"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, March 28, 2007

ఆంధ్రుల సొంతం అవధానం

వధానం... అక్కడ ఆశుకవితా ధార రసగంగా ప్రవాహమై పొంగుతుంది. అవధాని వూహలో... జార్జిబుష్‌, లాడెన్‌ చెట్టపట్టాలు వేసుకుని రామాయణ ఇతివృత్తంలోనో ఇంకేదో ఇతిహాసంలోనో ఇట్టే ఒదిగిపోతారు. ఇంగ్లిషు పదాలు అచ్చ తెలుగు పైటేసుకుని కొత్త అర్థాలూ అందాలూ సంతరించుకుంటాయి. నిషిద్ధాక్షరి పేరుతో పృచ్ఛకుల ఎత్తులూ... నానార్థాల సాయంతో అవధాని పై ఎత్తులూ... అత్యద్భుత సాహితీ సమరం అది. కమ్మటి కందపద్యాలూ... సింగారాల సీసపద్యాలూ... చవులూరించే చంపకమాలలూ... ఉత్తేజపు ఉత్పలమాలలూ... అసందర్భ ప్రసంగంలో నవ్వుల జల్లులూ... ...ఇవీ ఆ యుద్ధ ఫలితాలు. ఆస్వాదించిన వాళ్లకు ఆస్వాదించినంత. ఇటీవలే... సహజావధాని మేడసాని వోహన్‌ పంచసహస్రావధానం చేసి రసహృదయాలను రంజింపజేసిన నేపథ్య´ంలో... అవధాన సారస్వతాన్ని అందరికీ అందించే చిరుప్రయత్నం...

ది వెుఘల్‌ సామ్రాజ్యంలోని ఓ అగ్రహారం.. ఎక్కడి నుంచో వచ్చిన కొందరు వ్యాపారులు ఓ అంగడి ముందు నిలిచి చాలాసేపు మంతనాలు జరిపారు. బేరం కుదరలేదు సరికదా! మాటా మాటా పెరిగి గొడవ వెుదలైంది. న్యాయం కోసం ఇరుపక్షాల వారూ రాజును ఆశ్రయించారు. ఇద్దరి వాదనలూ విన్న రాజు ఎవరి మాట నిజవో తేల్చుకోలేకపోయాడు. వారి వాదులాట వెుదటి నుంచి విన్నవారెవరైనా సాక్ష్యం చెప్తేగానీ విషయం తేలేలా లేదు. ఇంతలో ఓ పండితుడు ముందుకు వచ్చి 'జహాపనా మీకభ్యంతరం లేకపోతే జరిగిందంతా నేను చెపుతాను' అన్నాడు. సరేనన్నాడు రాజు. ఆ వర్తకులు వచ్చిన దగ్గర నుంచి అంగడి దగ్గర మాట్లాడినదంతా పొల్లు పోకుండా చెప్పాడా పండితుడు.
తప్పెవరిదో రాజుగారికి తెలిసింది. దోషికి వెయ్యివరహాల జరిమానా విధించి, పండితుడికి భారీగా బహుమానమిచ్చి, 'పార్శీ ఎక్కడ నేర్చుకున్నారు? బాగా మాట్లాడుతున్నారు' అని అడిగాడు.

దానికా పండితుడు 'జహాపనా నిజానికి నాకు పార్శీ ఒక్క ముక్కా రాదు. కాకపోతే... ఒకసారి వింటే చాలు దేన్నైనా తిరిగి చెప్తాను' అన్నాడు.
రాజు నమ్మలేదు. 'పార్శీ రాకుండా అక్కడ జరిగిన సంఘటన పూసగుచ్చినట్లు ఎలా చెప్పారు? మీరు అబద్ధం చెపుతున్నారు' అన్నాడు ఒకింత కోపంగా. కావాలంటే తన శక్తిని పరీక్షించుకోమన్నాడు పండితుడు.

రాజు ఇతర భాషాపండితులను పిలిచి వారి వారి భాషల్లో కావ్యాలను చదివించాడు. ఆ పండితుడు వాటిని ఒక్కసారి విని ఇసుమంత తేడా లేకుండా ఆమూలాగ్రం తిరిగి అప్పజెప్పాడు. ఆ అసమాన ధారణా ప్రతిభకు ముగ్ధుడైన రాజు ఆ పండితుణ్ని ఘనంగా సన్మానించాడు.
అంతటి ధారణా ప్రతిభను చూపిన వ్యక్తి అవధాని జగన్నాధ పండిత రాయలు కాగా ఆ రాజు వెుఘల్‌ చక్రవర్తి షాజహాన్‌.
ధారణ గొప్పతనాన్ని తెలియచెబుతుందీ సంఘటన. అవధాన ప్రక్రియకు ఆయువు పట్టు ధారణ.

* * *

'సారాగొనె శివుడు లోక సంరక్షణకై' ...లోక సంరక్షణ కోసం శివుడు సారా తాగాడట! అవధాని చాతుర్యానికి పరీక్షపెట్టే ఈ సమస్యని క్షీరసాగర మథనానికి లంకె పెట్టి హాలాహలాన్ని శివుడు మనసారా తాగాడంటూ కడిమిళ్ల వరప్రసాద్‌ ఇలా పూరించారు.

