అమెరికా బువ్వ, ఇండియా అవ్వ
అమెరికాలోని భారతీయులను (వొంటి రంగూ, పట్టి ఇచ్చే ఇండియన్ ఇంగ్లీషు యాస కాక) ప్రత్యేకంగా కలిపి ఉంచే అంశాలేమిటి? మాతృభాషలు కావన్నది స్పష్టమే; భారతదేశంలోనే అవి మనల్ని కలిపి ఉంచలేకపోతున్నాయి కదా. మన ఆకాంక్షలా? ఇవికూడా కావు. ఇక్కడికి వలస వచ్చిన ప్రతి ఒక్కరూ పెద్ద ఆశలను నెరవేర్చుకోవాలనే వస్తారు. వారు నెరవేర్చుకోవాలనుకునేవి కూడా అమెరికన్ స్వప్నాలే తప్ప, సొంత కలలు కావు.
మరి మనలను వేరుగా నిలబెడుతున్నదేమిటి? అమెరికాలోని మన ప్రస్తుత జీవనశైలిని, భారత్‌లోని అధివాస్తవ జీవితంలోకి చొప్పిం చాలన్న ఆకాంక్షే ఈ భేదంగా మారుతున్నదనిపిస్తుంది. మానసికంగా భారతీయులుగానే ఉండాలని మనకు ఉంటుంది, అదే సమయంలో అమెరికాలోని వ్యవస్థీకృత పద్ధతులు, సదుపాయాలు, సమాన అవకాశాలు, సౌఖ్యాలూ మనకు కావాలి. ఈ రెండు తృష్ణలకూ పరస్పరం సంబంధం లేదా? లేకపోతే, అమెరికా దాటి వెళ్లినప్పుడు మనల్ని విపరీతంగా ఆవరించే ఈ భారతీయతను ఎట్లా అర్థం చేసుకోవాలి? భారత్‌లో ఉన్నప్పుడు నేను కొత్త ఇంగ్లీష్ మ్యూజిక్ రికార్డులను ఎప్పటికప్పుడు వింటుండేదాన్ని; కొత్త ఇంగ్లీష్ సినిమాలను విడుదలైన వెంటనే చూస్తుండే దాన్ని; వస్త్రధారణలో సరికొత్త ఫ్యాషనన్లు, సంభాషణలో నవరీతులను తెలుసుకోవటానికి, అనుకరించటానికి అమిత శ్రద్ధ చూపేదాన్ని. తెలుగు లేదా హిందీలో మాట్లాడకుండా ఉండటానికే ప్రయత్నించేదాన్ని, వీలైనప్పుడల్లా ఇంగ్లీషులోనే మాట్లాడేదాన్ని.
అమెరికాలో ఇప్పుడు నేను సరికొత్త భారతీయ సినిమాను చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నాను. విడుదలైన వెంటనే వాటిని చూస్తు న్నాను. అలాగే కొత్త హిందీ, తెలుగు మ్యూజిక్ ఆడియోలను సొంతం చేసుకొంటున్నాను. తెలుగు సంఘం కార్యక్రమాలలో, హోలీ వేడు కలలో, వెన్నెల రాత్రుల దాండియా నృత్య సంబరాలలో పాల్గొంటున్నాను. అవకాశం లభించినప్పుడల్లా తెలుగులో, హిందీలో మాట్లాడ డానికి ఉత్సాహపడుతున్నాను. అమెరికాను సందర్శించే మా బంధువులు భరతనాట్యం, కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొంటున్న పిల్లలను, భారతీయ సంఘాల సమావేశాలలో తబలా వాద్యంలో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఏడేళ్ళ బాలురను, రంగోళి పోటీలలో తల్లులతో కలిసి పాల్గొనే నవ యవ్వన బాలికలను చూసినప్పుడు చూసి మురిసిపోతుంటారు. వారి కంటె మేమే ఎక్కువగా భారతీయులుగా ఉన్నట్టు వ్యాఖ్యానిస్తుంటారు.
సరే, సోమవారాలు తెల్లవారుజామునే మా నిత్యజీవన సమరం మొదలవుతుంది. పిల్లలు స్కూళ్లకు, పెద్దలు ఉద్యోగాలకు వెళ్ళటానికి హడావుడి పడుతుంటారు. వీకెండ్‌లోని ఆనందాలను, భారతీయతలో చేసిన కొద్దిపాటి విహారాన్ని మరచిపోయి మహానగర మధ్యంలోకి ప్రవహించే వాహనవాహినిలో మేమూ కలసిపోతాము, వీపులపై బరువైన బ్యాగులతో స్కూళ్లకు వెళ్లేపిల్లల్లో మేమే ఒకరిమవుతాము, అమె రికన్ జీవనస్రవంతిలో అంతర్భాగమైపోతాము. సాంస్కృతిక కార్యక్రమాల్లో మిత్రులనుంచి, బంధువుల నుంచి వీనులవిందైన ప్రశంసల తో పాటు వీకెండ్స్‌లో మాకు అప్రియమైన మాటలు, వ్యాఖ్యలు కూడా ఎదురవుతుంటాయి. భారతీయ సంతతి పిల్లలను పెంచడంలో ఉన్న సమస్యలు చర్చకు వస్తాయి. 'మా పిల్లలు మరీ అమెరికన్లయిపో తున్నార'ని ఒకరు ఫిర్యాదు చేస్తారు. 'ఫలానా పిల్లలు తమ నానమ్మ పై, తాతయ్యపై పోలీసులకు ఫిర్యాదుచేశార'ని మరొకరు ఆశ్చర్యంగా చెబుతారు. 'ఇంకెప్పుడూ అమెరికాకు రామని వారు వెళ్లిపోయారు' అని ఇంకొకరు మరో ఉదంతం చెబుతారు. 'ప్రేమతో లాలించడమొ క్కటే సరిపోదు, అప్పుడప్పుదు బెత్తం కూడా ఉపయోగిస్తేనే పిల్లలు అదుపులో ఉంటారు'- అని వేరెవరో ఉపదేశం ఇస్తారు.
