తెలుగులో వచనం-నేను నేర్చిన పాఠం!
- విప్లవ్ రెడ్డి
తెలుగు భాష మీద నాకు అవగాహన తక్కువే. గత నెలరోజులుగా భాషౌన్నత్యం మీద, ప్రాచీనతావాదాల మీద వస్తున్న వ్యాస పరంపరను చది వి తర్కంతో కూడిన వ్యాసాలు రాయడంలో, సరైన వాక్యనిర్మాణంలో నాకున్న ఆలోచనా పరిధిని పెంచుకుందామని తలచాను. తెలుగు భాష గురించి రాస్తున్న పండితుల రాతలే మంచి చోటు అనుకుని వాటినే చదివాను. ఇట్లాగైనా కనీసం సరైన వాక్యనిర్మాణమేనా నాకు అబ్బుతుందనిపించింది. నా శ్రమ వృధా కాలేదు.
"తెలుగుభాషను ప్రాచీనభాషగా గుర్తించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలని అధికారభాషా సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెలల క్రితమే కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ మానవవనరుల అభివృద్ధిశాఖకు ఒక లేఖరాయడం ఎంతైనా ముదావహం. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటూ చెలరేగుతున్న ఆందోళన నేపధ్యంలో అస లు విషయంలో తమిళభాషకు ఉన్నదేమిటి? తెలుగు భాషకు లేనిదేమిటి? అన్న ప్రశ్నలపై చర్చ మొదలైంది.''
"మాతృభాష అంటే ప్రథమభాష. బాల్యదశ నుండి జీవిత చరమాంకం వరకు ఉండేది. మాతృస్తన్యంతో పాటు అలవడిన భాష''
"ఒక భాషకు ఎంతో ప్రాచీనత ఉంటేనే, భౌగోళికంగా ఇంత విస్తృతం కావడానికి అవకాశం ఉంటుందనీ భాషా శాస్త్రవేత్తల సునిశ్చితాభిప్రాయం. మరి ఇంత విస్తృతి గల తెలుగుభాషను పక్కనబెట్టి కేవలం తమిళ భాషకు మాత్రమే ప్రాచీనత కట్టబెట్టడం శోచనీయం'' "కానీ మన భాషనే అధోగతికి దిగజార్చేది ఏ రకం సంస్కృతి? తెలుగు వాళ్ళు చదివేది తెలుగు వాళ్ళకు ఉపయోగపడాలి కాని అమెరికా వాళ్ళకో, బ్రిటన్ వాళ్ళకో ఉపయోగపడాలనుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాక సామాజిక ద్రోహం కూడా. ఇంజనీరింగ్ కాని, వైద్యశాస్త్రం కాని చదవాలనుకోవడం మరో దేశ ప్రజలకు సేవ చేయడానికా? వీళ్ళ చదువులకయ్యే ఖర్చుల్లో ఎక్కువశాతం భరిస్తున్నది తెలుగు ప్రజలే. అందువల్ల సాంకేతిక విద్యలతో సహా అన్ని రకాల విద్యలూ తెలుగులో జరిగేటట్లు చూడడం తెలుగువారి కర్తవ్యం.''
"ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలన్న కోర్కె ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుజాతి గుండెచప్పుడుగా మారిపోయింది. తెలుగుజాతి ప్రతిష్ఠకు సంబంధించిన సమస్యగా పరిణమించింది. మనచేత కాని తనంపైన మన భాష భవిష్యత్తుపైన ఆవేదన ఆందోళన లు వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసాంధ్రులైతే పాపం వారి ధ్యాస ధ్యానం ఎప్పుడూ మాతృదేశంపైన మాతృభాషా సంస్కృతులపైనే!''
"తెలిసిన అరకొర సమాచారం ఆధారంగా నిర్ణయాలు చేసుకోవడం, వాటిని పట్టుకొని అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం. తమకే దేశభక్తి ఉన్నదనీ, ఇతరులంతా దేశద్రోహులనీ భావించేవారు రాజకీయాలలో ఉన్నట్టే తమకే తెలుగుభాష పట్ల ప్రేమ ఉన్నదనీ, ఇతరులంతా భాషా భ్రష్టులనీ అనుకునేవారు తెలుగుసమాజంలో ఉన్నారని కూడా తెలుగు చర్చ వెల్లడిస్తున్నది.''