'పారావారమున నందున
నారని పెనుజిచ్చువోలె హాలాహలమే
పారగ నద్దానిని 'మన
సారా' గొనె శివుడు లోక సంరక్షణకై
అలాగే మరోసారి ఆయననే జనవరి, మార్చి, మే, జూలై... ఈ నాలుగు ఇంగ్లిషు పదాలతో రాముడి గురించి చెప్పమంటే...

'జనవరిష్ఠు'డు శ్రీరామచంద్రమూర్తి
'మే'లు గూర్చుట వ్రతముగా మెలగినాడు
మహిని రాక్షసులం బరి'మార్చి'నాడు
సూర్యవంశపు 'జూలయి' శోభలీనె
...అని చెప్పారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు! ఎన్ని వేల పద్యాలైనా చెప్పగల చాతుర్యం, ధార, అవధానులకు ఉంటుంది.

తెలుగువారికి మాత్రమే సొంతమైన అపురూప వినోద, విజ్ఞానాల సమ్మేళనం... అవధానం. అసలింతకీ అవధానం అంటే ఏమిటంటే ఏకాగ్రత అనే చెప్పాలి. అప్రమత్తతే అవధానం అని అమరకోశం చెప్తుంటే... శబ్దార్ధ కల్పతరువు దాన్ని 'మనో యోగం' అంటోంది. అసలీ అవధానాలకు మూలం వేదాధ్యయనంలో ఉంది! వేదాలను పలక మీదో పుస్తకం మీదో రాసి లేదా చూసి నేర్చుకోరు. గురుముఖతా విని ఎప్పటి పాఠం అప్పుడు వల్లెవేయాల్సిందే. పన్నెండేళ్లపాటు చదివిన వేదసారాన్నీ మెదడులో నిక్షిప్తం చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో అంతటి గొప్ప వాజ్ఞ్మయంలో ఒక్క అక్షరం కూడా జారిపోకుండా ఉండటానికి రకరకాల పద్ధతులను ప్రవేశపెట్టారు. ఐదు వేళ్లనూ నియమబద్ధంగా కదుపుతూ అనేక స్వరాలను సూచించడం అందులో ఒకటి. రానురానూ ఒకరు వేళ్లు కదుపుతుంటే మరొకరు స్వరం చెప్పడం, ఒకరి స్వరానికి అనుగుణంగా వేరొకరు వేళ్లు కదపడం వెుదలైంది. అదే స్వరావధానం. అలాగే... వేదంలోని కాండ సంఖ్య, పాఠసంఖ్య చెప్పి అందులో ఒక అక్షరం ఉన్న స్థానాన్ని చెప్తే ఆ అక్షరం ఏంటో చెప్పాలి. అలా కాకుండా... అక్షరం చెప్తే దాని స్థానాన్ని గుర్తించడం మరో పద్ధతి. అది అక్షరావధానం. దీనికి అద్భుతమైన జ్ఞాపకశక్తి అవసరం.

రోజూ వల్లె వేయడం వల్ల ధారణ సహజంగానే అలవడే వేదపండితులకు రాజాస్థానాల్లో కవులకు మించి అమిత గౌరవం లభించేది. దాంతో కవులకు వారితో స్పర్థ వెుదలైంది. బహుశా ఆ స్పర్థలోంచే అవధాన విద్య వర్ధిల్లిందంటారు ఆ ప్రక్రియను నిర్వహించే పండితులు. స్పర్థ మంచిదే కానీ... సాహితీ అవధానం వేదావధానం అంత సులభం కాదు. ఎందుకంటే వేదాలు స్థిరమైనవి. వాటిని ఒకసారి ధారణ చేయగలిగితే చాలు. కానీ కవిత్వావధానంలో అలాకాదు. అవధానికి ధారణతో పాటు సృజనా సమయస్ఫూర్తీ సమపాళ్లలో లేకపోతే సభ రక్తికట్టదు. పృచ్ఛకుడు సమస్య ఇస్తుండగానే అవధాని మెదడు ఊహాతీత వేగంతో పనిచేయాలి. దత్తపదో, నిషిద్ధాక్షరో, ఆశువో... అడిగిందే తడవు దాన్ని ఏ ఛందస్సులో చెప్పాలి, ఏ అక్షరాలు రాకుండా చెప్పాలి అన్నీ అంచనా వేసుకొని పద్యం చెప్పడానికి సిద్ధమవాలి. ఇదంతా కళ్లు మూసి తెరిచేలోపు జరగాలి.

సాహిత్యావధానం స్ఫూర్తితో ఆ తర్వాత నాట్యావధానం, గేయావధానం... ఇలా దాదాపు 50 రకాల ప్రక్రియలు రూపుదిద్దుకున్నాయి. అలాంటివి ఎన్నున్నా అవధానం అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రక్రియ అష్టావధానమే. అతి కష్టమైనదీ తక్కువ సమయంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేదీ కాబట్టే దానికిఅంతప్రాముఖ్యం, ప్రాచుర్యం.


