ప్రపంచ పటంలో ప్రవాస భారతం
జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం. ఇప్పటి వరకు ఢిల్లీలో రెండుసార్లు, ముంబాయిలో ఒకసారి జరిగిన ఈ ఉత్సవాలు ఈ ఏడాది హైదరాబాద్‌లో జరగనున్నాయి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగొచ్చిన రోజుకు గుర్తుగా ఏటా అదే రోజున ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. మూడు రోజుల ప్రవాస భారతీయుల పండగ ఇది. ఈ సందర్భంగా తెలుగువాళ్ళ వలసలపై పిహెచ్.డి చేసిన డాక్టర్ టి.ఎల్.ఎస్.భాస్కర్ రాసిన వ్యాసం మీకు అందిస్తున్నాం. ప్రస్తుతం బైర్రాజు ఫౌండేషన్‌లో అసోసియేట్‌గా పని చేస్తున్న భాస్కర్ www.telugudiaspora.com అనే వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
యూనివర్సిటీలో ఎకనమిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అంజలీదేవి నర్సింహులు రోజూ విష్ణుపూజ చేశాకే యూనివర్సిటీకి వెళుతుంది. ఇందులో ఏముంది విశేషం, ఎంత మంది చేయడం లేదా పని అని అనుకుంటున్నారేమో. ఆమె ఆ పనిని మారిషస్‌లో చేయడమే విశేషం. తను ఎన్నడూ చూడని తన మాతృభూమి నుండి తన పూర్వీకులు 200 ఏళ్ళ క్రితం తీసుకొచ్చిన ఆచార సంప్రదాయాలను ఆమె నేటికీ పాటించడమే విశేషం. ఆమె నివసించే సెయింట్ పియరీ పట్టణంలో ఒక విష్ణు దేవాలయం కూడా ఉంది. మారిషస్ మొత్తానికి చూసుకుంటే చిన్నవీ పెద్దవీ కలిపి దాదాపు వంద దేవాలయాలున్నాయి. మరి 70 వేల మంది తెలుగు వాళ్ల అవసరాలకు సరిపోవాలి కదా. మారిషస్‌లోని 12 లక్షల మంది జనాభాలో తెలుగువాళ్లు 70 వేలమంది ఉన్నారంటే ఒకప్పుడు ఎంత పెద్దఎత్తున మన వాళ్ళు అక్కడికి వలస వెళ్లి ఉంటారో ఊహించండి.
అంజలీదేవి పూర్వీకులది విశాఖపట్నం. ఆమె మొదటిసారిగా రెండేళ్ళ క్రితం ఇండియా వచ్చి తమ ఊరిని చూసుకుని వెళ్లింది. ఆనందం, అయోమయం, దుఃఖం అన్నీ ముప్పిరిగొన్న భావంతో తిరిగి వెళ్లి తన చరిత్రను తన పిల్లలకు కథలు కథలుగా చెప్పింది. ఆమె పూర్వీకులు మిగతా తెలుగు వాళ్లలాగే, భారతీయుల్లాగే బ్రిటిష్ పరిపాలనలో చెరకు తోటలలో పనిచేసే కూలీలుగా అక్కడికి వెళ్లారు. ఎవరు, ఎప్పుడు, ఏ నౌకల్లో ప్రయాణించి అక్కడికి వచ్చారో ఆ వివరాలన్నీ మారిషస్‌లోని మహాత్మాగాంధి ఇన్‌స్టిట్యూట్ (మోకా)లో భద్రంగా ఉన్నాయి. భారతీయ వలసలకు అద్దం పట్టే ఫోక్ మ్యూజియం అది.
ఐతరేయ బ్రాహ్మణంలో...
బహిష్కృతులైన విశ్వామిత్రుని పుత్రులు దేశాలు పట్టిపోయిన ఉదంతం ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. వలసల గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఇది. తొలినాటి వలసలన్నీ యుద్ధాలు, వ్యాపారాలలో భాగంగా జరిగినవే. అలా వెళ్లి అక్కడే ఉండిపోయిన వాళ్లంతా తెలుగు భాషను, ఆచార వ్యవహారాలను, విలువల్ని, నమ్మకాల్ని తరం నుండి తరానికి అందించుకుంటూ పోయారు. అందుకే ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా వారి ఆనవాళ్లు చెరిగిపోలేదు.
