అమెరికా ఆలయాలపై అద్భుత గ్రంథం
మన దేశం విడచి ఉంటున్నతెలుగువారిలో పెరిగిపోతున్న భక్తిప్రవత్తులపై తమిళపేరు గల ఓ తెలుగాయన అధ్యయనం చేశారు. 110 దేశాల్లో స్థిరపడిన భారతీయుల ఆలయధర్శనంపై ఆయన ప్రత్యేక పరిశీలన చేశారు. అమెరికాలోని 33 రాష్ట్రాలలో గల 53 ప్రధాన దేవాలయాలపై వివరాలతో విశేష గ్రంథాన్ని రూపొందించారు. త్వరలోనే దాన్ని విడుదల చేయబోతున్నారు.
వరంగల్ నుంచి ఉద్యోగరీత్యా మద్రాస్‌కు వెళ్ళిన కుటుంబంలో పుట్టి పెరిగి ఎలక్ట్రికల్ మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో ప్రావీణ్యం పొందిన పంచాప కేశన్ పలు దేశాల్లో, ప్రాంతాల్లో ఉద్యోగాలు చేశారు. ముంబాయి, సౌదీఅరేబియా, సింగపూర్‌లో పనిచేశాక అమెరికాలో కొన్నేళ్లు పనిచేసి పదవీవిరమణ చేశారు. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక ఆలోచనలు, అధ్యయనంపై ఆసక్తిగల పంచాప కేశన్ ఆలయ చరిత్రపై మనస్సు లగ్నం చేశారు. అమెరికాలో భారతీయులు నిర్మించిన దేవాలయాలు, సంస్కృతిపై సమాచారం సేకరించారు. అంతకు ముందే కొందరు విదేశీయులు కొన్ని ఆలయాలపై పుస్తకాలు వెలువరించారని తెలిసి సమగ్రంగా అన్ని దేవాలయాలపై డైరీక్టరీ రూపొందించాలని సంకల్పించారు. మన రాష్ట్రం నుంచే వెళ్లి అక్కడే స్థిరపడిన వైద్యుడు, ప్రొక్టర్ అండ్ గాంబుల్ డైరెక్టర్ డాక్టర్ చల్లాశేఖర్ ఈ విషయం తెలుసుకుని పంచాపకేశన్‌తో చర్చించారు. తన ప్రయత్నానికి మెచ్చుకుని సహకారం అందించారు.
మూడేళ్లపాటు ఏకబిగిన అమెరికాలోని అన్ని ఆలయాలను సందర్శించి, ధర్మకర్తలు, సంబంధీకులతో మాట్లాడి సమాచారం సేకరించారు. క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, మన పూర్వ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్, వాషింగ్టన్ డిసికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ నేత కాంప్ విల్సన్, సిక్కిం రాష్ట్ర గవర్నర్ వి.రామారావు, నేత్ర వైద్యుడు డాక్టర్ సిన్హా వంటి వారెందరో ఈ ప్రయత్నాన్ని, అధ్యయనాన్ని హర్షించారు. ఈ సమగ్ర ఆలయ చరిత్ర విశేషాల్ని హైదరాబాద్‌లో ముద్రించి, జనవరిలో నగరంలోనే జరిగే ప్రవాసి భారతీయ దివస్ మహాసభల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రతి ఏటా కొంత కాలం గడిపే పంచాప కేశన్ వివాసంలో 'నవరంగ్' ప్రతినిధి కలిసినప్పుడు ఆయన పలు విశేషాల్ని చెప్పారు. వాటిల్లో కొన్ని ..
అమెరికావాళ్ళూ ఆలయాలు కట్టారు...
మన సంస్కృతిపై ముచ్చటపడి హిందువులుగా మారిన 12 మంది శ్వేతజాతీయులు కలిసి ఓ ఆలయాన్ని నిర్మించారు. ఆగమశాస్త్ర నియమాల్ని పాటిస్తూ ఆ ఆలయానికి బోధినాథన్ వేలన్‌స్వామిగా పేరు పెట్టారు. అమెరికాలో ఎప్పటి నుంచో భారతీయ సంస్కృతి, జాడలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. అమెరికాలో అందరూ ఒప్పుకునే 'మాయదేవి' సంస్కృతి మన గ్రామదేవతల ఆలయాలు, మొక్కులు, జాతరలకు దగ్గరి పొలికతో ఉంది. అశ్వమే«థ యాగంగా చెప్పుకునే విశ్వజైత్ర యాత్రలో అమెరికా ప్రాంతంలో అడుగులు, ముద్రలు ఉన్నాయి. సగర చక్రవర్తి చేసిన యాగంలో 'విజయ కేతనం'తో తిరుగుతున్న నూరుమంది రాకుమారుల్ని కోపంగా చూసి ఒక్క చూపులో భస్మం చేసిన కథ విశేషాలు ఆ ప్రాంతంలో దగ్గరి పోలికలతో కనిపిస్తాయి. అక్కడ హార్స్ ఐలాండ్, యాష్ ఐలాండ్‌లు ఇప్పుడూ ఉనికిలో ఉన్నాయి. కపిలమహర్షి ఆశ్రమంగా చెప్పుకునే పాతాళలోకం, కపిలారణ్యం కాలిఫోర్నియా వంటి పోలికలో మనం గమనించవచ్చు. మన దేశంలో ప్రాంతాలనుంచి సూటిగా సూదిమొనతో భూగోళం లాంటి 'గ్లోబ్'పై గుచ్చి కిందకి దింపితే అమెరికా వస్తుంది. భారతదేశ భూభాగంలో ప్రాంతాలకి అమెరికాలోని కొన్ని చోట్లకి ఎంతో దగ్గర సంబంధం ఉంది. వాటిని ఇప్పటి ఆలయాలతో కలిపి పోల్చి చూసుకోవచ్చు గతంలో కంచిపీఠం పరమాచార్య ఈ అంశాలపై చాలా విశేషాలు వెల్లడించారు.
