ప్రాచీన హోదా తెలుగుకు లేదా?
వి.లక్ష్మణరెడ్డి
ఐక్య ప్రగతిశీల కూటమి (యు.పి.ఎ.) ప్రభుత్వం కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన్న మేరకు తమిళ భాషను ప్రాచీన భాషగా ఇటీవల ప్రకటించింది. అలా ప్రాచీనభాష హోదాను పొందిన భాషకు కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం లభిస్తుంది. అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఆ భాషాపీఠాలను స్థాపిస్తారు. ఆ భాష పురోగతికి తోడ్పడే ఒక బోర్డును ఏర్పాటుచేస్తారు. మూడు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంటు' అవార్డులు ఆ భాషా విద్వాంసులకు అందజేస్తారు. ఒక్కో అవార్డు కింద లక్ష రూపాయలు అందజేస్తారు. అందులో రెండు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ఆ భాషకు ఉదాత్త సేవలందించిన జాతీయ స్థాయి విద్వాంసులకు యాభైవేలు విలువ చేసే అయిదు అవార్డులు అందజేస్తారు. పది డాక్టోరల్ ఫెలోషిప్‌లూ, అయిదు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లూ ఆ ప్రాచీన భాషా పరిశోధకులకు అందజేస్తారు. అంతేకాక, మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థలో ఆ ప్రాచీన భాషకు సంబంధించి మహోన్నత పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ పరిశోధన ఆ భాషాభివృద్ధికి సంబంధించి ఉంటుంది. ఇలా ప్రాచీన భాషగా గుర్తింపు పొందాలంటే 1000 సంవత్సరాల సాహిత్యం ఉండాలని, ఆ భాషపై ఇతర భాషల ప్రభావం ఉండరాదని కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని విధించింది.
తెలుగు అత్యంత ప్రాచీన భాష. ఈ భాష క్రీస్తు శకారంభానికే వ్యాప్తిచెంది ఉండేది. శాతవాహనులూ, ఇక్ష్వాకులు మొదలైన రాజవంశాలవారు వేసిన ప్రాకృత శాసనాలలో తలవర, తగవర- లాంటి తెలుగు పదాలు కన్పిస్తాయి. తలవర శబ్దం తలారి రూపం దాల్చింది. ప్రాచీన కాలంలో ఆ శబ్దానికి సేనాపతి, నాయకుడు అనే అర్థాలుండేవి. తరవాత కాలంలో గ్రామంలోని 'వెట్టి' అనే అర్థం వాడుకలోకి వచ్చింది. న్యాయాధీశుడనే అర్థంలో తగవర శబ్దం ప్రయోగంలో ఉండేది (ఆచార్య లక్ష్మీరంజనం). హాల శాతవాహన చక్రవర్తి (క్రీ.శ. 19-24) కూర్చిన ప్రాకృత గ్రంథం 'గాథాసప్తశతి'లో అత్త, అమ్మి, అందము, పొట్ట, పాడి- లాంటి తెలుగు పదాలు కన్పిస్తాయి (తిరుమల రామచంద్ర). ఆకాలంలో దేశ భాష అయిన తెలుగు జనవ్యవహారంలో ప్రాచుర్యం పొందింది.
తూర్పు చాళుక్యులు క్రీ.శ. ఏడో శతాబ్దం నుంచి తెలుగు గడ్డను పాలించటం ప్రారంభించారు. ఆ రాజులు దేశ భాష అయిన తెలుగును ఉద్ధరించి మహోపకారం చేశారు. తెలుగు భాషకు 'వంగిలిపి'ని ప్రసాదించారు. వీరు శాసనాలను తెలుగులో వెలువరించి ప్రజాభ్యుదయ దృష్టిని ప్రదర్శించారు. ఈ కాలంలోనే కడప, కర్నూలు ప్రాంతాలను పరిపాలించిన రేనాటి చోడులు రాజశాసనాలను జనుల వాడుక భాషలో ప్రకటించారు. ఇలా వెలువడిన తెలుగు శాసనాలు గద్య, పద్యాలతో కూడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో తెలుగులో దేశికవితలు వెలువడటానికి దోహదం చేసినవారు తూర్పు చాళుక్యులే (దేశి కవిత పుట్టించి తెనుంగున నిలిపిరి... జనచాళుక్యరాజు మొదలుగ పలువుర్ -నన్నెచోడ కవి).
