Eenadu cover page article on Telugu Wikipedia, Blogs
మన తెలుగు...వెబ్‌లో బహుబాగు
ఒకాయన ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ పరిశోధకుడు. నివాసం అమెరికాలో. ఇంకొకాయన విశాఖలో డిప్యూటీ కలెక్టరు. మరొకాయన బర్కిలీ తెలుగువిశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. వీళ్లందరికీ భిన్నంగా ఓ బిజినెస్ అనలిస్ట్, మరో రైతు. ఇంకా... సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లూ వైద్యులూ గృహిణులూ... ఒక్కరనేమిటి, నానా వృత్తుల వాళ్లూ కలిసి పనిచేయడం వెుదలుపెట్టారు. వెుదట్లో కొన్నేళ్లపాటు వీళ్లల్లో ఒకరితో ఒకరికి ముఖపరిచయాలు కూడా లేవు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకున్నది లేదు. అయినా ఈ అందరూ కలిసి ఒక్కటై తెలియని అనుబంధాన్ని అల్లుకున్నారు. నిండా 200మందికి మించని ఈ బృందం ఇంటర్‌నెట్‌లో తెలుగు ప్రభను వెలిగిస్తోంది. మనదైన నుడికారాన్ని బతికించటానికి నిశ్శబ్ద విప్లవం సాగిస్తోంది. భాష మీద అభిమానం, ఆధునిక సమాచార విప్లవాన్ని అమ్మభాషకు అన్వయించాలన్న ఆరాటం... ఇవే వారందరినీ కలిపి ఉంచుతున్న అంతస్సూత్రాలు. వారే... తెలుగు బ్లాగర్లూ స్వేచ్ఛాసమాచార విజ్ఞానం పేరిట సమస్త ప్రపంచజ్ఞానాన్నీ తెలుగులో అందిస్తున్న వికీపీడియన్లూ!
బాదరాయణ సంబంధం... 'మీ ఇంట్లో రేగు చెట్టుంది, మా ఇంట్లోనూ రేగుచెట్టుంది కనుక మనం మనం ఒకటి' అని దానర్థం. సాధారణంగా ఈ నుడికారాన్ని వ్యంగ్యంగా వాడతారు. కానీ ఇంటర్‌నెట్‌లో తెలుగువెలుగుల కోసం కృషిచేస్తున్న బ్లాగర్లూ వికీపీడియన్ల గురించి చెప్పడానికి ఇదయితేనే సరిగ్గా సరిపోతుంది బహుశా. అదీ సానుకూల అర్థంలో. ఎందుకంటే వాళ్ల బంధం బాదరాయణం కాదు... భాషాయణ సంబంధం. నిజం. మాతృభాష మీద అభిమానమే వారితో 'మనం మనం ఒకటి' అనిపిస్తోంది. అంతర్జాలంలో తెలుగును వెలిగించడానికి అవసరమైన సరికొత్త సాఫ్ట్‌వేర్లను రాసేలా చేస్తోంది. ఎన్నో సాంకేతిక పదాలకు తెలుగులో పదాలను కనిపెట్టేలా చేస్తోంది. ఇన్నిమాటలెందుకు? వారి నడుమ వారధిగా నిలుస్తోంది భాషాభిమానమే. లేకపోతే ఎక్కడి మిన్నెసొటా! ఎక్కడి పశ్చిమగోదావరి జిల్లా! ఎక్కడి మస్కట్! ఎక్కడి మహబూబ్‌నగర్!
ఎక్కడో మాంచెస్టరులో ఉన్న పిల్లల డాక్టరు కందంలో అందంగా పద్యాలల్లేస్తుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి దానికి తెలుగు అభిమానుల భేషులూ శభాషులూ శరవేగంతో వచ్చిపడిపోతుంటాయి.
నిండా పాతికేళ్లు నిండని మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఎక్కడో అమెరికాలో కూచుని కూనలమ్మ పదాలకు పేరడీగా 'గూగులమ్మ పదాలు' రాస్తాడు... సాక్షాత్తూ ఆరుద్ర గుర్తొచ్చేలాగా. మచ్చుకొకటి...
