"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Thursday, January 05, 2006

ఆత్మలో నిరాయుధీకరణ


ఆనందమే జీవిత లక్ష్యం
భారతే నా స్వస్థలం
'న్యూస్‌టుడే' ఇంటర్వ్యూలో దలైలామా
రఘు ఏలూరి,న్యూస్‌టుడే

click for larger size


బౌద్ధానికి, భారత్‌కు, దలైలామాకు అవినాభావ సంబంధం ఉంది. బౌద్ధం పుట్టింది భారతదేశంలో... కానీ పుట్టినింట చోటులేక అది పొరుగు దేశాలకు తరలిపోయింది.
లైలామా పుట్టింది టిబెట్‌లో... కానీ స్వస్థలంలో చోటు లేక (చైనా టిబెట్‌ను ఆక్రమించడంతో) ఆయన భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు.
ంధ్రప్రదేశ్‌లో కాలచక్ర ఉత్సవాల సందర్భంగా ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. హింసతో, యుద్ధాలతో సతమతమవుతున్న ప్రపంచానికి బౌద్ధం సూచించే పరిష్కారం ఏమిటని అడగ్గా... ''ముందు మన ఆత్మలో నిరాయుధీకరణ జరగాలి'' అని బదులిచ్చారు. ''అంతరిక్షం ఉన్నంత వరకూ... సున్నిత భావానువర్తుల బాధలు ఉన్నంత వరకూ.. నేనూ ఉంటాను. వారికి సాయం, సేవ చేయడానికి!'' అని సందేశమిచ్చే బౌద్ధమతాచార్యుడు దలైలామా ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు...

ప్ర: బౌద్ధ మతాచార్యుడుగా ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం ఏమిటి?
జ: ఆధ్యాత్మికత అనేది మానవుల ఆత్మ తృప్తికొక మార్గం. ధన యోగం, అధికార భోగం, భౌతిక లాలసలు ఇవ్వలేని ఆత్మానందాన్ని మానవీయ హృదయ స్పందనలు, ప్రేమానురాగాలు మాత్రమే అందిస్తాయి. అందుకే ఆత్మ పరితృప్తి కలిగించేదాన్నే నేను ఆధ్యాత్మికత అంటాను. కొన్ని సందర్భాల్లో మత విశ్వాసం... ఆంతరాళాల్లో నమ్మకాన్ని నింపుతుంది. అలాగే కొన్ని మానవ విలువలు మత విశ్వాసాలతో ప్రమేయం లేకుండానే జన్మతః, ప్రకృతి ప్రసాదంగా సంక్రమిస్తాయి. ఉదాహరణకు సాటి మానవుడి లేదా జీవి పట్ల ఆర్ద్రత, అపేక్ష, భావావేశం... అటువంటివే!

ప్ర: జీవితాన్ని మీరెలా అర్థం చేసుకున్నారు?
జ: జీవన చింతన గురించి నేను సరిగ్గా చెప్పలేనేమో. ఎందుకంటే ప్రారంభం నుంచీ నేను ప్రశాంత జీవనాన్ని ఆశించే జీవిని. ఆనందమే జీవిత లక్ష్యమని నేను విశ్వసిస్తాను. జీవించడం ద్వారానే జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అందుకు రకరకాల మార్గాలు... సాధనలు... గమ్యాలు.

ప్ర: ఈ దేశంలో పుట్టి ఈ నేలపై నడయాడి ప్రపంచానికి వెలుగునిచ్చిన బౌద్ధం ఈ లోకానికి చాటిందేమిటి?
జ: భారతీయ బోధకుల్లో బుద్ధుడు ముఖ్య ప్రబోధకుడు. బుద్ధుడు అవతరించేనాటికే ప్రపంచంలో విభిన్న మత సంప్రదాయాలు బలంగా ఉన్నాయి. అయితే అన్ని మతాలు ఏకస్సూత్రంగా... ప్రేమ, కరుణ, క్షమాభిక్షలను చాటుతున్నాయి. ప్రకృతిలోని కార్యకారణ సంబంధాన్ని, పరస్పర ఆధారత్వాన్ని బౌద్ధం ప్రతిపాదించింది. దీన్నే సంస్కృతంలో 'ప్రతీత్‌ సంపత్‌' అంటారు. పరమోత్తమ సత్యం పరస్పర ఆధారమైనదని బుద్ధ భగవానుడు ప్రవచించాడు. అప్పుడే అనాత్మ సిద్ధాంతం వెలుగు చూసింది. ఇది పూర్తిగా దేహగతమైంది.

