ఉద్యోగాలకు ప్రైవేటే దిక్కు
పేదరిక నిర్మూలనకు ఉపాధే మార్గం
ప్రతి ఒక్కరూ త్యాగాలు చేయాలి
విద్యా విధానమూ మారాలి
రొడ్డ కొట్టుడు పద్ధతి పోవాలి
'న్యూస్‌టుడే'తో నారాయణమూర్తి
రఘు ఏలూరి
ఆయన కారు డ్రైవర్ ఆస్తి రూ.రెండున్నర కోట్లు. ఆయన కింద పనిచేసే 50 వేల సిబ్బందిలో 400 మందికి పైగా కోటీశ్వరులే. తన కంపెనీలో వాటాలివ్వడం ద్వారా వారిని ఆయన కోటీశ్వరుల్ని చేశారు. ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ రూ.76 వేల కోట్లు. అయినా ఆయన జీవితంలో విలాసాలకు చోటులేదు. మైసూరుకు చెందిన మామూలు మధ్యతరగతి సంప్రదాయ కుటుంబీకులు ఎలా జీవిస్తారో... ఇప్పటికీ ఆయన అదే జీవితం గడుపుతున్నారు. ఆయనే ఇన్ఫోసిస్ సంస్థ అధినేత నాగావర రామారావు నారాయణమూర్తి. ఓ ఉపాధ్యాయుడి ఎనిమిదిమంది సంతానంలో ఒకరైన నారాయణమూర్తి కేవలం పదివేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు రూ.76 వేల కోట్లకు పెంచారు. 45 దేశాల్లో కార్యాలయాలు స్థాపించే స్థాయికి ఎదిగారు. సంపదను సృష్టించడం, దానిని నలుగురికీ పంచిపెట్టడం అన్న తన సిద్ధాంతాన్ని ఆచరణలో అమలు చేసి చూపుతున్నారు. హైదరాబాద్ శివార్లలో 500 ఎకరాల భూమిలో అతి పెద్ద ఐటీ క్యాంపస్‌ను నిర్మించేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నారాయణమూర్తితో 'న్యూస్‌టుడే' ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రశ్న: మీ చిన్ననాటి జ్ఞాపకాలేమిటి?
జవాబు: నేను కర్ణాటకలోని సిద్ధాఘట్టలో మధ్యతరగతి బడి పంతులు కుటుంబంలో జన్మించాను. ఆచార, సంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చే కుటుంబం మాది. ఇంజినీరింగ్‌లో ప్రాథమిక అంశాల్ని నేను మైసూరు విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నాను. 1969లో కాన్పూర్‌లోని ఐఐటీలో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో పనిచేశాను. కొంతకాలం ఫ్రాన్స్‌లో ఉన్నాను. అక్కడ అనేక జీవిత పాఠాలు నేర్చుకున్నాను. మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1981లో ఇన్ఫోసిస్‌ను స్థాపించాను. టూకీగా ఇదీ నా కథ.
ప్ర: అసలు ఓ కంపెనీ పెట్టాలన్న ఆలోచన మీలో ఎప్పుడు తొంగిచూసింది?
జ: నిర్దిష్టమైన ఆలోచనలేవీ నాలో లేకున్నా ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల మాత్రం పుష్కలంగా ఉండేది. ఆ దిశగానే అడుగులు వేస్తుండేవాడిని. 1981లోనే పీసీలూ, నెట్ బాక్సులూ మన దేశంలోకి రావడం ఆరంభమైంది. అప్పట్లోనే సాఫ్ట్‌వేర్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఊహించాను. దానికి సంబంధించిన ప్రతిభ ఎంతో మన దేశంలో ఉన్నప్పుడు, ఇక్కడే మనం సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి, జి-7 దేశాలకు ఎందుకు ఎగుమతి చేయకూడదన్న ఆలోచన నాలో మొలకెత్తింది. అందులోంచి పుట్టుకొచ్చిందే ఇన్ఫోసిస్ సంస్థ. నా భార్య ఇచ్చిన పదివేల రూపాయలతో మరో ఆరుగురు మిత్రులతో కలిసి పుణెలోని శివాజీనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసి ఆఫీసును ప్రారంభించాను.
ప్ర: ఇన్ఫోసిస్ ఇంత అభివృద్ధి సాధించటానికి కారణాలేమిటి?
జ: ఇన్ఫోసిస్ అభివృద్ధి సాధించిందంటే అందుకు కారణం మేం అనుసరించిన మెరుగైన సూత్రాలే. భౌగోళికమైన నైపుణ్యానికి సరిపడ కచ్చితమైన ప్రమాణాలు మేం పాటిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలతో పోటీపడుతున్నాం. ఆ సంస్థలు పాటించే నాణ్యమైన పద్ధతుల్ని చూసి మేం ఎంతో నేర్చుకున్నాం. ఆచరణలో పెట్టాం. మేం చేపట్టిన ప్రతిపనిలో వేగాన్ని, కల్పననీ, అమోఘమైన నైపుణ్యాన్ని జోడించాం. మెరికల్లాంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటున్నాం. వారికి అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పిస్తున్నాం.
