Interview with SemIndia president Vinod Aggarwal
'న్యూస్‌టుడే' ప్రత్యేక ఇంటర్వ్యూలో
సెమ్‌ఇండియా ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల

ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. నెలన్నర, రెండు నెలల్లో మొత్తం వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాతే ప్రాజెక్టు శంకుస్థాపన ఉంటుంది. రెండున్నర, మూడేళ్లలో ప్రాజెక్టు తొలి దశ పనిచేయడం ప్రారంభిస్తుంది.
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటి పడినా... హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?
భారత్‌లో ఫ్యాబ్ సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాగానే నాలుగైదు ప్రాంతాలను పరిశీలించాం. చివరకు దక్షిణాదిలోని ఈ మూడు రాష్ట్రాలు రంగంలో మిగిలాయి. చిప్‌ల తయారీకి ప్రధానంగా మౌలిక సదుపాయాల అవసరం చాలా ఉంటుంది. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న వసతులు నచ్చాయి. కొత్తగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటం, విశాలమైన రోడ్లు, ప్రభుత్వ సానుకూల ధోరణి, అన్నింటికీ మించి సుశిక్షితులైన నిపుణులు అందుబాటులో ఉండటం తదితర అంశాలు ప్రధానంగా ఆకర్షించాయి.
ఫ్యాబ్ సిటీ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒనగూడే ప్రయోజనాలు...!
చాలా ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా చిప్‌ల తయారీకి వేదికగా నిలుస్తుండటం ఆంధ్రాకు ప్రత్యేకంగా కలిసిరానుంది. ఈ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదిగేందుకు హైదరాబాద్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు ఏర్పాటుతో ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చిప్‌ల తయారీకి సంబంధించి వందల సంఖ్యలో అనుబంధ సంస్థల ఏర్పాటవుతాయి. పదేళ్ల కాలంలో దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది.
దేశంలో మొట్టమొదటిదైన ఈ తరహా ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన సహకారాన్ని అందిస్తున్నాయి.
ఈ తరహా ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ సాయం తప్పనిసరి. ప్రాజెక్టులో పెట్టుబడి ద్వారా వాటా తీసుకునేందుకు కేంద్రం ఆసక్తి కనబర్చింది. ఈ మేరకు బడ్జెట్లో చిదంబరం ప్రకటన కూడా చేశారు. కేంద్రం 25 కోట్ల డాలర్లు (రూ. వెయ్యి కోట్లు పైనే) పెట్టుబడి పెడుతుందని అంచనా వేస్తున్నాం. అయితే... దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వాస్తవానికి... చిప్‌ల తయారీకి భారత్ సంసిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారా?
ఏ రంగంలోనూ ముందుగా సంసిద్ధంగా ఉండటం అంటూ ఉండదు. ఎవరో ఒకరు ముందడుగు వేయాల్సి ఉంటుంది. దేశంలో చిప్‌ల తయారీ విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఇలాంటిదే. చిప్‌ల తయారీ ఇప్పటివరకు ఇక్కడ జరగకపోయినా... ఈ రంగానికి సంబంధించిన అనేక మంది భారతీయ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీరందరినీ ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం ఫలిస్తే భవిష్యత్తులో దేశంలో మరిన్ని ఫ్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకు వస్తాయి. రావాలనే మేమూ కోరుకుంటున్నాం.
ఫ్యాబ్ సిటీ ఏర్పాటుకు సంబంధించి భారత్‌లో ఉన్న అవకాశాలు, సవాళ్లను విశ్లేషిస్తారా?
ఎలక్ట్రానిక్ వస్తువులకు భారత్ అతిపెద్ద విపణి. ఈ వస్తువులలో (మొబైల్ ఫోన్‌లు మొదలుకొని కంప్యూటర్ల వరకు) ఉపయోగించే చిప్‌ల కోసం ఇప్పుడు చైనా, కొరియా, తైవాన్, సింగపూర్ తదితర దేశాలపై ఆధారపడుతున్నాం. చిప్‌ల తయారీని ఇక్కడే చేపట్టడం వల్ల మన మార్కెట్ అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే... దేశంలో ఈ పరిశ్రమకు ఇవి తొలి అడుగులు కావడం వల్ల అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తక్కువ ఖర్చుతో నాణ్యత కలిగిన చిప్‌లను తయారు చేయగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోగలుగుతాం. దీనికి సరైన మౌలిక సదుపాయాల అవసరం చాలా ఉంటుంది.
|
Courtesy: ఈనాడు
Telugu Andhra Pradesh Hyderabad Silicon chip semiconductor Fab City 2006 Eenadu
0 Comments:
Post a Comment
<< Home