తెలుగుకి జే... జే...
తెలుగుకు మనవాళ్లు ఎంత ప్రాధాన్యత నిస్తున్నారు. తెలుగు భాషను అభిమానిస్తున్నారా? ఇంగ్లీష్ మీడియం చదువులు, ఆ భాషపై వ్యామోహం నెలకొని ఉన్న నేటి రోజుల్లో తెలుగుకు లభిస్తున్న ఆదరణ ఎలాంటిది? అనే సందేహాలు సహజంగానే కలుగుతున్నాయి. పాత తరం వాళ్లు దాదాపుగా తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారు. తెలుగు సాహిత్యంతో అనుబంధం ఉన్న వాళ్లు. కాబట్టి వాళ్లకు ఎలాగూ తెలుగు మీద ఎంతో కొంత అభిమానం ఉండే ఉంటుందని అనుకోవాలి. మరి, ఇంట్లో మాతృభాషగా తెలుగు మాట్లాడుతూ, ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ఇపుడు ముఖ్యం. 'లిటిల్స్' ఇద్దరు విద్యార్థులను పలకరించింది. వాళ్లేమంటున్నారో చూడండి...
"నేను ఇంట్లో తెలుగులో మాట్లాడతాను. స్కూల్‌కి వస్తే మాత్రం తప్పకుండా ఇంగ్లీషులోనే మాట్లాడాలి. అది నియమం. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా నాకు తెలుగు అంటేనే ఎంతో ఇష్టం. కారణం...అది మాతృభాష. ఈ భాషలో మాట్లాడినంత హాయిగా తెలుగులో మాట్లాడడం సాధ్యం కాదు. మా స్కూల్లో ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నియమం ఉన్నప్పటికీ ఒక్కోసారి కొన్ని మాటల్ని తెలుగులో తప్ప చెప్పడం సాధ్యం కాదు. ఆ తెలుగు భావనకు సంబంధించిన ఖచ్చితమైన ఇంగ్లీష్ ఎక్స్‌ప్రెషన్ ఏమిటో తెలియదు. అపుడు మాటల వడిని ఆపలేక తెలుగులో మాట్లాడేస్తాను. టీచర్లతో తిట్లు తింటాను. నిజానికి భాషను నేర్చుకునే విషయంలో ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది. మాతృభాష కాబట్టి మనకు తెలుగు సులభతరంగా ఉంటుంది గానీ తెలుగు రాని వాళ్లకు దాన్ని నేర్చుకోవడం అంత సులభమైందేమీ కాదు. నాకు తెలుగు భాష అంటే ఇష్టం కాబట్టి వ్యాకరణం ఎంతో సులభంగా అనిపిస్తుంది. సంధులు, సమాసాలు, అలంకారాలు, చంధస్సు... ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి.
తెలుగు మీడియంలో చదివితే తెలివి రాదనుకుంటారు. కానీ ఏ భాషలో చదివినా లోకజ్ఞానం సంపాదించవచ్చు. తెలివి తేటలు పొందవచ్చు. అందరూ వేలంవెర్రిగా ఇంగ్లీష్ మీడియంకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అఫ్‌కోర్స్... ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇంగ్లీష్ భాష వద్దని నేను అనడం లేదు. కానీ తెలుగుకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగులో కూడా మంచి స్కూళ్లు, చదువులు అందుబాటులో ఉండాలి. ఇపుడు ఉన్నత విద్య తెలుగు మాధ్యమంలో లభించదు. ఇది విచారకరం. ఇపుడందరూ విదేశాల మోజులో ఉన్నారు. ఇంగ్లీష్‌లో చదువుకుంటే తప్ప విదేశాలకు వెళ్లలేమని అనుకుంటున్నారు. అందుకే ఈ మీడియంకు ప్రాధాన్యత పెరిగిపోతోంది.
నేను నా టెక్ట్స్‌బుక్‌లోని అంబేద్కర్ జీవత చరిత్ర పాఠంతో బాగా ఇంప్రెస్ అయ్యాను. అతని తెలివి తేటలు, కష్టపడే తత్వం, చదువు మీద ఆసక్తి నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. చందమామ, బాలమిత్ర కథలు, జాతీయ నాయకుల జీవిత చరిత్రలు అంటే నాకెంతో ఆసక్తి. అలాంటి పుస్తకాలను నేను కొనుక్కు మరీ చదువుతాను. తెలుగులో ఉండే తీయదనమే వేరు''
-ఎం.రమ్య, పదవ తరగతి.
మా పేరెంట్స్‌కి ఇంగ్లీష్ కావాలంటారు...
