'అమ్మ'భాషలో అందరూ
స్పీకర్ అభ్యంతరం
న్యూఢిల్లీ- న్యూస్‌టుడే
అయితే ఆంగ్లం... కాకపోతే హిందీ... ఈ రెండు భాషలే వినిపించే లోక్‌సభకు మంగళవారం కొత్త కళ వచ్చింది. 15 భారతీయ భాషలు విని సభ సాంతం పులకించిపోయింది. మాతృభాషా దినోత్సవం సందర్భంగా 'భిన్నత్వంలో ఏకత్వం' భావన మరింత పరిమళించింది. బెంగాలీ భాషను, సంస్కృతిని కాపాడుకునేందుకు అప్పట్లో తూర్పు పాకిస్థాన్ (నేటి బంగ్లాదేశ్) వాసులు చేసిన పోరాటానికి గుర్తుగానే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏర్పడింది. నాటి పోరాటంలో బెంగాలీలు చేసిన త్యాగాలను, పోరాటాన్ని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తన మాతృభాష బెంగాలీలో వివరించారు. తర్వాత ఒకొక్కరుగా లేచి... తమ తమ మాతృభాషల్లో ప్రసంగించారు. ఎవరికి వారు మాతృభాషలో తమ భావాలను వ్యక్తం చేసుకునే అవకాశముంటే... ప్రపంచంలో ఎలాంటి సమస్యలూ ఉండవని మాజీ మంత్రి సురేశ్ ప్రభు కొంకణిలో పేర్కొన్నారు. సుమారు గంటసేపు ఇలా మాతృభాష చర్చ కొనసాగింది. అందరికీ అర్థమయ్యేందుకు కొందరు తామే అనువాదకుల పాత్ర పోషించారు.
తెలుగుకు ఏదీ వెలుగు... మంగళవారం మాతృభాష దినోత్సవం అని గుర్తుచేసింది... లోక్‌సభలో ఆ ప్రస్తావన తెచ్చింది ఆంధ్రప్రదేశ్ సభ్యులే. కానీ... ఈ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశం పొందేందుకు తెలుగువారు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పురందరేశ్వరి సమాధానం చెబుతుండగా... గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అనుబంధ ప్రశ్నవేసే అవకాశం వచ్చింది. ఆయన తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇందుకు స్పీకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలుగు అనువాదకుడు లేనందున ఇంగ్లిష్‌లో మాట్లాడమని సూచించారు. 'ఈరోజు మాతృభాషా దినోత్సవం. నేను తెలుగులోనే మాట్లాడుతా' అంటూ రాయపాటి తన ప్రశ్న కొనసాగించారు. మంత్రికి తెలుగువచ్చని, ఆమె కూడా తెలుగులోనే సమాధానమివ్వాలని రాయపాటి కోరారు. ఇందుకు పక్కనున్న లగడపాటి, బాలశౌరి మద్దతు పలికారు. తెలుగులో సమాధానమివ్వమంటారా? అని పురందరేశ్వరి స్పీకర్ అనుమతికోరారు. స్పీకర్ అందుకు నిరాకరిస్తూ లిఖితపూర్వక సమాధానం పంపితే సరిపోతుందంటూ మరోప్రశ్నకు వెళ్లిపోయారు. ఇలా మాతృభాష ప్రస్తావన మొదలైంది. సభలో అనువాదకుడులేని మళయాళం, తెలుగు, గుజరాతి భాషలకు చివరి అవకాశం ఇచ్చారు. హిందీ తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడే తెలుగుకు లోక్‌సభలో అనువాదకుడు లేకపోవడంతో... మాతృభాషా దినోత్సవం రోజు సభలో తెలుగుకు వెలుగు లేకుండాపోయింది.
నేడు అసెంబ్లీలో తీర్మానం హైదరాబాద్ - న్యూస్‌టుడే ఇంగ్లీషు మీడియం పాఠశాలలను అనుమతించకండి... ఇంగ్లీషు మాధ్యమంలో పాఠశాలలను అనుమతించడాన్ని ఆపివేయాలని, ఉన్నవాటిని క్రమంగా తెలుగు మాధ్యమంలోకి మార్చాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో 93శాతం కనీసం కూడికలు కూడా చేయలేని స్థితిలో ఉన్నట్లు ఇటీవల పాఠశాల విద్యాశాఖ చేసిన సర్వేలో తేలడాన్ని ప్రస్తావిస్తూ ఇందుకు కారణం ఇంగ్లీషు మీడియం, ప్రైవేటు పాఠశాలలేనని చెప్పారు. పాఠశాలల్లో తెలుగు భాషోపాధ్యాయుల నియామకాలను తప్పనిసరి చేయాలని కోరారు. తెలుగు కోసం జారీ అయిన జీవోను అమలు చేయాలని సూచించారు. కవులు, రచయితలు వెలమల సిమ్మన్న, కత్తి పద్మారావు, తెలిదేవర భానుమూర్తి, సింగమనేని నారాయణ, మంజూర్ అహ్మద్, మజీద్ బదర్, ఫాతిమాతాజ్, కలెక్టర్లు డి.వి.రాయుడు (నిజామాబాద్), వై.వి.అనురాధ (అనంతపురం), శ్రీకాకుళం ఎస్‌పీ ఎ.ఎస్.గురప్ప పురస్కారాలను అందుకున్నారు. |
హైదరాబాద్ - న్యూస్‌టుడే తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించడానికీ, భాషా పరిరక్షణ చర్యల కోసం రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రావాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ''ఈ అంశంపై బుధవారం శాసనసభలో వాయిదా తీర్మానం కోసం పట్టుపడతాం. ప్రభుత్వాన్ని ఒప్పించి... తెలుగుకు ప్రాచీనహోదా కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపుతాం. అవసరమైతే ఢిల్లీ పోదాం. నేనూ మీతో వస్తా'' అని భాషాభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు పరిరక్షణ, ప్రాచీనహోదా కోరుతూ... మంగళవారమిక్కడి ఇందిరా ఉద్యానవనం వద్ద 'తెలుగు భాషోద్యమ సమాఖ్య' ఒకరోజు నిరాహారదీక్షలు చేపట్టింది. సి.ధర్మారావు, మల్లాది సుబ్బమ్మ, చుక్కా రామయ్య, పాత్రికేయుడు వరదాచారి తదితరులు ఇందులో పాల్గొన్నారు. రాత్రి చంద్రబాబు వారి వద్దకు వచ్చి... నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. |
Courtesy: ఈనాడు
Telugu Andhra Pradesh Hyderabad International Mother Tongue Day Feb 21 2006 classical ancient language status demand tcld2006
Technorati tags: Telugu,తెలుగు
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home