అష్టావధానం అంటే ఏమిటి?
ఎనిమిది మందితో నిర్వహించే ప్రక్రియ కాబట్టి అష్టావధానమని కొందరు అంటారు. సాహిత్య, సాహిత్యేతర అంశాలు ఎనిమిదింటితో నిర్వహించేది కాబట్టి ఆ పేరు వచ్చిందని చాలా మంది అంటారు. ఏదేమైనా ఏకకాలంలో ఎనిమిది మందికి సమాధానాలిస్తూ కార్యక్రమం చివర్లో వాటిలోని సాహిత్య అంశాలను ధారణ చేయడం చూసేవారికి ఇష్టావధానం, చేసేవారికి కష్టావధానం... అదే అష్టావధానం. సమస్యా పూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం... ఇలా అవధాని ఎనిమిది అంశాలను ఎంచుకొంటాడు. వాటిలో ఒక్కో అంశాన్నీ ఒక్కో పృచ్ఛకుడు నిర్వహిస్తాడు.

ఒక్కొక్కటీ ఇలా...
అవధాన ప్రక్రియకు దాదాపు 50 దాకా అనుకూల అంశాలున్నాయి. సాధారణంగా అందరి అవధానాల్లోనూ ఉండే అంశాలు ఇవీ...
సమస్యా పూరణం: పృచ్ఛకుడు ఏదో ఒక అంశంపై నాలుగో పాదాన్ని ఇస్తాడు. దాని ఆధారంగా పై మూడు పాదాల్నీ అవధాని పూరించాలి. సాధారణంగా సమస్య ఇచ్చేవారు చిత్రాతిచిత్రంగా అసలది సాధ్యమేనా? అనిపించేలా ఇస్తారు.

ఉదాహరణకు... 'రావణుని పత్ని సీతమ్మ రాము చెల్లి' ఈ సమస్యను రాళ్లబండి కవితాప్రసాద్‌ను అడిగారు. సీతమ్మ రావణుడికి భార్య, రాముడికి చెల్లెలూ అవుతుందా? అదెలా సాధ్యం? ఆ సమస్యను అవధాని చమత్కారంతో ఇలా మార్చేశారు.

సీత రాకడ నెదిరించెనే తరుణియ?
రామ కథలోని శక్తి యే లేమ చెపుమ?
భరతు డమ్మాయి యైనచో వరుస వరుస -
రావణుని పత్ని, సీతమ్మ, రాము చెల్లి

ఎంత అద్భుతమైన పూరణ! సీతను తీసుకురావడం తగదని చెప్పినదెవరు? రామకథలోని కథానాయిక ఎవరు? భరతుడు అమ్మాయిగా పుడితే రాముడికి ఏమవుతుంది? అని వెుదటి మూడు పాదాల్లో ప్రశ్నించి వాటికి సమాధానాలు వరుసగా రావణునిపత్ని, సీతమ్మ, రాము చెల్లి అని నాలుగో పాదంలో తెలివిగా సమస్యను పూరించారు.

నిషేధాక్షరి: తాను కోరిన పద్యాన్ని అవధాని చెప్పడం ప్రారంభించగానే పృచ్ఛకుడు అడ్డుతగిలి కొన్ని అక్షరాల్ని నిషేధిస్తాడు. నిషేధాక్షరి నిర్వహణలో అవధానికి నిఘంటు పరిజ్ఞానంతోపాటు అప్పటికప్పుడు పదాన్ని మార్చేసే శక్తి ఉండాలి.

ఉదాహరణకు... భద్రాచల రాముని వర్ణించమని మేడసాని వోహన్‌ను ఒక పృచ్ఛకుడు అడిగాడు. తొలి రెండు అక్షరాలూ అవధాని స్వేచ్ఛకే వదిలేయగా ఈయన 'భద్రా' అన్నారు. తర్వాత 'చలం' అంటారనుకొని పృచ్ఛకుడు 'చ' అక్షరాన్ని నిషేధించాడు. వెంటనే అవధాని 'ద్రి' అన్నారు. భద్రాద్రి అయింది. తర్వాతి పదం (భద్రాద్రి)'వాసా' అయి ఉంటుందని ఊహించి 'వా' నిషేధం అన్నాడు. 'స్థి' అన్నారు అవధాని. 'స్థి'రవాసా అనే అవకాశం ఉందనుకుని 'ర' నిషేధించాడు పృచ్ఛకుడు. ఈయనేవో 'త' అన్నాడు. వెంటనే ఆయన 'వా' రాకూడదన్నాడు. అవధాని 'రా' అన్నాడు. ఇంకేముందీ! రామా అంటాడు కాబోలని 'మా' అక్షరాన్ని తొక్కిపట్టాడాయన. 'జా' అంటూ వెుదటి పాదాన్ని పూర్తిచేశారు మేడసాని. వెుత్తం కలిపితే 'భద్రాద్రి స్థిత రాజా' అయింది. అవతలి వ్యక్తి ఊహించని కోణంలో ఆలోచించడమే అవధాని ప్రతిభ. ఇలా ఎత్తులూ పై ఎత్తులుగా సాగుతుందా చెలగాటం.