ప్ర: ఈ ప్రపంచ సంరక్షణలో బౌద్ధం పాత్ర?
జ: ఈ విశ్వాన్ని, ఈ ఆకుపచ్చ లోకాన్ని, ఈ అద్భుత ప్రపంచాన్ని కాపాడే బాధ్యత అన్ని ధార్మిక సంస్థలదీ. ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థే ఈ ప్రపంచాన్ని మారుస్తుందని ఆశించడం సబబు కాదు. లోక కల్యాణం, శాంతి సౌభాగ్యాల కోసం అన్ని ప్రధాన మతాల్లాగే బౌద్ధం కూడా తన వంతు బాధ్యత నిర్వర్తించగలదు. మనలోని విభేదాలు సమసినప్పుడే అసలైన సామరస్యం వెల్లివిరుస్తుంది.

సర్వ ధర్మాలూ బౌద్దంలోనే
అనుసరించాలా, లేదా ప్రజల ఇష్టం
భారత్‌లో ఈ మతం విస్తరిస్తోంది
'న్యూస్‌టుడే' ప్రత్యేక ఇంటర్వ్యూలో దలైలామా
న్యూస్‌టుడే - హైదరాబాద్‌
విద్యాభ్యాసం ముగించాక దలైలామా తన దేశమైన టిబెట్‌ కోసం పోరాటం ప్రారంభించారు. 1949లో టిబెట్‌పై చైనా దురాక్రమణకు పాల్పడింది. దాన్ని ఎదుర్కోవాలంటే దేశ ప్రజలంతా ఒక్కటవ్వాలని 1950లో ఆయన పిలుపునిచ్చారు. పోరాటం నాలుగేళ్లు సాగింది. వాటికి తలొగ్గిన చైనా 1954లో శాంతి చర్చలకని దలైలామాను ఆహ్వానించింది. కానీ చర్చలు ఫలించలేదు. 1959లో ఆయన్ను దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. అయినా దలైలామా ఊరుకోలేదు. తన దేశానికి జరిగిన అన్యాయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా చైనా దురాక్రమణ గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్నించీ దలైలామా టిబెట్‌ కోసం, తన దేశ ప్రజల శాంతి కోసం నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నారు. ఆ చిత్తశుద్ధే ఆయన్ను టిబెట్‌ వాసులకు ఆరాధ్య దైవాన్ని చేసింది. నోబెల్‌ శాంతి బహుమతి వరించేలా చేసింది.

ప్ర: బౌద్ధం ధర్మమా? లేక జీవన విధానమా?
జ: అన్నీ కూడా. ఎందుకంటే బౌద్ధంలో సర్వ ధర్మాలూ దాగి ఉన్నాయి. అందుకే నేను బౌద్ధాన్ని ఆరాధిస్తాను. అనుసరించమని ప్రజలకు చెబుతాను. ప్రజలు అందుకు సమ్మతించవచ్చు. తిరస్కరించవచ్చు. ఆ హక్కు వాళ్లకు ఉంది. అయితే సమ్మతించి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత మాత్రం చిత్తశుద్ధితో, నిజాయితీతో దాన్ని అనుసరించాలి. అప్పుడే ధర్మం ఓ జీవిత విధానంలా శోభిస్తుంది. అలా కాక మతం, ధర్మం ఓ పారాయణ గ్రంథమే అనుకుని, జీవితానికి అన్వయించుకోకపోతే ఎవ్వరూ మనల్ని లక్ష్యపెట్టరు.