మూడు దశలుగా
ఈ వలసలు మూడు దశల్లో సాగాయి. బ్రిటిష్‌కు పూర్వం, బ్రిటిష్ హయాంలో, స్వాతంత్య్రానంతరం. శాతవాహనుల కాలంలో ఆంధ్రుల వలసలు ప్రధానంగా వ్యాపార వాణిజ్యాల కోసం జరిగాయి. 'పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ' అనే గ్రీక్ గ్రంధం ఈ నౌకావాణిజ్యాన్ని చాలా వివరంగా రికార్డు చేసింది. సముద్ర మార్గాలు, రేవులు, వచ్చేపోయే వ్యాపారస్తులకు కల్పించిన సౌకర్యాలు మొదలైన వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఆ తర్వాత ఆగ్నేయాసియా దేశాలతోనూ ఆంధ్రులకు నౌకా వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మలేషియాతో. కళింగ శ్రీశైలానికి చెందిన శైలేంద్ర వంశం పలంబంగు (సుమత్రా దీవి)లో శ్రీవిజయ సామ్రాజ్యాన్ని నెలకొల్పి జావా,మలయా, సయాం, బోర్నియా, కంబోడియాలతో వాణిజ్యం జరిపింది. మహాయాన బౌద్ధాన్ని కూడా ప్రచారం చేసింది. పరమేశ్వర మహారాజు సింగపూరు, మరి కొన్ని దేశాలను కూడా పరిపాలించాడు.
శాతవాహనుల తర్వాత కాకతీయుల పాలనలోనూ ఈ వాణిజ్యం కొనసాగింది. గణపతి దేవుని మోటుపల్లి శాసనమే దీనికి ఉదాహరణ. నౌకా వాణిజ్యం రాజుకు ఆదాయం తెచ్చిపెట్టేది కాబట్టి ఏ రాజూ దీని మీద ఎటువంటి ఆంక్షలూ విధించలేదు. విదేశీయానానికి కులపరమైన అడ్డంకులూ కల్పించలేదు.
బ్రిటీష్ కాలంలో...
బ్రిటీష్ హయాంలో ఆంధ్రదేశంలో 40 దాకా రేవులు ఉండేవి. వారు ప్రవేశ పెట్టిన జమీందారీ విధానం వలన రైతుల పరిస్థితి మరీ దిగజారింది.షేష్‌కష్ పన్ను కారణంగా, తరచూ కరువు కాటకాలు రావడం మూలంగా తిండికి వారు విపరీతంగా కటకటలాడారు. ఆంధ్రా కరువు(1805-7), నెల్లూరు కరువు(1811), గుంటూరు కరువు(1833), 1839లో పంటలన్నీ నాశనమవడం ఇలా వరస బాధలు వచ్చిపడ్డాయి.దీనికి తోడు చేతివృత్తులను ధ్వంసం చేశారు. దాంతో ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పటి దాకా బరంపురం నుంచి పట్టు, శ్రీకాకుం నుంచి రవల్లా బట్ట,మచిలీపట్నం నుంచి కలంకారి వస్త్రం వగైరాలన్నీ ఎగుమతి అవుతూ ఆ ప్రాంత వాసుల ఆదాయానికి లోటు లేకుండా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి పరిపాలన బ్రిటీష్ రాజరికానికి మారిన తర్వాత కూడా అధిక పన్నులు, అవినీతి, అసమర్థత కొనసాగడంతో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
మారిషస్‌కి
మారిషస్‌కి వెళ్లిన తొలి ఆంధ్రుడి పేరేమిటోగాని అతను వెళ్లిన సంవత్సరం మాత్రం 1836. కొరింగ నుండి గాంజెస్(గంగ) అనే నౌక ఎక్కి వెళ్లినట్లు రికార్డు ఉంది. ఆ తర్వాత విశాఖపట్నం పరిసరప్రాంతాల నుంచి చాలామంది వెళ్లారు. అప్పట్లో తెలుగువాళ్ళను కొరింగలు, జెంటూలు, తెలింగలు, కళింగలు ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు. ఒకేసారి ఎక్కువమంది తెలుగువాళ్ళు మారిషస్‌కి వెళ్ళే నౌక ఎక్కింది 1843లో. ఆ నౌక పేరు కొరింగా పాకెట్. కాకినాడ దగ్గరున్న కొరింగ రేవు నుండి బయల్దేరింది అది. ఆ నౌక యజమాని పేరు పొనమండ వెంకటరెడ్డి. 1837 - 1880ల మధ్య దాదాపు 20 వేల మంది ఆంధ్రులు మారిషస్‌లోని చెరుకు తోటలలో కూలీలుగా (జీnఛ్ఛీn్టఠట్ఛఛీ జ్చూఛౌఠట) పని చేయడానికి వెళ్ళారు. వాళ్ళలో ఎక్కువ మంది గంజాం, వైజాగ్, రాజమండ్రి ప్రాంతం వాళ్ళు.
మలేషియాకు ...
