తేట తెలుగు మాటా పాటా
మీరు టీవీల్లో టామ్ అండ్ జెర్రీ, స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ వంటి కార్టూన్ బొమ్మల్ని సరదాగా చూసేస్తుంటారు కదా. కానీ ఇవన్నీ ఎక్కడో విదేశాల్లో పుట్టి, టీవీల ద్వారా మన దేశానికి వచ్చినవే. ఇవి కూడా ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాయి కానీ, వీటి అసలు భాష మాత్రం ఇంగ్లిషే. బొమ్మల్ని మాత్రం అలాగే ఉంచి మాటలను మార్చి ప్రసారం చేస్తారన్నమాట. దీన్నే అనువాదం (డబ్బింగ్) అంటారు.కదిలే బొమ్మల నోట...
తేట తెలుగు మాటా పాటా
!తేటతేట తెలుగు పదాలతో అందర్నీ ఆకట్టుకునే ఈ కథలు, పాటలు ఇప్పుడు కదిలే బొమ్మలుగా వచ్చేస్తున్నాయి. అంటే యానిమేషన్ రూపంలోకి అన్నమాట. వీటిని మన ఇంట్లోనే సినిమాల్లా చూస్తూ బోలెడు విషయాలు నేర్చుకోవచ్చు! ఆ వివరాలేంటో చూద్దామా!
* అనగనగా ఓ సోమరిపోతు. ఏ పనీ చేతగాదు. కానీ, చివరికి రాజకుమారి జబ్బు నయం చేసి, బోలెడు డబ్బు సంపాదిస్తాడు!
- ఇది ఒక పేదరాశి పెద్దమ్మ కథ.
* ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు... చూడ చూడ రుచుల జాడ వేరు!
- ఇది ఒక వేమన పద్యం!
* ఏనుగు ఏనుగు నల్లన... ఏనుగు కొమ్ములు తెల్లన!
- ఇది ఒక సరదా గీతం!
మరి మనకి తెలిసిన పాత్రలు... అమ్మమ్మ, తాతయ్య చెప్పే కథలు అన్నీ మనం చిన్నప్పటి నుంచి మాట్లాడే తేట తెలుగులో ఆడి, పాడితే ఎంత బాగుంటుందో! అలా అనగానే మీకు 'ఈటీవీ'లో వచ్చే 'పంచతంత్రం' గుర్తొచ్చిందా? బోలెడు బొమ్మల్ని తయారు చేసి, వాటిని కదిలించి తీసిన కథ అది. తెలుగులో మాటాడుతున్నాయి కాబట్టే అవంటే మనకంత ఇష్టం.
టీవీ కార్యక్రమాలనైతే అవి వచ్చినప్పుడే మనం చూడాలి. కానీ, మనకి కావలసినప్పుడల్లా చూడాలంటేనో? ఇటువంటి పిల్లల కథలు వీసీడీల్లో వస్తే బాగుండు అనుకుంటున్నారా? ఇప్పుడు అటువంటివి కూడా వస్తున్నాయి మరి. టీవీకి అనుసంధానంగా ఉండే సీడీ ప్లేయర్‌లో ఆ సీడీలను పెడితే వెంటనే అందులోని బొమ్మలన్నీ టీవీలో కనిపిస్తాయి. టూని ఆర్క్స్ వాళ్ళు ఇప్పటికే చిన్నారి చిట్టి గీతాలు అనే పిల్లల పాటలను సంగీతంతో కూర్చి సృష్టించారు. ఇప్పుడు సరికొత్తగా చిన్నారి బాలశిక్షను విడుదల చేశారు. త్వరలోనే పేదరాశిపెద్దమ్మ కథను కూడా సీడీగా తీసుకువస్తున్నారు.
బొమ్మల బాలశిక్ష!
వర్ణమాల, వారాలు, కూరగాయలు, పండుగలు, శరీరభాగాలు, మా పల్లెటూరు వంటి 22 అంశాలతో 'చిన్నారి బాలశిక్ష' ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. మరి అన్నీ కూడా చిన్న చిన్న పాటలతో, మంచి సంగీతంతో, అందమైన బొమ్మలతో ఉన్నాయిగా. ఇందులో అయిదు వేమన పద్యాలు కూడా ఉన్నాయండోయ్.
