తెలుగు భాషకు కావలసిందేమిటి?
-చుక్కా రామయ్య (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)
ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించి యాభయ్యేళ్ళయింది. ఈ ఐదుదశాబ్దాల నుంచి తెలుగుభాష గురించి లేని బెంగ ఇప్పుడు ప్రారంభమైంది. మన భాష గమనం ఎటు అన్నధ్యాస ఇప్పటివరకు లేదు కాని పొరుగురాష్ట్ర భాషకు ఒక గుర్తింపు వచ్చేసరికి ఇప్పుడు మన భాషపై మనకు మమకారం పుట్టుకొచ్చింది. తమిళభాషకు ప్రాచీనహోదా ఇచ్చిన ఫలితంగా మన తెలుగుభాష అందుకు సరితూగదా అన్న రోషం మనలో పుట్టుకొచ్చింది. భాషా ఉద్య మం ప్రారంభమైంది. అయితే తెలుగుభాషకు ప్రాచీనహోదా ఔచిత్యాన్ని గురించి చర్చించడం ఉద్దేశం కాదు కానీ మనం ఇంతగా అభిమానిస్తున్న భాషకు ఇప్పటివరకు మనమేం చేశాం. అసలు ఏం చేయాలో ప్రస్తావించడమే ఇక్కడ ఉద్దేశం. భాషా ప్రయుక్తరాష్ట్రంకోసం మనం పోరాటం చేశాం. ఈ పోరాటం రాజకీయ నాయకులకోసమో, భాషా ఉద్ధరణకోసమో జరిగింది కాదు. పాలకులకు-పాలితులకు మధ్య ఉన్న అగాధాన్ని తుదముట్టించేందుకు జరిగింది.
పాలన అంతా 'రాజభాష'లో జరుగుతుంటే పాలితులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్న దుస్థితిని తొలగించేందుకు ఆనాటి పోరాటం జరిగింది. రాజభాష స్థానంలో ప్రజలభాషకే రాజసం అబ్బితే తమకు ప్రశ్నించే అధికారం వస్తుందని గుర్తించినందువల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటాలు జరిగాయి. ప్రజాస్వామ్య ఔన్నత్యానికి భాషే పునాది. ప్రజలభాషలో ప్రభుత్వ గమనం సాగితే ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత ఏర్పడుతుంది. ప్రజ లు చైతన్యవంతులవుతారు. తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో కిందివర్గ భాగస్వా మ్యం ఏర్పడుతుంది. ఇది ప్రజాస్వామ్యా న్ని పరిపుష్ఠం చేస్తుంది. అలాగే న్యాయస్థానాల్లో ప్రజలభాషే ప్రధాన మాధ్యమం అయితే సామాన్యుడికి తన వ్యాజ్యంపై న్యాయస్థానంలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. శాసనాలు, చట్టాలు ప్రజల భాషలోనే రూపొందించడం వలన సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి. న్యాయంకోసం మరెవరిపైనో ఆధారపడాల్సిన అవసరం ఉండదు. తన హక్కులను తాను తెలుసుకోగలుగుతాడు. మొత్తంమీద శాసన, న్యాయ,పాలనా వ్యవస్థల్లో ప్రజల భాష అంతర్వాహినిగా ప్రవహిస్తుండటం వల్ల సామాన్యుల జీవితాలను స్పృశించి ప్రజాస్వామ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది. భాషా ప్రయుక్త రాష్ట్ర పోరాటానికి ఇదే స్ఫూర్తి. ఈ సందర్భంలో నైజాం ఉద్యమాన్ని ప్రస్తావించాలి. ఈ ఉద్యమానికి బీజం పడింది ఆంధ్రమహాసభ ఆవిర్భావంతోనేనని మరువరాదు. నైజాం కాలంలో రాజభాష ఉర్దూస్థానంలో ప్రజలభాష అయిన తెలుగు వినియోగానికి ఆంధ్రమహాసభ పోరాటం చేసింది. పాఠశాలల్లో తెలుగుమాధ్యమంలో విద్యాభ్యాసం జరగాలని డిమాండ్ చేసింది. పాఠశాలల్లో తెలుగులో బోధన ప్రారంభమైన తరువా త ప్రజల్లో చైతన్యం వచ్చింది. అప్పటివరకు ప్రజలు దారిద్య్రాన్ని తమ ప్రారబ్ధం అని సరిపెట్టుకునేవారు. అయితే భాషద్వారా వచ్చిన చైతన్యం ద్వారా తమ కడగండ్లకు కారణం నైజాం పాలన దాష్టీకాలేనని గుర్తిం చారు. దానితో ఆంధ్రభాషా ఉద్యమం వెట్టిచాకిరి నిర్మూలన ఉద్యమంగా మారింది. ఆ పై భూపోరాటంగా మలుపు తీసుకుంది.
