కరణీ భవ జలధిఁ - దుదముట్ట నీఁదెదను నారాయణా || [7]

ఇల మనుజ జన్మ మెత్తి - సుజ్ఞాన మించు కంతయు లేకను,
కలఁతఁ జెందెడు చిత్తమున్‌ - స్వచ్ఛంబుగాఁ జేయు నారాయణా || [8]

యెంత పాపాత్ముఁడైన - మిముఁ దలంచి కృతకృత్యుఁడౌనుఁ,
బుడమి నింత పరుసము సోఁకిన - లోహంబు హేమమౌ నారాయణా || [9]

కామాంధకారమునను - బెక్కు దుశ్హ్కర్మములఁ జేసి నేను,
నీ మఱుఁగు జొచ్చినాను - నామీఁద నెనెరుంచు నారాయణా || [10]

సమయమైనపుడు మిమ్ముఁ -దలచుటకు శక్తి గలుగునొ కలు
గదో, సమయమని తలఁతునిపుడు -నా హృదయ కమలమున నారాయణా || [11]

ఆటలన్నియు ఱంకులు -నేనాడు మాటలన్నియు బొంకులు,
పాటింప నింతకైన -నున్నదే పాపంబు నారాయణా || [12]

వావి దప్పిన వాఁడను -దుశ్హ్క్రియా వర్తనుఁడ నగుదు నేను,
బావనునిగాఁ జేయవె ననుఁ బతిత పావనుఁడ నారాయణా || [13]

దేహమే దృఢమనుచును -దెలిసి నే మోహబద్ధుఁడ నగుచును,
సాహసంబున జేసితిఁ -నేగురు ద్రోహంబు నారాయణా || [14]

ఎన్ని జన్మము లాయెనో -నేటి కెందెందు జన్మించినానో
నన్ను దరిఁ జేర్పఁ గదవొ -యిఁకనైన నా తండ్రి నారాయణా || [15]

యమ కింకరులఁ దలఁచిన -నాగుండె యావులింపుచు నున్నది
యముని బాధలు మాన్పను -మాయప్ప వైద్యుఁడవు నారాయణా || [16]

అరయఁ గామ క్రోధముల -లోభంబు మోహమద మత్సర
ములు, తఱుఁగ వెప్పుడు మనసున -నిన్నెపుడుఁ దలచెదను || [17]

ఆశా పిశాచి పట్టి, -వైరాగ్య వాసనలఁ జేరనీయదు
గాసి పెట్టుచు నున్నది -నేనేమి చేయుదును నారాయణా || [18]

తాపత్రయంబుఁ జెంది -చాలఁ బరితాప మొందెడు చిత్తము
నీ పాదములఁ జెందినఁ -జల్లనై నిలిచెదను నారాయణా || [19]

చింతా పరంపరలచేఁ -చిత్తంబు చీఁకాకు పడుచున్నది,
సంతోశ్హమునఁ గూర్పవె -దివ్య ప్రసాదములు నారాయణా || [20]

ప్రాయమెల్లను బోయెను -నాశ లెడఁ బాయఁ జాలక యున్నవి
మాయా ప్రపంచమేల -చేసెదవి మాయయ్య నారాయణా || [21]

శరణుఁ జొచ్చినవాఁడను -నేఁ జేయుదురితముల నపహరించి
పరమ పద మొసఁగఁ గదవె -యిఁకనైనఁ బరమాత్మ నారాయణా || [22]

సంకల్పములు పుట్టినఁ -గర్మ వాసనల దృఢముగఁ జేయవు
సంకటము నొందించకే -నను సత్య సంకల్ప నారాయణా || [23]

ఒకవేళ నున్న బుద్ధి -యొక వేళ నుండదిఁక నేమి సేతు
విశదంబుగాఁ జేయవే -నీవు నా చిత్తమున నారాయణా || [24]

నెట్టుకొని సకల జీవ -కోటులను గొట్టి భక్షించినాను
పొట్ట కొఱకై నీచుల -సేవించి రట్టయితి నారాయణా || [25]

నేను పుట్టినది మొదలు -ఆహార నిద్రలనె జనె కాలము
పూని యెప్పుడు సేయుదు -నీపదధ్యానంబు నారాయణా || [26]