"తమ భాషను తాము ప్రేమించలేని వాళ్ళు పుట్టకురుపులాంటి వాళ్ళు. వాళ్ళూ బాగుపడరు. సమాజాన్నీ బాగుపరచరు. భాష సర్వతోముఖాభివృద్ధికి ఉపకరించని ఇలాంటి వాళ్ళవల్ల భాషకే కాదు ఏ సమాజానికీ ఉపయోగం లేదు''
"ఎల్లయ్యమీద పుల్లయ్య ఆరోపణలు చేస్తే, ఎల్లయ్య అభిప్రాయం ఏమిటో కనుక్కోకుండా పుల్లయ్య చేసిన ఆరోపణలను యథాతథంగా ప్రసారం చేయడం లేదా ప్రచురించడం అనుచితమన్నది ప్రచార మాధ్యమాలు పాటించవలసిన ప్రాథమిక సూత్రం. మన మాధ్యమాలలో ఈ సూత్రాన్ని ఉల్లంఘించిన సందర్భాలు లేకపోలేదు. వార్తా పత్రికలలో, టీవీ చానళ్ళలో పోటీ ఉంటుంది కనుక హడావుడిగా వార్తలు వండవలసి రావడంతో నిజానిజాలు తెలుసుకునే వ్యవధి ఉండదు. ఇతరు లు తొందరపడటం ఎందుకు?''
'దేశభాషల ప్రాచీన భావము గుర్తించుటకు వెయ్యి సంవత్సరముల లిఖిత చరిత్ర యుండవలెనన్న కేంద్రప్రభుత్వపు నిర్ణయము తమిళభాషకు ప్రాచీన హోదా లభించిన వెంటనే ముగిసిపోయి, అది తిరిగి 1500-2000 సంవత్సరములై మార్పు చెందుట తక్కిన ప్రాచీన భాషలన్నిటిని తీవ్రమైన వివక్షతకు గురిచేసినది. కేంద్రప్రభుత్వ నిర్ణయము తెలుగుభాషకు శరాఘాతమై నిలుచుట సందేహములేని విషయము. కానీ, క్రీస్తుపూర్వము నుండి అటుపిమ్మట 2500 సంవత్సరముల చరిత్రలో పెక్కు ఆధారములు గలిగియున్న తెలుగుభాషకు ఇటువంటి పరిస్థితి కలుగుట కేవలము కేంద్రముదే తప్పిదము కాదు. ఇందులో మన వైఫల్యములే, మత భేదములే కారణములై యున్నవి''
"పురాణముల నుండి తక్కిన కావ్యములనుండి పుట్టిన పదములు ఆర్య, సంస్కృతభావ వాదమునకే చెందగలవు. అవి తెలుగునకు సమాంతరమని, ప్రత్యామ్నాయము కలిగి, ప్రాచీన రూపము కలిగి, దక్షిణాది జాతులలో అతి ప్రాచీనభాషయైన తెలుగునకు ఒక సంకీర్ణ చరిత్ర కలుగుట వల్లనే దాని ప్రాచీన చరిత్రకు అవరోధము కలిగినదనుట తప్పుట లేదు.''
"శాస్త్రీయమైన ఆలోచనలతో, చారిత్రక ఆధారాలతో కూడిన నివేదికను సిద్ధం చేసుకోగలగాలి. ఆ తర్వాతనే-వెయ్యేళ్ళు, పదిహేను వందల ఏళ్ళ నిబంధనల న్యాయాన్యాయాలను గురించి ఆలోచించుకోవచ్చు. పునరాలోచన చేయమని కేంద్రాన్ని కోరవచ్చు. ఒప్పించవచ్చు.''
"సుమేరియన్లు తెలుగునేల నుండి వలసవెళ్ళిన వారే అనడానికి ప్రాచీన శిలాసమాధులు సాక్ష్యం. ఇరాక్‌లోని కిర్కుక్ పట్టణంలోని సమాధులు మెదక్‌లోని మర్కుక్ ప్రాంతంలో పురావస్తు శాఖవారు జరిపిన తవ్వకాలలో బయటపడ్డ సమాధులు ఒకే జాతీయులు ఏర్పాటు చేసుకొన్న సమాధులే.''
" 'ఊరు' అనే బాబిలోన్‌కు పొరుగునగరం. మరొక నగరం పేరు నిప్పూరు. నిప్పు+ ఊరు= అగ్నినగరం. ఈ పేర్లు తెలుగు నామాలు. నిప్పూరు క్రీ.పూ. 1500 సంవత్సరాల నాటి నగరం. సింహళంతో నౌకాసంబంధాలు హాలుని రాణి సింహళ రాజకన్య లీలావతి కళ్యాణానికి బాటలు వేశాయి. వీరిద్దరి వివాహం సప్తగోదావరి తీరం వెంపల్లి వెంకటరావుపేటలో జరిగింది. క్రీ.పూ. 3000 సంవత్సరాలకు క్రితం ఇక్కడి జాతీయులకు సోదరులుగా ఇరాన్ ఇరాక్ ప్రాంతాలకు, రోం నగర ప్రాంతాలకు, అస్సిరియా ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడి, సుమేర్ ప్రాంతీయులుగా పేరుపడి, తమ పూర్వీకులైన తెలుగువారితో సంబంధాలు, వ్యాపార లావాదేవీలు కొనసాగిం చారు. సోదర జాతీయులు కనుక అంత దూరం వ్యాపారం చేయగలిగారు.''
