రేపు గయకు ప్రత్యేక రైలు
గుంటూరు, జనవరి 16 (న్యూస్‌టుడే): కాలచక్ర ప్రవచనానికి హాజరైనవారి సౌకర్యార్థం ఈనెల 18న గుంటూరు నుంచి గయ (రైలు నంబరు.711)కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ టి.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు గుంటూరులో ఉదయం 9.00 గంటలకు ప్రారంభమై విజయవాడకు 10.00 గంటలకు చేరుతుందన్నారు. ఇది విశాఖపట్నం, కుర్దారోడ్డు మీదుగా గయకు 19వ తేదీ సాయంత్రం 5.05 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ బండికి రిజర్వేషన్ సౌకర్యం మంగళవారం నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే వీరికోసం ఈనెల 17, 18, 19 తేదీల్లో మూడు రోజులపాటు విజయవాడ నుంచి హుబ్లీకి, మైసూరులకు ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సోమవారం అమరావతి ఎక్స్‌ప్రెస్ (నం.7225)కు మూడు, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (నం.8563)కు రెండు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
45 లక్షల ఆదాయం
కాలచక్ర ఉత్సవాల సందర్భంగా అమరావతిలో ఏర్పాటుచేసిన ప్రత్యేక రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ద్వారా సోమవారం వరకు సుమారు 45 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్టు సీనియర్ డి.సి.ఎం. టి.వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దానిని మరికొన్ని రోజుల కొనసాగించనున్నట్టు ఆయన తెలిపారు. రైళ్ళ రాకపోకల వివరాలను కొద్దిరోజుల వరకు టిబెటెన్లకు అర్థమయ్యేలా వారి భాషలో ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.
*****
అంధ విద్యార్థులకు దలైలామా చేయూత
అరండల్‌పేట, జనవరి 16 (న్యూస్‌టుడే): బ్రెయిలీ లిపిలో అంధ విద్యార్థుల కృషికి మెచ్చిన బౌద్ధ మతగురువు దలైలామా రూ.50,000 విరాళంగా ప్రకటించారని నగరంలోని శ్రీ షిర్డీ సాయి దీనజన సేవాసమితి అధ్యక్షుడు పబ్బరాజు వెంకటేశ్వరరావు, కార్యదర్శి పి.ఎస్.మూర్తిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని బ్రాడీపేట ఆరోలైనులో సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న అంధ పాఠశాల విద్యార్థులు 'బుద్ధ భగవాన్ జీవితం - ధర్మం' అనే మూడు సంపుటాలు గల పుస్తకాన్ని తయారు చేశారు. అంధులు చదువుకునేందుకు వీలుగా దీన్ని బ్రెయిలీ లిపిలో రూపొందించారు. కాలచక్ర తుదిరోజున ఈ పుస్తకాన్ని బౌద్ధ మతగురువు దలైలామాకు అమరావతిలో సంపుటాలను సమర్పించారు. ఈ సందర్భంగా 'దలైలామా' అంధ విద్యార్థుల కృషికి అభినందనలు తెలిపారు. సమితి కార్యకలాపాలను తెలుసుకుని, వారిని మరింత ప్రోత్సహించేందుకు అంధ పాఠశాలకు తమ సంస్థ తరఫున రూ.50వేల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు వి.రాజారాం, బి.వి.సుబ్రహ్మణ్యం, విద్యార్థులు పాల్గొన్నారు.Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu January 2006 , Nagarjunasagar, Nagarjunakonda , Bodh Gaya
0 Comments:
Post a Comment
<< Home