ప్రొద్దు వోవక యున్నను -వేసరక పొరుగిండ్లు తిరుఁగుగాని
బుద్ధిమాలిన చిత్తము -నీయందుఁ బొందదే నారాయణా || [27]

ఎన్ని విధములఁ జూచిన -నిత్యమును హృదయమున మిము
మఱవక యున్నంతకన్న సుఖము -వేఱొక్కటున్నదే నారాయణా || [28]

లాభ లోభముల విడిచి -యిహపరంబులను ఫల మాసింపక
నీ భక్తులైన వారు -ధన్యులై నెగడెదరు నారాయణా || [29]

ముందు నీ సృశ్హ్టి లేక -సచ్చిదానంద స్వరూపంబును
బొంది భేదము నొందక -బ్రహ్మమై యుందువఁట నారాయణా || [30]

కాలత్రయీ బాధ్యమై -మఱి నిరాకారమై యుండు కతనఁ
జాలఁగాఁ దత్త్వజ్ఞులు -తెలియుదురు సత్తగుట నారాయణా || [31]

జ్ఞాన స్వరూపమునను -నజడమై జడ పదార్థము నెల్లను
గానఁగాఁ జేయు కతనఁ -జిత్తండ్రు ఘనులు నిను నారాయణా || [32]

సుఖ దుఃఖముల రెంటికి -వేఱగుచు సుఖ రూపమైన కతన
నఖిల వేదాంత విదులు -ఆనందమండ్రు నిను నారాయణా || [33]

గుణ మొకటియైన లేని -నీయందు గుణమయంబైన మాయ
గణుతింపఁ గను పట్టెడు -దర్పణము కైవడిని నారాయణా || [34]

అందుఁ బ్రతిబింబించిన -చిత్సదానంద సముదాయమెల్లఁ
జెందు నీశ్వర భావము -త్రిగుణ సం శ్లిశ్హ్టమయి నారాయణా ||[35]

సత్వంబు రజము తమము -నను మూఁడు సంజ్ఞలను గ్రమము
తోడఁ దత్త్వజ్ఞులేర్పరింపఁ -సద్గుణ త్రయములను నారాయణా || [36]

ప్రకృతి నీయందు లీనమై -యుండి స్మృతిని జెందిన వేళను
సకల ప్రపంచ మిటులఁ -గనుపట్టె నకళంక నారాయణా || [37]

మీరు సంకల్పించిన -యిశ్హ్టప్రకారమును జెందు మాయ
యారూఢి వివరించెద -నవ్విధం బొప్పంగ నారాయణా || [38]

పంచభూతములు మనసు -బుద్ధియును బ్రకటహంకారము
లును, నెంచంగ నిట్టిమాయ -యిదిగా ప్రపంచంబు నారాయణా || [39]

భూతపంచక తత్త్వ సం -ఘాతమునఁ బుట్టె నంతఃకరణము
ఖ్యాతిగా నందుఁ దోఁచి -చిత్తు జీవాత్మాయె నారాయణా || [40]

వెస మనో బుద్ధి చిత్తా -హంకార వృత్తు లంతఃకరణము
ప్రచురింప నవి నాలుగు -తత్త్వ రూపములాయె నారాయణా || [41]

భౌతిక రజోగుణములును -నేకమై ప్రాణంబు పుట్టించెను
వాద భేదములచేతఁ -బంచ పాపములాయె నారాయణా || [42]

అలరు ప్రాణ మపానము -వ్యానంబుదానము సమానంబులు
తలఁప నీ సంజ్ఞలమరి -వాయుతత్త్వము లొప్పు నారాయణా || [43]

ప్రత్యేక భూత సత్త్వగుణములన -బరఁగి బుద్ధీంద్రియములు
సత్త్వమున జనియించెను -దత్త్వ ప్రపంచముగ నారాయణా || [44]

చెవులు చర్మముఁ గన్నులు -జిహ్వ నాసికయుఁ బేరుల చేతను
దగిలి బుద్ధీంద్రియముల -విశ్హయ సంతతిఁ దెలియు నారాయణా || [45]

భౌతిక తమోగుణమున -విశ్హయములు తఱుచుగాఁ జనియిం
చెను, శబ్ద స్పర్శ రూప -రస గంధ నామములు నారాయణా || [46]