పైకోర్టు చివాట్లు - పాలకులకలవాట్లుతెలుగుమీద విపరీతమైన అభిమానం, సాహిత్యంతో కాస్తోకూస్తో పరిచయం, తమకు తెలిసిన విషయాల్ని అందరితోనూ పంచుకోవాలన్న ఆరాటం... వీటిల్లో ఏది లేకపోయినా ఈ గూగులమ్మ పదాలూ లేవు. తెలుగు బ్లాగులసలే లేవు. తెలుగు వికీపీడియా అనే స్వేచ్ఛా సమాచార విజ్ఞాన సర్వస్వం అంతకంటే లేదు.
పాలితుల గ్రహపాట్లు - ఓ గూగులమ్మా
ఇంటర్‌నెట్‌లో తెలుగు విస్తృతంగా విస్తరించడానికి ప్రధాన కారణం ఈ బ్లాగర్లూ వికీపీడియన్లే. నిజానికి బ్లాగులు వేరు, వికీపీడియా వేరు. అసలా రెండిటికీ సంబంధమే లేదు. బ్లాగులు సొంత అభిప్రాయాల మాలికల్లాంటివి. సరదాగా ఏదైనా రాసుకోవచ్చు. కానీ విజ్ఞానసర్వస్వంలో రాయడానికి అల్లాటప్పా విషయపరిజ్ఞానం ఉంటే చాలదు. రాసేదాంట్లో తప్పులుంటే కుదరదు. అన్నిటికీ మించి... వికీపీడియా ఉచిత సైటు కాబట్టి, దానికోసం ఎంత సమయం వెచ్చించినా ఒక్క పైసా రాదు. అయినా సరే, వృత్తిగత, వ్యక్తిగత జీవితాలతో పాటు రోజుకు 2 నుంచి 4 గంటలు అంతర్జాలంలో తెలుగువెలుగుల కోసం కేటాయిస్తున్నారు వారు. అందుకే వారి గురించి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తోంది.
ఎందరో మహానుభావులు...
వెన్న నాగార్జున, చావాకిరణ్... వెుదటాయన తెలుగు వికీపీడియాకు ఆద్యులయితే, రెండో వ్యక్తి తెలుగు బ్లాగులకు మూలపురుషుడు. బ్లాగర్లంతా 'చావా'ను ముద్దుగా పిలుచుకునే పేరు 'ఆదిబ్లాగరి'. వారిలో ముందుగా వెన్న నాగార్జున గురించి... ఈయన బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణులు. నెట్‌లో తెలుగుకు సంబంధించినంతవరకూ నాగార్జున రూపొందించిన 'పద్మ' అనే లిప్యంతరీకరణ పరికరం(ట్రాన్స్‌లిటరేషన్ టూల్) ఓ కీలక మైలురాయి. ఇంగ్లిషులో టైపుచేసిన అక్షరాలను తెలుగులో చూపించడం పద్మ ప్రత్యేకత. క్రమంగా దాని పాపులారిటీ గణనీయంగా పెరిగి భారతీయ భాషలన్నిటికీ విస్తరించింది. అలా పద్మ ప్రాజెక్టుతో బాగా వెలుగులోకి వచ్చిన నాగార్జునను వికీ నిర్వాహకుల్లో ఒకరైన మార్క్ విలియంసన్ సంప్రదించారు. ఆసక్తి ఉంటే, నిర్వహించగలరన్న నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియా(ఉచిత విజ్ఞాన సర్వస్వం)ను రూపొందించి ఇస్తామని టపా రాశారు. దాన్నో ఛాలెంజ్‌గా భావించిన నాగార్జున సానుకూలంగా స్పందించారు. అదీ మన తెలుగులో ఒక విజ్ఞానసర్వస్వం ఏర్పడాటానికి తొలిమెట్టు. అలా డిసెంబరు 9, 2003న తెలుగు వికిపీడియా ప్రారంభమైంది. దానికి తొలిపేజీనీ లోగోనూ రూపొందించింది వెన్న నాగార్జునే.
