"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Tuesday, February 21, 2006

తెలంగాణ గోదావరే 'తెలివాహ'!

ఆంధ్రదేశపు ప్రాచీన చరిత్రలో 'తెలివాహ' నది ఎక్కడ ఉందో అస్ప ష్టంగా ఉన్న అంశం. శెరవనీయ బౌద్ధ జాతక గాథ ఈ నదిని దీని ఒడ్డునే ప్రసిద్ధమైన ఆంధ్రపురం గూర్చి చెప్పింది1. ఈ నది ఏది అనేవిషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ తెల్‌ నది మహా నదికి ఉపనది అని, ఇది ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లోనిదని పేర్కొన్నారు. కాని ఇది ఆంధ్రదేశపు నది కాదు. ఇది భౌగోళికంగా కుదరదని ఆచార్య గంటిజోగి సోమ యాజిగారు తెలిపినారు2. రాయచౌధరిగారు దీన్ని కృష్ణానది అన్నారు. దీని ఒడ్డున పేర్కొనబడ్డ ఆంధ్రనగరం ధాన్యకటకం అని నిర్ధారించారు. పల్లవరాజు శివస్కంధ వర్మ క్రీ.శ. 234 నాటి తన మైదవోలు శాసనంలో ధాన్యకటక, 'ఆంధ్రపథ' పేర్లు పేర్కొన్నాడు3. ధాన్యకటకం క్రీ.శ. ఒకటవ శతాబ్ది నాటికే అతి ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం కావడం వల్ల బౌద్ధ జాతక కథలలో పేర్కొనబడి ఉండవచ్చుననేది4 వీరి భావన. శబ్ద వ్యుత్పత్తి (etymology) ప్రకారం తేల్‌ శబ్దం తైల శబ్దం నుండి వచ్చిందని నూనె లా నల్లగా ఉండే నది కనుక కృష్ణానదికి ఆ పేరు కుదురుతుందని భావించారు.

కాని బౌద్ధ వాఙ్మయంలో పేర్కొనబడ్డ ఈ 'తెలివాహ' నది గోదావరి నదేనని నా ప్రగాఢ విశ్వాసం. దీనికి ఉపబలకంగా కొన్ని ఆధారాలు....
కృష్ణానదికి 'కణ్ణబెణ్ణా' అని పేరుండేదానాడు. కణ్ణబెణ్ణ 'కృష్ణవేణి' శబ్దతుల్యం. నల్లని ప్రవాహం అని అర్థం. ఈ పేరు బౌద్ధ జాతక గాథల్లోనేగాకుండా నానేఘాట్‌ గుహలోని మొదటి శాతకర్ణి భార్య దేవినాగనీక క్రీ.పూ. 180లో వేయించిన శాస నంలో దీన్ని5 పేర్కొనడం జరిగింది. క్రీ.పూ. 2వ శతాబ్దికి ముందే కృష్ణానదికి ఈ పేరు స్థిరపడింది. తెలివాహ,కణ్ణబెణ్ణ అనేవి సమకాలిక నామాలు. అవి ఒకే నదికి ఏకకాలంలో ఉండవు. ఒకవేళ గౌతమి, గోదావరి వలె ఉన్నాయనుకున్నా అర్వా చీనంగా పురాణగాథలాధారంగా ఇవి ఏర్పడ్డవి. పురాణాల ప్రకల్పన ఆనాటికి లే దు. అవి నల్లని నది, తెల్లని నది అని రంగును బట్టి ఏర్పడ్డ ప్రాచీన నామాలు. కృష్ణ అంటే నల్లనిది, తెలి అంటే తెల్లనిది. తెలివాహ అంటే తెల్లని ప్రవాహం కలదని అర్థం. వాహ ప్రవాహ ఉపసర్గ 'ప్ర' కలిగిన ఏకపదమే. తెలి అంటే తేట, తెళుగన్నడ అంటే తేటఐన కన్నడభాష, తెలి+ఆగు= స్వచ్ఛమైనది అని వ్యవహారార్థాలున్నాయి.

తెళ్‌ాతెల్‌ాతెలి అనే పరిణామ క్రమంలో మూలద్రావిడంలో 'స్పష్టమైన, ప్రకాశ మానమైన' అనే అర్థాలు కలిగి ఉన్నాయి. ఇది ప్రాచీనపదం అనడాన్కి గుర్తుగా దీని మీద 'పు' అనే తద్ధిత ప్రత్యయం చేరి తెలుపు ఇత్యాది శబ్దం సిద్ధం కావడమే. (నలుపు,ఎరుపు,పసుపు) ఈ నామాలు విశేషణాలుగా మారినప్పుడు 'పు' ప్రత్య యం తొలగి పదాంత హల్లు ద్విత్వమై నల్ల, తెల్ల, ఎర్ర, పచ్చ అనే ఒకేవర్గ పదాలుగా స్థిరపడ్డాయి.

