ప్రాచీన భాషపై ప్రజా ఉద్యమం
- ఇనగంటి వెంకట్రావ్
ఎప్పుడు ఏది ముఖ్య సమస్యగా, ఏది ప్రజా ఉద్యమంగా తెరపైకి తేలి వస్తుందో చెప్పలేం. ప్రాచీన భాషగా తెలుగును గుర్తించా లన్న కోర్కె ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుజాతి గుండె చప్పుడు గా మారిపోయింది. తెలుగు జాతి ప్రతిష్ఠకు సంబంధించిన సమస్యగా పరిణమించింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలన్నీ దీనిపై సదస్సులు, చర్చాగోష్ఠులు ఏర్పాటు చేస్తున్నాయి. సాహిత్య, సాంస్కృతిక సభలలో తెలుగు ప్రముఖులు దీనిపై ఉద్వేగ భరిత ప్రకటనలు చేస్తున్నారు. మన చేతగాని తనంపైన, మన భాష భవిష్యత్తుపైన ఆవేదన, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసాంధ్రు లయితే - పాపం - వారి ధ్యాస, ధ్యానం ఎప్పుడూ మాతృదేశంపైన, మాతృభాషా సంస్కృతుల పైనే! తెలుగు ప్రజల నాడిని కనిపెట్టిన రాష్ట్ర విద్యామంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి, తెలుగును ప్రాచీన భాష గా ఋజువు చేయడానికి అవసరమైన ఆధారాలు సేకరించాలని అధి కారులను కోరారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ అయితే ఈ సమస్యపై ఏకంగా ఉద్యమానికే సన్నద్ధమయింది. షార్ట్‌కట్ పద్ధతి లో హైకోర్టులో దావాకూడా వేసింది. తెలుగుదేశం ప్రవేశంతో సహజం గానే దీనిపై రాజకీయ వాదోపవాదాలు కూడ రంగ ప్రవేశం చేశాయి. ఇప్పటివరకు మాతృభాషావాదులు, తెలుగు జాతీయవాదులకే పరి మితమైన భాషా వికాసోద్యమం ఇప్పుడు రాజకీయ ఉద్యమాలలో భాగమయ్యే పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఇది రాజకీయాలకు అతీ తంగా అందరూ కలిసి ఉద్యమించవలసిన అంశం. అయినా రాజకీ యం కావడంకూడ అదీ ఒకందుకు మంచిదే. రాజకీయ నిర్ణయం లేకుండా మన వ్యవస్థలో ఏ సమస్య పరిష్కారం కాదు. ఎవరెన్ని ఉద్య మాలు లేవదీసినా- కేంద్రంలో కాని, రాష్ట్రంలో కాని చివరకు నిర్ణయం జరగవలసింది రాజకీయ స్థాయిలోనే!
కేంద్ర ప్రభుత్వం తమిళ భాషను ప్రాచీన భాషగా గుర్తించడానికి దారితీసిన నేపథ్యం కూడ ప్రధానంగా రాజకీయమే! తమిళ జాతీయ వాదానికి ప్రతీకగాఉన్న అక్కడి ప్రధాన రాజకీయపక్షం ద్రవిడ మున్నే ట్ర కళగం తెచ్చిన ఒత్తిడి కేంద్రం నిర్ణయానికి కారణం. ఆ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని చేర్చింది. దానిని సాధించుకోవడా నికి పట్టుదలగా పనిచేసింది. అయితే ఒక రాజకీయ పార్టీ ప్రయత్నం వల్లనే ఇది సాధ్యమయిందని అనుకోవడం కూడ పూర్తిగా సరికాదేమో! తమ భాష విషయంలో తమిళులది వీరాభిమానం. ఉడుంపట్టు. అలా గని పిడివాదంతో ఇంగ్లీషుని కాదనే తత్వంకూడ వారికిలేదు. తమిళుల భాషాభిమానానికి నిదర్శనంగా ఒక్క సంఘటనను ఉదహరిస్తే చాలే మో! కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం అవకాశం దొరి కిన ప్రతిసారీ తన మాతృభాషను తెరపైకి తేవడానికి పడే ఆరాటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది బడ్జెట్ ప్రసంగం కానివ్వండి, మరో ముఖ్య మైన సమావేశంకానివ్వండి-ఆయన ధారాళంగా తమిళ చాటువులను, కవితలను తమ ప్రసంగాలలో సమయోచితంగా ఉటంకిస్తుంటారు. జాతి యావత్తూ చెవులు రిక్కించి వినే ప్రత్యక్ష ప్రసారాలలో - తమిళ వాణి వినపడడం కంటె గొప్ప గౌరవం భాషకు ఎక్కడ దొరుకుతుంది. మరే ఇతర ప్రాంతీయ భాషల వారయినా అలా చేయగలిగారా! మన నాయకులు కేంద్రంలో ఎన్ని పదవులు నిర్వహించలేదు. ఇప్పటికీ, మనది జాతీయ స్థాయిలో ముఖ్య భూమికే! అందుకు నిదర్శనం - కడచిన నెల రోజులలో ప్రధాని మూడుసార్లు, సోనియా రెండుసార్లు రాష్ట్రాన్ని సందర్శించడమే! గతంలో తెలుగుదేశం కూడ ఇలాగే కేంద్ర ప్రభుత్వానికి దన్నుగా ఉండేది. ఇప్పుడు మన రాష్ట్ర కాంగ్రెసు ఎంపీలే కేంద్రానికి ప్రాణవాయువు. అయినా ఎవరయినా చిదంబరంలా తెలు గు వాణిని సగర్వంగా వినిపించగలిగారా! అసలు లోక్‌సభలో కొంత కాలం దుబాసీలు లేక తెలుగు ప్రసంగం చేసే పరిస్థితే లేదంటే మన వారి అలసత్వాన్ని ఏమనుకోవాలి. మళ్ళీ మనకు ఒక గొప్ప జాతిగా, మన రాష్ట్రానికి అత్యంత ఆధునిక రాష్ట్రంగా ప్రపంచంలో ఎనలేని గుర్తింపు, గౌరవం. అందుకు మనం తరచూ గర్వపడడం.అదంతా ఎన్.టి.ఆర్. పుణ్యం, కాని ఆ తర్వాత ఏమయింది. అందరూ ఆ సంగతి మరచిపోయారు. భాషోద్యమం బయలుదేరిన తర్వాత కాని తెలుగు మాధుర్యం గురించి ఎవ రికీ గుర్తురాలేదు. నిజానికి తెలుగు ప్రాభవాభ్యు దయాల కోసం పోరాడవలసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశమే! ఎందుకంటె- ఆ పార్టీ పుట్టిందే ఆ పేరుపైన! ఆ పార్టీ వ్యవస్థాప కుడు అంటే జనానికి గుర్తుకు వచ్చేది తెలుగు పౌరుషం, తెలుగు ఆత్మగౌరవాలే!
చాలా ఉద్యమాలు కింది స్థాయి నుంచి - ప్రజల నుంచి పుట్టుకు వస్తాయి. సారా వ్యతిరేక ఉద్యమం మహిళల నుంచి పుట్టుకు వచ్చి ఇప్పటికి పదేళ్లకు పైగా అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సారా నిషేధాన్ని ఎత్తివేసే ఊసు తెచ్చే ధైర్యం కూడ ఎవరికీ లేకపోయింది. సరే-మద్యం రూపంలో సారాలేని లోటును ప్రభుత్వాలు తీరుస్తున్నా యనుకోండి- అయినా ప్రజా చైతన్యం రాజకీయ పార్టీలను, ప్రభుత్వా లను ఎంతగా కట్టడి చేయగలదో నిరూపించగల ఉద్యమం సారా వ్యతి రేక ఉద్యమం. భాష విషయంలో కూడ అలాంటి చైతన్యమే, ఉద్యమ మే ఇప్పుడు అవసరం. నిజానికి ఈ దిశగా కొన్నేళ్ళ క్రితమే చలనం ప్రారంభమయింది. భాషోద్యమసమాఖ్య పేరుతో సి.ధర్మారావు, సామ ల రమేష్‌బాబు, మండలి బుద్ధప్రసాద్ వంటి కొద్దిమంది భాషాభిమా నులు మెల్లిగా గళం విప్పారు. అది క్రమంగా వ్యాపించింది. చిత్రం ఏమిటంటే- భాషాభిమానం అందరి గుండెలలోనూ నిండుగా వుంది. కాని అది పాలకులకు వినపడేటంత బిగ్గరగా, భీకరంగా ఎగదన్నడం లేదు. మన సాహిత్య సమావేశాలనే చూడండి లేదా భాషా విషయాల పై జరిగే చర్చలు, గోష్ఠులనే చూడండి- హాజరు పదులు, పాతికలలో! వందలలో అరుదు.