ప్ర: కంపెనీ నడపటంలో ఎటువంటి సూత్రాలను పాటించారు?
జ: ఇన్ఫోసిస్‌కు సంబంధించిన ఏడుగురు వ్యవస్థాపకులం ఒకే రకమైన విలువలు పాటిస్తున్నాం. నీతి, నిజాయతీ, న్యాయం, పారదర్శకత, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సంస్థ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం లాంటి విలువల్ని పాటిస్తూ వచ్చాం. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ఎదుటివారిలోనూ అలాంటి ఉత్సాహాన్నే కలిగించాలి. ఎవరికి వారు తమ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించకుండా సమష్టిగా కృషి చేయాలి. అప్పుడే విజయాలు.
ప్ర: ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలతో ఎలా పోటీ పడగలుగుతున్నారు?
జ: మనం మొదట నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. కొన్ని సందర్భాల నుంచీ, సన్నివేశాల నుంచీ నేర్చుకుని వాటికి సరి కొత్త సందర్భాలకీ, సన్నివేశాలకీ అన్వయించే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. ఉదాహరణకు మా వ్యాపారంలో ఎప్పటికప్పుడు అన్నీ మారిపోతుంటాయి. కొత్త సాంకేతికాంశాలు వచ్చిపడుతుంటాయి. దానికనుగుణంగా మమ్మల్ని నిత్యం మార్చుకుంటున్నాం. మా వినియోగదారులు అనేక దేశాలకూ, సంస్కృతులకూ చెందినవారు. మా పనులు 97శాతం విదేశాలకు సంబంధించినవే. అందుకని మేం వివిధ సంస్కృతుల్లో ఒదిగిపోవాలి. ఇవన్నీ మా సంస్థలో జరిగాయి. ఫలితమే ప్రపంచంలో నేడు ఎవరితోనైనా పోటీపడగల స్థాయిని చేరుకున్నాం.
ప్ర: దేశంలో ఉపాధిని ఎలా మెరుగుపరచాలి?
జ: ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తాయనే కల పూర్తిగా తొలగిపోయింది. అందువల్ల ప్రైవేటు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో ప్రవేశించి వాటి వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకోవాలి. తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించాలి. అదే పేదరికాన్ని నివారించడానికి ఏకైక మార్గం. దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న నిరుద్యోగం కారణంగా ప్రజలు దారుణమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణను ప్రైవేటు యాజమాన్యాలు అందిపుచ్చుకుని దారిద్య్రాన్ని రూపుమాపేందుకు కృషి చేయాలి.
ప్ర: ప్రపంచీకరణ ప్రపంచానికి, ప్రధానంగా మన దేశానికి మంచిదేనా?
జ: ప్రపంచీకరణ మూలంగా వివిధ దేశాల మధ్య పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఇది వర్తకాన్ని ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. వివిధ దేశాల మధ్య శాంతిని, సుహృద్భావాన్ని పెంపొందింపజేస్తుంది. వర్తకం ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న తర్వాత ఒకరితో ఒకరు కలహించుకునే అవకాశం ఉండదు. యుద్ధాలు ఉండవు. సరైన నాయకుల చేతుల్లో జరిగే ప్రపంచీకరణ పెద్ద వరం అని నేను భావిస్తాను. ఒక డాక్టర్ చేతిలో ఫోన్ ఉంటే అది ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, అదే ఒక సంఘ విద్రోహి చేతిలో వుంటే ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే ప్రపంచీకరణ సరైన నాయకత్వం చేతిలో ఉన్నప్పుడు ఫలితాలు అద్భుతంగానే ఉంటాయి.
ప్ర: దేశంలో ఎన్నో సమస్యలు తొంగిచూస్తున్న నేపథ్యంలో అసలు మనం అభివృద్ధి వైపు అడుగులేయడం సాధ్యమేనా?
జ: మన దేశంలో అద్భుత అవకాశాలున్నాయి. అపార మేధో సంపద ఉంది. మనం ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన దగ్గర మంచి ఆలోచనలున్నంత కాలం, వీటికి మార్కెట్ ఉన్నంత కాలం, కలిసికట్టుగా మంచి విలువలతో మనం పనిచేసినంత కాలం డబ్బు సమస్య కాదు. డబ్బు దానంతటదే వస్తుంది. మనం ముందుకు సాగిపోవాలి. ఉద్యోగాలు సృష్టించాలి. పేదరిక సమస్యను నిర్మూలించాలి. అప్పుడు అన్నీ తొలుగుతాయి. సుందర భారతం సాక్షాత్కరిస్తుంది.
ప్ర: ప్రస్తుతం ఏం చేస్తే మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడగలుగుతాం?
