తెలుగు ప్రాచీనత సరే, ఆధునికత మాటేమిటి?
- ఎన్. ఇన్నయ్య
తమిళ భాషకు దీటుగా తెలుగు భాషకు గుర్తింపు కావాలని యిప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. అలా గుర్తింపు వస్తే ఏమిటంట? అంటే ప్రభుత్వ నిధులు వస్తాయి. పరిశోధనలు జరుగుతాయి. ఇంకా ఎన్నో ఉపయోగాలుంటాయి. బాగానే ఉంది, మరి తెలుగు భాషకు ఆధునికత ఏదీ? ఎవరూ ఆ ఊసెత్తరేం? వేగంగా మారుతున్న ప్రపంచంలో అంత స్పీడ్‌లో భాష కూడా అందుకోవాలిగదా.
తమిళనాడులో భాషోద్యమం అన్ని రంగాలలో ఉధృతంగా సాగింది. అందుకే గుర్తింపు వచ్చింది. తెలుగు వారికి అటువంటి పట్టుదల, చిత్తశుద్ధి లేదు. కనుక గుర్తింపు రాదు. ఉదాహరణకు కాంగ్రెస్ ప్లీనరీ హైదరాబాద్‌లో జరిగితే, ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంగ్లీషులో మాట్లాడారు. తమిళనాడులో అయితే అక్కడివారు తమిళంలో మాట్లేడేవారు. తెలుగులో ఏం మాట్లాడుతున్నారో ఇతరులకు తెలియడానికి వెను వెంటనే అనువాద ప్రక్రియ చేయవచ్చు. అసెంబ్లీ, పార్లమెం టులో వలె చెవిఫోన్లు పెట్టుకుంటారు. సమితిలో ఇలాంటివి ఉన్నాయి. ఎవరి భాష వారు మాట్లాడడం వలన యిలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలుగువారికి పట్టుదల ఉంటే అటువంటి పనులు జరగాలి. అది తెలుగుపై ప్రేమాభిమానాలకు, భాషా వ్యాప్తికి, ఆధునికరణకు దోహదం చేస్తుంది. సినిమావాళ్ళతో చిలక పలుకులు పలికిస్తే తెలుగు పెంపొందదు. కీలక వ్యక్తులు, అసలు పట్టిం చుకోవలసిన సంస్థలు తెలుగు అభివృద్ధికి కృషి ప్రారంభించాలి.
జపాన్, దక్షిణ కొరియా చిన్నదేశాలే. కాని భాషారంగంలో అగ్ర రాజ్యాలకు దీటు గా అభివృద్ధి చెందాయి. అటువంటి కృషి తెలుగులో జరగాలి కదా. అందుకు ఆధునీకరణ ఎక్కడోచోట మొదలుకావాలి. కంప్యూటర్లు మన భాషాభివృద్ధికి చాలా ప్రయోజనకారులని తెలుసుకోవాలి. ప్రభుత్వం చేయలేని పని, ప్రైవేటు సంస్థలో, పత్రికలు, మీడియా సాధించడం చూస్తూనే ఉన్నాం.
మనకు భాషా సంస్థలు, పదవులు తక్కువేం కాదు. కానీ ఈ సంస్థలలో ఆధునిక మనస్తత్వం లేకపోవడమే లోపం. తెలుగు భాష అంటే అన్ని రంగాలలో ఇతర దేశాలకు, భాషలకు దీటుగా రావాల్సిన భాష అనే సంగతి గుర్తుంచుకోకపోవడమే మన సంస్థల లోపం.
సెక్రటేరియట్ మొదలు పంచాయితీల వరకూ, హైకోర్టు నుండి మండలం వరకూ, యూనివర్శిటీ నుండి ప్రాథమిక పాఠశాల వరకూ అన్ని శాస్త్రాలలో తెలుగు రావాలి. వాచకాలకూ, సాంఘిక శాస్త్రాలకూ, తెలుగు పరిమితం కారాదు. టెక్నాలజీ, మెడికల్ కోర్సులకు పిల్లల్ని పంపాలనే పట్టుదలతో ఇంగ్లీషు మీడియంలో ప్రాథమిక దశనుంచే మొదలెడుతున్నాం. ఆ స్థితి తెలుగులో రావాలంటే, సంస్థలన్నీ త్వరగా తెలుగులో అన్ని కోర్సులు ఆధునీకరణ చేస్తూ కంప్యూటరీకరణ చేయాలి. కొన్నిటికే తెలుగును పరిమితం చేసినందున ఇంగ్లీషు మీడియం తప్పడం లేదు. అది గ్రహించకుండా 'మమ్మీ', 'డాడీ' కల్చర్ అంటూ విమర్శిస్తే ఏం ప్రయోజనం?
సంస్కృతాన్ని మరిపించేటట్లు భారతాన్ని తిక్కన తెలుగులో చూపాడని గర్వి స్తాం. అటువంటిదే నేడు ఐన్‌స్టీన్ మొదలు హాకింగ్స్ వరకూ జరగాలి. తెలుగులో ఆధునిక శాస్త్రాలన్నీ అందిస్తేనే తెలుగు పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
అధికార భాషా సంఘం నేడు వివిధ విద్యా సంస్థల వెంటబడి ఆధునీకరణలో తెలుగు దనం కనబరచడానికి కృషి చేయాలి. తెలుగు యూనివర్శిటీ, ఓపెన్ యూనివర్శిటీ నుండి లా సంస్థలు, బిజినెస్ కోర్సులు, మెడికల్, టెక్నాలాజికల్ కోర్సులు తెలుగులో వచ్చే ప్రక్రియకు కృషి జరగాలి. అంతవరకూ నేల విడిచిన సాముచేసినట్టే అవుతుంది.
ఇంగ్లీషువాళ్ళు, ఫ్రెంచివారు మన రాష్ట్రంలో అనేక తీరుల్లో వివిధ విషయాలను పరిశీలించి, తెలుగునుండి తమ భాషల్లోకి విషయాల్ని అందించారు. భాషా భేషజం పోలేదు. ఇప్పుడు మనం కూడా తెలుగును అతిగా పొగడడం మానేసి, ఆచరణలో తెలుగు అభివృద్ధి సాధించాలి. తెలుగు ఛాందసుల, పండితుల చేతుల్లో ఇన్నేళ్ళుగా తెలుగు ఆధునీకరణ కుంటుపడింది. అసలు లోపం అక్కడున్నది. సైన్స్, టెక్నాలజీ రంగాలలో అట్టడుగున తెలుగు ఉండడానికి ఈ ఛాందస నాయకత్వమే కారణం. అదే సవరించుకోవాలి.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh ancient classical language status demand tcld2006
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home