'Da Vinci' రహస్యం ఏమిటి?
Photo courtesy: Rediff
వివాదాస్పద నవలతో హాలీవుడ్ చిత్రం
నిషేధం కోసం దేశంలో నిరసనలు
కేథలిక్ ప్రతినిధులు సరేనంటేనే విడుదల
మూడేళ్ల క్రితం అమెరికన్ రచయిత డాన్ బ్రౌన్ రచించిన 'డా విన్సీ కోడ్' నవల అప్పట్లోనే వివాదాస్పదమైంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఆరున్నర కోట్ల ప్రతులు అమ్ముడై సంచలనం సృష్టించింది. దీంతో ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో సోనీ స్టూడియో 12.5 కోట్ల డాలర్ల వ్యయంతో చిత్రాన్ని నిర్మించింది. గత ఏడాది ఈ చిత్రం ట్రెయిలర్‌ను ప్రదర్శించినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాల నిరసనలు వెల్లువెత్తాయి. అయినా నిర్మాతలు షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రానికి... రాన్ హోవార్డ్ (ఎ బ్యూటిఫుల్ మైండ్‌కు ఆస్కార్ గ్రహీత) దర్శకత్వం వహించగా... రెండు ఆస్కార్‌లు అందుకున్న ప్రఖ్యాత నటుడు టామ్ హ్యాంక్స్ కథానాయకుడిగా నటించారు. ఇది బుధవారం ప్రారంభమైన కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైంది. శుక్రవారం అంతర్జాతీయంగా లక్ష థియేటర్లలో విడుదల కానుంది.
ఆ వివాదం ఎందుకు?
క్రీస్తు జీవితం గురించి విస్మయకరమైన అంశాలే ఇందులోని ప్రధానాంశం. అసలు కథ ఆరంభంలోనే... పారిస్‌లోని విఖ్యాత లోవర్ పురావస్తు ప్రదర్శనశాల క్యూరేటర్ హత్యకు గురవుతాడు. మృతదేహం పడి ఉన్న తీరు, చనిపోయే ముందు అతడు ఉంచిన కొన్ని గుర్తుల ఆధారంగా... ఆయనేదో విషయం చెప్పదలచుకున్నట్లు క్యూరేటర్ పెంపుడు కూతురు సోఫీ నెవూ అర్థం చేసుకుంటుంది. ఈ కేసులో ఫ్రాన్స్ పోలీసులు అనుమానించిన అమెరికన్ ప్రొఫెసర్ రాబర్ట్ లాంగ్డన్ నిర్దోషని ఆమె గుర్తిస్తుంది. మతపరమైన సంజ్ఞలను (సింబాలజీ) విశ్లేషించడంలో నిపుణుడైన లాంగ్డన్‌తో కలిసి... తన తండ్రి చెప్పాలనుకున్న రహస్యాన్ని ఛేదించడానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని రచయిత ఉత్కంఠభరితంగా మలచారు. వారిద్దరి పరిశోధన నేపథ్యంలో క్రీస్తు జీవితం గురించి రాసిన విషయాలే వివాదానికి దారితీశాయి. అందులోని వివాదాస్పద అంశాలివీ...
* క్రీస్తుకు సంబంధించిన అత్యంత కీలక సమాచారం బయటకిరాకుండా ఉండేందుకే చర్చి అధికారులు క్యూరేటర్‌ను హతమార్చారు.
* సాధారణంగా క్రైస్తవుల విందుల్లో కన్పించే హోలి గ్రెయిల్ అంటే మద్యం సేవించే గ్లాసు కాదు. అది ఓ మహిళకు గుర్తు. ఆమె పేరు మేరీ మేగ్డలీన్. హోలి గ్రెయిల్ అంటే ప్రాచీన ఫ్రెంచ్ భాషలో 'రాజరికపు రక్తం' అని అర్థం. (లియోనార్డో డా విన్సీ గీసిన 'లాస్ట్ సప్పర్' చిత్రంలో ఈమె ఉంటుంది.)
* మేగ్డలీన్‌ను జీసస్ వివాహం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి చర్చి ఆమెపై వేశ్య అనే ముద్రవేసింది. (బైబిల్ ప్రకారం జీసస్ మరణం తర్వాత మూడోరోజున పునరుజ్జీవితుడై తొలిసారిగా మేగ్డలీన్‌కు కనిపిస్తారు.)