జ: వేగవంతమైన అభివృద్ధి మనం సాధించాలనుకున్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇందుకోసం అన్ని పార్టీలూ సహకరించుకోవాలి. కలిసికట్టుగా అడుగులు వేయాలి. ఏ దేశమైనా అభివృద్ధి సాధించిందంటే అది కఠిన నిర్ణయాల వల్లే.
ప్ర: మిమ్మల్ని ప్రభావితం చేసిన నేత ఎవరు?
జ: నా ఆదర్శ నేత మహాత్మాగాంధీ. ఆయన చెప్పింది చేసి చూపించారు. జాతికి ఓ మార్గాన్ని చూపారు. తృతీయ ప్రపంచ దేశాలకు చెందిన మనల్ని అగ్రస్థాయిలో నిలిపిన మహనీయుడు.
ప్ర: ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
జ: ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నిరుపేదల కనీస అవసరాలపై దృష్టి వహించింది. మేం అనేక ఆసుపత్రులు నిర్మించాం. అనాథ శరణాలయాలు కట్టించాం. కుగ్రామాల్లో గ్రంథాలయాలు నెలకొల్పాం. వ్యభిచార వృత్తిలో మగ్గిన వారికి పునరావాస కార్యక్రమాలు చేపట్టాం. దీనికి అదనంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉన్నతవిద్యను, ప్రాథమిక విద్యనూ ప్రోత్సహిస్తోంది. త్వరలో మాకార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం.
జ: నేను ఐరోపా వెళ్లినపుడు అక్కడ అనేకమందిని కలిశాను. ఎంతో అధ్యయనం చేశాను. ఈ ప్రపంచంలో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్యోగాల్ని సృష్టించడం ఒక్కటే మార్గమని నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఉద్యోగాల్ని సృష్టించడంలో విఫలమయ్యాయి. సామ్యవాద సిద్ధాంతాలు కూడా ఈ దిశగా విజయం సాధించలేకపోయాయి. ఇప్పుడు ఉద్యోగాల సృష్టికి ఉన్న మార్గమల్లా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడమే.
ప్ర: మీ వృత్తిని, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు?
జ: కుటుంబ జీవనం, వృత్తి జీవనం... ఈ రెండింటి మధ్యా నేను సమతౌల్యం పాటించలేకపోయాను. ఎప్పుడూ పనిలో మునిగి ఉండేవాణ్ని. గంటలకు గంటలు ఆఫీసులో గడిపేవాణ్ని. 12 సంవత్సరాల క్రితం వరకు ఏడాదిలో 300 రోజుల పైచిలుకు నేను విదేశాల్లో గడిపేవాణ్ని. నా మనసును గుర్తెరిగిన భార్య లభించడం నా అదృష్టం. మా పిల్లల్ని ఆమే పెంచింది. వాళ్ల బాగోగులు చూసుకుంది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని బోధించింది. విజయం సాధించాలంటే అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉండాలి.
ప్ర: మన విద్యావిధానంలో రావాల్సిన మార్పులు ఏమిటి?
జ: సమస్యలను పరిష్కరించే దిశగా మన విద్యా విధానాన్ని రూపొందించుకోవాలి. దురదృష్టవశాత్తూ మన విద్యావిధానం రొడ్డ కొట్టుడు పద్ధతిలో సాగిపోతోంది. అది అసలైన ప్రపంచ సమస్యలపై దృష్టి సారించడం లేదు. ప్రాథమిక విషయాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేయడం లేదు. సమస్యల్ని పరిష్కరించే మౌలిక సూత్రాలపై శ్రద్ధ వహించడం లేదు. దీనిపై దృష్టి సారిస్తే మన పరిస్థితి మెరుగవుతుందని నా నమ్మకం. భారతదేశంలో విద్యావిధానం ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా వుండాలి. ఎప్పటికప్పుడు విద్యావిధానంలో మారుతున్న రీతులను అధ్యయనం చేసుకుంటూ అవసరమైన విషయాలకు మాత్రమే పాఠ్యాంశాలలో చోటు కల్పించాలి. వాటిలో ఉత్తమ ప్రమాణాలను పాటించాలి. పరభాషలపై పట్టు సాధించాలి. తద్వారా దేశవిదేశీ అంశాల్లో పరస్పర అవగాహన పెంపొందడానికి దోహదమవుతుంది.
ప్ర: ఎటువైపు అడుగులు వేస్తే మన దేశం ప్రపంచం ఎదుట సగర్వంగా నిలబడుతుంది?
జ: మన దేశంలోని ప్రతి శిశువుకీ మంచి చదువు, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, చక్కని ఇల్లు... వీటిని అందుబాటులో ఉంచగలిగితే అది ప్రజల అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనకుగౌరవాన్ని సంపాదించి పెడుతుంది. ఈదిశగా మనలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. త్యాగాలు చేయాలి. వాటి ద్వారా రాబోయే తరాలకు మేలు చేకూరుతుంది.
Technorati tags: Telugu,తెలుగు,Infosys,Narayana Murthy
interview Hyderabad Andhra Pradesh Eenadu feb 2006
0 Comments:
Post a Comment
<< Home