గోదావరికి తెలివాహ, కృష్ణకు కణ్ణబెణ్ణ (బెణ్ణ=వేణి=పాయ) అని పేర్లు బౌద్ధ వాఙ్మయంలో వ్యవహారనామంగా కనబడటానికి కారణం ఈ రెండు నదుల మధ్య ప్రాంతాలు లేదా సమీపవర్తి ప్రాంతాలు బౌద్ధ పుణ్యక్షేత్రాలుకావడమే6. ఐతే విశే షంగా గోదావరి నదీ దక్షిణ తీరం బౌద్ధుల ప్రాచీన పర్యాటక క్షేత్రం. తెలివాహ నది ఒడ్డున (ప్రాచీన) ఆంధ్రనగరం ఉందని బౌద్ధ వాఙ్మయం చెప్పడం వల్ల తమకా నాటికి తెలిసిన ధాన్యకటకానికి ముడివేసి, తెలి శబ్దానికి కృష్ణానదికి ముడిపడక తైల శబ్దం తీసుకొని, నూనె నల్లగా ఉంటుందని, కృష్ణానది నూనెలాగ ఉంటుందని ఊహ చేశారు. తెలిలోని ఎ (హ్రస్వ వక్రం) సంస్క­ృత వర్ణమాలలో లేదు గనుక ఈ శబ్దం సంస్క­ృతం కాదు. తైలంతో సంబంధం లేదు, కాని గోదావరి నది తీరాన ధాన్య కటకానికి 300 సంవత్సరాల ముందే ఉన్న మరో మహానగరం గూర్చి ఆనాడు ఎవ రికీ తెలియదు. అది కరీంనగర్‌ జిల్లాలోని (ధర్మపురికి 15 కి.మీ. దూరంలో వెల్ల టూరు మండలంలోని) కోటి లింగాల గ్రామం. గోదావరి తీరాన గల 2500 సంవత్సరాల కిందటి గ్రామం.

తెలివాహ ఒడ్డున గల నగరం ధాన్యకటకమేమోనని చరిత్రకారులు ఊహించే నాటికి 'కోటిలింగాల'లో తవ్వకాలు జరగలేదు. క్రీ.శ. 1979-84 మధ్య పురావస్తు శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు తవ్వకాలు జరుపగా అనేక విశేషాలు వెలుగు జూశాయి. దీంట్లో 'గర్భనగరం' బయటపడింది. ఇది శాతవాహనుల తొలి రాజ ధాని. తొలిరాజు శ్రీముఖుని పేరు శాసనాల్లో మాత్రం కనబడి ఆధారాలు లభించని స్థితిలో ఉండగా ఇక్కడ అతని పదుల కొద్దీ నాణెములు 'సిముక' పేరుతో లభిం చాయి. పేరు తెలియని మరో శాతవాహన రాజు నాణెములు, అంతకుముందే పరి పాలించిన సామగోపుని నాణెములు, మహాతలవర, మహాసేనాపతిస అనేపేర్లు గల నాణెములు లభించాయి. క్రీస్తు పూర్వమే ఈ నగరానికి విదేశీ వ్యాపారులతో సంబంధాలకు గుర్తుగా రోమన్‌ సామ్రాట్టుల నాణెములు లభించాయి. ఆనాటి నగర విశేషాలు, బావులు, కాలువలు, పారిశుద్ధ్యపు జాగ్రత్తలు గల ఇటుకల నిర్మా ణాలు బయటపడ్డాయి. ఈ కోటిలింగాల నగరంలో ఆగ్నేయభాగంలో పెదవాగు గోదావరిలో సంగమించే చోట బౌద్ధ స్థూపం కానవచ్చింది. ఇక్కడ క్రీ.పూ. 3 శతా బ్దులకు ముందే నిర్మితమైన కోట శిథిలాలు కానవచ్చాయి. ఉత్తరాన గోదావరి, తూర్పున పెదవాగు మధ్యలో కోట ఉంది. ఇది జలదుర్గం. దక్షిణాన ప్రధాన మార్గం. గోదావరి నది వైపు కోట ద్వారం గుర్తించబడింది. ఈ కుడ్యం గోదావరి వరదల వలన శిథిలమైంది. కోటకు నాలుగు మూలలకు బురుజులుండేవి7. కోట నిర్మాణానికి, స్థూప నిర్మాణానికి ఒకే ప్రమాణపు పెద్ద పెద్ద ఇటుకలు వాడినారు. ఇది ధాన్యకటక (అమరావతి) బౌద్ధ స్థూపానికి, నగరానికి ముందటి నిర్మాణాలు. ఇది శాతవాహనులకు పూర్వపు నగరం. ఈ స్థూపానికి చెందిన రాతి ఫలకాల మీద గల లఘు శాసనాల8 రాతలనుబట్టి ఇది మౌర్యుల కాలానికి ముందుదని, దీని మీద రాతల్లో గల లిపి బ్రాహ్మీలిపి కంటే