నిషిద్ధాక్షరి: అంటే... పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధవో ముందే నిర్దేశిస్తాడు. ఉదాహరణకు... మేడసాని వోహన్‌ను ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు రాకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. వెంటనే ఆయన
'సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యన్‌ సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మెసగిన్‌'
...అని చెప్పారు.

వివర్గాక్షరి: పద్యంలోని ఏయే పాదాల్లో ఏ అక్షరాలు నిషిద్ధవో పృచ్ఛకుడు ముందే చెప్తాడు. అవధాని వాటిని మరోసారి అడగకుండా పద్యం చెప్పాలి. ఉదాహరణకు... 1944లో పిసుపాటి చిదంబరశాస్త్రి అవధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు వెుదటి పాదంలో య, ర, ల, వ, శ, ష, స, హ, రెండో పాదంలో ప, ఫ, బ, భ, మ, మూడో పాదంలో త, థ, ద, ధ, న, నాలుగో పాదంలో క, ఖ, గ, ఘ, జ్ఞ... ఇన్ని అక్షరాలు రాకుండా మత్తేభ ఛందస్సులో సరస్వతీ దేవిని వర్ణించమన్నాడు. పిసుపాటి వారు దాన్ని అవలీలగా పూరించారిలా...

'గణుతింతున్‌ మనమంది నుక్తిజననిన్‌ కాంతా మణిన్‌ జండధా
రణ హృత్సారస చంచరీక నవతారస్వైరసంచార, చర్వణ బీయూష కరాభ్యుపేయ రుచపారం పర్య సంశోభ, గా
రణ భూతన్‌ వివిధ శ్రుతి స్మృతి విహారద్యోత మానస్థితిన్‌'
అవధాన చరిత్రలోనే ఇన్ని నిషేధాలతో ఇంత అందమైన పద్యం రాలేదంటే అతిశయోక్తి కాదు.

దత్తపది: ఇచ్చిన పదాలతో పృచ్ఛకులు కోరిన భావాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు... పంచరు, టించరు, వెంచరు, లాంచరు పదాలతో భారతీయ సంస్కృతి గురించి వర్ణించమన్నారో అవధానిని. దాన్ని ఆయన పరిష్కరించిన తీరు ఇది...
'పంచరు ద్వేషభావనలు భారత వీరులు, కల్మి లేమి పా
టించరు, అందరున్‌ కలిసి ఢీకొని శత్రు సమూహ శక్తి లా
వెంచరు, పోరులోన అరిభీకరమూర్తులు భారతంబ చే
లాంచ రుచి ప్రతీకలు భళా! మన సంస్కృతి సంస్తుతంబగున్‌'

´వర్ణన: పృచ్ఛకుడు తన ఇష్టం వచ్చిన అంశాన్ని ఇచ్చి దాన్ని తాను కోరిన ఛందంలో వర్ణించమంటాడు. ఉదాహరణకు... ఒక సభలో విజయవాడ అద్దెకొంపల అగచాట్లను వర్ణించమంటే అవధాని ఆ కష్టాలను కళ్లకు కట్టిన తీరిది...

దొరికియు చావదాయెు యెుక త్రోవను గొంప లభించెనేని సంబరపడరాదు చుట్టములు పక్కములద్దరి చేరరాదు బా పురెతన జీతమందు దృణవో పణవో మిగులంగనింటియో
నరునకునద్దె గట్టవలె నారకమౌపడునద్దె కొంపలన్‌

ఆశుకవిత్వం: ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం వరకూ దేనిమీదైనా ఆశువుగా పద్యవో దండకవో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.

న్యస్తాక్షరి: దీనిలో పృచ్ఛకుడు తన ఇష్టానుసారం అక్షరాలను ఇచ్చి అవి పద్యంలో ఏ లైనులో ఎన్నో అక్షరంగా రావాలో చెప్తాడు. అవధాని వాటన్నిటిని గుర్తుంచుకుని పృచ్ఛకుడు కోరిన ఇతివృత్తంలో ఇచ్చిన అక్షరాలను కోరిన చోట ఉంచుతూ పద్యం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు... ఒకటో పాదంలో 11వ అక్షరంగా 'ట్మ' రావాలని కోరితే అవధాని అలా చెప్పి తీరాల్సిందే.

నిర్దిష్టాక్షరి: అనగా నిర్దేశించబడిన అక్షరాలుగలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృచ్ఛకుడు బేసిస్థానాల్లోగాని, సరిస్థానాల్లోగాని ఇష్టానుసారం అక్షరాలను రాసిస్తాడు. అవధాని మిగిలిన ఖాళీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తిచేస్తాడు.

పుష్పగణనం: అవధానం జరుగుతుండగా అవధాని వీపునకు తగిలేలా అప్పుడప్పుడూ పూలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి వెుత్తం ఎన్నిపూలు విసిరారో చివర్లో చెప్పాల్సి ఉంటుంది. ఘంటా గణనం కూడా ఇలాంటిదే. అవధానం జరుగుతుండగా వెనకాల ఒకరు గంట కొడుతుంటారు. వెుత్తం ఎన్ని గంటలు కొట్టారో అవధాని చెప్పాలి.