* జీసస్‌కు శిలువ వేసే సమయంలో ఆమె గర్భవతి. ఆయన మరణం తర్వాత మేగ్డలీన్ మార్సిలే ప్రాంతానికి వెళ్లి సారా అనే అమ్మాయికి జన్మనిచ్చింది.
* జీసస్ వంశక్రమాన్ని, రహస్యాలను కాపాడడానికి 'ప్రయరీ ఆఫ్ సియోన్' అనే రహస్య సంఘం ఏర్పడి... ఇప్పటికీ కొనసాగుతోంది.
* ఈ సంఘంలో చరిత్రకెక్కిన ప్రముఖులు కూడా సభ్యులుగా ఉండేవారు. వారిలో లియోనార్డో డా విన్సీ (మోనాలీసా చిత్రంతో పేరు పొందారు), ఐజాక్ న్యూటన్ (శాస్త్రవేత్త) తదితరులున్నారు.
* సంకేత భాషలో దిట్ట అయిన డా విన్సీ... జీసస్ జీవిత రహస్యాన్ని తన చిత్రాల్లో పరోక్షంగా సూచించేవాడు.
* ఈ రహస్యాన్ని అంతం చేయడానికి వాటికన్‌లోని కేథలిక్ మతాధిపతులే ఓపస్ డే (అమెరికాలో నిజంగానే ఉన్న క్రైస్తవ సంఘం) అనే మత సంఘం ద్వారా 'ప్రయరీ' సభ్యులను హత్య చేయిస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా రచయిత బ్రౌన్ చిత్రించారు.
* పైగా నవల ప్రారంభంలో 'ఇందులోని మొత్తం చిత్రాలు, పురాతన వస్తువుల ప్రస్తావన, పత్రాలు, రహస్య సంప్రదాయాలు అన్నీ వాస్తవాలు' అని చెప్పుకున్నారు.
భారతదేశంలోనూ...
ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న క్రైస్తవ సంఘాలు... ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కల్పితమేంటూ పేర్కొనాలని కోర్టుకెక్కాయి. భారతదేశంలోనూ ముంబాయి తదితర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గోవా ముఖ్యమంత్రి ప్రతాప్‌సిన్హ్ రాణే... రాష్ట్రంలో చిత్రాన్ని నిషేధించాలంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాస్తానని ప్రకటించారు. మరోవైపు 300 క్రైస్తవ సంఘాలు కేంద్రానికి వినతిపత్రాలు పంపాయి. కానీ సోమవారమే ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు... 'కేవలం కల్పితం' అనే ప్రకటన ఉంచాలని చెబుతూ 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించింది. బోర్డులో ముగ్గురు కేథలిక్ క్రైస్తవ సభ్యులు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో భారత కేథలిక్ చర్చిల సంఘం (సీసీఏఐ) అనుమతిస్తేనే ఈ చిత్రాన్ని భారతేశంలో విడుదల చేస్తామని మంగళవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రియరంజన్ దాస్‌మున్షీ ప్రకటించారు. అందుకోసం సంఘం ప్రతినిధులతో కలిసి బుధవారం చిత్రాన్ని చూశారు. కేథలిక్ ప్రతినిధుల అభిప్రాయాన్ని గురువారం మధ్యాహ్నంలోగా అందజేస్తారు. దీంతో విడుదలపై తుది నిర్ణయాన్ని అదేరోజు సాయంత్రంగానీ, శుక్రవారంగానీ సెన్సార్ బోర్డు ప్రకటిస్తుందని మున్షీ పేర్కొన్నారు. దక్షిణ కొరియాలో అయితే క్రైస్తవ సంఘాలు కోర్టుకు వెళ్లాయి. కానీ సినిమాను చూసిన ప్రధాన న్యాయమూర్తి విడుదలకు అనుమతిచ్చారు. ''నవల, సినిమా అభూత కల్పనలని తెలిసిపోతుంది. ప్రేక్షకుడు ఈ సినిమాను వాస్తవగాథగా భావించే అవకాశం లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారంపై పోప్ ఇప్పటిదాకా ప్రతిస్పందించకపోయినా వాటికన్ అధికారులు కొందరు ఈ సినిమాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Courtesy: ఈనాడు
(Photograph taken near Los Angeles International Airport)
0 Comments:
Post a Comment
<< Home