తెలుగు వర్ణమాల పాట
by Thotakura Venkat Rao, Cherukupalli, Guntur dist., AP
తీపి తీపి తెలుగు తేట తేట తెలుగు అని మనం మన తెలుగు భాష గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన, వేమన... వంటి మహా కవులను స్మరించుకుంటాం. 'దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకుంటూ అన్న మాటలు తలుచుకొని మురిసిపోతాం. మరి మనం తెలుగుకు నిజంగానే అంత ప్రాధాన్యం ఇస్తున్నామా? మన సొంతభాషను గౌరవిస్తున్నామా? మన స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం మోజులో పడి మాతృభాషకు అన్యాయం చేస్తున్నామా? ఈ విషయాన్ని ఈ వయసు నుంచే మనం ఆలోచించాలి. మన తీయటి తెలుగును ప్రేమించాలి. దాని గొప్పదనాన్ని తెలుసుకొని గర్వించాలి. మరోవైపు తమిళులు వాళ్ల తమిళభాషను భారత ప్రభుత్వం చేత 'ప్రాచీన భాష'గా గుర్తింపచేసుకున్నారు. వాళ్లది తక్కువ భాష కాదుగానీ మనది వాళ్ల కంటే తక్కువ భాష మాత్రం కాదు. కనుక మేల్కొందాం. తెలుగు నేర్చుకుందాం. ప్రతిఒక్కరికీ నేర్పుదాం. అందుకోసం ఈ అందమైన 'వర్ణమాల' పాటను ఉపయోగించుకుందాం. 'అ' నుండి 'ఱ' వరకు తెలుగు అచ్చులు, హల్లులు వచ్చేలా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అల్లిన గేయం ఇది. చూడండి...
పల్లవి : అందరము బడిపిల్లలము
హాయిగ బడికి వెళ్లెదము
అ, ఆ, ఇ, ఈ నేర్చుకుని
ఆగ పాటల గడిపెదము
ఉదయపు సూర్యుని వెలుగులలో
ఊయలలూగి హాయిగొని
ఋషులను తలచి ప్రణమిల్లి
ఋతువుల గీతం పాడెదము...
ఎల్లలు మాకు చెల్లవని
ఏవో పాటలు పాడుకొని
ఐదు రూకలు ఇచ్చుకొని
ఒక్క తామయమును కొంటాము
ఓహో అంటూ గంతులిడి
ఔనని అంతా ఏకమయి
అందరు దానిని పంచుకుని
అః అః అని తింటాము
కమలపు పూవులు కోసుకొని
ఖర్జూరరాలను రుచి చూచి
గంధపు చెట్టు నీడలలో
ఘటములో నీరు తాగెదము
సఙ్గతి తెలిపే గురువులను
చక్కగ ముందుగ స్తుతియించి
ఛత్రము పట్టి పూజించి
జయమును యిమ్మని వేడెదము...
ఝంఝామారుత వేగంతో
జ్ఞానమునెంతో ఆర్జించి
టకటక ప్రశ్నల బదులిచ్చి
ఠావుల మీద రాసెదము
డండం, డండం నాదమిడె
ఢంకను బాగా మోగించి
వీణతో గీతం పాడించి
తబలల తాళం వేస్తాము
కథలతో కాలం గడిపేసి
దశదిశలన్నీ పరికించి
ధవళపు కాంతుల వెలుగులలో
నవగీతాలను పాడెదము...
పగలు రేయి ఆడుకొని
ఫలములనెన్నో కోసుకొని
బంగరు సందెల పరుగిడుతు
భయమును లేక తిరిగెదము...
మధ్యాహ్నపు మాపులలో
యతులై ఎండలో తిరుగాడి
రంగుల రెక్కల నడయాడె
లకుముకి పిట్టల చూచెదము
వన్నెలు చిన్నెలు వెలయించే
శంఖపు సొంపుల గమనించి
షరతులు లేని ఊసులతో
సంబరపడుతూ సాగెదము
హరిత వనంబుల ఆడుకొని
గళములనెత్తి పాడుకొని
క్షణమొక రీతిగ గడిపేసి
ఱంగలరాట్నం ఎక్కెదము...
రచన: తోటకూర వెంకటరావు, టీచర్ చెరుకుపల్లి, గుంటూరు జిల్లా
Courtesy: ఆంధ్ర జ్యోతి
0 Comments:
Post a Comment
<< Home