వీటికి భిన్నమైన వాతావరణంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపా ధ్యక్షులు డాక్టర్ ఆవుల మంజులత ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజ రయ్యారు. అదేవిధంగా పత్రికా సంపాదకులు, పండితులు. భాషా విషయికంగా ఇటీవల జరిగిన సమావేశాలలో ఇది ముఖ్యమైనది, పెద్ద ది కూడ! తెలుగు విశ్వవిద్యాలయం కంటె ముందుగా ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఇలాం టి సమావేశాన్నే ఒకదానిని ఏర్పాటు చేశారు. పత్రికలు, ఈటివి-2 వంటి సంస్థలేకాక వ్యక్తులుగా పలువురు భాష కో సం పడుతున్న తాపత్రయం కూడ మెచ్చదగినదే. ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలని కోరుతూ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఉత్తరాల ఉద్య మం సాగిస్తున్నారు. ఆయనది వన్‌మాన్ ఆర్మీ! ప్ర ముఖ సినీ కవి వేటూరి సుందరరామమూర్తి అయి తే-తన జాతీయ పురస్కారాన్నే వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఇవన్నీ తెలుగు జాతిలో వ్యక్తమవుతు న్న ఆగ్రహావేశాలకు నిదర్శనాలు. తెలుగు జాతికి తగిన గుర్తింపు రావడం లేదనే అవమాన భారం తో, తెగువతో తీసుకుంటున్న నిర్ణయాలు.
అయితే దీనికి మరో కోణం కూడ ఉంది. కొంత కాలం క్రితం - తిరు పతిలో తుడా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి తెలుగు సాహితీ సాంస్కృతిక వారోత్సవాలు నిర్వహించారు. ఆ సమావేశాలలో ఒక రోజున పత్రికా సంపాదకుల సమక్షంలో భాషోద్యమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి సామల రమేష్‌బాబు ఆవేశపూరితంగా ఒక ప్రశ్న సంధించా రు- తమిళులకు ఉన్నట్టు మనకు ఒక జాతీయ కవి ఎందుకు లేరని. మనం అందరం కలిసి ఒక పేరును సూచించలేమా అని ఆయన సూటి గా అడిగిన ప్రశ్న సమావేశంలో కలకలం రేపింది. రమేష్‌బాబు ప్రశ్న కు స్పందించిన కరుణాకరరెడ్డి వెంటనే లేచి వేమనను జాతీయ కవిగా తాను ప్రతిపాదిస్తున్నట్టు ప్రకటించారు. సభ హర్షామోదాలు తెలిపిం ది. అంతే- ఆ ప్రతిపాదన అక్కడితోనే ఆగిపోయింది. దాని తర్వాత ఏమిటనేది ప్రశ్న. అసలు జాతీయ కవిగా ఉండడానికి ఫలానా కవి అర్హుడు అని ఎవరు నిర్ణయించాలి? మనకు ఆస్థాన కవులయితే చాలా మంది ఉండేవారు కాని జాతీయ కవి గౌరవాన్ని పొందినవారు లేరు. అయినా ఒకరికి జాతీయ కవి అనే గుర్తింపు, గౌరవం ఏ ఒక్కరో ఇచ్చేది కాదు. అది మొత్తం జనాభిప్రాయానికి, కవి పండిత లోకంలో ఏకాభి ప్రాయానికి అనుగుణంగా సహజరీతిలో రావాలి.