ప్ర: బుద్ధుడు పుట్టిన ఈ నేల నుంచి బౌద్ధం మాయమైంది. దీనికి కారణం ఏమిటి?
జ: ఈ దేశాన్ని బుద్ధ జన్మస్థలిగా ఆరాధిస్తాం. ఈ భూమిలో ఎన్నో తాత్విక చింతనలు పరిఢవిల్లాయి. మహాభారతం వంటి ఇతిహాసాలు అవతరించాయి. ఇలాంటి భూమిలో బుద్ధుడు సజీవుడుగా నడయాడిన రోజుల్లో స్వయంగా బుద్ధుడే వాదోపవాదాలు చేశాడు. ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. తేజోమయ జీవితంలోకి మనిషిని తీసుకువెళ్లాడు. అయితే కాలక్రమంలో భారతదేశంలో బౌద్ధం పతనం కావడానికి అనేక సంఘటనలు దోహదం చేశాయి. ప్రొఫెసర్‌ జోషి రాసిన 'ది మెయిన్‌ కాసెస్‌ ఆఫ్‌ డిక్లెయిన్‌ ఆఫ్‌ బుద్ధధర్మ' అన్న పుస్తకం భారతదేశంలో బౌద్ధమత క్షీణదశకు కారణాలు సోదాహరణంగా వివరించింది. శంకరాచార్యుల వంటి పండితులు చేసిన చర్చల్లో కొందరు బౌద్ధమతాచార్యులు ఓడిపోవడం మొదటి కారణం. కొందరు రాజులు బౌద్ధేతర సంప్రదాయాల పట్ల మొగ్గు చూపడం రెండో కారణం. క్రమశిక్షణ కోల్పోయిన బౌద్ధ సన్యాసులు, బౌద్ధ మతానుయాయుల ధోరణి మూడో కారణం. బౌద్ధ సన్యాసులు తమ వద్ద ధన కనక వస్తు ఆభరణాలు అట్టిపెట్టుకొని భోగలాలస వైపు మొగ్గుచూడటంతో ప్రజల మన్నన కోల్పోయారు. బౌద్ధానికి బయట నుంచి కంటే బౌద్ధ మార్గాన్ని సక్రమంగా ఆచరించని స్వజనుల నుంచే ఎక్కువ నష్టం పొంచి ఉందని స్వయంగా బుద్ధ భగవానుడే తన బోధనల్లో పేర్కొన్నారు.

ప్ర: భారతదేశంలో బౌద్ధానికి భవిష్యత్‌ ఉందా? హిందూ ప్రపంచంలో అది జీవిస్తుందా?
జ: భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ గత శతాబ్ద కాలంగా బౌద్ధం క్రమేపీ విస్తరిస్తోంది. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే... మహాబుద్ధ సొసైటీ ఏర్పాటయ్యింది. వేలాదిమంది ప్రజలు బౌద్ధం పట్ల మక్కువ చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ చిన్న చిన్న బౌద్ధ సంఘాలను నేను చూశాను. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికంగా భారతదేశం సుసంపన్నమైనది. అయితే ఆధ్యాత్మికత సంస్కృత శ్లోకాలకు, పూజలకు మాత్రమే పరిమితం కాకూడదు. బలమైన మత, తాత్విక చింతనలను ప్రజలు అర్థం చేసుకోవాలి. కేవలం హోమాలు వంటి కొన్ని మతపరమైన క్రతువులతో సరిపెట్టుకోకూడదు. మనం కొన్ని క్రతువులను ధర్మానికన్న ఎక్కువగా భావిస్తాం. ఇది పొరపాటు. అవి మతంలో ఓ భాగం మాత్రమే. ఆధ్యాత్మిక, మతపరమైన విజ్ఞానం కొద్దిమందికి తెలిస్తే సరిపోదు. మతం పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ సమగ్ర ఆధ్యాత్మిక విజ్ఞానంతో భాసిల్లాలి.

ప్ర: భౌతిక సుఖాలకు, విలువలకు పొంతన లేని వర్తమానంలో వ్యక్తిగత విలువలకు ఏ మేరకు ప్రాధాన్యం ఇవ్వాలి?
జ: నా ముందు రెండు కర్తవ్యాలున్నాయి. మానవ విలువలు వికసించేలా చేయడం మొదటి కర్తవ్యం. మనలో ప్రతి ఒక్కరూ సుఖప్రదమైన, ఆనందదాయకమైన జీవితం కోరుకుంటాం. అందుకోసం అన్ని రకాల ఐహిక సౌకర్యాలుంటే బాగుండునని తలపోస్తాం. ఈ భౌతిక శరీరం మనకుంది కాబట్టి అలా కోరుకోవడం తప్పు కాదు. అయితే అదే సమయంలో మనలోని వ్యక్తిగత విలువల్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఎందుకంటే ఈ భౌతిక సౌకర్యాలు మన అంతర్‌లోకానికి ఎటువంటి తృప్తినివ్వలేవు. నువ్వు ఎంతో సంపన్నుడవైనా కావచ్చు, కాని మానసికంగా ఏదో అసంతృప్తితో బాధపడుతుంటావు. మరోవైపు కడు నిరుపేద ఎంతో మనశ్శాంతితో జీవనయానం సాగిస్తుంటాడు. కాబట్టి మనం భౌతిక అభివృద్ధికే పరిమితం కాకుండా అంతరాంతరాల్లో ఆత్మిక వికాసం కూడా అత్యవసరం. నా రెండో కర్తవ్య సాధన... మత సామరస్యం. శాంతి, సామరస్యాలకు సంబంధించి అన్ని మతాల దృష్టి ఒక్కటే. అందుకే ప్రతి ప్రధాన ధార్మిక సంస్థ మతసామరస్య భావాన్ని నెలకొల్పటానికి సమైక్య పంథా అనుసరించాలి. మనమందరం లోకశాంతిని, మనశ్శాంతిని, ఆత్మపరివర్తనను సాధించడంలో నిమగ్నమవ్వాలని నేను కోరుకొంటున్నాను. అప్పుడే వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ఆనందం వెల్లివిరుస్తుంది.

