శ్రీ కృష్ణుడు తెలుగు జాతివాడే
డాక్టర్ వి.వి.కృష్ణశాస్త్రి.. నిజాలను తవ్వి తీయడం ఆయన వృత్తి. ఆర్కియాలజీ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. తాము తవ్వితీసిన చరిత్రకు భాషా చరిత్రకు సంబంధం ఏమిటో చెబుతారాయన. అనేకానేక సంస్కృతుల, భాషల ప్రాబల్యంలో నలిగి సజీవంగా నిలిచిన తెలుగుభాషపై ఆయనకు అపారమైన మక్కువ. తెలుగుభాష అతి ప్రాచీనమైనదనీ దానికెవ్వరూ ప్రత్యే కంగా పట్టం కట్టనక్కరలేదనీ అంటారాయన. దాని ప్రాచీనతకు ఎన్నో ఆధారాలు చూపుతారు. ఆయనతో పాటు చరిత్ర పుట ల్లోకి 'మార్నింగ్ వాక్..' మనం 'అంధకులం'..
బ్రాహ్మణాలు క్రీ.పూ. 1500 నాటివి.. ఇంగ్లీషువారే చెప్పారా మాట. వీటిలో ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. 'అంధకులు' అని వాడారు. విశ్వామిత్రుడిశాపం వల్ల ఆంధ్రులు అంధకులు అయ్యారని క«థ. అంధకులు ఇక్కడి ప్రాం తం వారు కాదు.. అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చారన్న అభిప్రాయం కూడా ఉంది. అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల మధ్య 'చక్షు' అనే నది ఉండేది. ఇప్పుడు దానిని 'ఓక్సస్' అంటున్నారు. ఈ నది ఒడ్డున అంధకులు అనే తెగ ఉండేది. వారు అక్కడినుంచి మొదట గంగా, యమున ప్రాంతానికి అటునుంచి గోదావరి, కృష్ణానది ఒడ్డుకు వచ్చారు.
అఫ్ఘానిస్తాన్‌లో ఇప్పుడు 'బ్రూహి' అనే జాతి ఉంది. వారు మాట్లాడే భాషకు తెలుగుకు సంబం ధం కనిపిస్తుంది. ఇక్కడినుంచి అక్కడికి వెళ్ళారో.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో చెప్పలేం. సాంస్కృతిక మార్పులే మైనా బయటినుంచే వచ్చాయని అనడం బ్రిటిష్ వారికి తద్వారా మనకు అలవాటయింది. చక్షునది ఒడ్డున 'అంధ కూయి' అనే ప్రాంతంలో అంధకులు.. అంటే ఆంధ్రులుండే వారు. దక్షిణ భారతదేశానికి లోహయుగ సంస్కృతి నేర్పింది ఆంధ్రులే. ఇనుము, గుర్రాలను విరివిగా వాడేవారు. ఎరుపు, నలుపు రంగులున్న పాత్రలు వాడింది వీరే. క్రీ.పూ. 1100 నాటి మాట ఇది. ఆంధ్రులు గొప్ప యోధులు. వారు చనిపోయాక మృతదే హాలను పూడ్చి చక్రాకారంలో పెద్ద రాళ్ళతో రాతి నిర్మాణం చేసేవారు. చరిత్ర చెబుతున్న ఈ ఆంధ్రులు మాట్లా డేది ఏమయి ఉంటుంది.. ఆంధ్రమేగా.. అంటే మన భాష, సంస్కృతికి క్రీ.పూ. మూడువేల నాటికే బీజం పడింది.
జాతక కథల్లో కూడా..
బౌద్ధ మత గ్రంథాలయిన జాతక కథల్లో కూడా అంధకుల ప్రస్తావన ఉంది. కొన్ని శాసనాల ద్వారా కూడా ఈ విషయం నిర్ధారణ అవుతోంది. అంధకులు ఉత్తరాదికి వెళ్ళి అంధకవింద, అంధక వనం అనే ఆరామాలను అప్పటి మగధ రాజ్యం (ఇప్పటి బీహార్..)లో నిర్మించారు. క్రీ.పూ. ఆరవ శతాబ్దం నాటికే ఆంధ్ర దేశానికి బౌద్ధం వచ్చినట్టు ఆధారాలున్నాయి. బుద్ధుడి జీవిత కాలంలోనే అది ఇక్కడికి ప్రవేశించింది. ఆం ధ్రులు బౌద్ధాన్ని బాగా ఆదరించారు. త్రిపీటకాల్లోని 'బావురి' వృత్తాంతం ద్వారా ఇది తెలుస్తోంది.
కృష్ణుడు మన జాతి వాడే..