ప్రాచీనమైనదని ఠాకూర్‌ రాజారాం సింగ్‌ గారు అభిప్రాయపడ్డారు9. యావద్భాతర దేశంలోనే అశోకుని బ్రాహ్మీలిపి శాసనాలు తొలి నాళ్ళవి కాగా ఇవి మరీ ప్రాచీనాలౌతాయి. నేడు కోటిలింగాల గ్రామం (కోట కార ణంగా) కోట లింగాలగా వ్యవహరించబడేదని చెపుతారు. ఈ నగరం చుట్టూరా విస్తరించిన రాజ్యం ఆంధ్రదేశంలో చరిత్రకందనంత పూర్వపుదిగా వెలుగులోకి వచ్చింది. అర్ద సహస్రాబ్ది ఆంధ్రదేశాన్నేలిన రాజవంశమైన శాతవాహనులకు తొలి రాజధాని (క్రీ.పూ. 3వ శతాబ్దం)కోటిలింగాల, మలి రాజధాని ప్రతిష్ఠానం (పైఠాన్‌= మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ సమీప గ్రామం), ఆ పిదప మూడవది ధాన్యకటకం (అమరావతి)గా భావించవచ్చు. తొలి మలి రాజధానులు గోదావరి తీర నగరాలు. తృతీయం కృష్ణాతీరం.

క్రీ.పూ. 300 సంవత్సరాల ప్రాంతంలో మగధ రాజైన చంద్రగుప్త మౌర్యుని ఆస్థా నాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్థనీసు తన గ్రంథంలో 30 దుర్గాలు, లక్ష కాల్బలం, రెండు వేల అశ్విక దళం వేయి ఏనుగులు కల చతురంగ బలాలు కల్గిన ఆంధ్రులు మౌర్యుల తర్వాత అతి పెద్ద రాజ్యం కల్గి ఉన్నారని చెప్పింది ఈ ప్రాంతం గురించేనని భావించవచ్చు10. నాడు ఆంధ్రదేశాన ఇంత ప్రాచీనమైన రాజ్యం లేదా రాజధాని నగరం నదీ తీరాన బయటపడలేదు. క్రీ.పూ. 3వశతాబ్దిలో అశోకుడు వేయించిన 13వ ధర్మలిపి శాసనంలో ఆంధ్రులు బుద్ధుని ధర్మ బోధనలను అనుసరించారని 'నిచనోడ... ఆంధ్ర పులిదేషు సవత్ర దేవనం పియస ధమనుశస్తి' అని రాసింది ఈ ప్రాంతం గురించే. కారణం ఇక్కడ అంటే కరీంనగర్‌ జిల్లాలో గోదావరికి దక్షి ణంగా నేటికీ కోటిలింగాల, పాశాయిగాం, ధూళి కట్ట, పెద్ద బొంకూరు మొదలైన ప్రాంతాల్లో అనే క బౌద్ధ స్థూపాలు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. ధూళికట్టలో మరొక మట్టికోట ఆనవాళ్ళు బయటపడ్డాయి. అలాగే నేటి బోధన్‌ (నిజామా బాద్‌ జిల్లా) నాడు పోతలిగా పిలువబడ్డది. బోధన్‌కు ఉత్తరాన రెండు కి.మీ. దూరంలో అతి ప్రాచీనస్థలంలో 20 అడుగుల ఎత్తుగల మట్టి కోట ఉంది. ఇది ప్రాచీన కోట. కోట తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి పూసలు, పెంకులు లభించాయి. బావరి పోతలి రాజ్య నివాసిగా సుత్తనిపాతం పేర్కొంది.11 ఇవి మెగస్తనీసు చెప్పిన దుర్గాలు. క్రీ.శ. రెండవ శతాబ్దినాటి ప్లీని (గ్రీకు చరిత్రకారుడు) కోసల దేశాన 'అంధర' రాజ్యం ఉన్నట్లు వారికి సంబంధించిన పై వివ రాలే ఇచ్చాడు. దుర్గాలు మాత్రం 80 అని చెప్పి నాడు. కోసల రాజ్యానికి దక్షిణంగా ఉన్న ఈ రాజ్యం గోదావరి ఉభయ పారాలైన బస్తరు, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలుగా గుర్తించవచ్చు. ఈ ప్రాంతాన్ని వి.వి.కృష్ణ శాస్త్రిగారు దక్షిణ కోసలగా తెలిపినారు.12 కోటి లింగాల నగరం దక్షిణ కోసలకు నడిబొడ్డున గల రాజధాని నగరం. ఇదే తెలి వాహ ఒడ్డున గల నాటి ఆంధ్రనగరం.