ప్ర: బౌద్ధంలో తరచూ వినిపించే 'లామా' అంటే మరో బుద్ధుడని అర్థమా... లేక మరేదైనా వివరణ ఉందా?
జ: లామా అనే పదానికి సంస్కృతంలో 'గురువు' అనే అర్థం ఉంది. ఈ లామా, గురు పదాలకు బుద్ధుడనిగానీ, మరో బుద్ధుడనిగానీ ఎంతమాత్రం అర్థం లేదు. అయితే చైనా భాషలో ఈ లామా అనే పదానికి 'కనిపించే బుద్ధుడు' అనే పర్యాయపదం ఉంది. చైనా భాష నుంచి ఆంగ్లంలోకి తర్జుమా అయ్యేసరికి అది అలా ప్రచారంలోకి వచ్చింది. బౌద్ధం అవతరించిన కాలంలోనే బుద్ధభగవానుడు నడయాడాడు. అంతేగాని మరో బుద్ధుడు ఎప్పుడూ లేడు. నన్ను 'కనిపించే బుద్ధుడు'గా తలపోస్తే, వేలాది బుద్ధులు అవతరించినట్లే. దీన్నే నేను బౌద్ధంలోని గొప్పతనంగా భావిస్తాను.

ప్ర: మార్పు సహజమంటారు... గత నాలుగున్నర దశాబ్దాల కాలంలో చైనా విషయంలో మీ ఆలోచనల్లో ఏమైనా మార్పు చోటు చేసుకుందా?
జ: చైనా నుంచి స్వాతంత్య్రం పొందాలనో, విడిపోవాలనో మేం కోరుకోవడం లేదు. ఓ అర్థవంతమైన, స్వేచ్ఛాయుతమైన సార్వభౌమాధికారాన్ని, స్వపరిపాలనను కోరుకొంటున్నాం, మంగోలియా, యుహు, టిబెటిన్‌ వంటి మైనారిటీలకు, కాందిశీక సమూహాలకు అలాంటి హక్కులను చైనా ప్రభుత్వం కల్పించింది. అది అమలు అయినప్పుడే నిజమైన, సమర్థమైన, నిలకడగల సమైక్యతకు అవకాశం ఏర్పడుతుంది. పరస్పర ప్రయోజనాలకు వీలు కలిగినప్పుడే ప్రగతి సుసాధ్యం.

ప్ర: రెండు ప్రపంచ యుద్ధాలు మానవ చరిత్రను తిరగరాశాయి. ఎన్నో దురాక్రమణలు, అణచివేతలను ప్రపంచ దేశాలు చవిచూశాయి. అశాంతికి, అణచివేతకు ఆయుధం కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచశాంతికి మీరిచ్చే సూచన ఏమిటి?
జ: తొలుత ఆత్మలో నిరాయుధీకరణ జరగాలి. అది కోపాన్ని, అసూయా ద్వేషాల్ని ఉపశమింపచేస్తుంది. అదే ఆత్మ నిరాయుధీకరణ అంటే! ఆ తర్వాతది బహిర్‌ నిరాయుధీకరణ. మొదట మన ఆలోచనా ధోరణిలో మార్పు అనివార్యం. విధ్వంస ఆలోచనలకు విలువ లేదని గ్రహించాలి. పరిసర ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే యోచనలు సత్ఫలితాలిస్తాయి. అంతరాళాల్లో మనం మరింత శక్తివంతులం అవుతాం. ఆ తర్వాతే బాహ్య ప్రపంచంలో నిరాయుధీకరణ. ఇదీ చాలా ముఖ్యమైనదే. ఒకేసారి సాధ్యం కాదు. అంచెలంచెలుగా సాగాలి. అప్పుడు అంతిమంగా సైన్యరహిత సమాజం ఏర్పడుతుంది. అణ్వాయుధ నిర్మూలనం జరిగితే అప్పుడు ప్రజలు నిర్భయంగా రసాయనికాయుధాలు, సైన్యం, రక్షణ వ్యయం తగ్గింపు గురించి మాట్లాడ్డం మొదలుపెడతారు. హింసాకాండ అంటే హత్యాకాండే, అదుపు తప్పిన హింస, దురాశలకు ప్రజలు బలైపోతున్నారు.