దీన్నిబట్టి నన్నయకు అయిదువందల సంవత్సరాలకు పూర్వమే తెలుగులో శాసనసాహిత్యం రూపుదిద్దుకుందనటం స్పష్టం. వెయ్యేళ్ల నుంచి సాహిత్య గ్రంథాలున్నాయి. తెలుగు జన్మించి కనీసం మూడువేల సంవత్సరాలు గడిచింది. 1500 సంవత్సరాల నుంచి సాహిత్యం ఉంది. కాబట్టి సుదీర్ఘ సాహిత్య చరిత్ర ఉన్న తెలుగు భాషను కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషగా గుర్తించాలి. తెలుగులో వెలువడిన శాసనాలను ప్రాతిపదికగా తీసుకుని తెలుగు సాహిత్య ఆవిర్భావాన్ని నిర్ణయించాలి. ప్రాచీన భాషల జాబితాలో చేర్చాలి.
ప్రాచీన భాషగా గుర్తింపు పొందటానికి ఆ భాషపై ఇతర భాషల ప్రభావం ఉండరాదనే నిబంధన అశాస్త్రీయమేగాక, అందులో వాస్తవిక దృక్పథమూ లేదు. భాషల్లో పరస్పర ఆదాన ప్రదానాలు- అంటే ఇచ్చి పుచ్చుకోవడాలు- సహజసిద్ధమని భాషా శాస్త్రవేత్తల ఏకగ్రీవాభిప్రాయం. అలాంటి ఆదాన ప్రదానాలు ధ్వనులూ, పదాలూ, వాక్యాలూ, సాహిత్యరీతులూ మొదలైనవాటికి సంబంధించి ఉంటాయి.
భారతీయ భాషల్లో సంస్కృతం, ఆంగ్లం మొదలైన భాషల ప్రభావం పడని భాషలు లేవు. తమిళభాషలోకి సంస్కృత, ఆంగ్లభాషల ధ్వనులనూ, పదాలనూ దిగుమతి చేసుకోవటం కోసం 'గ్రంథలిపి'లోని కొన్ని రాత గుర్తులను తీసుకున్నారు. 'ఐస్'లాంటి ఆంగ్లపదాలను ఆ గుర్తులతోనే తమిళభాషలో రాస్తారు. ఇతర భాషల ప్రభావం సోకని భాష ఏదీ కూడా ఉండదనేది నిర్వివాదం. తమిళభాషపై ఇతర భాషల ప్రభావం లేదని భావించి తమిళానికి ప్రాచీనభాషా హోదా కల్పించి, ఇతర భారతీయ భాషలకు ఆ హోదా లేకుండా చేయటానికి ఈ కృతక నిబంధన ఏర్పరచినట్లు భావించాలి. తమిళం మీదకూడా ఇతర భాషల ప్రభావం బాగానే ఉంది. ఉదాహరణకు కిటికీ అనటానికి తమిళులు 'జనల్' అంటారు. ఇది పోర్చుగీసు భాషా పదం (ఆచార్య దొణప్ప). మడులూ, దడులూ భాషా విషయాల్లో పాటించటం అసాధ్యం. శుద్ధ తమిళోద్యమం, అచ్చతెలుగు ఉద్యమం- ఎలా విఫలమయ్యామో అందరికీ తెలుసు. సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త సునీతకుమార ఛటర్జీ హింద్వార్య భాషలపై దక్షిణాది భాషల ప్రభావాన్ని ఎంతో చక్కగా వివరించారు. కాబట్టి తమిళేతర భాషలకు ప్రాచీన భాష ప్రతిపత్తి లేకుండా చేయటం కోసం ఈ నిబంధనను ప్రవేశపెట్టారేమోననిపిస్తోంది. మరో విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించవలసి ఉంది. తమిళాన్ని దేశంలో ద్వితీయ అధికార భాషగా చేయాలని ఆశించడం మరింత దారుణం. అలాంటి హోదాను ఏ భాషకైనా కల్పించాల్సి వస్తే అది- భారతదేశంలో మాట్లాడే భాషల్లో ద్వితీయ స్థానంలో ఉన్న తెలుగుకే దక్కాలి.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కన్నడ భాషను ప్రాచీన భాషల జాబితాలో చేర్చాలని పట్టుదలగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో- మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీ విభేదాలకు అతీతంగా కృషి చేసి, కేంద్రం తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించేలా చూడాలి.
బాసరలో ఐ.ఐ.టి. స్థాపించే విషయంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది. ఇప్పటి యు.పి.ఎ. ప్రభుత్వం కూడా న్యాయం చేయటంలేదు. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించే విషయంలోనైనా అలాంటి అన్యాయం జరగకుండా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భావితరాలు మనల్ని క్షమించవు.
Courtesy: ఈనాడుKeywords: Telugu , Andhra Pradesh , ancient classical language status demand , TCLD2006 , India Indian
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home