పాళీ బౌద్ధ వాఙ్మయంలో పేర్కోబడ్డ అంధరకట్టి (ఆంధ్రరాష్ట్రం) తెలుగు ప్రాం తమని మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చెప్పారు. అది ఈ ప్రాంతమే. ఎందుకంటే బౌద్ధ వాఙ్మయంలో పేర్కోబడ్డ అస్సక, ముల్లకులు కూడా ఈ సమీప ప్రాంతాల వారే. అశ్మక (అస్సక) నిజామాబాద్‌,కరీంనగర్‌ జిల్లాల ప్రాంతాలు. మూలక (ముల్లక) పైఠాన్‌ ప్రాంతం నుండి దక్షిణ మహారాష్ట్ర గోదావరి తీర ప్రాంతాలు. ఇవి అత్యంత ప్రాచీమైన క్రీ.పూ. 600 నాటి జనపద ప్రాంతాలు13. ఇవి తర్వాత శాతవాహనులు రాజ్య నిర్మాణం చేసి, కోటిలింగాలను తత్పూర్వ రాజన్యుల నుండి గెలిచి, తొలి రాజధానిగా చేసికొని పాలించిన ప్రాంతాలు. శాతవాహనులు క్రీ.పూ. 3 వ శతాబ్దిలో రాజ్య నిర్మాణం గావించారు. బుద్ధునికి సమకాలికుడైన బావరి అనే బ్రాహ్మణుడు (క్రీ.పూ.600) తన శిష్యులతో అశ్మకరాజ్యంలో గోదావరి తీరంలో నివ సించాడని బౌద్ధ వాఙ్మయంలో ఉంది14. ఈయన నివసించిన ప్రాంతం కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి ప్రవాహ మధ్యస్థ ద్వీపం బాదనకుర్తి (బావరికుర్తి) గా ఠాకూర్‌ రాజారాంసింగ్‌ గారిచే గుర్తించబడింది15. అంతేకాదు బుద్ధఘోషుడు రాసిన పర మార్థ జ్యోతిక అనే గ్రంథంలో 'బావరి' మరియు 'బోధిసత్త్వ శరభంగ జ్యోతిపాల' అనే ఇద్దరు అస్సక రాజ్యంలో గోదావరి నదిలోని కవిటవనం (వెలగ తోట) అనే ద్వీపంలో నివసించేవారని రాసి ఉంది16 .అస్సక జనపదంలో గోదావరి నదిలోని ఈ ద్వీపం కచ్చితంగా నేటి బాదనకుర్తియే. ఈ దీవిలో ప్రాచీన యజ్ఞవాటికలు బయటపడ్డాయి. బావరి బౌద్ధం స్వీకరించడానికి ముందు యజ్ఞయాగాదులు చేసిన బ్రాహ్మణుడే. ఈయనకు ముందు కవిటవన ద్వీపంగా పేరున్న ఈ ద్వీపం తరువాత ఈయన పేర బావరికుర్తిగా నేడు బాదనకుర్తిగా మారిందని నా భావన. (కుర్తి, పర్తి, ఆల, పాడు వంటివి గ్రామమనే అర్థాన్ని సూచించే ప్రాచీన తెలుగు పదాలు). కోటి లింగాల నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాశాయిగాం గ్రామం వెలుపల రోడ్డు మీద బౌద్ధ స్థూపం ఉంది. బౌద్ధాచార్యుడై దిగంతాల విఖ్యాతుడైన ఆచార్య దిజ్నాగుడు ఈ గ్రామం వాడేనని కృష్ణశాస్త్రిగారు తెలిపారు.