ప్ర: నా మాతృభూమి భారతావని అంటూ మీరు చెప్పడం పరిపాటి. వెనక్కి తిరిగి చూస్తే ఈ దేశంతో మీకున్న అనుభూతులు ఏమిటి?
జ: భారతదేశంలోనే నేను గత 46 ఏళ్లుగా జీవిస్తున్నాను. నా ఆధ్యాత్మిక భావనలకు సంబంధించిన శిక్షణంతా ఈ దేశం నుంచే పొందాను. ఆ రకంగా చెప్పాలంటే ఈ దేశమే నా నిజమైన స్వస్థలం. నా ఆధ్యాత్మిక మూలాలు ఇక్కడే. ఈ 46 ఏళ్ల కాలంలో భారతదేశంలో నాకు దొరికిన స్వేచ్ఛ నన్ను ఏం చేసిందోగానీ, ఒక్కోసారి ఈ దేశమే నా ఇల్లు అనుకుంటాను.

ప్ర: దేశవిదేశాల్లో ఇప్పటి దాకా మీరు 29 కాలచక్ర దీక్షలను నిర్వహించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో 30వ కాలచక్ర నిర్వహిస్తున్నారు. దీని ప్రాముఖ్యం ఏమిటి?
జ: బౌద్ధ సంప్రదాయంలో కాలచక్ర... ఓ సంక్లిష్ట తాంత్రిక పూజా క్రతువు. ఇది దృగ్గోచరమైన అంతిమ ప్రపంచంతో సంబంధం నెరుపుతుంది. మానసిక, ఆత్మ, వివిధ నాడీ మండలాలతో కూడిన శరీర అంతర్లోకాలతోనూ కాలచక్ర ముడులు వేస్తుంది. ఈ కాలచక్రలోని ఇతర చక్రాలతో మన ఆత్మ పరివర్తనలను, మన అభివృద్ధిని సిద్ధింపచేసుకోవచ్చు. కాలచక్ర ప్రార్థనలతో విజ్ఞతను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవచ్చు. నా ఆధ్వర్యంలో 30వ కాలచక్ర కార్యక్రమం మీ రాష్ట్రంలోని అమరావతిలో నిర్వహిస్తున్నాను. ప్రపంచంలోని పలు దేశాల నుంచి కొన్ని వేల మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే తరలివచ్చారు. బౌద్ధధర్మ సారాంశమైన నాలుగు పవిత్ర ధర్మాలను కాలచక్ర సమావేశంలో సందేశంగా ఇస్తున్నాను.

ప్ర: బౌద్ధంలో లేని తంత్రాలు, మంత్రాలు, కర్మకాండ... ఈ కాలచక్రలో చోటు చేసుకున్నాయి. దేనికని?
జ: ప్రజలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేదు. నిరంతరం పరిభ్రమించే గ్రహచక్రాల నుంచి మానవ శరీరంలోని ఉఛ్వాస, నిశ్వాసలతో కూడిన శ్వాస చక్రం వరకూ ఇంకా అనేక అద్భుత విషయాలను ఇది బోధపరుస్తుంది. కాలాన్ని దేవతగా భావించడం ఒక సంప్రదాయం. స్వార్థ చింతన వీడిన సాధకులు బోధి సత్వాన్ని పొంది సంయక్‌ దృష్టితో బుద్ధునిగా మారే యత్నమే ఇది.

ప్ర: కాలచక్ర భావనను ఇక్కడి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలోనే అర్థం చేసుకున్నాయా?
జ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మా పట్ల ఎంతో శ్రద్ధ చూపుతోంది. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగానే గాక పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోంది. పురాతనం, పవిత్రం అయిన ఈ ప్రదేశానికి మరోవైపు అమరావతి, నాగార్జున కొండ ఉన్నాయి. అదృష్టవశాత్తు 1956 ప్రాంతంలో ఆ ప్రాంతం నీట మునగకముందే... చిన్న దేవాలయం కూడా ఉన్న అప్పటి నాగార్జునకొండను చూసే మహత్‌ భాగ్యం నాకు దక్కింది.