తాదృశ రజోగుణమున -జనియించె నరక కర్మేంద్రియములు
ఐదు తత్త్వమ్ము లగుచును -గర్మ నిశ్హ్ఠాదులకు నారాయణా || [47]

వాక్పాణిపాదపాయూ -పస్థలను వాని పేళ్ళమరుచుండుఁ
బ్క్వహృదయులకుఁ దెలియు -నీవిధము పరమాత్మ నారాయణా || [48]

పలుకు పనులును నడుపును -మలమూత్రములు విడుచుటీ య
యిదును వెలయఁ గర్మేంద్రియముల -విశ్హయములు నళినాక్ష నారాయణా || [49]

పరఁగఁ జంద్రుండు బ్రహ్మ -క్షేత్రజ్ఞుఁ డరువొందు రుద్రుఁ
డచటి, పరమానసాదులకును -నధిపతులు వివరింప నారాయణా || [50]

అరయ దిక్కున వాయువు -సూర్యుఁడును, వరుణుండు, నశ్విను
లును, బరఁగ శ్రోత్రాదులకును -నధిపతులు పరికింప నారాయణా || [51]

అనలుఁ, డింద్రుఁడు, విశ్హ్ణువు -మృత్యువును, నల ప్రజాపతియుఁ
గూడి, యొనరఁగా నాడులకును -నధిపతులు పరికింప నారాయణా || [52]

పంచీకృతంబాయెను -భూతపంచకము, ప్రబలించి సృశ్హ్టి
పంచీకృతముచేతను -స్థూల రూపము లాయె నారాయణా || [53]

పది యింద్రియముల మనసు -బుద్ధియును, బ్రాణంబులైదు
గూడి, పదియేడు తత్త్వములను -సూక్ష్మరూపములాయె నారాయణా || [54]

స్థూలసూక్ష్మములు రెండు -కలుగుటకు మూలమగు నజ్ఞాన
ము, లీల కారణ మాయెను -జీవులకు నాలోన నారాయణా || [55]

ఈరెండు దేహములకు -విశ్వంబు నెల్లఁ బ్రకటనంబాయెను
నామ రూపముల చేత -లోకైక నాయకుఁడ నారాయణా || [56]

కొన్ని మాయనుఁ బుట్టును -గ్రుడ్లతోఁ గొన్ని తనువులు పుట్టు
ను, గొన్ని ధరణిని బుట్టును -జెమటలను గొన్ని హరి నారాయణా || [57]

ఈ చతుర్విధ భూతములందుఁ -గడు హెచ్చు మానవ జన్మము
నీచమని చూడరాదు -తథ్యమే నిర్ణయము నారాయణా || [58]

ఈ జన్మమందెకాని -ముక్తి మఱి యేజన్మమందు లేదు
చేసేతఁ దను దెలియక -మానవుఁడు చెడిపోవు నారాయణా || [59]

చేతనాచేతనములు -పుట్టుచును రోఁతలకు లోనగుచును
నాతంక పడుచుండును -గర్మములఁ జేతఁనుడు నారాయణా || [60]

సకలయోనులఁ బుట్టుచుఁ -బలుమాఱు స్వర్గ నరకములఁ బడు
చు, నొకట నూఱట గానక -పరితాప మొందితిని నారాయణా || [61]

వెలయ నెనుబదినాలుగు -లక్ష యోనులయందుఁ బుట్టిగిట్టి
యలసి మూర్ఛలఁ జెందుచు -బహుదుఃఖముల చేత నారాయణా || [62]

క్రమముతో మనుజగర్భ -మునఁ బడుచుఁ గర్మవశగతుఁడగు
చును, నమితముగ నచ్చోటను -గర్భనరకమునఁ బడు నారాయణా || [63]

ఈశ్వరాజ్ఞను బుట్టిన -తెలివిచే హృదయమునఁ దలపోయుచు
విశ్వమునఁ దను బొందిన -పాటెల్ల వేర్వేఱు నారాయణా || [64]

చాలు చీ! యిక జన్మము -నిఁకఁ బుట్టుఁ జాలు, శ్రీహరి భజించి
మేలు చెందెద ననుచును -జింతించు నాలోన నారాయణా || [65]