ప్రాకృతంలో రాయబడ్డ గాథాసప్తశతి వల్ల అత్యంత సుప్రసిద్ధుడైన హాల శాత వాహన చక్రవర్తి, సింహళ రాజకన్య లీలావతిని వివాహమాడిన గాథ 'లీలావఈ' అనేపేరుగల కావ్యంగా కుతూహలుడనే కవి రాసినాడు. రాచ వివాహం సప్త గోదా వరి తీరస్థ భీమేశ్వరుని సన్నిధిలో జరిగింది. (సప్త గోదావరి భీమేశ్వరుడనగానే దాక్షారామం వైపు మనసు పరిగెత్తుతుంది. కాని దాక్షారామంలో గోదావరి నది లేదు) గోదావరి కరీంనగర్‌ జిల్లాలో మల్లాపూర్‌ మండలంలోని వేంపల్లి వెంకట్రా వుపేట వద్ద ఏడు పాయలుగా చీలింది. కోటి లింగాల రాజధానికి ఇది 70 కి. మీ. దూరం. ఇక్కడ తీరాన శాతవాహనుల కాలపు ప్రాచీనాలయం ఆకాలపు ఇటుకలతో నిర్మాణం ఐంది గోదావరి ఒడ్డున నేను చూశాను. ఇక్కడ ఏనుగులతో ఉల్లిగడ్డలు మోయించి తెచ్చి వ్యాపారం చేసేవారని అంత పెద్ద సంత జరుగుతుండేదని చెప్పారు. ఇక్కడ నాకు గోదావరి తీరాన ఇనుప ఖనిజం గల బిళ్లలు గోదావరి వరద కోతకు గురైన తీరాన లభించాయి. ఈ నదీ తీరాలన్నీ వ్యాపార కేంద్రాలే. హాలుని కాలానికి ఇది ఆయన రాజ్యంలో ప్రసిద్ధ ప్రాంతం. దీన్నిబట్టి హాలుడు శాతవాహన సామ్రాజ్యం కోటిలింగాల రాజధానిగా కీ.శ. ఒకటవ శతాబ్దిలో ఏలి ఉండే వాడనీ, గాథాసప్తశతి కరీంనగర్‌ జిల్లాలో పుట్టిందని భావించవచ్చు17. గాథాసప్తశతిలోని తెలుగు పదాలు తిరుమల రామచంద్రగారు ఎత్తిచూపినవి ఈ ప్రాంతపు తెలుగు భాష యొక్కనాటి వాడుకలోనివే.

ఈ తెలివాహ నది గోదావరియే కావడం వల్ల తెలుగునాట గోదావరి తీర ప్రాంతాలైన అశ్మక, మూలక రాజ్యాలు అత్యంత ప్రాచీన జనపదాలు కావడం వల్ల తెలుగు భాషా సంస్క­ృతులు ఇక్కడే వికసించాయనవచ్చు. ఈ ప్రాంతం నుండి ఇతర ఆంధ్రదేశ ప్రాంతాలకు వలస వెళ్ళిన తెలుగువారు తెలుగు భాషను, ఈ ప్రాం తాలలోని తమ గ్రామాల పేర్లను యావదాంధ్రదేశంలో వ్యాప్తం చేశారనవచ్చు18. ప్రముఖ ఎటిమలొజిస్టు ప్రొ. యార్లగడ్డ బాల గంగాధర రావుగారు తెలంగాణలోనే తెలుగు పుట్టిందని, అది తరువాత ఇతర ప్రాంతాలకు విస్తరించిందని తెలిపినారు19. అంతేకాదు ఈ ప్రాంతాల్లో బౌద్ధం వ్యాప్తం అయిన కారణంగా ప్రచారంలో ఉన్న పాళీభాష నిజానికి ప్రాకృత భేదం కాదని ఇది తొలినాళ్ల తెలుగేనని ఒక అభి ప్రాయం ఉంది. పాళీభాష క్రీ.పూ. 3వ శతా బ్దంలో సింహళ దేశంలోని మాగధీ ప్రాకృత మేనని జాన్‌ బీమ్స్‌ అభిప్రాయం. ఈ అభిప్రా యాల్లో నిశ్చితి లేదు. గుణాఢ్యుడు (1వ శతాబ్ది) తాను శాతవాహన రాజు కొలువులో పందెంలో ఓడిపోయిన కారణంగా రచన సాగించనని శపథం చేసి త్యజించిన రచనానుకూల భాషల్లో సంస్క­ృత,ప్రాకృతాలతోబాటు దేశ్యభాష కూడా ఉంది. ఇది తెలుగేనని పండితాభిప్రాయం. ఈ శాతవాహన రాజు కోటిలింగాలలో ఉన్నాడా? ప్రతిష్ఠానపురంలో ఉన్నాడా? అనేది సందేహమే. ఐనా ఒకటవ శతాబ్దం నాటికి కూడా కోటి లింగాల రాజధాని కావడం వల్ల ఈ చారిత్రక సంఘటన ఇక్కడే జరిగిందని భావించవచ్చు. పైఠాన్‌ ఐతే అక్కడి దేశభాష మహారాష్ట్రి ప్రాకృ తం అవుతుంది. సంస్క­ృత ప్రాకృతాలు కాక మరొకటి కదా ఆయన త్యజించింది! అపుడా యన త్యజించింది దేశభాష అయిన తెలుగే. పైఠాన్‌, కోటిలింగాల నగరాలు తెలి వాహ తీరంలో ఉన్నవే.