చివరకు అది నైజాం పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసి అప్రతిహత ఉద్యమంగా పరిణమించింది. అంటే భాష ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఆలోచనల బీజాలద్వారా చైతన్యం అనే అగ్నిపూలు పూస్తాయి. ప్రజల పోరాటం ఫలంగా భాషా ప్రయుక్తరాష్ట్రం ఏర్పడింది. యాభైయ్యేళ్ళుగడిచాయి. అయితే దురదృష్టవశాత్తూ ఏ లక్ష్యాలకోసమైతే పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామో ఆ దిశగా జరిగిన కృషి కన్పించదు. అంతకుముందు బూర్గుల రామకృష్ణారావు తీసున్న కొన్ని సాహసోపేత నిర్ణయాల కారణంగా ఉద్యమలక్ష్యాలు నెరవేరుతాయన్న ఆశాపవనాలు వీచాయి. హైస్కూలు స్థాయి వరకు బోధనాభాషగా తెలుగును ప్రవేశపెట్టారు. మరోపక్క పాలనలో న్యాయస్థానాల్లో తెలుగువినియోగం ఆరంభమైంది. ముఖ్యంగా కింది కోర్టుల్లో తెలుగు వినియోగం విరివిగా జరిగింది. దీనితో భాషా ప్రయుక్త ఉద్యమానికి ఒక స్వరూపం ఏర్పడింది. అయితే, భాషా ప్రయుక్తరాష్ట్రం ఏర్పడిన అనంతరం మాత్రం ఈ లక్ష్యాలను విస్మరించాం. రాజకీయశక్తులు ఉద్యమస్ఫూర్తిని కొడిగట్టిం చాయి. ఫ్యూడల్ శక్తులు ఈ కృషికి తాళాలు వేశాయి. ఇందుకు వారి స్వార్థప్రయోజనాలే కారణం. విద్యాబోధన ప్రజల భాషలో జరిగి చదువు అర్థం అయితే జనం బ్రిటిష్‌వారిపై తిరగబడినరీతిలోనే తమపై తిరుగుబాటు చేస్తారని శంకించారు. క్రమేపీ ప్రజలభాష ప్రజలమధ్యనే ఉండగా, రాజభాషలే రాజ్యమేలాయి. చివరకు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంగ్లీష్‌మీడియం లేకుండా మనలేవని ప్రస్తుత సర్కార్లు తేల్చిచెబుతున్నాయి. అయితే, తమిళనాట ఇలా జరగలేదు. అక్కడ బ్రాహ్మణ-సంస్కృత వ్యతిరేక ఉద్యమాలు అంతిమంగా ప్రజలభాషకు ప్రాభవాన్ని తెచ్చిపెట్టా యి.
ప్రాచీనత, ఆధునికత విషయం ఎలా ఉన్నా అక్కడ ప్రజలభాషకు మన్నన లభించింది. మన రాష్ట్రంలో భాష-ప్రామాణికతల రీత్యా మరొక పరిణామాన్ని చూస్తున్నాం. ప్రజల భాషలో కూడా ఒక ప్రాంత భాష ఇతర ప్రాంతభాషలపై అజమాయిషీ చేస్తూ ప్రామాణికభాషగా పరిణమించింది. ఒక ప్రాం తంలో అభిమానభాష మరొక ప్రాంతంలో దుష్టభాషగా ముద్రపడింది. ఫలితంగా భాషద్వారా ఐక్యత రావాల్సింది పోయి విచ్ఛిన్న ఉద్యమాలు మొదలయ్యాయి. భాషద్వారా మనిషిలో వచ్చే వికాసం సమైక్యతను మరింత పటిష్టం చేయాలే తప్ప విచ్ఛిన్నం చేయరాదు. మరొకవైపు సర్వీసురంగంవైపు ఉపాధికోసం చూడాల్సివస్తున్న ఫలితంగా ఉద్యోగకల్పనాసంస్థల ఆకాంక్షల మేరకు విద్యాభ్యాసం చేయాల్సివస్తోంది. వారికి కావలసింది ఆంగ్లమాధ్యమమే కాబట్టి దానినే ఆశ్రయిస్తున్నారు. ప్రజల భాష కనుమరుగవుతోంది. భాషా ఔన్నత్యం, భాషా వినియోగం రీత్యామనం తిరోగమనంలో ఉన్నాం. ఏ లక్ష్యాలకోసం భాషా ప్రయోక్త రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని తుంగలో తొక్కాం. ప్రజలభాషగా భాసిల్లాల్సిన భాషను భావితరాలకు పరిచయం చేయలేని దుస్థితిలో పరిమిత వర్గ భాషగా మిగిల్చాం. అందుకే ఇప్పుడు తెలుగుకు కావల్సింది ప్రాచీనహోదా కాదు. అట్టడుగు ప్రజల హృదయాలలో పట్టాభిషేకం. చదువు,పాలన,శాసనం,చట్టం అన్నీ ప్రజలభాషలో జరగాలి. చదువు ఇంటిభాషలో జరిగితే పిల్లలకు ముందు అర్థం అవుతుంది. పాఠశాలను తన ఇల్లులాగే భావిస్తారు. ప్రేమిస్తారు. ఇంటిభాష అంటే ఒక గిరిజన కుటుంబంలో మాట్లాడేభాష, ఒక దళిత కుటుంబంలో మాట్లాడేభాష. ఇలా ఏదయినా కానీయండి విద్యార్థి ఇంటిభాషలో విద్యాభ్యాసం జరిగితే అర్థం అవుతుంది. చెప్పే విషయం అర్థం అయితే ఆలోచన పెరుగుతుంది. ఆలోచనల స్రవంతి అవగాహనను పెంచుతుంది. అవగాహన చైతన్యాన్ని రగిలిస్తుంది. పాలనలో, శాసననిర్మాణంలో, చట్టం అమలులో ప్రజలభాషే కనబడాలి. ప్రస్తుతం ప్రజలభాషగా తెలుగుకు పట్టాల్సిన ప్రాభవం ఇదే. దీనివల్ల భావితరాల మేథోసంపన్నత రాష్ట్ర వికాసానికి హారతి పడుతుంది. ప్రాచీనభాష హోదావల్ల వచ్చేనిధులకంటే ఈ 'పెన్నిధి' శాశ్వతం. సామాన్య ప్రజలకు సుసంపన్నం.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh classical ancient language status India Indian Chukka Ramaiah Andhra Jyothy tcld2006
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home