మహాభారతంలో ఆంధ్రుల కౌరవ పక్షాన యుద్ధం చేసినట్టు ఉన్నది. దీనికి కారణం ఏమిటంటే.. కృష్ణుడు అంధక జాతి వాడు. అంధక వృష్టీయంలో పుట్టాడు. హి బిలాంగ్స్ టు ఆంధ్రా.. ఆయన సైన్యం అంధకులు.. అంటే ఆంధ్రులు. అం దుకే మనకు కృష్ణుడంటే అంత ప్రీతి. ఇక్కడ ఇంతగా కృష్ణ భక్తి పెరిగిందీ అందుకే. ఆయన రాసలీలలు బాగా ప్రచారం పొందిందీ... ఆయన ఇక్కడివాడు కనుకే. కురుక్షేత్ర సంగ్రామం లో "నేనొక్కడినీ ఒకవైపు.. నా సైన్యం మరోవైపు ఉంటుంది.. ఏది కావాలో కోరుకో'' అని కృష్ణుడు అర్జునుడిని అడిగితే ఆయన కృష్ణుణ్ణే కోరుకున్నాడు. దానితో కృష్ణుడి సైన్యం అంతా దుర్యోధనుడి పక్షాన పోరాడింది.
గుంటూరు జిల్లా 'కొండమోటు'లో దొరికిన 'పంచవీర' విగ్ర హంలో వాసుదేవ కృష్ణుడు ఉన్నాడు. అనిరుద్ధుడు, బల రాముడులాంటి ఐదుగురు వీరులున్న విగ్రహం ఇది. క్రీ.శ. రెండు, మూడు శతాబ్దాల నాటిది. దేశంలో దొరికిన కృష్ణుడి విగ్రహాలలో ఇదే ఎర్లియస్ట్.. ముష్టికుడు, చాణూరుడు కూడా ఆంధ్రులే .. గొప్ప మల్ల యోధులు.
చరిత్ర చెబుతోంది ఇదీ..
కరీంనగర్ జిల్లాలోని 'దూరికట్టె' అనే ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో శాతవాహనుల కాలంనాటి నాణేలు దొరికాయి. అవి వెండినాణేలు. శివసిరి పులమామి పాలనలోవి. వాటిపై ఒకవైపు ప్రాకృతం.. మరోవైపు తెలుగు ఉంది. ఆయన క్రీ.శ. 1వ శతాబ్దం అనుకుంటే తెలుగు అప్పటినుంచి బాగా వాడుకలో ఉన్నట్టే కదా.. అలాగే ఈయన తాత గౌతమీపుత్ర శాతకర్ణి ఆయన కాలంలో కూడా ఇలాంటి ద్విభాష నాణేలున్నాయి. అంటే అప్పటినుంచి తెలుగు ఉన్నట్టే.. తెలుగంటే ఇప్పటి తెలుగు కాదు. ప్రాకృతం కలిసిన తెలుగు.
అశోకుడి శాసనాలు అమరావతిలో, కర్నూలు జిల్లాలో ఉన్నాయి. భాష ప్రాకృతం. క్రీ.పూ. 3వ శతాబ్దం నాటివి. నిజానికి ఆకాలంలో ఉత్తరం నుంచి దక్షిణ దేశందాకా అంతా ప్రాకృతమే.. ఒకరకంగా ఆ కాలంలో అది నేషనల్ లాంగ్వేజ్.. రాజభాషగా చెప్పవచ్చు. కాకపోతే ప్రాంత బేధాలున్నాయి. కన్నడ ప్రాంతంలో కొంత కన్నడ కలిసి.. తెలుగు ప్రాంతంలో కొంత తెలుగు కలిసి ఉండేది. ప్రాకృతం ప్రాంతీయ భాషలను కలుపుకుని పెరిగిందే. అందుకే అశోకుడి శాసనాల్లోని ప్రాకృతంలో తెలుగు కనిపిస్తున్నది. హాలుడి గా««థా సప్తతిలో అక్క, అత్త లాంటి తెలుగు మాటలెన్నో ఉన్నాయి.
అలాగే గుణాఢ్యుడి బృహత్కథలో సంస్కృతం, ప్రాకృతం, దేశీ భాషల ప్రస్తావన ఉంది. దేశీ భాష అంటే తెలుగే..
విష్ణుకుండినుల రాజుల కాలం నాటివి అంటే క్రీ.శ.నాల్గవ శతాబ్దం నాటివి 11 రాగిశాసనాలు, ఒక శిలాశాసనం దొరికిం ది. దీనిలో 'పెణకపర్రు' లాంటి తెలుగు పదాలు అనేకం ఉన్నా యి. ఆ కాలం నాటికి తెలుగు విస్తృతంగా వాడినట్టు తెలు స్తోంది.