మారిషస్ తర్వాత ఎక్కువ మంది ఆంధ్రులు వలస వెళ్ళిన దేశం మలేషియా. విడివిడి కూలీలుగా కాకుండా 'కంగానీ' పద్ధతి కింద వలస వెళ్ళిన కూలీలు వీళ్ళు. వీళ్ళ కాంట్రాక్టు మూడేళ్ళు. చెరుకు తోటల ఏజెంట్ ద్వారా కాకుండా తమ కుటుంబ పెద్ద ద్వారా రబ్బరు, కొబ్బరి, పామాయిల్ తోటల్లో పని చేయడానికి వెళ్ళారు. రోడ్డు నిర్మాణం, పారిశుధ్యం, రైలు మార్గాలు, విద్యుచ్ఛక్తి కేంద్రాలలో పనుల కోసం కూడా వెళ్ళారు. ఈ వలసలు కూడా ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కొంతవరకు తూర్పు గోదావరి జిల్లాల నుంచి జరిగినవే. చిత్తూరు జిల్లా నుండి కూడా వెళ్ళారు. కంగానీని మనం దండేలు అని కూడా అంటాం. అంటే దండును ఏలేవాడని. కులాలుగా చూస్తే గవర, కాపు, వెలమ, చాకలి, మంగలి తదితర కులాల నుండి ఎక్కువ మంది వెళ్ళారు. అయితే తమిళులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వెళ్ళినందువల్ల తెలుగువాళ్ళకి విడిగా ఎలాంటి గుర్తింపూ ఉండేది కాదు. 1900 వరకు కూడా అదే పరిస్థితి. 1955లో మలేషియా ఆంధ్ర సంఘం ఏర్పడ్డాక గాని తెలుగువాళ్ళ సమస్యలు వెలుగులోకి రాలేదు.
మారిషస్‌లో లాగా కాకుండా ఇక్కడ తెలుగువాళ్ళు ఇప్పటికీ ఇళ్ళల్లో తెలుగే మాట్లాడతారు. వేరే దేశస్థులను పెళ్ళి చేసుకున్నా సరే పిల్లలకు తెలుగు తప్పనిసరిగా నేర్పిస్తారు. ఇక్కడి తెలుగువాళ్ళ సంఖ్య మూడు లక్షలుంటుందని అంచనా. కాని అధికారికంగా మూత్రం 40 వేలని చెపుతారు. ఈ ఏడాది మార్చిలో మలేషియా ఆంధ్ర సంఘం స్వర్ణోత్సవాలు జరుపుకోనుంది.
ఫిజి
'ఎల్బీ' అనే నౌకలో తొలిసారిగా తెలుగువాళ్ళు 1903లో ఫిజి దీవులకు వలస వెళ్ళారు. వీళ్ళ గురించి ఎక్కువ తెలియకపోయినా వాళ్ళు తెలుగు భాషను మాత్రం మర్చిపోలేదనడానికి వాళ్ళు నెలకొల్పుకున్న 'దక్షిణ ఇండియా ఆంధ్ర సంఘమే' ఉదాహరణ. దీని అధ్యక్షుడు పేరు డేవిడ్ రాబర్ట్! వెస్టిండీస్‌కు కూడా తెలుగువాళ్ళు బాగానే వలస పోయారు.
బర్మా
బర్మా (ఇప్పటి మయన్మార్)కు తెలుగువాళ్ళ వలస పందొమ్మిదో శతాబ్దం మొదట్లోనే ప్రారంభమైంది. 1871 నుండి పదిహేను రోజుల కొకసారి స్టీమర్ సర్వీసు కూడా ప్రారంభమైంది. మేస్త్రీ కింద కూలీలుగా వలసపోవడమనే పద్ధతి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వలసలు కూడా గంజాం, విశాఖపట్నంల నుండే ఎక్కువగా జరిగాయి. స్టీమర్‌లో నాలుగు రోజుల ప్రయాణం, 16 రూపాయల ఖర్చూ అయ్యేది. అయితే వీళ్ళు అక్కడే ఉండిపోకుండా రెండు మూడేళ్ళ తర్వాత 200, 300 రూపాయలతో తిరిగొచ్చి అప్పులు తీర్చుకుని, భూములు విడిపించుకునే వాళ్ళు. బర్మా వెళ్ళిన లక్షా 50 వేల మంది భారతీయులలో ఎక్కువ మంది తెలుగువాళ్ళే.
