అమరారామంలో బౌద్ధుల సంచారం..
కన్పిస్తోన్న 'కాలచక్ర' కళ..!
న్యూస్‌టుడే-అమరావతి
దలైలామ ప్రసంగించనున్న వేదిక నిర్మాణం.. అతిథుల కోసం ఏర్పాట్లు..శరవేగంగా పూర్తవుతున్న ధ్యానబుద్ధుడి విగ్రహం.. వెరసి అమరావతిలో కాలచక్ర కళ కన్పిస్తోంది. మరో పద్దెనిమిది రోజుల్లో మొదలవనున్న అంతర్జాతీయ స్థాయి వేడుకను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్న బౌద్ధులతో ఇక్కడ సందడి నెలకొంది. భారీ యంత్రాలు.. వందల సంఖ్యలో పనివారు ఒకవైపు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉండగా, అతిథులకు ఆహ్వానం పలికేందుకు ధర్మశాల నుంచి వచ్చిన బౌద్ధులు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. కాస్తంత ముందుగా వచ్చి ఇక్కడ జరుగుతున్నదేంటో పరిశీలిద్దాం అనుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ సన్యాసులు వస్తున్నారు.
ఇళ్ల కోసం వేట..
దూర ప్రాంతాల నుంచి వస్తున్న బౌద్ధులు అత్యవసర వసతి కోసం ఇళ్లను వెతుక్కుంటున్నారు. అమరావతిలో దిగీ దిగగానే వీరిని బ్రోకర్లు చుట్టుముడుతున్నారు. వచ్చీరాని హిందీ, ఇంగ్లిష్‌తో తంటాలుపడుతూ వీరు పట్టణమంతా తిరుగుతున్నారు. మరికొందరు ఆటోలను కిరాయికి తీసుకుని ధరణికోటకు వెళ్తున్నారు. అమరావతి పట్టణంలో ఇప్పటికే ఇళ్లన్నీ బౌద్ధుల కోసం రిజర్వు కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్, హుబ్లీ, మైసూర్, మునుగోడు, హాస్పేట, ధర్మశాల నుంచి వస్తున్నారు. వీరిలో కొందరు కుటుంబాలతో సహా విచ్చేశారు. బస్సుస్టాండ్ నుంచి ధరణికోట వరకూ ఏదో ఒక ప్రాంతంలో వీరు కన్పిస్తూనే ఉన్నారు.
* 'కాలచక్ర' మతపరమైన వేడుక కాదు
* 'న్యూస్‌టుడే'తో ఉత్సవ నిర్వాహక కమిటీ ఛైర్మన్ కెలసాంగ్ ఈష్
న్యూస్‌టుడే-గుంటూరు
'దలైలామాకు వారసులెవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధమతస్తులంతా ఆయనను బుద్ధుడి అవతారమేనని నమ్ముతున్నారు.. బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే 'కాలచక్ర' కేవలం మతపరమైన వేడుక కాదు.. హిందూమతంలో ఉన్న కర్మ సిద్ధాంతానికీ, బౌద్ధమతంలో కొన్నింటికి సంబంధం ఉంది.. ప్రపంచ శాంతి కోసమే 'కాలచక్ర' ఉత్సవాలను అమరావతిలో నిర్వహిస్తున్నాం' అని కాలచక్ర నిర్వాహక కమిటీ ఛైర్మన్ కెలసాంగ్ ఈష్ అన్నారు. కాలచక్ర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయన 'న్యూస్‌టుడే'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ఇలా సాగింది.
ప్ర: 'కాలచక్ర' నిర్వహణ వెనుక ఉద్దేశ్యమేమిటి? ఇక్కడే ఎందుకు నిర్వహిస్తున్నారు?
స: కాలచక్ర ఉత్సవం కేవలం బౌద్ధులకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ శాంతి కోసం 14వ లామా అయిన దలైలామా కాలచక్ర బోధనలను ప్రవచిస్తారు. గౌతమబుద్ధుడు నడయాడిన పవిత్రమైన నేలలో నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. అందుకే 30వ కాలచక్ర వేడుకలకు సన్నాహాలు చేస్తున్నాం.