తెలివాహ నది ఒడ్డున పుట్టినదే తెలుగుభాష. ఈ భాషకు ఈ పేరు రావడానికి రకరకాల వ్యుత్పత్తులు చెప్పారేకాని 'తెలి' నది వల్ల వచ్చినట్టు ఎవరూ చెప్పలేదు. తేల్‌+అగు అని తెలుగులో నది వ్యుత్పత్తి చెప్పినా అది (తేల్‌ నది) తెలుగునాట లేద ని సోమయాజిగారు ఖండించారు20. తెళి+అగు= తెలుగు= స్వచ్ఛమైనది అని భాషాపరంగా మరో నిర్వచనం. తిలల వలె గోవులుండే దేశమని మరో నిర్వచనం. తెలుగు శబ్దం తెనుగు శబ్దం నుండి పుట్టిందని తెనుగు త్రినగ శబ్దభవమని, తేనె+ అగు తెనుగు అని మరికొన్ని నిర్వచనాలు21. తెలుగు శబ్దం త్రిలింగ శబ్ద భవమని, త్రికళింగ శబ్ద భవమని రకరకాల నిర్వచనాలు వచ్చాయి22. బర్మాదేశంలోని తైలంగుల జాతివారే తెలుగువారని జాతిపరంగా చెప్పినారు23. అయితే ఇవి ఖండ నీయాలే. తేల్‌ నది ఒరిస్సాలోనిది. ఎవరి భాష వారికి స్వచ్ఛమైనదే. నూల వలె గోవులుండటం పండితోత్ప్రేక్ష24. మూడు పర్వతాల మధ్య తెలుగు నేల మొత్తం లేదు. మూడు లింగాల (శివక్షేత్రాల) మధ్య భూభాగపు భౌగోళిక హద్దులు అర్వా చీనాలు. తెన్‌+అగు=దక్షిణ దేశపు భాష అని దిగర్థంలో చెప్పినా ఔత్తరాహికులకు తెలుగునేల దక్షిణం అవుతుందే తప్ప ద్రావిడ ప్రజలకు ఈ దిశ కుదురుట లేదు.
తెలివాహ నదీ తీరపు భాష తెలుగే అని చెప్పడం వల్ల దీని ప్రాచీనత్వం స్థిరపడు తుంది. ఈ నది తీర భూమి తెలంగాణ. ప్రాచీన తెలుగు నేల. గోదావరి మూడింట రెండు వంతులు తెలంగాణలోనే పారుతుంది. గోదావరికి శబరి కలిసి గోదా+శబరి= గోదావరి అయి శబరి సంగమం తర్వాతి నేలపై పారినపుడు కింది తీరాల్లో ఈ పేరు అర్వాచీనంగా స్థిరపడి ఉండవచ్చు. తెలివాహతో తడిసే విస్త­ృత భాగం తెలంగాణ. ప్రారంభంలో దక్షిణ గోదావరి పరీవాహక ప్రాంతాలైన కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వికసించిన తెలుగు తెలివాహ నామోద్భవం అయి తరువాత విస్త­ృ తమైంది. మంజీరికా దేశమని బౌద్ధ వాఙ్మయంలో పేరుగల మెతుకు సీమ (మెదక్‌ జిల్లా) ప్రాంతం గోదావరి ఉపనది అయిన మంజీర వల్ల ఏర్పడింది. ఇది తెలం గాణమే అయినా ఆనంతరిక విస్త­ృత తెలంగాణ. దీన్నిబట్టి ప్రాచీనంగా ఈ ప్రాంతా లు నదుల పేర్లతో పిలువబడేవని, తెలంగాణ తెలివాహ నది ఒడ్డున ఉండడం వల్లే ఈ పేరు వచ్చిందని భావించవచ్చు. (తెలివాహ నదితో తడిసిన అతి ప్రాచీనమైన జనావాస ప్రాంతం మాత్రం నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలే. ఈ ప్రాంతం అశ్మక, మూలక జనపదాలు గల క్రీ.పూ. 600 నాటి భౌగోళిక స్థితి).
