తెలుగు భాష-ఒక పరిశీలన
Tuesday February 28 2006 17:05 IST
సకల జీవరాశిలో మానవుడు ఒక్కడే తన భావాల్ని వాగ్రూపంలో వ్యక్తం చేయగలడు. మానవుడు తన మనస్సులోని అభిప్రాయాల్ని, ఆలోచనల్ని బహిర్గతం చేయడానికి ముఖావయంతో చేసే అర్థవంతమైన ధ్వనుల సముదాయం భాష. భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చిన 'భాష' అనే పదానికి మాట్లాడబడేది అని అర్థం. 'భాష్యతే ఇతి భాషా' భాషింపబడేది భాష. మనిషికి ఉన్న అద్భుతమైన శక్తి మాటలాడటం. భావ వ్యక్తీకరణమే భాష. దేశకాల ప్రాంతాది భేదాల్ని బట్టి ఆయా జాతి జనుల ఉచ్ఛారణా భేదాల్ని బట్టి వేర్వేరు రూపాల్ని పొంది వైవిధ్యాన్ని పొందిందని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం. దీనినే 'ఏకమూల భాషావాదం' అని అంటారు. ప్రారంభంలో అనేక భాషలు పుట్టి క్రమక్రమంగా ఎక్కువ భాషలయ్యాయని కొందరు భాషావేత్తలు అభిప్రాయపడ్డారు. దీనినే 'బహుమూల భాషావాదం' అంటారు.
1906లో అప్పటి ప్రభుత్వం భారతీయ భాషలపై సమగ్రమైన పరిశోధన చేయించాలనే ఉద్దేశంతో ప్రముఖ భాషా శాస్త్రవేత్త సర్ జార్జ్ గ్రియర్సన్‌ను ప్రధాన సంపాదకుడిగా నియమించింది. ఆయన కృషి ఫలితంగా హిందూ దేశపు లింగ్విస్టిక్ సర్వే అనే పేరుతో పదకొండు సంపుటాలుగా 1927లో ముద్రించబడ్డాయి. ఒక భాషని ప్రాచీన భాషగా నిర్ణయించాలంటే ఆ భాషకి కొన్ని లక్షణాలుండాలని కమిటీల వారు సూచించారు. ఆ భాషలో వెయ్యేళ్ళ కిందటే లిఖిత సాహిత్యం ఉండాలి. ఆ సాహిత్యం ఇతర భాషల నుంచి తెచ్చుకున్న అనువాదాల వంటిది కాక ఆ భాషలోనే పుట్టినదై ఉండాలి. ఈ విధమైన లక్షణాలు ఉంటే ఆ భాషను ప్రాచీన భాషగా చెప్పవచ్చు. ప్రాచీనత్వం హోదాని సంపాదించడం వల్ల వచ్చే డబ్బుతో ఎలాంటి పనులు మాత్రమే చేయాలో తెలిస్తే ఏ భాషాభిమానులైనా తెల్లమొహం వేసుకోవాల్సిందే. దీని ద్వారా వచ్చిన డబ్బును ప్రాచీన సాహిత్య ప్రచారానికే ఉపయోగించాలి. ప్రాచీన సాహిత్యాన్నే ముద్రించాలి. దీనిని నిలిపి ఉంచడమూ తర్వాత తరాల వారికి అందేలాగ చేయడమూ మంచిదే. కొన్ని భాషలనే ప్రాచీన భాషలుగా గుర్తించి వాటి కోసమే కోట్ల డబ్బును ధారాదత్తం చేయడం అంటే అంత ప్రాచీన లిఖిత సాహిత్యం లేని భాషల మాట ఏం కావాలి. ప్రాచీన లిఖిత సాహిత్యం కొన్ని భాషలకే ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని భాషల లక్షణాలనే నియమాలుగా పెట్టడం మిగిలిన భాషలకు అన్యాయం చేయడం కాదా. గ్రాంథిక భాష అనేదాన్ని నిన్నటి దాకా చదివినా స్పందించలేము. ఈనాడు సాహిత్యం అంతా వాడుక భాషా రూపంలోకి మారిపోయింది. ఒక భాషకి ప్రాచీన భాష హోదా ఇవ్వడం అంటే దాని వల్ల ఆ భాషో సహా అన్ని భాషలకు హాని జరుగుతుంది. ఆ హోదాని పొందిన భాష ప్రజల్లో అన్ని భాషల కన్నా తమ భాషే గొప్పది అనే తప్పుడు భావం ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తమిళ భాషను ప్రాచీన భాషగా గుర్తించడానికి దారితీసిన నేపథ్యం కూడా ప్రధానంగా రాజకీయమే. తమిళ జాతీయవాదానికి