ప్రసవకాలమునఁ దల్లి -గర్భమునఁ బాదుకొని నిలువలేక
వసుధపయి నూడిపడినఁ -దెలివిచే వాపోవు నారాయణా || [66]

చనుఁబాలు గుడిచి ప్రాణ -ధారణను నిఁక మూత్ర మలము
లోను, మునిఁగితేలుచునుండును, దుర్గంధమున నారాయణా || [67]

బాలత్వమున బిత్తరై -నలుగడలఁ బాఱాడు సిగ్గులేక
పాలుపడి యౌవనమునఁ -విశ్హయానుభవమొందు నారాయణా || [68]

ముదిమి వచ్చిన వెనుకను -సంసారమోహంబు మానకుండఁ
దుదనేఁగుఁ గర్మగతులఁ -బొందుటకు ముదమేమి నారాయణా || [69]

అజ్ఞాన లక్షణమ్ము -లిటువంటివని విచారించి నరుఁడు
సుజ్ఞానమునకుఁ -దగిన మార్గంబు చూడవలె నారాయణా || [70]

వేదాంత వేదియైన -సద్గురుని పాదపద్మములు చెంది
యాదయానిధి కరుణచే -సద్బోధ మందవలె నారాయణా || [71]

ఏ విద్యకైన గురువు -లేకున్న నావిద్య పట్టుపడదు
కావునను నభ్యాసము -గురుశిక్ష కావలెను నారాయణా || [72]

గురుముఖంబైన విద్య -నెన్నికై కొనిన భావజ్ఞానము
చిరతరాధ్యాత్మ విద్య -నభ్యసింపఁగ లేడు నారాయణా || [73]

అనపేక్షకుఁడు సదయుఁడు -వేదాంతనిపుణుఁడయ్యాచార్యు
డు దొరుకుటపురూపమపుడు -గుఱుతైన గుఱి యొప్పు నారాయణా || [74]

అట్టిసద్గురుని వెదకి -దర్శించి యా మహాత్ముని పదములు
పట్టి కృతకృత్యుఁడౌను -సాధకుఁడు గట్టిగా నారాయణా || [75]

మొగి సాధనములు నాల్గు -గలనరుఁడు ముఖ్యాధికారి యగును
దగిన యుపదేశమునకు -యోగసాధకులలో నారాయణా || [76]

ఇది నిత్య మిదియనిత్యం -బనుచుఁ దన మది వివేకించుటొ
కటి, యెదను నిహపర సుఖములు -కోరనిది యిదియొకటి || [77]

ముదముతో శమదమాది -శ్హట్క సంపద గలిగి యుండుటొ
కటి, విదితముగ ముక్తిఁ బొందఁ -గాంక్షించు టదియొకటి || [78]

ఈనాల్గు సాధనముల -నధికారియై నిజాచార్యుఁ జేరి
నానా ప్రకారములను -శుశ్రూశ్హ నడుపవలె నారాయణా || [79]

ఉల్లమునఁ గాపట్యము -లవ మైన నుండ నీయక సతతము
తల్లి దండ్రియుఁ దైవము -గురువనుచుఁ దలఁపవలె నారాయణా || [80]

తనువు, ధనమును, సంపద -గురుని సొమ్మని సమర్పణము
చేసి, వెలసి తత్పరతంత్రుఁడై -నిత్యమును మెలఁగవలె నారాయణా || [81]

ఏనిశ్హ్ఠ గురునిశ్హ్ఠకు -దీటుగాదీ ప్రపంచంబునందు
మానసము దృఢము చేసి -యలరవలె మౌనియై నారాయణా || [82]

ఇట్టి శిశ్హ్యుని పాత్రత -వీక్షించి హృదయమునఁ గారుణ్యము
నెట్టుకొని బ్రహ్మవిద్య -గురుఁడొసఁగు నెయ్యముగ నారాయణా || [83]

బ్రహ్మంబు గలుఁగఁగానె -యేతత్ప్రపంచంబు గలిగి యుండు
బ్రహ్మంబు లేకున్నను -లేదీ ప్రపంచంబు నారాయణా || [84]