దలైలామా అంటే..?
న్నాళ్లగానో ఎదురుచూస్తున్న కాలచక్ర మొదలైంది. లామాలు గురువుగా భావించే దలైలామా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి పెద్దఎత్తున లామాలు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో లామాల గురించి క్లుప్తంగా...
లామా అంటే టిబెట్‌భాషలో ఆధ్యాత్మిక గురువు అని అర్థం. భారతదేశంలో ఇస్లాం ఆధిక్యత పెరగగానే పలువురు బౌద్ధ భిక్షువులు టిబెట్‌కు పయనమయ్యారు. 13వ శతాబ్దంలో చైనాను పాలించిన మంగోలులు టిబెట్‌ను కూడా తమ ఏలుబడిలోకి తీసుకున్నారు. ఆ కాలంలోనే శాక్య విహారానికి చెందిన ఒక ఆచార్యుడు చైనా చక్రవర్తి కుబ్లయ్‌ఖాన్‌కు బౌద్ధదీక్షను ఇచ్చారు. ఈ ఆచార్యుడే మతాచార్య పాలనను నెలకొల్పాడు. దీనిని అనుసరించి దేశంలో ధర్మపాలనకు ఒక లామా (దలైలామా), రాజకార్య నిర్వహణకు మరో లామా (పంచెన్‌లామా)లు ఉంటారు. ఈ పదవులలో ఉన్నవారు వేరొకచోట జన్మిస్తారని టిబెట్‌ పౌరుల విశ్వాసం. దీని కారణంగా ఈ లామాలలో ఏ ఒక్కరు మరణించినా ఆయా నిర్ణీత శుభలక్షణాలు గల శిశువును మతాచార్యులు కనుగొని అతడ్ని ఆ పదవిలోకి అభిషిక్తుడ్ని చేస్తారు.
*బౌద్ధంకు మరో రూపమైన లామాలో దైవజ్ఞ విద్య, ఇంద్రజాలిక విద్య వంటి వాటికి స్థానం ఉండటానికి కారణం అక్కడి 'బోన్‌' అనే మతప్రభావం కావచ్చు.
*దలైలామా అంటే వివేక సాగరం. ఈ బిరుదును మొదటగా చేపట్టిన వాడు బౌద్ధమతాధిపతుల్లో మూడోవాడు.
*తాషి-లామా అంటే మహారత్న విద్వాంసుడు. ఈయన రాజ్యాధికారం ఒక రాష్ట్రానికే పరిమితం.
*దలైలామా లేదా తాషిలామాలలో ఏ ఒక్కరు మృతి చెందినా ఆ క్షణాన పుట్టిన శిశువుల్లో ఎవరు లామా అవతారమన్నది రెండవ లామాయే నిర్ణయిస్తారు.



కాలచక్ర ఆరంభం
అమరావతి, న్యూస్‌టుడే : బౌద్ధుల పూజనీయ ఆధ్యాత్మికోత్సవం 'కాలచక్ర' బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లా అమరావతిలో ఆరంభమైంది. బౌద్ధ మత గురువు దలైలామా జ్యోతి ప్రజ్వలన గావించి కాలచక్రను లాంఛనంగా ప్రారంభించారు. అయితే అసలు కార్యక్రమాలు గురువారం నుంచి ప్రారంభమవుతాయి. ఉపాసన, ధ్యానం, మంత్రోక్త ఘోష నియమబద్ధ వేళల్లో వేడుకగా సాగుతాయి. విశాలమైన పందిళ్లల్లో 5 వేలకుపైగా భిక్షువులు ఒకేచోట కూర్చొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రవచనాలను భక్తి ప్రపత్తులతో ఆలకించి తరించేందుకు వివిధ దేశాల నుంచి దాదాపు 35 వేల మంది ప్రతినిధులు ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. ఇంకా అనేక మంది చేరుకుంటున్నారు. మొత్తంమీద వచ్చే పన్నెండు రోజులూ బౌద్ధ ప్రవచనాల ఘోషతో అమరావతి పరిసరాలు పరవశించనున్నాయి!!

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda , interview


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home