తెలంగాణ పద వ్యుత్పత్తిని కొంచెం పరిశీలించాలి. తెలి అనేది నదీ సంబంధంగా నిర్ధారణమైంది. మిగిలిన 'గాణ' అనేది ప్రాంతం, భూమి అనే అర్థంలో ఉంది. తెలు గులో మా'గాణ' అనే పదంలో నదీ జలాలతో తడిసి పంటలు పండే భూమి అనే అర్థంలో కనబడుతుంది. మెట్ట అంటే ఎత్తైన పొడినేల, మాగాణ అంటే జలసిక్తసస్యక్షేత్రం. (కాణాచి అనే మరో దేశ్యపదం స్థావరం, ప్రాంతం అనే అర్థంలో ఉంది.) తెలంగాణ అంటే తెలిప్రవాహసిక్త భూమి అని ఈ ప్రాంతానికి స్థిరపడింది. గోదా వరి నదికి ఉత్తర భూములైన ఆదిలాబాద్‌, బస్తరు జిల్లాలు జనావాసాలున్నా భీకరా రణ్యాలే. జనపదాలు, నగరాలు, రాజ్యాలు రెండున్నర వేల సంవత్సరాల క్రితం గోదావరి దక్షిణ ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఇక్కడ లేవు. పైగా ఉత్తర భారతదేశంలోని సంచార జీవనులు, బౌద్ధ యాత్రికులు మొదలగువారు నది దాటిన తర్వాతే తెలి భాష మాట్లాడే సీమలో అడుగుపెట్టేవారు. భాషల మాండలికత్వానికి నదులే హద్దు లు. తెలింగాణా తెలంగాణ ఐంది. తెలినది గమించే భూమి, తజ్జనులు, తద్భాష తెలుంగుా తెలుగు ఐంది. తెలుంగు భాషానామం తెలంగాణా శబ్దజన్యం. దీనికి తెలుంగులోని నిండు సున్న తిరుగులేని సాక్ష్యం. క్రీ.శ. 102లో గ్రీకు భౌగోళికుడు టాలెమీ చెప్పిన టెలింగాన్‌ ఈ తెలంగాణమే. తెలుగులో ల-నగా మారి తెనుగుగా మరోపేరు స్థిరపడి ఉంటుంది25. ఈ విధంగా తెలివాహ గోదావరి నదిగా నిర్ధారిం చవచ్చు.

అధస్సూచికలుః
1. శెరవనీయ (శ్రీవనిజ) జాతక కథలో 'తెలివాహ నామ నదీం ఉత్తీరిత్వా, ఆంధ్రపురం నామ నగ రం ప్రవిశంతు'(సంస్క­ృతీకరణం) అని ఉంది.
2. ఆంధ్రభాషా వికాసము- ఆచార్య గంటిజోగి సోమయాజి పే.26
3. 'అంధాపతి యోగామో విరిపరం'- శివస్కంధవర్మ శాసనం
4. రెలిజియన్‌ ఇన్‌ ఆంధ్ర- బి. ఎల్‌. హనుమంతరావు, ఆర్కియాలజీ పబ్లికేషన్స్‌
5. ఏన్షియంట్‌ అండ్‌ మిడీవల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, పి. ఆర్‌. రావ్‌ 1994
6. బుద్ధుని తొలి ఐదుగురు శిష్యులలో తొలి శిష్యుడు కొండన్న తెలుగువాడు. 'అన్నాసి వితభో కొండ న్నో, (కొండన్నా విషయం గ్రహించావు) అని బుద్ధుడు స్వయంగా ప్రశంసించిన తెలుగు శిష్యుడు (మిసిమి మే 2005 పే. 223- శ్రీవిరించి వ్యాసం)
7. భారతీయ సంస్క­ృతి- పురాతత్త్వ పరిశోధన- డా. వి.వి.కృష్ణశాస్త్రి- పే.291
8. లిపియుక్తమైన 26 రాతిఫలకాలు కరీంనగర్‌ ఆర్కియాలజీ ఆఫీసులో భద్రపరచబడ్డాయి.
