సంతృప్తి.. లభించాలి కీర్తి..
కాలచక్ర అనంతరం అమరావతి మనోగతం..
న్యూస్‌టుడే, గుంటూరు
బుద్ధం శరణం గచ్ఛామి.. అంటూ చేతులు జోడించి వినమ్రంగా వేడుకున్న బౌద్ధభిక్షువులు. జీవనగమన రీతులు నిర్దేశిస్తూ మంద్ర స్వరంతో ప్రవచనాలు బోధించిన దలైలామా తమ స్వస్థలాలకు మంగళవారం బయలుదేరారు. ధ్యానబుద్ధుడి సాక్షిగా పన్నెండు రోజులు కొనసాగిన కాలచక్ర ఉత్సవాలు ముగిశాయి. ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక ఉత్సవానికి ఆతిథ్యమిచ్చానన్న సంతృప్తి అమరావతికి కలిగింది.. ఇక కావాల్సిందిల్లా అంతర్జాతీయ స్థాయిలో కీర్తి.. కాలచక్ర సందర్భంగా ప్రభుత్వం చేసిన పనుల కన్నా చేయాల్సినవి ఇంకా ఉన్నాయి.. తక్షణం అమరావతి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం.. హడావుడిగా ప్రారంభించిన పనులు పూర్తిచేయడం ఇందులో ప్రధానమైనవి.
చిన్న లోపాలను మినహాయిస్తే అంతర్జాతీయస్థాయిలో కాలచక్ర ఉత్సవాన్నిప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. గ్రామంలో కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలను సమకూర్చింది. అధికార యంత్రాంగం అంతా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసింది. ఆధ్యాత్మికవేత్త దలైలామా ప్రవచనాలు.. వేలసంఖ్యలో తరలివచ్చిన బౌద్ధ భిక్షువులు.. దలైలామాను దర్శించుకొనేందుకు వచ్చిన తెలుగుప్రజలతో కార్యక్రమానికి నిండుదనం వచ్చింది. అంతర్జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రచారాన్ని కల్పించింది. అమరావతికి వచ్చిన బౌద్ధులు, భిక్షువులు కూడా వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పదిహేను రోజులు తమ సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు.
ప్రయోజనాన్ని పొందుదాం..
హిందువులకు తిరుమల.. క్రైస్తవులకు వాటికన్ సిటీ.. ముస్లింలకు మక్కా ఎలాగో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అమరావతి అలా నిలవాలని దలైలామా పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధ్యానబుద్ధ విగ్రహానికి రూ. 30 లక్షల విరాళం.. అంతర్జాతీయ అధ్యయన కేంద్రం నెలకొల్పితే తగిన సహకారం అందిస్తానని ప్రకటించారు. వీటిని అనుకూలంగా మలచుకుంటే అమరావతికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. పర్యాటక శాఖ లోయర్ కృష్ణావ్యాలీ ప్రాజెక్టు పేరుతో నాగార్జునకొండ.. అమరావతిలో బౌద్ధ ఆరామాలను అభివృద్ధిచేసేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఆలస్యం లేకుండా వీటిని పూర్తిచేయడం.. అంతర్జాతీయంగా ప్రచారాన్ని కల్పించడం వంటి పనులు చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది.
వీటిపై దృష్టిసారించాలి..
ధ్యానబుద్ధ విగ్రహం.. బుద్ధ ఇంటర్‌ప్రిటీషన్ సెంటర్ నిర్మాణాలు పూర్తవ్వాలి.. ధ్యానబుద్ధ విగ్రహం నుంచి అమరలింగేశ్వర ఆలయం వరకూ రోడ్డు నిర్మించి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ తరహాలో రూపొందించాలన్న ప్రణాళికను వెంటనే చేపట్టాలి. కాలచక్ర ఉత్సవాలు.. సంక్రాంతి సెలవులు కలిసిరావడంతో అమరావతికి వేలసంఖ్యలో ప్రజలు వచ్చారు. చివరి మూడు రోజులు ఇరవై వేలకు పైగా పర్యాటకులు వచ్చారని అంచనా. వీరంతా ప్రధానంగా ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చిన వారే. బుద్ధ ఇంటర్‌ప్రిటీషన్ సెంటర్‌లో అమరావతి చిత్రకళ సంపందను పూర్తిస్థాయిలో నెలకొల్పి ఆధునికమైన లేజర్ షోను కూడా వెంటనే అందుబాటులోకి తీసుకునిరావాలి. కాలచక్ర సందర్భంగా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు మొదలుపెట్టినా అసంపూర్తిగా వదిలేశారు. వీటిని పూర్తిచేసేందుకు తక్షణం నిధులు విడుదలచేయాలి.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu January 2006 , Nagarjunasagar, Nagarjunakonda , Bodh Gaya
0 Comments:
Post a Comment
<< Home