"నన్నయ్యకు ముందుయుగంలోనే దేశీ, సంస్కృత ఛందస్సులతో కూడిన పద్యశాసనాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగుభాషలో వెయ్యి సంవత్సరాలకు ముందే సాహిత్యగ్రంథాలుండేవని,తెలుగుభాషకు రెండువేలసంవత్సరాల చరిత్ర ఉందనీ పలుఆధారాలతో ఆచార్యవిశ్వనాథం నిరూపించారు.''
"పైన చెప్పిన హేతువుల దృష్ట్యా, సంస్కృతం, పాళీ, ప్రాకృతం, తమిళంతో పాటు, పై మూడుభాషలను కూడా శ్రేష్ఠభాషలుగా భారత ప్రభుత్వం గుర్తించాలని నేను సిఫార్సు చేస్తున్నాను. లేని పక్షంలో, ద్రావిడభాషా వ్యవహర్తల్లో నాలుగింట మూడొంతుల మంది మనోభావాలను నొప్పించినట్టవుతుంది''
'తెలుగువారికి భాషాభిమానం అసలే లేదు. తెలుగుదనాన్ని నిలబెట్టుకుని, భాషను పోషించుకోవటానికి ప్రభుత్వం అన్ని విధాల సహకరించి భాషాభివృద్ధికి తోడ్పటం లేదు. భాషాపరమైన సమస్యల పరిష్కారంలో భాషా శాస్త్రవేత్తలు తగిన సూచనలివ్వడం లేదు. వారు కూడా తెలుగుభాషాభివృద్ధికి దోహదం చేయడం లేదు. ప్రతి వ్యక్తీ మాతృభాషాభిమానాన్ని కలిగి ఉండేట్టు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చటం లేదు. రాష్ట్ర ప్రజలను సుసంఘటితం చేయడానికి భాష ఒక్కటే మార్గమని ఎవరూ గ్రహించటం లేదు.''
పై వాటిని చదివాక ఆ చివరగా రాసిన దాంట్లోది 'తెలుగువారికి భాషాభిమానం లేదు' అంటే ఎందుకో ఒప్పుకోబుద్ధి అవలేదు. కానీ నేను అనవసరతర్కం జోలికి వెళ్ళకుండా వాక్యనిర్మాణాన్ని మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను. ముందే చెప్పినట్టు నా శ్రమ వృధా కాలేదు. ఎట్లాగైతేనేం, చివరకి 'ఎలా రాయకూడదో' తెలుసుకున్నాను. తెలుగు పండితులకు నేనెల్లప్పటికీ కృతj~nuడనే.
నాది కూడా చివరి మాటొకటి: తెలుగు ప్రాచీనత మరియు ఆయా రాజకీయాల మీద, రావలిసిన వందకోట్ల మీదా, రాని పీఠాల గురించీ గత నెలరోజుల్లో వచ్చిన వ్యాసాలు చాలా వరకు చదివాను. ఇంత వరకూ నాకు తెలిసి ఒక్క వ్యాసం కూడా మొదలుపెట్టిన చోట అంతం కాలేదు. ఒకటి తెలీవాహలో మొదలై ఇప్పటి ఇరాక్‌లో అంతమవుతుంది. మరొకరు తమిళుల రాజకీయాల్లో మొదలుపెట్టి రాజభాష బాట లో కొద్ది సేపు నడిచి నిజాం సమాధులమీదుగా భావితరాల మేధోసంపత్తి గురించి ప్రస్తావిస్తారు. ఇంకొకరు ఒకే వ్యాసంలో ఎవరెవరినో వొణికించమంటారు, బానిస శృంఖలాలు తప్ప పోయేదేం లేదు అంటారు, తిరుపతి కొండకు ఉత్తరాన ఉన్నదం తా మనదే అంటారు (తెలీవాహ గురించిన వ్యాసాలు ఈయన చదివి ఉండరు). అందుకని, తెలుగు గురించిన వ్యాసాలు వేటికవే చూస్తే తర్కంలో తప్పుతున్నాయనిపించి ఆ రాతలను నాకు తోచినట్లు పేర్చుకుని చదువుకున్నాను. ఈ శ్రమ మాత్రం వృధా అయింది. మీ టైం వేస్టుచేస్తే క్షమించండి.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh Jyothi Jyothy March 2006 Viplav Reddy
0 Comments:
Post a Comment
<< Home