అప్రస్తుత ప్రసంగం: అవధాని ఏకాగ్రతను చెడగొట్టేందుకు అప్రస్తుత ప్రసంగి చేయని ప్రయత్నం ఉండదు. ఒక సభలో ఒకాయన ''అవధానిగారూ భర్త భోజనం చేస్తున్నాడు, భార్య వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి'' అని అడిగారు. దానికి అవధాని... 'పళ్లెం నిండా శుభ్రంగా వడ్డించవే' అని భర్త అంటే 'కోరినంత తినండి' అని భార్య జవాబిచ్చింది... అని చెప్పారు. మరోసారి... ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మను ఒక అప్రస్తుత ప్రసంగి... 'అయ్యా వ్యవసాయ శాఖలో పనిచేసే భర్త, కుటుంబ నియంత్రణ శాఖలో పనిచేసే భార్య... వారి సంభాషణ ఎలా ఉంటుందో చెబుతారా' అని అడిగారు. దానికి మాడుగుల... ''భర్త 'గ్రోవోర్‌... గ్రోవోర్‌...' అంటుంటే, 'భార్య నోవోర్‌... నోవోర్‌...' అంటుంది'' అని సభలో నవ్వులు పూయించారు. ఇలా... క్షణాల్లో అవతలి వారి ఛలోక్తులూ చెణుకులకు తడుము కోకుండా సమాధానం చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే... పద్యాలూ ఛందస్సుల గురించి అస్సలు తెలియని సామాన్యులను ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.

ఇవి కొన్ని ప్రక్రియలు మాత్రమే. ఇంకా... వ్యస్తాక్షరి, కావ్యోక్తి, పురాణపాఠం, సహపఠనం, శాస్త్రార్థం, ఇచ్ఛాంక శ్లోకం... ఇలా అవధాని ప్రతిభను అన్ని విధాలా కఠిన పరీక్షకు గురిచేసే అంశాలు అష్టావధానంలోనే ఉన్నాయి. ఇందులో మళ్లీ ఇటీవల వచ్చిన వినూత్న ప్రక్రియ గుణితాష్టావధానం. అంటే... అంశాల సంఖ్య ఎనిమిదే కానీ పృచ్చకుల సంఖ్య మాత్రం పదహారు, ఇరవైనాలుగు ఇలా రెట్టింపవుతూ ఉంటుంది. ఎంతమంది ఉద్దండ పండితులు ఎదురుగా ఉన్నా ఇసుమంతైనా తొణక్కుండా రసగంగా ప్రవాహాలు పొంగిస్తారు అవధానులు.

అడిగిన పద్యాలు చెప్పడంతోనే అవధానం పూర్తయిపోదు. చివర్లో 'ధారణ' లేని అవధానం రక్తి కట్టదంటారు పండితులు. అన్ని రోజులూ చెప్పిన పద్యాలను అవధాని కార్యక్రమం చివర్లో మరోసారి చెప్పాల్సి ఉంటుంది. అదే సిసలు పరీక్ష. మేడసాని వోహన్‌, గరికపాటి నరసింహారావు, రాళ్లబండి కవితా ప్రసాద్‌, కడిమిళ్ల, వద్దిపర్తి వంటి కొద్ది మంది అవధానులు తప్ప ఇటీవలి కాలంలో ధారణ ప్రక్రియను దాటవేస్తున్న వారే ఎక్కువ.

ఔరా!
ఇక్కడో పోలిక అవసరం. అదేంటంటే... ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్‌ సామర్థ్యం కోటికోట్ల బైట్లు(10 తర్వాత 12 సున్నాలు). కానీ... 10 తర్వాత 8,432 సున్నాలు ఉంచితే ఎంత అవుతుందో అన్నిబైట్ల సమాచారం ఒక్క మనిషి మెదడులో నిల్వచేయవచ్చని బ్రెయిన్‌ అండ్‌ మైండ్‌ జర్నల్‌వారు లెక్క కట్టారు. అంత స్థాయిలో వినియోగించుకుంటారో లేదో తెలియకపోయినా... సాధారణ మనిషి కన్నా అద్భుతమైన ధారణ శక్తి అవధానులకు ఉంటుందనేది నిర్వివాదాంశం. ఎందుకంటే...అవధానికి 18 పురాణాలూ సంస్కృత, తెలుగు కావ్యాలూ నోటికి రావాలి. అంటే కొన్ని లక్షల పద్యాలు కంఠస్థం అయి ఉండాలి. అక్కడితో అయిపోదు! వాటిని సందర్భానుసారం ఉపయోగించగలిగే సమయస్ఫూర్తి ఉండాలి. సామెతలూ జాతీయాలూ అలవోకగా తాను చెప్పాల్సిన ఇతివృత్తంలోకి జొప్పించగలిగే చాతుర్యం ఉండాలి. ఇవన్నీ అవలీలగా చేసే అవధానుల మస్తిష్కశక్తి మహాద్భుతం కాక మరేమిటి!