ప్రతీకగా ఉన్న అక్కడి ప్రధాన రాజకీయ ద్రవిడ మున్నేట్ర కజగం తెచ్చిన ఒత్తిడి కేంద్ర నిర్ణయానికి కారణం. తమ భాష విషయంలో తమిళులది వీరాభిమానం. అలాగని పిడివాదంతో ఇంగ్లీషుని కాదనే తత్వం కూడా వారికి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో సారా ఉద్యమం లాంటి ఉద్యమం భాషపైరావాలి. అలాంటి చైతన్యమే ఇప్పుడు అవసరం. కొన్నేళ్ళ క్రితమే భాషోద్యమ సమాఖ్య పేరుతో సి. ధర్మారావు, సామల రమేష్‌బాబు, బుద్ధప్రసాద్ మొదలగు భాషాభిమానులు నెమ్మదిగా గళం విప్పారు. తెలుగు భాషను బ్రతికించుకునే ఉద్యమం కూడా అలాగే ప్రజల నుంచి రావాలి.
ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక తీసుకు రావడానికి అధికార భాషా సంఘం చురుకుగా పనిచేస్తున్నది. వ్యక్తులను బట్టి సంస్థలకు ఎలా ప్రాణం వస్తుందో ఎబికె ప్రసాద్ రుజువు చేస్తున్నారు. ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలన్న ఉద్యమం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు నిద్ర లేచింది. తమిళానికి కేంద్రం ఆ హోదా కల్పించిన తర్వాతనే, ఆవేశంలో మనకంటే నెమ్మదస్తులు అనుకునే కన్నడీయులు ఈ విషయంలో ప్రభుత్వాన్ని కదిలించగలిగారు. తెలుగు విశ్వవిద్యాలయం సమావేశంలో తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రాచీనతను మెచ్చుకుంటూనే ఎంపి సురవరం సుధాకర రెడ్డి మాట్లాడుతూ తమిళానికి ఇచ్చారని ఫిర్యాదులు చేయడం కంటె రుజువులు సేకరించి మన భాషకు అలాంటి గౌరవం తెచ్చుకోవాలనే విషయంపై ప్రధాన దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు.
సమాజం ఏకతాటిపై నడిచినపుడు సమస్య పరిష్కారమై మాతృభాషా వికాసం చెందుతుందని డాక్టర్ ఎస్‌ఎస్ రాజు పేర్కొన్నారు. వ్యక్తులకు భాష ద్వారాను, భాషలకు వ్యక్తుల ద్వారా విలువ సంక్రమిస్తుంది. అన్య భాషలకు అనవసర ప్రాముఖ్యాన్ని కల్పించడం చేత స్వభాష కంటే ఇంగ్లీషు, హిందీ భాషలు విశిష్టమైనవనే భావం కలుగుతుంది. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు కోసం తాపత్రయం పడడం కంటె దానిని ఆధునిక భాషగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తే కొంత మేరకు విజయం సాధించగలుగుతాం. తెలుగు భాషాభిమానులందరూ తెలుగు మధురమైన భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ ఇన్నాళ్ళూ భాషా దురహంకారాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అందుచేత తెలుగు భాషాభిమానులందరూ తమ వంతు కర్తవ్యంగా భాషా ఉద్యమంలో పాల్గొంటూ సమాజంలోని యువతను భాష పట్ల ఆకర్షితులను చేయడానికి వీలైన భాషా సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య గోష్ఠులు ఏర్పాటు చేయాలి. తద్వారా భాషకు ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి అవకాశం ఏర్పడుతుందని ఆశిద్దాం.
- జి. ప్రవీణ్‌కుమార్
Courtesy: ఆంధ్ర ప్రభTechnorati tags: Telugu,తెలుగు
0 Comments:
Post a Comment
<< Home