దక్షిణాఫ్రికా
'ఎస్.ఎస్.ట్రూరో' అనే నౌకలో మిగతా దక్షిణాది ర్రాష్టాల వాళ్ళతో కలిసి తెలుగువాళ్ళు 1860లో డర్బన్‌లో అడుగుపెట్టారు. ఈ వలసలు 1911 దాకా జరిగాయి. వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది నాయుళ్ళు. నిజానికి భారతదేశం నుండి అక్కడికి వెళ్ళిన మొదటి వ్యక్తి తెలుగువాడని, అతని పేరు బాబు నాయుడని, 1885లో వెళ్ళాడని మరో కథనం ఉంది. నాయుళ్ళ తర్వాత కంసాలి, కమ్మరి కులస్తులు ఎక్కువగా వెళ్ళారు. కూలీలుగా వెళ్ళినప్పటికీ ఆ తర్వాత వ్యాపారస్తులుగా, సినిమా హాళ్ళు, గ్యారేజ్‌లు, లాండ్రీలకు యజమానులుగా మారారు. డెబ్బై ఏళ్ళ దాకా తెలుగువాళ్ళకు విడిగా గుర్తింపు లేని లోటును 1931లో ఏర్పడిన దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ తీర్చింది. దీనికి 30 బ్రాంచీలున్నాయి. తెలుగు స్కూళ్ళు నడుపుతారు. ఉగాది, త్యాగరాజ సంగీతోత్సవాల లాంటి పండగలు జరుపుతారు.
గల్ఫ్, పాశ్చాత్య దేశాలకు
ఈ రెండు ప్రాంతాలకు మన వాళ్ళు స్వాత్రంత్యానంతరమే వెళ్ళారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన వాళ్ళంతా బాగా చదువుకుని వెళ్ళిన వాళ్ళే. 1950ల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు అమెరికా వెళ్ళసాగారు. 1990ల తర్వాత ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వెళ్ళారు. ఆ ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికాలో నాలుగు లక్షల మంది తెలుగువాళ్ళు ఉన్నారని అంచనా. వీళ్ళకోసం 60 దాకా తెలుగు సంఘాలున్నాయి. బ్రిటన్‌కు నేరుగా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళేకాక బర్మానుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. 1960లలో ప్రెస్టన్ పరిశ్రమలలో పని చేయడానికి దాదాపు 130 కుటుంబాలు వెళ్ళాయి. లండన్, స్కాట్లండ్, పారిస్‌లలో తెలుగు సంఘాలున్నాయి. రెండేళ్ళకు ఒకసారి యూరోపియన్ తెలుగు సంఘాల సమావేశం జరుగుతుంది. ఫ్రాన్స్‌లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎక్కువ మంది యానాం నుండి వెళ్ళిన వాళ్ళే.
ఆ్రస్టేలియాకు వలస వెళ్ళడం 1960 తర్వాతే మొదలైంది. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంల కింద పరిశోధకులు, టీచర్లు మొదట వెళ్ళారు. 1985 నాటికి సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో 60 చొప్పున తెలుగు కుటుంబాలు ఉన్నాయి. రెండు చోట్లా తెలుగు సంఘాలు కూడా ఏర్పడ్డాయి. గల్ఫ్‌కు వెళ్ళిన వాళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళే. కడప, అనంతపురం, కరీంనగర్ లాంటి చోట్ల నుండి డ్రైవర్లుగా, వంట వాళ్ళుగా, ఆయాలుగా, ఇంటి పని వాళ్ళుగా ఎక్కువ మంది వెళ్ళారు. వీళ్ళంతా ఇక్కడ కుటుంబాలతో నిత్యసంబంధాలతో ఉంటున్న వాళ్ళే. వచ్చిపోతున్న వాళ్ళే.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియా ప్రభుత్వం 2000 సంవత్సరంలో భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు తొలిసారిగా ప్రవేశం కల్పించింది. ఈ ఐదేళ్ళలో అక్కడికి వెళ్ళిన తెలుగువాళ్ళ సంఖ్య 300, 400 కంటే ఎక్కువ ఉండదు. అయినా రెండేళ్ళ క్రితమే అక్కడ ఒక తెలుగు సంఘం (ఖ్చీటజు) ఏర్పడింది. కొత్తగా వచ్చిన తెలుగువాళ్ళకు ఈ సంఘం బాగా సహాయం చేస్తోంది.
శాతవాహనుల కాలం నుండి ఇప్పటిదాకా జరిగిన, జరుగుతున్న వలసలను రేఖామాత్రంగానే పరిచయం చేశాను. తవ్వేకొద్దీ కొత్త సంగతులు తెలుస్తూనే ఉంటాయి
Keywords: Telugu , Andhra Pradesh , India , diaspora migration migrate world worldwide , America US USA , Europe UK , Malaysia Mauritius Fiji South Africa Gulf South Korea, Andhra Jyothi January 2006
0 Comments:
Post a Comment
<< Home