- శ్రీకాంత్‌ బక్షి, న్యూస్‌టుడే, హైదరాబాద్‌

రకాలెన్నో...
వరైనా ఒకటికి మించి పనులు చేస్తుంటే 'అష్టావధానం చేస్తున్నాడు' అనడం పరిపాటిగా మారింది. అంటే... అష్టావధానం, శతావధానం అన్న పదాలు ఏ స్థాయిలో తెలుగు నుడికారాలుగా స్థిరపడిపోయాయో అర్థమవుతుంది. ఆ రెండే కాదు ఇంకా అవధానాలలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
వేదసంబంధ అవధానాలు: స్వరావధానం, అక్షరావధానం.
సాహిత్య అవధానాలు: అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి.
సాహిత్యేతర అవధానాలు: శతకలశావధానం(ఇది చాలా సునిశితమైన విద్య. నూరు రాగి చెంబులలో నీళ్లు పోసి ఒక్కోదాన్నీ కొట్టినప్పుడు వేర్వేరు శబ్దాలు వస్తాయి. వాటిని అవధాని గుర్తుపెట్టుకుని ఏ చెంబుని కొట్టారో చెప్పాలి), శబ్దావధానం(నూరు వస్తువులను కొట్టగా వచ్చే శబ్దాలను అవధాని విని గుర్తుంచుకుంటాడు. ఆ తర్వాత... కళ్లకు గంతలు కట్టుకుని శబ్దాన్ని బట్టి ఏ వస్తువును కొట్టారో చెప్తాడు). రామాయణ, భగవద్గీత అవధానాలు కూడా సాహిత్యేతర అవధానాల కిందకే వస్తాయి. ఇవన్నీ ధారణ సంబంధమైనవి. అంటే ఒకసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి.
సాంకేతికావధానాలు: నేత్రావధానం(ఇందులో ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. పృచ్ఛకులు వెుదటి అవధానికి ఒక కాగితంపై విషయం రాసిస్తారు. అతను దానిని చదివి రెండవ అవధానికి తన కనుసైగల ద్వారా చెప్పాలి. దాన్ని ఆయన అర్థం చేసుకుని బయటకు చదవాలి. ఇలా చేయడానికి ఆ జంట తెలుగులో ప్రతి అక్షరానికీ ఒక్కో గుర్తును పెట్టుకుంటారు. తిరుపతి కవులు, కొప్పరపు కవులు తదితరులు ఈ నేత్రావధానంలో సిద్దహస్తులు. కళ్లతో కాకుండా బొటనవేలితో భావాలను చెప్పితే అది అంగుష్టావధానం, పిడికిలితో చేస్తే అక్షరముష్టికావధానం), ఇలాంటివే... పుష్పావధానం, ఘంటావధానం, ఖడ్గావధానం, గమనావధానం... వెుత్తం 13 దాకా ఉన్నాయి. ఇలాంటి అవధానాలను చేయడానికి జంట అవధానులు తప్పనిసరి. అది ఆ ఇద్దరికి మాత్రమే సాధ్యం అవుతుంది. వారిలో ఎవరు లేకపోయినా రెండోవారు మరొకరితో కలిసి చేయలేరు.
శాస్త్ర సంబంధ అవధానాలు: గణితావధానం, జ్యోతిషావధానం, వైద్యావధానం, అక్షరగణితావధానం
కళా సంబంధ అవధానాలు: చిత్రకళావధానం(పృచ్ఛకులు గీసిన పిచ్చిగీతను వారు కోరిన బొమ్మగా మార్చడం, వారి సంతకంతోనే వారి బొమ్మను గీయడం, ఒకబొమ్మలో కొన్ని భాగాలు చెరిపేస్తే దానిని మరో బొమ్మగా గీయడం వంటి అంశాలుంటాయి), నాట్యావధానం, సంగీతాష్టావధానం, చతురంగావధానం, ధ్వన్యవధానం.

నిషేధాక్షరి కష్టం!
'అవధానం ఎవరి దగ్గరా నేర్చుకుని చేయగలిగే ప్రక్రియ కాదు. అది స్వతఃసిద్ధంగా రావాలి. లేదా... కొంత సహజశక్తి ఉన్నప్పుడు గురువును ఆశ్రయిస్తే ఫలితం ఉండొచ్చు' అంటారు ప్రముఖ అవధాని మేడసాని వోహన్‌. ఇటీవలే... నెల రోజుల్లో పంచసహస్రావధానం నిర్వహించి సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని సాక్షాత్కరింపజేసిన మేడసాని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ కూడా. ఐదువేలకు పైగా సమస్యలను పూరించి పండిత పామరుల ప్రశంసలందుకున్న మేడసానికి పద్యం మీద అనురక్తి ఎలా కలిగిందంటే...

