'కాలచక్ర'కు నిధుల గ్రహణం!
పనుల నిలిపివేత దిశగా కాంట్రాక్టర్లు
న్యూస్‌టుడే, గుంటూరు
ప్రతిష్ఠాత్మకంగా 'కాలచక్ర' మహోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు అధికారులకు సూచిస్తూనే నిధుల విడుదలలో సాచివేత ధోరణి ప్రదర్శిస్తుండడంతో ప్రస్తుతం జరుగుతున్న పనులు నిలిచిపోయే పరిస్థితి దాపురించింది. గురువారం నుంచి అన్ని పనులను నిలిపివేయాలనే నిర్ణయానికి కాంట్రాక్టర్లు వచ్చినట్టు సమాచారం.
అరుదైన అవకాశమని జిల్లా యంత్రాంగం అత్యుత్సాహంతో కాలచక్ర నిర్వహణకు రూ. 53 కోట్ల విలువైన పనులకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీన్ని సమీక్షించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రూ. కోటిన్నర మినహా అదనంగా నిధులు మంజూరు కాలేదు. అంతర్జాతీయ బౌద్ధ గురువు దలైలామా ఆర్థిక సహాయం, రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో జరుగుతున్న ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు మినహా మరే ఇతర నిర్మాణానికి ఇంతవరకు పూర్తి బడ్జెట్ విడుదల కాలేదు. ఇందులో రూ. 22 కోట్లకు పైగా వెచ్చించి రోడ్ల విస్తరణ చేపడుతుండగా వాటిపై తారు వేయడానికి మరో రూ. 10 కోట్లు అదనంగా అవసరమని ఆర్ అండ్ బి అధికారులు ఇటీవల జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో సూచించారు. ఇప్పటివరకు రోడ్ల విస్తరణను సొంత నిధులతోనే చేపట్టిన కాంట్రాక్టర్లకు అడపాదడపా హడ్కో నిధులతో అధికారులు బుజ్జగించారు. నేడో, రేపో మిగిలిన నిధులు విడుదలవుతాయని భావిస్తున్నా ఇంతవరకు అధికారుల నుంచి అటువంటి సమాచారమేదీ అందక వారు లబోదిబోమంటున్నారు. దీంతో రోడ్ల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయే పరిస్థితి దాపురించింది. ఇవి కాకుండా గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మరో రూ. 20 కోట్ల విలువైన పనులు చేపట్టాలని అధికారులు భావించారు. వీటిలో దాదాపు రూ. 2.5 కోట్లతో మూడు నీటి ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. పైపులైన్లను ఇంకా విస్తరించలేదు. ఈ శాఖ పరిధిలోనే ఆరువేలకు టాయిలెట్స్ నిర్మాణం కూడా మొదలెట్టారు. సుమారు రూ. 2 కోట్లతో విద్యుద్దీకరణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నెలకొల్పే పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ. 1.25 కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మాణం కొనసాగుతోంది. వీటిలో మొదటి విడత రూ. 83 లక్షలకు పనులు మంజూరుచేసినా తరవాత మరో రూ. 42 లక్షల పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తానికి పనులన్నీ నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని అధికారుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు సొంత పెట్టుబడితో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లకు ఇప్పటి పరిస్థితి మింగుడు పడడంలేదు. సగం పనులు పూర్తయినా నిధులు కొంతమేరకైనా విడుదల కాకపోవడంతో ఇక ఇక్కడితో ఆపివేస్తే అధికారులు దిగివస్తారనే అభిప్రాయంతో ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నిధులతో నిర్మాణాలు చేపట్టనున్నందున లాభార్జనపై ఆసక్తితో, రాజకీయ ప్రమేయంతో పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్లు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిధులు వస్తాయా, లేదా అన్నది ఇప్పటివరకు ఎటూతేలని సమస్యగా మిగిలిపోయింది. పనులను నిలిపివేస్తే అధికారులు, నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, నిధులు మంజూరు చేయిస్తారనే భావనతో కాంట్రాక్టర్లు ఉన్నారు. మరో వారం రోజులు ఇదేవిధంగా గడిచిపోతే నిర్మాణాల్లో నాణ్యత సంగతెలా ఉన్నా పనులు పూర్తికావడమే గగనమవుతుందని అధికారులు మధన పడుతున్నారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , Amaravati , Guntur , India , Kalachakra 2006 , Buddha Buddhist , stupa , Mahachaitya , Dalai Lama , Eenadu , December 2005 , tourist tourism , Tibet Tibetan , Sakyamuni , Mahayana , Theravada , Vajrayana
0 Comments:
Post a Comment
<< Home