రంగారెడ్డి జిల్లా కీసర గుట్టలో ఓ శాసనం ఉంది. దానిలో 'తొలచు వాండ్రు' అన్న పదం ఉంది ఇది క్రీ.శ. నాల్గవ శతాబ్దం నాటిది. ఆంధ్రప్రదేశ్‌లో దొరికిన పూర్తి తెలుగు 'లేబుల్' ఇది.
చాళుక్యులు ఆలంపూర్ (మహబూబ్‌నగర్) రాజధానిగా చేసుకుని పాలించినట్టు ఆధా రాలున్నాయి. వారి శిలా రాగిరేకు శాసనాలు కర్నూలు జిల్లాలో దొరికాయి. వారు 'చాళుక్య విష యం' అని రాసుకున్నారు. రాష్ట్రకూటులు, కళ్యాణి, బాదామి చాళుక్యులు విరివిగా తెలుగు పదాలు వాడారు.
భాషలకు పేర్లు లేవు..
మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. భాషలకు మొదట్లో పేర్లు లేవు. భాషను మాట్లాడే ప్రాంతాన్ని బట్టి పేర్లు వచ్చాయి. కళింగ ప్రాంతంలో మాట్లాడేది కళింగ భాష.. ద్రవిడ దేశంలో మాట్లాడేది ద్రవిడ భాష.. కొన్ని శాసనాల్లో చిత్తూరు జిల్లాలో వాడే భాష 'వడుకు' అని ఉంది. వడుకు అంటే 'ఉత్తరాది భాష 'అని అర్థం. తమిళులు పూర్వం తెలుగును వడుకు భాష అనే వారు. ప్రాంత చరిత్ర ద్వారా భాషా చరిత్ర తెలుస్తుంది. దీనికి ఆర్కియాలజీ ఆధారం. 'సంస్కృతం' అంటే అర్థం ఏమిటి.. 'బాగు చేయబడ్డది' అని. దేనినుంచి బాగు చేశారు.. ప్రాకృతం నుంచి.. లేదా మరో భాష నుంచి. మొదటి నుంచి ఉన్నదాన్ని సంస్కరిస్తే సంస్కృతం అయింది.
ఇరాక్‌లో తెలుగు..
'బాబిలోనియన్ అండ్ అస్సేరియన్ సివిలైజేషన్' అన్న పుస్తకం చదివాను. ఇరాక్ దేశంలోని యుప్రటిస్, టైగ్రిస్ నదీ ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి. తవ్వకాలు జరిగిన ప్రాంతం పేరు.. 'ఊరు'. ఇది తెలుగు పదం. అక్కడో లైబ్రరీ దొరికింది. నలభైవేల పుస్తకాలున్నాయి. దానిలో.. అవి ఇప్పటి పుస్తకాల లాంటివి కావు. కాల్చిన మట్టి పలకలపై 'క్యూని ఫారమ్' భాషలో... సూది ఆకారపు లిపిలో రాసిన క్లే టాబ్లెట్లు. ఆశ్చర్య మేమిటంటే ఆ పుస్తకాలలో తెలుగు భాషకు దగ్గరగా ఉన్న అనేక పదాలున్నాయి. గుడి, గుడియ.. లోగిలి ఇప్పుడు మనం వాడుతున్న అర్థంలోనే.. గుడియ అంటే అర్చకుడు అనే అర్థంలో వాడారు. అంటే క్రీ.పూ. 3 వేల ఏళ్ళకు పూర్వమే తెలు గు భాషా చాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇరాక్‌లో ఆ 'క్లే టాబ్లెట్స్' ఉన్నాయి క్యూనిఫారమ్ భాష తెల్సిన భాషా శాస్త్ర వేత్తలెవరయినా పరిశోధన చేస్తే బాబిలోనియా నాగరికతకు తెలుగు భాషకు సంబంధం కచ్చితంగా తెలుస్తుంది.
టాలమీ చెప్పిన ' ముడుగు లింగ'..
క్రీపూ 2వ శతాబ్దంలో ఇక్కడకు వచ్చిన టాలమీ అనే పర్యాటకుడు 'జాగ్రఫీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా' గ్రం«థం రాశాడు. ఇది పూర్తిగా వ్యాపారుల కోసం రాసింది. దానిలో కళింగ ప్రాంతాన్ని 'ముడుగు లింగ' అన్నాడు. అదే ముక్క లింగ... త్రిలింగ. ఉత్తర, దక్షిణ, మధ్య కళింగాలు. వీటిలో ఉత్తర.. ఉత్కళ కాగా, దక్షిణ, మ«ధ్య కళింగాలు తెలుగు దేశాలు. ముడుగు లింగ.. ముక్కలింగ.. త్రికళింగ.. త్రిలింగ.. తెలుంగు... తెలుగు అయి ఉంటుంది.