సముద్రంలో నాలుగైదు అలల తర్వాత పోతు అల అని ఒకటి వస్తుంది. అవధాని పద్యం చెప్పడం వెుదలు పెడితే నాలుగో పాదం ముగిసేదాకా అదేస్థాయిలో ఉంటుంది. ఆగాలన్నా ఆ ధార ఆగదు. పృచ్ఛకుడు సమస్య ఇవ్వగానే ఏ ఛందస్సులో ఎలా చెప్పాలీ అనేది యతిప్రాసలతో సహా మనసులో మెదులుతుంది. ఆశువుగా అలవోకగా నోటివెంట పద్యం వెలువడుతుంది. అయితే... అవధానుల్ని బాగా ఇబ్బంది పెట్టేదీ వారిని ముప్పతిప్పలు పెట్టడానికి పృచ్ఛకులకు అవకాశం ఇచ్చేదీ నిషేధాక్షరి అంశమే. ఈ ప్రక్రియలో పద్యం చెప్పేటప్పుడు అవతలివారికి మనం అనుసరిస్తున్న టెక్నిక్‌ చివరిదాకా తెలియనివ్వకూడదు. అప్పుడే నిషేధాక్షరి రక్తికడుతుంది. ఏదేమైనా... అవధాన ప్రక్రియ వెుత్తం ఏకాగ్రత పైనే ఆధారపడి ఉంది. ధ్యానంతోనే ఏకాగ్రత సాధ్యం.

ఇక, నా వ్యక్తిగత విషయానికొస్తే... చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని నడిమిపల్లి మా స్వగ్రామం. 1954 ఏప్రిల్‌19 నా జన్మదినం. ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. అందరిలోకీ నేనే చిన్నవాడిని. మాదో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. నాకు అక్షరాభ్యాసం కాక ముందే నాలుగేళ్ల వయసప్పుడు మావాళ్లు నన్ను ఓ వీధిబడిలో కూచోబెట్టేవారు. మిగతాపిల్లలకు చెప్తుంటే విని, చూసి అక్షరాలూ అంకెలు రాసేవాణ్ని. అది చూసి గురువుగారే ఆశ్చర్యపోయారు. నాలుగైదు తరగతులకు వచ్చేసరికి శతకసాహిత్యం మీద ఆసక్తి కలిగింది. అలా తెలుగు మీద మమకారం పెరిగింది. ఏ శతకమైనా కఠిన పద్యాలైనా ఇట్టే నోటికొచ్చేవి. కానీ... ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి నేను తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయాను. ఆస్పత్రికి తీసుకువెళ్తే డాక్టర్లు రెండు రోజులు ఉంచి, పరిస్థితి చేయి దాటిపోయిందని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత... ఎవరో చెప్పగా విని మానాన్న నన్ను అవధూత శివానంద మౌనస్వామి దగ్గరకు తీసుకువెళ్లారు. 14ఏళ్ల మౌనవ్రతంలో ఉన్నారాయన. నేను త్వరలోనే బాగవుతానని పలకమీద రాసి చూపించారు. ఆయన ఆశీర్వాద బలంతోనే నేను మళ్లీ మామూలు మనిషినయ్యాను. ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందనీ కాబట్టి రోజూ ధ్యానం చేయమనీ చెప్పారాయన. ఈ రోజుకూ ఆయన మాట తూచా తప్పకుండా పాటిస్తాను. ధ్యానం వల్ల నాలో చాలా మార్పులు వచ్చాయి. పద్యాలూ, శతకాలూ ఏవైనా ఒక్కసారి వినగానే వచ్చేసేవి. ఛందస్సు అంటే ఏమిటో తెలియక ముందే... నా నోటివెంట పద్యాలు అలవోకగా వచ్చేవి. అలా నాకు తెలియకుండానే ఛందోబద్దంగా పద్యాలు చెప్తుంటే విని స్కూల్లో ఉపాధ్యాయులే పృచ్ఛకులుగా మారి నాతో అవధానం చేయించారు. పదోతరగతి చదువుతుండగా నేను చేసిన వెుట్టవెుదటి అవధానం అది. ఆ తర్వాత... ఇంటర్‌ చదువుతున్నప్పుడు తిరుపతిలో అవధానం చేస్తుండగా అప్పటి తితిదే కార్యనిర్వహణాధికారి పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ 'ఈ అబ్బాయి ఎప్పుడు కోరితే అప్పుడు తితిదేలో ఉద్యోగం ఇస్తామ'ని అక్కడికక్కడే ప్రకటించారు. ఎమ్మే(తెలుగు) పూర్తయ్యాక అన్నమాచార్య కీర్తనలపై పి.హెచ్‌డి వెుదలుపెట్టాను. నా పరిశోధన పూర్తికాకముందే తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టులో రీసెర్చి అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. నా ఉద్యోగ దరఖాస్తుపై పి.వి.ఆర్‌.కె. గారు సంతకం పెట్టిన క్షణాలు... నా జీవితంలో అత్యంత ఆనందదాయకమైనవి. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి మెడిసిన్‌ చేస్తోంది. అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వాడూ పద్యాలు చెప్పగలడు. బాగా అభ్యాసం చేస్తే అవధానాలు కూడా చేయగలడు. కానీ వాడికా ఉద్దేశం లేదు. నా పిల్లలకే కాదు, చదువుకునే వారెవరికైనా నేను చెప్పేదొక్కటే... ఎంచుకున్నది ఏ రంగమైనా దానిపై అంకితభావం ఉండాలి. పట్టుదలకు ఏకాగ్రత తోడైతే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చు. ఇక... ధ్యానం మన సంస్కృతి మనకిచ్చిన జ్ఞానసాధనం. దానివల్ల ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని విజయం సాధించే ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత సొంతమవుతాయి. ఏకకాలంలో అనేక విషయాలమీద దృష్టిని కేంద్రీకరించగలిగిన ఏకాగ్రత కూడా మనిషికి సాధ్యమేనని అవధానం నిరూపిస్తోంది కదా. అవధానికి సాధ్యమైనది మీకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు... ప్రయత్నించండి!

