France's Highest award for a Telugu
సింగ్‌పూర్, ఫిబ్రవరి 10: సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ బివిఆర్ చౌదరికి ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం ' ఆఫీసర్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ పాల్మ్స్' లభించింది. అంతర్జాతీయ స్థాయిలో బోధన, పరిశోధన, ఫ్రెంచి సంస్కృతులలో విశేష కృషి చేసిన వారికి ఫ్రాన్స్ ఈ అవార్డును అందిస్తుంది. ఫిబ్రవరి 8న సింగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రాన్స్ రాయబారి జీన్ పాల్ రే, చౌదరికి ఈ అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా రే మాట్లాడుతూ సింగపూర్-ఫ్రాన్స్ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాలలో పరస్పర సహకారానికి చౌదరి చేసిన కృషి అనన్యమైనదని అన్నారు. మెటిరియల్ సైన్స్‌లో ఆయన పరిశోధనలు భావి తరాలకు చుక్కాని లాంటివని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత డిప్యూటీ హైకమీషనర్, జోర్డాన్ రాయబారి, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకలు, విద్యార్ధులు తదితరులు హాజరయ్యారు.
. ఫ్రొఫెసర్ బివి ఆర్ చౌదరిగారు జనవరి 21, 1943 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని మారుమూల పల్లె కౌతారంలో జన్మించారు. పదవ తరగతి వరకూ స్వగ్రామంలోనే విద్య నభ్యసించారు. అనంతరం గుడివాడ ఏఎన్ ఆర్ కాలేజిలో బిఎస్‌సి, బరోడాలోని ఎంఎస్‌సి యూనివర్సిటీ లో ఎంఎస్‌సి చేశారు. కాన్పూర్ ఐఐటి నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు. అనంతరం ఆయన విదేశాలకు వెళ్లి అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ గా ఎదిగారు. ప్రస్తుతం సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ లో ప్రొఫెసర్‌గా పనిచేయడంతోపాటు, అనేక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్శిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. దాదాపు పాతికేళ్లుగా సింగపూర్ తెలుగు సమాజం, ప్రపంచ తెలుగు సమాఖ్య లలో క్రీయాశీల సభ్యుడుగా ఉన్నారు. తెలుగు గడ్డపై పుట్టిన చౌదరికి ఫ్రాన్స్ దేశపు గౌరవ పురస్కారం లభించడం ఆంధ్రులందరూ గర్వించదగ్గ విషయమని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి తెలియజేశారు.
0 Comments:
Post a Comment
<< Home