ఈ విధంబున సూక్తుల -బ్రహ్మ సద్భావంబు గలుగఁ జేసి
భావ గోచరము చేయుఁ -జిత్స్వరూపములెల్ల నారాయణా || [85]

ఆ బ్రహ్మమందె పుట్టు -విశ్వంబు నాబ్రహ్మమందె యుండు
నా బ్రహ్మమందె యణఁగు -నదె చూడు మని చూపు నారాయణా || [86]

అది సచ్చిదానందము -అది శుద్ధ మది బద్ధ మది యుక్తము
అది సత్య మది నిత్యము -అది విమలమని తెలుపు నారాయణా || [87]

అదె బ్రహ్మ మదె విశ్హ్ణువు -అదె రుద్రుఁ డదియె సర్వేశ్వరుండు
అది పరంజ్యోతి యనుచు -బోధించు విదితముగ నారాయణా || [88]

భావింప వశముగాదు -ఇట్టిదని పలుక శక్యంబుగాదు
భావంబు నిలుపుచోట -నసి తాను బరమౌను నారాయణా || [89]

అది మాయతోఁ గూడఁగ -శివుఁడాయె, నదియె విద్యను గూ
డఁగ విదితముగా జీవుఁడాయె -నని తెలుపు వేర్వేఱ నారాయణా || [90]

శివుఁడు కారణ శరీరి -కార్యంబు జీవుఁడా లక్షణములు
ద్వివిధముగఁ దెలియు ననుచు -బోధించు వివరముగ నారాయణా || [91]

అరయ నిరువది నాలుగు -తత్త్వంబులై యుండు నందమ
గుచుఁ గరతలామలకముగను -బోధించుఁ బ్రకటముగ నారాయణా || [92]

కారణము కార్యమగుచు -వ్యవహార కారణాఖ్యత నుండును
నారూఢి బ్రహ్మాండము -పిండాండ మని తెలుపు నారాయణా || [93]

ఐదు భూతములు, నింద్రి-యములు పది, యంతరంగములు
నాల్గు, ఐదు విశ్హయములు తత్త్వ -సంఘాతమని తెలుపు నారాయణా || [94]

స్థూల సూక్ష్మాకృతులును -గారణముతో మూడు తెఱఁగులకు
ను, నీలమగు నందు నమరు -నని తెలుపు లాలించి నారాయణా || [95]

వెలసి పంచీకృతములు -నగు భూతములకుఁ బుట్టినది తను
వు, స్థూలంబు నది యనుచును -బోధించు దయతోడ నారాయణా || [96]

ఐదు నయిదింద్రియములు -ప్రాణంబు లయిదు, మనసును బు
ద్ధియుఁ, బాదుకొని సూక్ష్మ మందు -బోధించుఁ బ్రకటముగ నారాయణా || [97]

గాఢమగు నజ్ఞానము -ఈరీతిఁ గారణ శరీర మగును
మూఢులకు వశముగాదు -తెలియ విను మోదమున నారాయణా || [98]

ఈమూఁడు తనువులందు -దా నుండి ఈతనువు తాననుచును
వ్యామోహ పడుచుండు(ను) -జీవుండు వరుసతో నారాయణా || [99]

కలలేక నిద్రించును -కలఁగాంచి కడు మేలుగోరు చుండును
గలకాల మీ జీవుఁడు -త్రివిధములఁ గలసియును నారాయణా || [100]

ప్రాజ్ఞతైజస విశ్వులు -తానె, ఈపర్యాయముగ జీవుఁడు
ప్రజ్ఞగోల్పడ పొందును -సంసార బంధంబు నారాయణా || [101]

మూఁడవస్థలకు సాక్షి -యైనట్టి మూలంబు తాఁ దెలిసినఁ
జూడుమని సన్మార్గము -తేటగాఁ జూపుచును నారాయణా || [102]

నీవు దేహంబు గావు -ప్రాణంబు నీవుగావింద్రియములు
నీవుగాదని తెలుపును -వేదాంత నిలయమున నారాయణా || [103]

అనల తప్తంబు గాదు -జలమునను మునిఁగి తడిఁ జెందఁబో
దు, అనిలశుల్కంబుగాదు -నిరుపమం బని తెలుపు నారాయణా || [104]