ప్ర: కాలచక్ర కేవలం బౌద్ధులకు సంబంధించిన మతపరమైన వేడుక కదా.. దీనికీ, ప్రపంచ శాంతికీ సంబంధం ఏమిటి?
స: కాలచక్ర బౌద్ధమతానికి మాత్రమే పరిమితం కాదు. అందరూ ఈ బోధనలను వినవచ్చు. ఇందులో శాంతియుత జీవనం ఎలా కొనసాగించాలన్న అంశంపై వివిధ దశలుంటాయి. ప్రతి ఒక్కరూ వీటిని పాటిస్తే ప్రపంచశాంతి దానంతట అదే వస్తుంది.
ప్ర: హిందూ సంప్రదాయాలు, బౌద్ధుల ఆచారాలు విభిన్నంగా ఉంటాయి. మరి సంబంధం ఎక్కడ?
స: ఆసియా ఖండంలో హిందువులు, బౌద్ధులంతా ఒక్కటే. రెండు మతాలకు చెందిన వారందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అందిరిదీ శాంతి మంత్రమే. హింసాప్రవృత్తి నచ్చదు. ఇదే ఆ సంబంధం.
ప్ర: హిందూమతంలో వేడుకలు నిర్వహించాలంటే మంచి రోజు, ముహూర్తాలను పరిశీలిస్తారు. మీరు కూడా ఇలాగే చేస్తారా?
స: అవును. చాంద్రయాన సంవత్సరం ఆధారంగా పవిత్రమైన వేడుకల తేదీలు నిర్వహిస్తాం. టిబెటన్ల కేలండర్‌లో మంచి రోజులను పరిశీలించి నిర్ణయిస్తాం.
ప్ర: 'కాలచక్ర' నిర్వహణకు నిర్ణీత వ్యవధి ఉంటుందా? గతంలో ఒకే సంవత్సరంలో రెండుమార్లు నిర్వహించారు కదా?
స: అలాంటిదేం లేదు. లామాల నిర్ణయం మేరకు ఈ ఉత్సవాలు ఉంటాయి. బుద్ధగయ, ధర్మశాలలో ఎక్కువమార్లు నిర్వహించారు.
ప్ర: కాలచక్ర బోధనలు విన్న వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
స: మనిషిలో అంతర్గత శక్తుల్ని బహిర్గతంచేసి, సన్మార్గం వైపు మళ్లిస్తాయి. ధ్యానం వైపు మనసు మళ్లుతుంది. గొప్ప అనుభూతి మనసునిండా ఆవరించుకొంటుంది. ఉత్తేజం, జీవత్వం, ధీమా ప్రతి కదలికలోనూ కన్పిస్తుంది.
ప్ర: బౌద్ధులు టిబెట్‌లో కాకుండా భారతదేశంలో కూడా విస్తారంగా ఉన్నారు కదా. కాలచక్ర సందర్భంగా వారందరినీ సంఘటితపరిచేందుకు ఏమైనా చేస్తున్నారా?
స: అలాంటిదేం లేదు. ఇక్కడ కేవలం బోధనలు వినేందుకే భారతదేశం నలుమూల నుంచే గాక వివిధ దేశాల నుంచి కూడా వస్తున్నారు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు.
ప్ర: దలైలామా వారసుడిగా ఒక బాలుడున్నాడనీ, భారత్‌లో అతను పెరుగుతున్నాడని అంటున్నారు. అతణ్ని వారసుడిగా ఎంపిక చేస్తారా?
స: ఇది ఊహాజనితమైన ప్రశ్న. అసలు ఆ బాలుడున్నాడని మాకు ఇంతవరకూ తెలీదు. దలైలామాను బుద్ధుడి అవతారంగా నమ్ముతున్నాం. ఆయన అనంతరం ఎవరనే ఊహే మాకు ఇంకా రాలేదు. రాబోదు.
ప్ర: అమరావతిలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయా?
స: ఇక్కడ ఏర్పాట్లు చాల బావున్నాయి. ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పాలకులకు, స్థానిక అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు. అమరావతి ప్రజలకు మేం రుణపడిఉంటాం.
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005
1 Comments:
vow...good post indeed ..that too in telugu...
Post a Comment
<< Home