భారతం కథలు!
మహాభారతంలోని కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, అర్జునుడి కథలను ఆదిత్యా మ్యూజిక్ వాళ్ళు యానిమేషన్ సీడీలుగా తీసుకువచ్చారు. వీటిని చూస్తూ వారి గొప్పతనమేంటో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా... 'చిట్టి చిలకమ్మ' అనే పిల్లల పాటలను కూడా వీళ్ళే రూపొందించారు. మనం పాడుకునే చిన్న చిన్న పాటలు ఇందులో ఉంటాయి.
పిల్లాడి ఆలోచనే!
నిజానికి పేదరాశి పెద్దమ్మ కదిలే బొమ్మల కథ ఆలోచన ఒక పిల్లాడిదే! టూని ఆర్క్స్‌ని స్థాపించిన ప్రదీప్ మామయ్య అప్పటికే చిట్టిపొట్టి గీతాలు అనే వీసీడీనీ రూపొందించాడు. అది చూసిన ఓ కుర్రాడు ప్రదీప్‌కి పేదరాశి పెద్దమ్మ కథ ఒకటి చెప్పి, పాటల లాగానే దానిని కూడా యానిమేషన్‌లో ఎందుకు తీయగూడదని అడిగాడు. ప్రదీప్ మామయ్య 'సరే' అన్నాడు. వాటిలోని శుంఠాచారి కథనే యానిమేషన్ రూపంలో తీస్తున్నారు.
ఏమిటీ కథ?
శుంఠాచారి సోమరిపోతు. ఏ పనీ చేయడం చేతగాదు. తెలివి తక్కువ పనులతో అందరితోనూ తిట్లు తినేవాడు. ఒకసారి రాజుగారి కూతురికి జబ్బు చేస్తుంది. నయం చేసే మూలిక ఎక్కడో కొండ గుహలో, రాక్షసుడి దగ్గర ఉంటుంది. దానిని తెచ్చిన వారికి సగం రాజ్యం ఇవ్వడంతో పాటు కూతురిని ఇచ్చి పెళ్ళి చేస్తానని ప్రకటిస్తాడు. అప్పుడు తల్లి అన్న మాటలకు రోషం తెచ్చుకొని మూలిక తేవడానికి అడవిలోకి వెళ్తాడు శుంఠాచారి.
అడవిలో గోతిలో పడిన పులిని శుంఠాచారి కాపాడితే, అది రాక్షసుడి గుహకు చేరుకునే దారి చూపిస్తుంది. గుహలో ఒక విగ్రహాన్ని తాకగానే అందమైన అమ్మాయిగా మారుతుంది. వేణువు ఊదితే రాక్షసుడు నిద్రపోతాడని, అప్పుడు మూలిక తీసుకుపోవచ్చని రహస్యం చెబుతుంది ఆ అమ్మాయి. చివరికి మూలికతో పాటు ఆ అమ్మాయిని కూడా వెంటబెట్టుకొని ఊరుకి వచ్చేస్తాడు. మూలికతో రాజకుమారి జబ్బు నయం చేస్తాడు. ముందు సోమరిపోతు అయినా... చివరికి తెలివితేటలతో మంచివాడుగా మారిపోతాడు శుంఠాచారి. మాటలు, పాటలతో సాగే ఈ కథ చూస్తుంటే భలేగా ఉంటుంది లెండి.
40,000 బొమ్మలు!
ముప్పై నిమిషాల నిడివి గల ఈ చిత్రం కోసం మొత్తం 40,000 బొమ్మల్ని చేత్తో గీశారు! వాటిని కంప్యూటర్‌లోకి ఎక్కించి, నేపథ్య దృశ్యాలను కలిపారు. ఈ సీడీని తీయడానికి సుమారు ఆరునెలలు పట్టింది. అది కూడా 13 మంది ఐదున్నర నెలల పాటు పనిచేస్తే!
Courtesy: ఈనాడు
Telugu Andhra Pradesh Hyderabad theta eenadu May 2006 maata paata mata pata pure accha
0 Comments:
Post a Comment
<< Home