వెుదలైతే అయిందికానీ, 2004 ఆగస్టు దాకా అందులో ఒక్కవ్యాసమూ నవోదవలేదు. దాంతో దాని గురించి రచ్చబండ వంటి తెలుగు న్యూస్‌గ్రూపుల్లో ప్రచారం చేశారు నాగార్జున. రావ్ వేమూరి, ప్రొఫెసర్ కట్టా మూర్తి(మిచిగాన్ విశ్వవిద్యాలయం) వంటి విద్యాధికులు ఆ ప్రచారానికి తొలిగా స్పందించారు. ఆ దశలో... శ్రీనాథుడి పద్యాలనూ ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన వూరగాయరుచులను గురించి వివరిస్తూ నోరు వూరేలా కట్టామూర్తి రాసిన 'ఊరగాయ' వ్యాసం నెట్‌లో విహరించే చాలామంది తెలుగువారిని ఆకట్టుకుంది. ఇక వేమూరి వెంకటేశ్వరరావు బర్కిలీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు. ముందుముందు తెలుగులో ఆధునిక శాస్త్రసాంకేతిక పదాల కొరత ఎదురవుతుందనీ ఎప్పుడోనే గుర్తించి ఆ దిశగా ఆంగ్ల-తెలుగు, తెలుగు-ఆంగ్ల నిఘంటువులను కూర్చారు. వెంకటేశ్వరరావు సాధించిన మరో ఘనవిజయం బర్కిలీలో తెలుగుపీఠం స్థాపించడానికి కృషిచేసి ఇప్పుడక్కడ తెలుగుపాఠాలు చెబుతున్నారు.
కాలిఫోర్నియాలో ఉండే వాకాకిరణ్(వీటెల్ పేరుతో రాస్తారు), హైదరాబాదులో ఉంటున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగి చావాకిరణ్ వంటివారు తర్వాత దశలో కీలకంగా వ్యవహరించారు. అలా... నెమ్మదిగా 2005 ఏప్రిల్ నాటికి 57మంది సభ్యులు చేరారు. తెవికీలో వ్యాసాల సంఖ్య 110కి చేరుకుంది.
వీరితో తీరు మారింది!
ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ పరిశోధకుడు రవి వైజాసత్య, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న మాకినేని ప్రదీపు, హైదరాబాదు కూకట్‌పల్లిలో ఉండే చదువరి(తుమ్మల శిరీష్‌కుమార్) చేరికతో తెవికీ బలం పుంజుకుంది. రాశితో పాటు వాసీ పెరగడం వెుదలైంది. ప్రస్తుతం తెలుగు వికీ నిర్వహణలో ప్రముఖపాత్ర పోషిస్తున్న రవి వైజాసత్య మిన్నెసొటా(అమెరికా) వాసి. వెుదట్లో ఆయనకు తెలుగులో టైపు చేయడం కూడా రాదు. అప్పటి తన పరిస్థితి గురించి ఇలా వివరిస్తూ... '2005 ఏప్రిల్లో తెలుగు వికీ గురించి నాకు చాలా యథాలాపంగా తెలిసింది. గూగుల్లో దేనికోసవో వెతుకుతుంటే అనుకోకుండా ముత్యాల్లాంటి తెలుగుపదాలు కనిపించాయి. ఆ లింకుల ఆధారంగా వెళితే వికీపీడియా అనే విజ్ఞానపు ఖని ఉందన్న విషయం వెుదటిసారిగా తెలిసింది. ఆ సైటు తొలిపేజీలో 'తెలుగులో రాయటం ఎలా' అన్న లింకును చూసి నా కంప్యూటర్లో అందుకు తగ్గ అమరికలు చేసుకుని తీరిక దొరికినప్పుడల్లా తెలుగులో రాయడానికి ప్రయత్నించేవాణ్ని. తెలుగు కీబోర్డు గురించి అవగాహన లేకపోవడంతో ఒక్కొక్క కీనే నొక్కుతూ ఎలాగో కష్టపడేవాణ్ని. అంత చేసినా మరో అవరోధం. అప్పట్లో తెలుగు వికీ గురించి ఎవరికీ తెలీదు. అందులో ఎలా రాయాలో ఏం చెయ్యాలో వివరాలు ఉండేవి కావు. తెలుసుకోవడానికి ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదు. అడపాదడపా అతి కొద్దిమంది వ్యాసాలు రాసేవాళ్లు. దాంతో నాకు పెద్ద ఎడారిలో నేనొక్కణ్నే ఉన్నట్టనిపించింది. ఆంగ్ల వికీపీడియా చూసి అక్కడి విధివిధానాలనే ఇక్కడా ప్రయోగించి చూసేవాణ్ని. ఇలా లాభం లేదని సరాసరి ఆంగ్ల వికీ నిర్వాహకులను సంప్రదించి 'అయ్యా మా తెలుగు వికీపీడియా అంత క్రియాశీలకంగా లేదు. సాయం కావాలి' అని అభ్యర్థించి మెటావికీ నిర్వాహకుణ్నయ్యాను. అప్పటికి తెవికీ వ్యాసాల సంఖ్య 600' ...అంటారాయన.