9. ఎ.పి. జర్నల్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ వా.॥। నెం.2, 1985, హైదరాబాద్‌-పే. 21
10.
"Maccrindies Magasthens' Indian antiquary (1877) Vol. VI, pp 337-339
11. భారతీయ సంస్క­ృతి- పురాతత్త్వ పరిశోధన డా. వి. వి. కృష్ణశాస్త్రి పే. 254, 278
12. భారతీయ సంస్క­ృతి- పురాతత్త్వ పరిశోధన డా. వి. వి. కృష్ణశాస్త్రి పే. 254, 278
13. వినయపిటక 46, అంగుత్తరనికాయ ఐ-213 ప్రకారం క్రీ.పూ. 600 నాటికి షాడోశ మహా జన పదాల్లో గోదావరి తీరస్థ అశ్మకం ఒకటి. ఇది సుత్తనిపాతం (977)లో పేర్కొనబడింది.
14. సుత్తనిపాత- వత్థుగాథ- పారాయణవర్గ- అనువాదం- అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
15. 'మిసిమి'- బుద్ధ జయంతి ప్రత్యేక సంచిక, మే నెల -2004, పే. 274
17. 'సప్తగోదావరి ఎక్కడ' నా వ్యాసం 'మిసిమి' పత్రిక ఆగస్టు, 2003.
18. శాతవాహనుల విదేశీ వ్యాపారం వల్ల తెలుగువారు సాకోత్ర (ఉ్చట్ట అజటజీఛ్చి), బర్మా, సుమత్ర దేశాల్లో స్థిరపడ్డారని, అరకన్‌ దేశ రాజధానికి 'త్రిలింగ' అని, సయాం దేశంలో 'కాకులం' అని నగ రాలకు పేర్లు తెలుగువారే పెట్టుకున్నారని 'ఆంధ్రశాతవాహవులు' అన్న వ్యాసంలో డా. ఏ. నాగ భూషణం తెలిపారు. భారతీయ వారసత్వం- సంస్క­ృతి పే. 102 తెలుగు అకాడమీ 1994 (వీరు తెలంగాణలోని ఒక్క బౌద్ధ స్థూపం గూర్చి కూడా తెలుపలేదు. తొలి శాతవానుల రాజధాని కోటిలిం గాల గూర్చి రాయలేదు. కోటిలింగాల తవ్వకాలకు దశాబ్దం తర్వాత ఈ గ్రంథం అచ్చయింది).
19. నామ విజ్ఞానం- యార్లగడ్డ బాలగంగాధరరావు
20. ఆంధ్ర భాషా వికాసం - విద్యాన్‌ గంటిజోగి సోమయాజి, పే. 26
21. త్రినగ=మహేంద్ర, శ్రీశైల, కాళహస్తి పర్వతాలు-ఆంధ్రభాషా చరిత్ర- చిలుకూరి నారాయణ రావు పే. 32.
22. త్రికళింగ- మధుకళింగ, ఉత్కళింగ కళింగ (12 వ శ. ముఖలింగ శాసనం) త్రిలింగ= ఎ) శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగరి సంయుతం (బ్రహ్మాండ పురాణం). బి) శ్రీశైల కాళేశ్వర దాక్షారామ నివా సినః (ప్రతాప రుద్రీయం 5-22) నాటిక ప్రచురణం. సి) తెలుగు శబ్దం ప్రాచీనమని త్రిలింగ అనేది సంస్క­ృతీకరణమని కొమర్రాజు వారన్నారు. లక్ష్మణరాయ వ్యాసావళి పే. 122
23. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం- ఖండవల్లి లక్ష్మీ రంజనం
24. తిలలవలె గోవులు కల దేశం 'తెలుగు' అని కల్లూరి వెంకటనారాయణరావు 'ఆంధ్ర వాఙ్మయ చరిత్ర' పే. 32
25. 'ల'-'న'గా మారుటకు భాషాశాస్త్రజ్ఞులిచ్చిన ఉదాహరణలు: లచ్చిానచ్చి, లెగుానెగు, లేదుా నేదు, లంజానంజ, లాంగలిానాగలి. చూ. భద్రరాజు కృష్ణమూర్తి 'తెలుగు వర్బల్‌ బేసెస్‌' పే. 41.


Courtesy:
ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh Telangana Telivaha Mesopotamia Sumer Sumeria Hyderabad Telmun Elam Elamo-Dravidian Dravidian India Indian classical ancient language status demand tcld2006
Technorati tags: ,

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home