ప్రాచీన చరిత్ర ఉంది
'న్యూస్‌టుడే' ఇంటర్వ్యూలో ఏబీకే
హైదరాబాద్ - న్యూస్‌టుడే

ప్రశ్న: తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలనే ప్రతిపాదనలు ఇప్పుడే వినిపిస్తున్నాయి. ఇంతకాలం ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకొన్నట్లు లేదు?
జవాబు: అవును. మనమూ, కన్నడ భాషావేత్తలు ఆలస్యంగా మేల్కొన్నాం. ముందుగా మేల్కొన్న తమిళులు లబ్ది పొందారు. తెలుగు, కన్నడ భాషలను అణచివేసేందుకు తమిళులు చేసిన రాజకీయ కుట్ర ఇది.
ప్ర: ప్రాచీన భాషగా గుర్తింపునిచ్చేందుకు ఇటీవల కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్లపై మీ అభిప్రాయం?
జ: ప్రాచీనతను గుర్తించడంపై వస్తున్న ఈ ప్రకటనలు రాజ్యాంగ విరుద్ధం.
ప్ర: అంటే కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ వెనుక వేరే ఉద్దేశాలున్నాయంటారా?
జ: తమిళ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగిఉంటుందని అనుకుంటున్నాను.
ప్ర: దీనిపై అధికారభాషా సంఘం స్పందనేమిటి?
జ: అధికార భాషా సంఘం, తెలుగు భాషా సమాఖ్య, ఇతర సంఘాలు ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర హోం, సమాచార, మానవ వనరుల శాఖల మంత్రులకు లేఖలు రాశాయి. వారి స్పందన కోసం వేచి చూస్తున్నాం.
ప్ర: తెలుగును ప్రాచీన భాషగా నిరూపించగలమా?
జ: తెలుగు ప్రాచీన భాష అనడానికి శిలా శాసనాల రూపేణా ఎన్నో ఆధారాలున్నాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యం ఉంది. హలుడి గాథాసప్తశతి ప్రాకృతం తెలుగుల్లో మిళితమై ఉంది. ప్రాచీన నాణేల్లోనూ ప్రాకృతంతో పాటూ తెలుగు మిళితమై ఉంది. కడపజిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడులో ఎరికల్‌ముత్తరాజు అనే రాజు వేయించిన తొలి తెలుగు శాసనం లిఖితపూర్వకంగా దొరికింది. క్రీస్తుపూర్వం 200 నుంచీ క్రీస్తుశకం ఐదు, ఆరు శతాబ్దాల వరకూ తెలుగు శాసనాలన్నీ ప్రాకృతం, సంస్కృతాలతో కలివిడిగా కలిసిఉన్నాయి. ద్రవిడభాషా కుటుంబం నుంచి ఉద్భవించిన తెలుగు, తమిళం రెండూ ఒకశతాబ్దం అటూ ఇటుగా సమాంతరంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయని తమిళులే అయిన ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్తలు, పరిశోధకులు అయిన ప్రొఫెసర్ మలయాండి, డాక్టర్ మహదేవన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండ్యన్ తదితరులు నిష్పాక్షికంగా తేల్చారు.
Keywords : Telugu Andhra Pradesh ancient classical language status demand tcld2006 eenadu abk prasad interview
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home