తెలుగులో మాట్లాడినంత ధారాళంగా ఇంగ్లీషులో మాట్లాడలేను. అలా అని నాకు బాధ కూడా లేదు. నా ఫ్రెండ్స్‌తో, స్కూల్‌లో, టీచర్లతో మాట్లాడేందుకు ఎంత మేరకు ఇంగ్లీషు అవసరమో, ఆ మేరకు మాట్లాడుతాను. ఎప్పుడైనా కొన్ని మాటలు ఇబ్బంది అవుతాయి. అపుడు ఆల్టర్‌నేట్ వెదుక్కుంటాను. పెద్దగా ఇబ్బందయితే పడను.తెలుగు రాని వాళ్లకు ఆ భాష నేర్చుకోవాలంటే కష్టం. కానీ మనకు ఇంగ్లీషుతో అంత ఇబ్బందేమీ లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్న తెలుగుతో ఉండే ఈజీనెస్ ఇంగ్లీష్‌తో ఉండదు.
నిజానికి నాకు చాలా సార్లు అన్పిస్తుంది...మా అమ్మనాన్నలు నన్ను ఎందుకు తెలుగు మీడియంలో చేర్పించలేదని. ఈ చదువులు బాగా లేవని కాదుగానీ...మాతృభాషను ఎందుకు మనం నిర్లక్ష్యంగా చూడాలి. భాషా వ్యామోహం విషయానికి వస్తే మా కన్నా మా పేరెంట్స్‌కే ఇంగ్లీష్ అంటే ఎక్కువ ఆసక్తి. ఇంగ్లీష్ మీడియం తీరులో ఫీజులు తీసుకొని తెలుగు మీడియంలో కూడా బోధిస్తే, ఆ చదువులు కూడా స్టాండర్డ్‌గా ఉంటాయి. గ వర్నమెంట్ స్కూళ్లలో ఫీజు లేకుండా ఫ్రీగా చదువుకోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తోంది. డబ్బులు కడితే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. గవర్నమెంట్ కూడా మంచి స్కూళ్లను ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్య కూడా తెలుగులో అందుబాటులో ఉండేలా చూడాలి.
తెలుగు గ్రామర్ కొంత కష్టమైందే. కానీ మనకు మాతృభాష కాబట్టి ఎంతో ఈజీగా ఉంటుంది. మేం చదివే ఇంగ్లీష్ మీడియం పుస్తకాల్లో ఏదైనా డౌట్ వస్తే ఇంట్లో ఎవ్వరూ చెప్పలేరు. అదే తెలుగు సబ్జెక్టులో వస్తే ప్రతీ ఒక్కరూ చెప్పగలుగుతారు. ఇంగ్లీష్ పదాలకు మీనింగ్‌లు కూడా అంతే. డిక్షనరీ వెదుక్కోవాల్సిందే. అదే తెలుగు పదం అర్థం కాకపోతే ఎవరైనా చెబుతారు. ఇంగ్లీష్‌లో ఒక వాక్యం చదివితే రెండు, మూడు పదాలైనా అర్థం కానివి ఉంటాయి. సినిమాలు, పాటలైతే అస్సలు బుర్రకెక్కవు. అందుకే నేను తెలుగు సినిమాలు, తెలుగు పాటల్నే ఎంజాయ్ చేస్తాను.
బాలమిత్ర, చందమామ కథలంటే నాకు చాలా ఇష్టం. కామిక్స్ కూడా చదువుతాను. కానీ తెలుగు కథలంత ఆసక్తిగా అనిపించవు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాతావరణం, ఆలోచనలు, చూసిన ప్రదేశాలు తెలుగు కథల్లోనే కనిపిస్తాయి. బారిష్టర్ పార్వతీశం నవల చదివాను. హాయిగా అర్థమైంది. ఏ ఇంగ్లీషు అంతగా అర్థమవుతుంది చెప్పండి.''
-పి.శరత్, ఎనిమిదవ తరగతి
Courtesy: ఆంధ్ర జ్యోతిTechnorati tags: Telugu,తెలుగు
1 Comments:
ఇది చదివి చాలా సంతోషం కలిగింది. మళ్లీ తెలుగు పట్ల అభిమానం ఈ తరంలో పెరుగుతోంది. తెలుగువాళ్లం అనిపించుకోవడాన్ని తమ వ్యక్తిత్వాన్నీ ఉనికినీ చాటే విషయంగా భావిస్తున్నారు. మీరు రాసినదాంట్లో చిన్న పొరపాటు దొర్లినట్లుంది - "నాకు తెలుగు అంటేనే ఎంతో ఇష్టం. కారణం...అది మాతృభాష. ఈ భాషలో మాట్లాడినంత హాయిగా తెలుగులో మాట్లాడడం సాధ్యం కాదు."
Post a Comment
<< Home