2005 జులై చివరినాటికి తుమ్మల శిరీష్‌కుమార్ చేరికతో తెవికీలో రెండో దశ ప్రారంభమైంది. హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చిఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేసే ఈయన 'చదువరి' పేరుతో దాదాపు వెయ్యివ్యాసాలు అనువాదం చేశారు. తెవికీలో అడుగిడిన వెంటనే అక్కడి పద్ధతులను అర్థం చేసుకుని విధివిధానాలన్నింటినీ తెలుగులోకి తర్జుమా చేశారు. సాధారణంగా వికీలో రాసే వ్యాసాలకు సంబంధించి ఓ అనుబంధ చర్చా పేజీ ఉంటుంది. అక్కడ ఆంగ్లంలో చర్చలు జరుగుతాయి. అది కూడా తెలుగులోనే సాగాలంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించారీయన. ప్రస్తుతం తెవికీ నిర్వాహక కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరుగుతున్నాయంటే అది చదువరి చొరవే, చలవే. ఈ క్రమంలో 2005 డిసెంబరు నాటికి తెవికీ వ్యాసాల సంఖ్య రెండు వేలకు చేరింది.
మరింత వేగంగా...
2006జనవరి తెవికీ పరిణామ క్రమంలో అతిపెద్ద మైలురాయి. వెుదట్లో కొంతకాలం తెలుగు వికీపీడియా కోసం పనిచేసి వ్యక్తిగత కారణాలతో ఆర్నెల్లపాటు నిశ్శబ్దంగా ఉన్న మాకినేని ప్రదీపు మళ్లీ చురుగ్గా వ్యవహరించడం వెుదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మండలాలకూ మ్యాపులతో సహా పేజీలు రూపొందించారు మాకినేని ప్రదీపు. అన్ని పేజీలు వ్యక్తిగతంగా సృష్టించడం కష్టం కనుక అందుకోసం బాటు(ఆటోమేటిక్ ప్రోగ్రామ్‌డ్ స్క్రిప్ట్) రాశారాయన. బాట్లను రాయడంలో చెయ్యితిరిగిన ప్రదీపు... తెలుగువికీలో పదేపదే చేయాల్సిన నిర్వహణ పరమైన అనేక పనులకు బాట్లు రాసి ఎంతో శ్రమనూ సమయాన్నీ ఆదా చేశారు. బ్రౌను నిఘంటువులో 30వేలకు పైగా ఉన్న పదాల్ని తెలుగు విక్షనరీ(పదకోశం)లోకి బాటు ద్వారానే చేర్చారు. వ్యాసాల నాణ్యతను బేరీజు వెయ్యడం, కాపీ హక్కులు లేని బొమ్మలను తొలగించడంలోనూ ఈయనదే కీలక పాత్ర. హైదరాబాదుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు త్రివిక్రమ్ కూడా అదే సమయంలో తెవికీలో చేరారు(అనంతరకాలంలో చదువరితో కలిసి 'పొద్దు' అనే తెలుగు వెబ్‌జైన్‌ను స్థాపించారు). వీరంతా కలిసి తెవికీని వ్యాసాల నాణ్యతా పరంగా అద్భుతంగా అభివృద్ధి చేశారు.