కామహంకార మిపుడు -చిత్తంబుగా వీవు బుద్ధి నీవు
కావు మనసులు సత్యము -సాక్షివగు గట్టిగా నారాయణా || [105]

దేహధర్మములు నీకుఁ -దోఁచు టంతేగాని నిత్యముగను
మోహంబు మానుమనుచు -బోధించు ముఖ్యముగ నారాయణా || [106]

ఎన్ని దేహములు చెడిన -నీవు నేక స్వరూపుండ వగుచు
జెన్నలరి యుందు విలను -దత్త్వ ప్రసిద్ధముగ నారాయణా || [107]

అన్ని వేదాంత వాక్య -ములలో మహావాక్యములు నాలుగు
నిన్ను నీశ్వరునిగాను -వర్ణించు నిక్కముగ నారాయణా || [108]

ఉభయ దృశ్యోపాధులు, కడఁద్రోసిపోక యయ్యాత్మ మిగుల
నభయముగ నిటులెప్పుడు -చింతింపు మని తెలుపు నారాయణా || [109]

జీవ శివ తారతంయ -మున నైక్య సిద్ధి కానేర దనుచు
భావ సంశయము దీర్పు -కార్యార్థ పటిమచే నారాయణా || [110]

నిర్వికారుఁడవు నీవు -నీ యందె నిజమైన చందమునను
బర్వుఁ బ్రకృతి వికారము -లని తెలుపు ప్రౌఢిచే నారాయణా || [111]

సద్గురుం డీరీతిగా -బోధించు సరళితో వాక్యార్థము
హృద్గతముఁ జేసియుండి -జగతి జీవింపుదును నారాయణా || [112]

అని చింతనము జేయుచుఁ -జిత్తమునఁ దనివిఁ జెందుచు నెప్పు
డు, కనుదమ్ములను ముడుచుచు -ధ్యానంబుగాఁ జేయు నారాయణా || [113]

అపగతాఘ కృత్యుఁడై -ఈరీతి నభ్యాస మొనరించుచు
నపరోక్ష సిద్ధి నొందు -బ్రహ్మంబు తానగుచు నారాయణా || [114]

కందళిత హృదయుఁడగుచు -సచ్చిదానంద స్వరూపుఁడగు
చు, సందర్శితాత్ముఁడగుచు -నుండు నవికారతను నారాయణా || [115]

అవ్యయానంద పూజ్య -రాజ్య సింహాసనాసీనుఁడగుచు
భవ్యాత్ముఁడై వెలసెను -బూజ్య సంభావ్యుఁడై నారాయణా || [116]

నీవు సకలంబుగాని -యున్నదే నీకన్న వేఱొక్కటి
జీవుఁడని వర్ణించుట -వ్యవహార సిద్ధికిని నారాయణా || [117]

చిలుక పలుకులు పలికితి -నాకేమి తెలియుఁ దత్త్వ రహస్య
ము, వలదు నను నేరమెంచ -సాధులకు నళినాక్ష నారాయణా || [118]

శరణు భక్తార్తిహారి -గురురూప శరణు సజ్జన రక్షక
శరణు దురితౌఘనాశ -శరణిపుడు కరుణించు నారాయణా || [119]


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


6 Comments:

At 2:23 AM, Blogger kiran kumar Chava గారు చెప్పినారు...

ఎంత చక్కగా ఉన్నవి

 
At 11:13 AM, Anonymous kamesh గారు చెప్పినారు...

Nice one there.. Thanks..

 
At 7:02 AM, Blogger మనోహర్ చెనికల గారు చెప్పినారు...

thanks

 
At 8:40 AM, Anonymous Anonymous గారు చెప్పినారు...

ఇంతటి సత్కార్యమొనరించిన మీకు భగవత్కటాక్షవీక్షణ ప్రాప్తిరస్తు--వంశీ కన్నా

 
At 7:32 AM, Anonymous Anonymous గారు చెప్పినారు...

maa lanti vallaku edi chdive avkasham iccharu, meku baghavat kataksha veekshana prapti rastu

 
At 10:32 PM, Blogger shyam గారు చెప్పినారు...

Thank you but my Teleugu is not good..can I get a translation into simple telugu or in english

Pls let me know who can help....my mail ID is beeshyams@gmail.com

Thanks in anticipation

 

Post a Comment

<< Home