ఆలయాలు- మొక్కులు -పూజలు
స్థానికంగా పాటించని సంప్రదాయాలు, వ్యవహారాలపై అమెరికాలో స్థిరపడిన వారు ఎంతో శ్రద్ధతో మనసు పెడుతున్నారు. భారత దేశంలోని దేవాలయాలల్లోని పద్ధ్దతులు పూజలకు ఏమాత్రం తక్కువ కాకుండా కొన్నిచోట్ల ఇంచుక హెచ్చుగానే పూజాదికాలు జరుగుతున్నాయి.
భక్తులంతా మనసారా దైవదర్శనంతో పాటు కావలసినంతసేపు ఆలయ ప్రాంగణంలో గడపగలుగుతున్నారు. వ్రతాలు చేసుకోవాలన్నా, వివాహాలు, శుభకార్యాలకు ప్రీతిపాత్రమైన నెలవుగా తమ ప్రాంతం ఆలయాలన్నీ అమెరికా భారతీయులు ఇబ్బందులు లేకుండా నిర్వహించుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో 1970 ప్రాంతాల్లో పిట్స్‌బర్గ్ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకున్నారు. అక్కడి పద్ధతులు, భక్తి, పూజా విధానాలు గమనిస్తే మనం ఏం కోల్పోతున్నామో అవగతం అవుతుంది. శైవ, వైష్ణవ సంప్రదాయాలకు తోడుగా భారతీయులు పూజించుకునే దేవతలంతా అమెరికాలో కొలవై కొలుపులు అందుకుంటున్నారు. మేరిలాండ్లో శివ, విష్ణు ఆలయం చికాగో లోని ప్రాంగణంలో 'ఆగమశాస్త్రం' పవిత్రత ఉట్టిపడుతూంటాయి. న్యూయార్క్‌లోని మహవల్లభ గణపతి, ఫ్లోరిడాలో హరిహర ఆలయం వంటివి ఒక్కొ ప్రత్యేకతతో ఉన్నాయి. ఉత్తర ధృవంగా మంచుతిన్నెగా ఉండే అలాస్కాలో గణేశ్ మందిరం ఉంది. శివాయ సుబ్రమణి స్వామిగా పరివర్తన చెందిన శ్వేత జాతీయుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ ప్రాంతంలో ముప్పయి కుటుంబాల వారు కలిసి మెలిసి శ్రద్ధ పెట్టి నిత్యనైవేద్యాలు 'ఆరాధనలు' నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైన పూజారి లేకుండా వంతుల వారీగా పూజలు చేస్తునే ఉన్నారు. మిచిగన్ రాష్ట్రంలో డాక్టర్ జికె కుమార్ 'కుండలినీ యోగం'తో సిద్ధుడై సొంతంగా పరాశక్తి ఆలయ ప్రాంగణం నిర్మించి నిర్వహిస్తున్నారు. మన నర్మదా నదీ తీరం నుంచి స్వయంభువు లింగాన్ని తీసుకువెళ్ళి టెన్ససీలో ఆలయాన్ని నిర్మించారు. టెక్సాస్‌లో మీనాక్షి, విస్కాన్‌సన్‌లో దుర్గామాత ఆలయాలు ఉన్నాయి. ఐహొవా, లెబ్రాసా వంటి చోట్ల, జన సాంద్రత తక్కువ ఉన్న ఆలయాలలో సందర్శనం నిర్వహణ మిక్కుటంగానే ఉన్నాయి. పెన్సిల్సేనియాలో 'సాయిబాబా' ఆలయం ఎంతో ప్రసిద్ధమై పోయింది. అక్కడి వారంతా ఇక్కడికి వచ్చి వాస్తు, స్థపతి, శాస్త్ర నిపుణుల్ని సంప్రదించి పవిత్ర హృదయంతో దేవాలయ నిర్మాణం చేసి ఆచరిస్తున్నారు.
ఎంతో సమాచారం సేకరించిన పంచప కేశన్ మాటల్లో ఎలాంటి అసమానతలు లేకుండా దేవుడిపై మనసు లగ్నం చేసి వారంతా కలిసికట్టుగా అర్చన చేయడం అమెరికాలోనే సాధ్యమవుతోంది. మన ప్రాంతాల్లోని ఆలయాలపై పలు ప్రశ్నలు సంధించినప్పుడు ఆయన నిర్లిప్తంగా నవ్వి కచ్చితంగా అమెరికాలోనే బాగుంటుందని అన్నారు. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి చాలా మంది మా పుస్తకంతో పాటు అమెరికా ఆలయాలపై ఆసక్తి కనపరుస్తున్నారు. ఎలాంటి వివరాలు కావాలన్నా తెలియచేస్తాను. కాస్తంత ముందుగా సమయం తీసుకుని మాత్రం మాట్లాడండి..అంటూ పంచాప కేశన్ సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్త ఆలయాలపై పూర్తి సమాచార డైరెక్టరీని రూపొందించాలని ఆయన తపిస్తున్నారు. ఇతర వివరాల కోసం 9440296107, 27154060 నంబర్లలో సంప్రదించవచ్చు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Telugu , Andhra Pradesh , America US USA , Hindu temple temples worship , Andhra Jyothi Jyothy December 2005 article
0 Comments:
Post a Comment
<< Home