2006 ఫిబ్రవరిలో వీవెన్(వీరవెంకట చౌదరి) అనే బిజినెస్ అనలిస్ట్ చేరడంతో తెవికీ రూపురేఖల్లో ఒకింత అందమైన మార్పు వచ్చింది. వెబ్‌డిజైనింగ్ మీద ఆసక్తితో సొంతంగా HTML నేర్చుకొన్న ఈ ప్రతిభాశాలి అప్పటిదాకా పేలవంగా ఉన్న తెలుగువికీ వెుదటిపేజీని చూడచక్కగా తీర్చిదిద్దారు. ఈయన ప్రముఖ బ్లాగరి కూడా. అప్పటికే వెబ్‌లో తెలుగు, తెలుగులో బ్లాగింగ్ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో అప్పటిదాకా ఎక్కడెక్కడో ఉంటూ పనిచేస్తున్న బ్లాగర్లు సమావేశం కావాలని సంకల్పించారు. వీవెన్, చదువరి, చావాకిరణ్, శోధన సుధాకర్, వెంకటరమణ, సీబీరావు, సత్యసాయి కొవ్వలి, కందర్ప కృష్ణవోహన్, కృష్ణకిషోర్, పులివెల కాశ్యప్ వంటి తెలుగుబ్లాగర్లంతా అందుకు స్పందించి హైదరాబాదులో సమావేశమై చర్చలు ప్రారంభించారు. ఆ సమావేశాల ప్రేరణతో 'పద్మ' సాఫ్ట్‌వేర్‌ను ఆధారం చేసుకొని దాన్ని మరింత సులభతరం చేస్తూ 'లేఖిని' అనే చక్కటి ఉపకరణాన్ని సృష్టించారు వీవెన్(ఇప్పుడు నెట్‌లో తెలుగు రాయాలనుకునే చాలామందికి 'లేఖిని'తోనే అక్షరాభ్యాసం చేయిస్తున్నారు వికీపీడియన్లు). ప్రస్తుతం విస్తృతంగా ప్రచారంలో ఉన్న అనేక ఆంగ్లపదాలకు బ్లాగర్లూ వికీపీడియన్లూ తెలుగు పదాలు కనిపెడుతున్న నేపథ్యంలో వాటన్నిటినీ ఒకదగ్గరకు చేరుస్తూ తెలుగుపదం అనే వెబ్‌సైటును సృష్టించారీయన. గూగుల్ తెలుగుబ్లాగర్ల గుంపుకూ సృష్టికర్త వీవెనే. ఈ కార్యక్రమాలన్నిటినీ అనుసంధానం చేస్తూ 'ఈ-తెలుగు' పేరుతో మరో వెబ్‌సైటునూ తీర్చిదిద్దిన ఘనత ఈయన సొంతం.
అగ్రస్థానానికి...
2006 మే నాటికి 3,300 వ్యాసాలతో తెలుగువికీ మన భారతీయ భాషల్లోనే అత్యధిక వ్యాసాలున్న వికీగా వెుదటిస్థానానికి చేరుకుంది. ఆ ఏడాది ఆగస్టులో బ్లాగర్ల సాయంతో సినిమాలకు సంబంధించి మరో మూడువేల వ్యాసాలను చేర్చారు. ఈ వ్యాసాల వెనక కాజసుధాకరబాబు, చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాసరాజు, గార్ల సురేంద్ర నవీన్ తదితరుల కృషి ఉంది. వీరిలో కాజ సుధాకరబాబు(కాసుబాబు) ఒమన్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరు. 2007 ప్రారంభానికి ఈయన తెవికీ నిర్వాహకుడు కూడా అయ్యారు. ఒక్కో విషయాన్నీ ఒక్కో ప్రాజెక్టుగా రూపొందించి ఆ అంశంలో ఆసక్తి ఉన్నవారు వ్యాసాలు రాసేలా ప్రతిపాదించారు. తెవికీలో ఇంగ్లిషులో ఉండిపోయిన వందలకొద్దీ పేజీలను తెలుగులోకి అనువదించారు. ఇక చిట్టెల్ల కామేశ్వరరావు విశాఖపట్నంలో బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగి. శ్రీనివాసరాజు(తెలుగు వికీ వ్యాఖ్య నిర్వాహకుడు) హైదరాబాదులోనూ సురేంద్రనవీన్(తెవికీ నిర్వాహకుడు) బెంగుళూరులోనూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వీరందరి కృషితో 2006 సెప్టెంబరుకల్లా ఆరువేల వ్యాసాలకు చేరుకుంది తెవికీ.
