సరికొత్త అందాల ఆధ్యాత్మిక నగరి!
* అమరావతికి నూతన శోభ
* పెరిగిన బౌద్ధుల సంచారం
* సేదదీరేందుకు ప్రత్యేక వసతుల ఏర్పాటు
* అన్ని అంశాల్లో ప్రతిఫలిస్తున్న టిబెటన్ల శైలి
* 'కాలచక్ర-2006' విశేషాలు
న్యూస్‌టుడే-అమరావతి
భిన్న సంప్రదాయాలు.. సంస్కృతి ఎక్కడ కన్పించినా వైవిధ్యంగా ఉంటుంది. కాలచక్ర ఉత్సవాల కోసం సిద్ధమవుతున్న అమరావతిలో ప్రస్తుతం ఇలాంటి వాతావరణమే కన్పిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లలో వేగం మందగించినా సందర్శకులు, దలైలామా రాక కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ నుంచి వచ్చిన బౌద్ధుల సంచారంతో ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకొంది. కాలచక్ర బోధనల వేదిక, గుడారాలు, అలవాట్లలోనూ అడుగడుగునా టిబెటన్ల సంస్కృతి కన్పిస్తోంది. వసతి ఏర్పాట్ల సందర్భంగా వారు తీసుకువచ్చిన సామగ్రి, చేస్తున్న హడావుడి అమరావతి ప్రజల్ని ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
తేనీటి ఆతిథ్యం
కాలచక్ర బోధనల కోసం వచ్చే బౌద్ధులు, సాధారణ ప్రజల కోసం 'మేడిన్ టిబెట్' టీ అమరావతికి వచ్చేసింది. హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మార్లు నిర్వాహకులు వీటిని ఇస్తారు. టిబెటన్ టీ అంటే మాటలా.. మనకులా ఇందులో పంచదార, తేయాకు ఉండదు. కొద్దిగా ఉప్పు మాత్రమే వేస్తారు. తేయాకు బదులుగా టిబెట్ ప్రాంతాల్లో పండే ఆకుల రసాన్ని ముద్దగా చేసి, ఆరబెట్టిన దాన్ని అందులో వేస్తారు. పాలతో పాటు వెన్న, నెయ్యితో ఘుమఘుమలాడే టీని అతిథులకు ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా 3 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న 5 పెద్ద పాత్రలను తీసుకువచ్చారు. వారిదైన శైలిలో టీ జగ్గులు కూడా దిగుమతి అయ్యాయి.
సేదతీరేందుకు వసతి సిద్ధం
దలైలామా బోధనలు వినేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రముఖులు ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు. మరి అంతమందికి వసతి సౌకర్యమేదీ.. అన్న అనుమానాలకు తావులేకుండా నార్బులింగా ఇన్‌స్టిట్యూట్ వారు తాత్కాలికంగా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. హోటళ్లలో మాదిరే సాధారణ స్థాయి నుంచీ ఏసీ సూట్ల మాదిరిగా సాధారణ గుడారాల నుంచి ఏసీ లగ్జరీ టెంట్ల వరకూ సిద్ధంచేశారు. అయితే ధర కూడా అంతే స్థాయిలో ఉంది. పదిహేను రోజులకు లక్ష రూపాయలు చెల్లించాలి. కాలు కదపకుండా అన్ని సౌకర్యాలూ టెంట్‌లోనే ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ నుంచి నిపుణులు వచ్చారు. లోపల కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. లాంతర్లలో విద్యుత్తు దీపాలు, టీపాయ్‌లు, మగ్గులు ఇలా అన్నీ టిబెటన్ల సంప్రదాయలకు అనుగుణంగా ఉన్నాయి. ధరణికోటలోని రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు డిగ్రీ కళాశాల వెనుక సాధారణ సందర్శకుల కోసం గుడారాలను సిద్ధం చేస్తున్నారు. వర్షం వచ్చినా తడవకుండా ఉండేలా ప్రత్యేకమైన గుడ్డతో వీటిని తయారు చేస్తున్నారు.
రోడ్లకు తుది మెరుగులు
అమరావతి-సత్తెనపల్లి, గుంటూరు-అమరావతి రోడ్లను దాదాపు పూర్తిచేశారు. కొన్ని చోట్ల తుది మెరుగులు దిద్దుతున్నారు. అమరావతి పట్టణంలో అంతర్గత రోడ్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. మంచినీటి సౌకర్యం కోసం కొత్తగా వేస్తున్న పైప్‌లైన్ల ఏర్పాటు మరో పది రోజుల్లో పూర్తి కానుంది.
*****
కాలచక్ర మహాసభలకు అంతర్జాతీయ కళాకారులు
జిల్లా పరిషత్తు, డిసెంబరు 14 (న్యూస్‌టుడే): అమరావతిలో జరగనున్న కాలచక్ర మహాసభల్లో తమ కళా నైపుణ్యాలతో సందర్శకులను అలరించడానికి అంతర్జాతీయ కళాకారులు రానున్నారు. ఇప్పటికే వారు తమఅంగీకారాన్ని నిర్వాహకులకు తెలిపారు. జనవరి 4 నుంచి 16 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు. ప్రతిరోజు రాత్రి ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు కళా రూపాలు ప్రదర్శిస్తారు. అమరావతిలో ఇందుకోసం ప్రత్యేక వేదిక నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ కళాకారుల ప్రదర్శనలతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంస్కృతి, సంప్రదాయాల వైశిష్ట్యాలు తెలిపేలా జానపద, నృత్య ప్రదర్శనలు ఇవ్వటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ నర్తకి శోభానాయుడు, రాధారెడ్డి, రాజారెడ్డి, స్వాతి సోమనాథన్, జొన్నలగడ్డ అనూరాధ, రమాదేవి, సౌలవరపు కోటేశ్వరరావులు కూచిపూడి నాట్యంతో బౌద్ధ అంశాలపై ప్రదర్శనలు ఇస్తారు. డాక్టర్ ఆనందశంకరరావు భరత నాట్యం, ఆంధ్ర జానపద నృత్యాన్ని సంపత్ కుమార్ బృందం, ఒడిస్సీ నృత్యకారణి నాదినీలు కూడా ప్రదర్శనలు ఇవ్వడానికి సమ్మతి వ్యక్తం చేసినట్లు జిల్లా అధికారులకు సమాచారం అందింది. కాలచక్ర సాంస్కృతిక కమిటీ సభ్యులు, డ్వాక్వా పి.డి. బొమ్మిరెడ్డి రాజశేఖరరెడ్డి, ఇతర సభ్యులు, జిల్లా హౌసింగ్ డి.ఎం. వి.శరత్‌బాబు, డి.టి.డబ్ల్యు.ఒ. ఎస్.రామరాజు, డి.ఆర్.డి.ఎ. ప్రతినిధితో కలిసి బుధవారం తన ఛాంబర్‌లో ఏర్పాట్లపై సమీక్ష చేశారు. అనంతరం 'న్యూస్‌టుడే'తో రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక రచిస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులుపొందిన కళాకారుల ప్రదర్శనలకు ధీటుగా ఆంధప్రదేశ్ సంస్కృతిని కళారూపాలు స్థానిక కళాకారులతో ప్రదర్శించడానికి అవకాశం కలగజేస్తామన్నారు. ఉత్సాహవంతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వివరించారు.
Courtesy: ఈనాడు గుంటూరు ఎడిషన్, 15 Dec '05
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005
0 Comments:
Post a Comment
<< Home