శత, సహస్రావధానాలు
పేరును బట్టి అష్టావధానమే ముందు పుట్టింది అనుకుంటారు గానీ... అన్నిటికీ పెద్దన్న శతావధానమే. ధార, ధారణ ఉండే అవధానికి శతావధానం నల్లేరు మీద బండి నడకే. ఇందులో నూరుగురు పృచ్ఛకులు ఒకేసారి అవధానికి వారికి నచ్చిన అంశాలు ఇస్తారు. వారందరికీ అడగగానే తొలిపాదం చెప్పాలి. ఇలా వందమందికి తొలిపాదం చెప్పిన తర్వాత రెండో ఆవృతంలో అవధాని పృచ్ఛకుని చూడగానే గుర్తించి రెండో పాదం చెప్పాల్సి ఉంటుంది. ఇలా నాలుగు పాదాలకు నాలుగు ఆవృతాలు ఉంటాయి. ఇదే ప్రక్రియను రెండువందల మందితో చేస్తే ద్విశతావధానమనీ ఐదువందల మందితో చేస్తే పంచశతావధానమనీ అంటారు. వెయ్యిమందితో చేస్తే సహస్రావధానం అంటారు. వెయ్యి మంది పృచ్ఛకులు అడిగిన సమస్యలను పూరించడం ఒక ఎత్తయితే, ఆశువుగా చెప్పిన అన్ని పద్యాలనూ అవధానం చివర్లో అక్షరం పొల్లుపోకుండా వరుస క్రమంలో అప్పచెప్పడం ఎంతకష్టవో... అసలది ఎలా సాధ్యవో అవధానులకే తెలియాలి.


జంటకవులు

వధానాల్లో జంటకవులది ప్రత్యేక శైలి. ఒక్కరే చేయాల్సిన అవధానాన్ని ఇద్దరు కవులు చేయడం మరింత సులభం అని అనుకుంటాం. కానీ దీనిలో కూడా క్లిష్టత లేకపోలేదు. పద్యంలోని వెుదటిపాదం ఒకాయన చెప్తే రెండో పాదం మరొకాయన అందుకుంటాడు. మూడోపాదం మళ్లీ వెుదటాయన వంతు అయితే నాలుగోపాదంతో రెండో అవధాని ముగిస్తాడు. అలా చేయాలంటే ఇద్దరి ధార, ధారణ, ధోరణి ఒకేలా ఉండాలి. ఇద్దరూ సమాన పాండిత్యం కలిగి ఉండాలి. అలాంటివారిలో ప్రముఖులు... తిరుపతి వేంకట కవులు. అవధాన వైతాళికులుగా పేరొందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి జంట అవధానాలకు ఆద్యులు. తెలుగు సాహితీ సుమగంధాలను సామాన్య జనవాహినికి చేరేలా చేసిన ఘనత వీరికే దక్కుతుంది. పామరులు కూడా అవధానాల్ని ఆస్వాదించేలా సాధారణ విషయాలను కూడా మిళితం చేసేవారు. చీపురుపుల్ల నుంచి చిన్నయసూరి వరకూ అన్నీ వీరి అవధానంలో చోటుచేసుకునేవి. వారితో పాటు ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది కొప్పరపు సోదరుల (కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, వేంకట రమణ కవి) గురించి. చాలా సందర్భాల్లో తిరుపతి వేంకట కవులను సవాల్‌ చేసి ఎదురు నిల్చిన ప్రతిభ వీరి సొంతం. అడిగిందే తడవుగా అత్యంత వేగంగా అంతే రమ్యంగా పద్యాలు చెప్పడం వీరి ప్రత్యేకత. ఇంకా... వేంకట రామకృష్ణ కవులు, రాజశేఖర వేంకట కవులు, పల్నాటి సోదరులు, దేవుల పల్లి సోదర కవులు(వీరు ముగ్గురు), ఆధునిక జంటకవులుగా పేరొందిన పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు ఇలా చాలా మందే ఉన్నారు. ఇటీవలి కాలంలో... జంటగా సహస్రావధానం చేసి పేరొందిన వారు కడిమిళ్ల వరప్రసాద్‌, కోట లక్ష్మీనరసింహం.

Courtesy: ఈనాడు

*****Telugu avadhanam Eenadu march 2006 Andhra Pradesh Andhraite Dravidian discussion


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 6:12 PM, Blogger raybanoutlet001 గారు చెప్పినారు...

coach outlet online
nike store
ralph lauren uk
michael kors handbags outlet
louis vuitton sacs
ugg boots
converse trainers
yeezy shoes
ugg outlet
ugg boots

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home