వాల్మీకి 'లంక'.. తెలుగే..
రామాయణంలో వాడిన లంక పదం తెలుగుదే. సంస్కృ తంలో ఈ మాటలేదని పండితులు అంటున్నారు. వాల్మీకి రామాయణం క్రీ.పూ. మూడు, నాలుగు శతాబ్దంలోది. ఇదొ క్కటే కాదు వేల సంవత్సరాల క్రితమే అనేక కావ్యాలు, వైద్య గ్రం«థాలు రాశారు. అవి ఇప్పుడెలా దొరుకుతాయి. ఏ తాళపత్ర గ్రంథమైనా 200 ఏళ్ళకు మించి ఉండదు. బాగా ప్రాచుర్యం పొందిన కావ్యాలు.. కాపీ చేసుకున్నవే కనిపిస్తాయి. ప్రపంచ సైన్సు చరిత్రలో మొదటిసారిగా పాదరసాన్ని కాల్చి భస్మం చేసి 'రసభస్మం' తయారు చేసిన 'సిద్ధ నాగార్జునుడు' అనేక గ్రంథాలు రాశాడు. అవి ఇప్పుడు దొరుకుతున్నాయా.. ఒక్కటే దొరుకుతున్నది.
తెలుగు.. బగ్గడ్ లాంగ్వేజ్..!
సంస్కృతానికి తెలుగుదేశంలో ఆదరణ ప్రారంభం అయ్యాక తెలుగును నేలమట్టం చేశారు. గ్రామాలపేర్లు, నదుల పేర్లు అన్నీ సంస్కృతంలోకి మారిపోయాయి.. కృష్ణా నది పేరు అదేరీతిగా వచ్చింది. పెన్నేరు, పేద్దెరు, మానేరు, మాకేరు... ఎంత అందమైన పేర్లు.. పల్లెలకు ఎంత అందమైన పేర్లుండేవి. అన్నీ మార్చేశారు. తర్వాత కాలంలోనూ అదే తీరు.. అరిపిరాల కరీంనగర్ అయింది.. పాలమూరు మహబూబ్‌నగర్ అయింది. సంస్కృతం, ప్రాకృతం, ఉర్దూ, పారశీ, ఇంగ్లీషు.. ఇవన్నీ యథా శక్తి తెలుగును తొక్కేశాయి. ఇంతాచేసి 'సంస్కృతం లేకుండా తెలుగుకు ఉనికి ఎక్కడిది' అంటాడో పెద్దమనిషి.. ఇదేంరీతి.. తెలుగు మాట్లాడేవాడంటే చవట కింద జమ.. మేం ఉస్మా నియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో తెలుగు మాట్లా డే వారంతా సెకండరీ గ్రేడ్ సిటిజన్స్.. తెలుగుకు అప్పటి పేరు తెల్సా.. 'బగ్గడ్ లాంగ్వేజ్..' అ«థమ తరగతి వారు మాట్లాడే భాష.. ఇది 1956 నాటి పరిస్థితి.. ఇప్పుడేం మారింది. ఏ భాష, ఏ సంస్కృతి ఎంత అణచి వేసినా తెలుగు చావలేదు. చావబోదు.. అదీ దానిశక్తి.. అది ప్రాచీనమైంది కనుకే.. ప్రజల్లో దాని పునాదులు అంత గట్టిగా ఉన్నాయి కనుకే అదింకా సజీవంగా ఉంది.
పరిపుష్ఠమైన భాష మనది
కరీంనగర్, కృష్ణా, శ్రీకాకుళం, నెల్లూరు.. ఇలా వివిధ ప్రాంతాల్లో మాండలికాలున్నాయి. వీరు మాట్లాడే పదాల్లో తేడా ఉంది. ఒకరు తట్ట అంటే మరొకరు గిన్నె అంటారు.. వీట న్నిటినీ ఒక్కచోట కూర్చి డిక్షనరీ తయారుచేస్తే తెలుగు ఎంత గొప్ప భాషో తెలుస్తుంది. ఇంత పరిపుష్ఠమైన భాష దేశంలో ఎక్కడా కనిపించదు.
Keywords: Telugu Andhra Pradesh India Indian language classical ancient status demand Sri Krishna Hindu God Mesopotamia Iraq Afghanistan history migration tcld2006
Labels: tcld2006
1 Comments:
తెలుగు భాషా వైభవము విశ్వ వ్యాప్తి కావడానికి ఈ బ్లాగ్ ఎంతో ఉపయుక్తమయినది.
Post a Comment
<< Home