2007లో కొత్తగా చాలామంది చేరారు. వారిలో ముఖ్యులు... బ్లాగేశ్వరుడు. ఈయన అసలు పేరు శ్రీనివాసశాస్త్రి. లండన్‌లో శిశువైద్యులు. తెలుగు వికీలో పుణ్యక్షేత్రాల ప్రాజెక్టు ఈయన పుణ్యమే. ఈయన లాగానే రాజశేఖర్, మురళీకృష్ణ(మాచర్ల), వందన శేషగిరిరావు(శ్రీకాకుళం) వంటి వైద్యులు మానవశరీరం, వ్యాధులు వెుదలైన అంశాలపై చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. ఇక, హైదరాబాదుకు చెందిన ఆర్టిస్టు విశ్వనాథ్ తెలుగువికీకి ఫొటోలతో కొత్తందాలు చేకూరుస్తున్నారు. బ్లాగేశ్వరుడితో కలిసి ఈయన పుణ్యక్షేత్రాల ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వోద్యోగి చంద్రకాంతరావు ఆర్థికశాస్త్రం, వివిధక్రీడలకు సంబంధించిన వివరాలతో తెవికీని పరిపుష్టం చేస్తున్నారు. అలాగే విశాఖజిల్లా డిప్యూటీ కలెక్టరు రహంతుల్లా, మదనపల్లెకు చెందిన ఉర్దూకవి అహ్మద్‌నిసార్ ఇస్లాంకు సంబంధించిన వ్యాసాలపై కృషిచేస్తున్నారు. 'ఈ మాట' పేరుతో తొలి తెలుగు వెబ్‌జైన్(ఇంటర్‌నెట్ పత్రిక) రూపొందించిన కొలిచాల సురేష్, ఇంద్రగంటి పద్మ వంటి వారు సాంకేతికాంశాల విషయంలో, అచ్చుతప్పులు దిద్దడంలో సహకరిస్తున్నారు. నల్లవోతు శ్రీధర్... ఒక కంప్యూటర్ పత్రికకు ఎడిటర్ అయిఉండీ తెలుగు వికీపీడియన్లకు సాంకేతికంగా అండగా నిలుస్తున్నారీయన. తెవికీలో కొత్తగా చేరాలనుకునేవారికి కంప్యూటర్‌లో తెలుగు అమర్చుకోవడం దగ్గర్నుంచి అనేక టెక్నికల్ విషయాలను అరటి పండు ఒలిచినంత వివరంగా తేలిగ్గా నేర్పిస్తుంటారు. వీరందరితో పోలిస్తే... విక్షనరీ కోసం కృషిచేస్తున్న సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ ఓ సాధారణ గృహిణి అయుండీ కేవలం తెలుగుమీద అభిమానంతో విక్షనరీ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఈ బృహత్కార్యానికి తమ విజ్ఞానాన్ని దారబోస్తున్న ఇలాంటి మహానుభావులు ఇంకా ఎందరో ఉన్నారు! ఈ వ్యాసాలు రాసినందుకు వారికి ఐదు పైసల ఆదాయం ఉండదు. అయినా రాస్తున్నారంటే కారణం అమ్మభాషమీద అభిమానమే. ఏదో ఒకనాటికి తెలుగువారందరూ తమకు అవసరమైన అతిచిన్న సమాచారాన్ని సైతం తెలుగులోనే పొందాలన్న ఏకైక లక్ష్యంతో కృషిచేస్తున్న వారందరికీ వందనాలు.
షరా: తెలుగు వికీలో ప్రస్తుత వ్యాసాల సంఖ్య దాదాపు 38,300. తెలుగు వికీపీడియన్ల సంఖ్య సుమారు 3,500. భాషాభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ తలో చెయ్యీ వేస్తే తెవికీ లక్షవ్యాసాలకు చేరుకోవడం అంత కష్టమేం కాదు. బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా లాంటి అఖండ విజ్ఞాన సర్వస్వం తెలుగులో లేదన్న కొరతా తీరుతుంది.
http://te.wikipedia.org
http://groups.google.com/telugublog
http://etelugu.org
http://lekhini.org(తెలుగులో రాసేందుకు)
http://koodali.org(తెలుగు బ్లాగుల సమాహారం)
http://computerera.co.in./chat (సాంకేతిక సహాయాల కోసం)
వెుదట్లో తెలుగు వికీలో రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలకు అన్నిటికీ ప్రత్యేక పేజీలు ఉండటంతో వికీపీడియన్ల దృష్టి గ్రామాలవైపునకు మళ్లింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ సంబంధించిన వివరాలన్నీ ఒకేచోట రాయాలన్న ఆలోచనే గొప్పది. అందుకు సంబంధించి పేజీలను రూపొందించడం కూడా పూర్తయింది. 'వికీపీడియాలో మీ ఊరుందా?' అంటూ వెబ్‌సైటు వెుదటిపేజీలోనే దానికి పెద్దపీట వేశారు. ఇందులో ఎవరైనా సరే... తమ వూరికి సంబంధించిన వివరాలనూ ఫొటోలనూ దాంట్లో పెట్టగలిగితే వికీ చరిత్రలోనే ఇదో అద్భుత ప్రయోగమవుతుంది.
Courtesy: ఈనాడు
blogging computing software lekhini blog Feb February 2008 sunday edition newspaper Kiran Vaka telugutanam california blogger