తెలుగు భాషను బ్రతికించుకునే ఉద్యమం కూడా అలాగే ప్రజల నుంచి రావాలి. అదే మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది! కాని అది ఇంకా- నాది తెలుగు జాతి, మాది తెలుగు భాష అని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే స్థాయికి చేరుకోలేదేమో అనిపిస్తుంది. నిజంగా అలాంటి వాతావరణమే రాష్ట్రంలో ఏర్పడితే- రెండు మూడు దశాబ్దా లుగా ప్రజల మధ్య పనిచేస్తున్న అధికారులు తెలుగులో ఒక్క ముక్కం టే ఒక్క ముక్క కూడ మాట్లాడలేని పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక తీసుకురావడానికి ఇటీవలి కాలంలో అధికార భాషా సంఘం చురుకుగా పనిచేస్తున్నది. వ్యక్తులను బట్టి సంస్థలకు ఎలా ప్రాణంలేచి వస్తుందో ఎ.బి.కె.ప్రసాద్ ఋజువు చేస్తున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొద్దు నిద్రనుంచి లేపడానికి ఆయన ఒక్కడి కృషి ఏమూలకు!
ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలన్న ఉద్యమం కూడ ఒక్కసా రిగా ఉలిక్కిపడినట్టు నిద్ర లేచింది-తమిళానికి కేంద్రం ఆ హోదా కల్పించిన తర్వాతనే! ఆవేశంలో మనకంటె నెమ్మదస్థులు అనుకునే కన్నడిగులు సయితం ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వాన్ని కదిలించ గలిగారు. మరి మనం ఎక్కడఉన్నాం! తెలుగు విశ్వవిద్యాలయం సమావేశంలో-తెలుగు భాషా మాధుర్యాన్ని, ప్రాచీనతను మెచ్చుకుం టూనే, సి.పి.ఐ. సీనియర్ నేత సురవరం సుధాకరరెడ్డి ఒక మాట అన్నారు. తమిళానికి ఇచ్చారని ఫిర్యాదులు చేయడం కంటె, ఋజువు లు సేకరించి మన భాషకు అలాంటి గౌరవం ఎలా తెచ్చుకోవాలనే దానిపైన ప్రధానంగా దృష్టి పెడితే బాగుంటుందని, అది చేయకుండా మనలో మనం ఎంతగా ఆవేశపడినా, మన గొప్పలు మనం ఎంతగా చెప్పుకున్నా ఉపయోగం ఉండదని సూచించారు. ఇది వినడానికి కష్టం గాఉన్నా విలువయిన సూచన. మన భాష ఎప్పుడు పుట్టిందో, అది వాడుక భాష ఎప్పటి నుంచి అయిందో, దాని ప్రస్తావనలు ఎక్కడెక్కడ ఉన్నాయో, శాసనభాష ఎప్పటినుంచిఅయిందో, అంతకంటె ముఖ్యం గా సాహిత్యభాషగా ఎప్పటికి పరిణతిచెందిందో ఈ వివరాలన్నీ క్షుణ్ణం గా మనంతెలుసుకోవాలి- కేంద్రానికి తెలియజెప్పాలి. శాస్త్రీయమైన ఆలోచనలతో, చారిత్రకఆధారాలతో కూడిన నివేదికను సిద్ధం చేసుకో గలగాలి. ఆ తర్వాతనే-వెయ్యేళ్ళు, పదిహేను వందల ఏళ్ళ నిబంధ నల న్యాయాన్యాయాలను గురించి ఆలోచించుకోవచ్చు. పున రాలోచ న చేయమని కేంద్రాన్ని కోరవచ్చు. ఒప్పించవచ్చు. అది జరగ నంత కాలం-ఇప్పుడు తమిళంఅయింది, రేపు కన్నడం అవుతుంది, ఎల్లుండి మరొకటిఅవుతుంది. మనంమాత్రం ఇలాగేఉంటాం! మంత్రి రాజ్య లక్ష్మి ఈ దిశగా చేసిన ప్రకటన వాస్తవ రూపంలోకి రావాలంటే - అం దుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి, లోతుగా పరిశోధన జరగాలి. అప్పుడే ఆశించినఫలితం వేగంగా లభిస్తుంది. తెలుగుకు ప్రాచీన భాష గా గుర్తింపు కోసం తాపత్రయపడడం కంటె, దానిని ఆధునిక భాషగా అభివృద్ధి చేయడంపై ఎందుకు దృష్టి పెట్టరనే విమర్శకూడా ఉంది. నిజమే-కానీ ఈ రెండూ పరస్పర విరుద్ధ విషయాలు అనుకోవడం పొరపాటు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Telugu , Andhra Pradesh , ancient classical language status demand , TCLD2006 , India Indian
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home