వీటితో సమాధానపడడం ఎట్లా? సామాజిక, మత కార్యక్రమాల్లో ఐకమత్యం కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడి భారతీయులలో అస్తిత్వ సంక్షో భం నెలకొనివుందనడానికి కావలసినన్ని రుజువులు ఉన్నాయి. భారత్ నుంచి వచ్చిన భారతీయులమా? లేక అమెరికన్‌లమా? అమెరికాలో పుట్టిన అయోమయపు దేశీలమా (అమెరికన్ బార్న్ కన్‌ప్యూజ్డ్ దేశీస్-ఎబిసిడి) లేక భారతీయ-అమెరికన్‌లమా?
ఈ ఆత్మ శోధన ఇలా ఉంటే కేలిఫోర్నియాలోని కొంతమంది భారతీయ తల్లితండ్రులు, బృందాలు ఆరవ తరగతి పాఠ్యగ్రంథాలలో భారతీయ చరిత్ర-సంస్కృతికి లభించిన ప్రాతినిధ్యంపై వివాదంలో ఉన్నారు. ఆర్యులనేవారు బయటి నుంచి వచ్చినవారు కాదని కొంత మంది వాదిస్తున్నారని, కుల వ్యవస్థను, ఆధునిక భారతంలో ప్రజల మధ్య అంతరాలు ప్రబలిపోవడంలో అది నిర్వహిస్తున్న పాత్రను తగ్గించిచూపడానికి మరి కొందరు ప్రయత్నిస్తున్నట్టు 'యాహూ!' మరికొన్ని వెబ్‌సైట్స్‌లోని ఒక వార్తా కథనం తెలియజేస్తోంది. అలాగే ప్రాచీన భారతదేశంలో మహిళలకు లభించిన హోదా సరైనదేనని, వారికి భిన్నమైన బాధ్యతలు అప్పగించారు తప్ప వివక్ష చూపలేదని కొందరు వాదిస్తున్నట్టు కూడా ఆ రిపోర్టు రాసింది.
ఇది ఒక విధమైన తప్పుడు దేశభక్తా? గతాన్ని శుద్ధిచేసి, అందరూ గుర్తుకు తెచ్చుకునే, గర్వపడే చరిత్రను తయారుచేయడమా? ఇక్కడ పుట్టిపెరిగిన భారతీయ సంతతి పిల్లలు స్వయంగా తాము భారతదేశాన్ని సందర్శించినప్పుడు, తమ తల్లితండ్రులు 'పాత రోజుల'ను మననం చేసుకుని ఎందుకు అంతగా బెంగపడతారో అర్థంకాక బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు.
సొంత అస్తిత్వం, విలువల వ్యవస్థ, సంస్కృతి విషయంలో, మన పుట్టిపెరిగిన ప్రదేశానికి బహుదూరంగా ఉన్న దేశంలో సమాధాన పడడం కష్టం. అయితే, ఈ ద్వంద్వత్వానికి పరిష్కారం వెదికే మార్గంలోనే ప్రవాసులం ఉన్నామనుకుంటున్నాను. పూర్తి సామరస్యం, సయోధ్య సాధించే కచ్చితమైన సూత్రమేదీ ఎవరివద్దా లేదు. అయితే, అమెరికన్ పరిస్థితులతో భారతీయులు సర్దుకుంటున్న నిదర్శనాలు రోజూ చాలా చూస్తున్నాము. అమెరికన్ సంస్కృతిలో సంలీనమవడంలో మనం విజయవంతమవుతున్నామా లేక ' వారు-మనము' అనే విభజన కొనసాగుతున్నదా? మన ప్రత్యేకత కాలపరీక్షకు నిలుస్తుందా లేదా క్రమంగా మనం ఒక మూసలో కరిగిపోతామా? చూడాలి.
- జయ బాడిగ
ఈ శీర్షికా రచయిత అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రురాలు. ఆరోగ్య, సామాజిక రంగాలలో మీడియా స్పెషలిస్టుగా సేవలందిస్తారు. బ్లాగ్స్, న్యాయశాస్త్రం, ప్రవాస జీవనశైలి ఈ ర చయిత ఆసక్తులు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu America usa us Andhra Pradesh India Indian language nri Andhraite
0 Comments:
Post a Comment
<< Home