"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Monday, March 20, 2006

అందమైన గ్రంథంలో అసంగతాలు!


నన్నయగారి శ్రీమహాభారతం- 'తెలుగు భారతం' కాకుండా ఎవరో ప్రకాశకుల పుణ్యమా అని 'శ్రీమదాంధ్ర మహా భారతము' ఐనది. అట్లే కొందరు భాగవతానికి పేరుంచినారు. పోతనగారు- ఆయన శిష్యులు- 'శ్రీ మహా భాగవతము' అనే అన్నారు. దీన్ని ఇప్పుడు తి.తి.దే.వారు వ్యాప్తినిబట్టి 'పోతన భాగవతము'అని- ఇతర స్కంధాలను తెనిగించిన వారిని లోపల పడవేసినారు.

తిరుమల-తిరుపతి దేవస్థానాల(టిటిడి)వారు స్వామివారికి వచ్చే కొంత ఆదాయం నుండి కొంత ధనాన్ని ధార్మిక గ్రంథ ప్రకాశనానికి వినియోగిస్తూ- ఎందరో రచయితలకు తోడ్పడి వారి రచనలు వెలుగు చూడటానికి అవకాశం కల్పించటమేగాక- స్వయంగా టిటిడివారే కొన్ని గ్రంథాలను ముద్రించి సామాన్యమైన ధరలతో అందుబాటులోనికి తేవటం అనే సత్కార్యం- శాశ్వతంగా కొనియాడబడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈ పరంపరలో వీరు ప్రచురించిన గణనీయ గ్రంథంలో ఒకటి పోతన భాగవతం. మన సాహితీ లోకంలో సుప్రసిద్ధులైనవారి సంపాదకత్వాన వారి విలువైన పీఠికలతో- పద్యం, ఆ పద్యానికి సులభశైలి వచనం ఇట్లా సిద్ధం చేయించారు. ఈ పుస్తకం 1987లో ప్రథమ ముద్రణగా 1/8 డెమ్మీ సైజులో 17 సంపుటాలుగా ముద్రణమై- అనతికాలంలోనే బాగా ప్రచారమైనాయి. 1998లో పునర్‌ముద్రితమై, పరివర్ధిత ముద్రణగా 2004లోను, 2005లోను ఈ గ్రంథరాజం వెలువడ టం తెలుగు ప్రజలకు శ్రీ మహాభాగవతంపైనగల ఆదర భక్తి భావాలు, తి.తి.దే. వారి గ్రంథ ప్రచురణ ప్రచారాలు- రూఢీయైనాయి. పోతన భాగవతం పేర 1/4 డెమ్మీ సైజులో గట్టి బైండు, అందమైన కవరుపేజీ-దానిపైన పోతనగారి వర్ణచిత్రంతో ఆకర్షణీయంగా మొత్తం ఐదు వాల్యూములుగా 2005లో ముద్రణమై వ్యాప్తిలోకి రావడం ఆనందదాయకమైన విషయం.

అయితే, ఈ గ్రంథం సంపుటాలను చూస్తే కొన్ని సంశయాలు కలుగుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 1. అంతా 'పోతన భాగవతము' అవునా? 2. 'సరళ గద్యానువాదము', 3. 'షష్టమస్కంధం' ఏమిటి? వీటిల్లో మొదటిది- తెలుగునాట తెలుగు భాగవతం అనగానే గుర్తు వచ్చేది పోతన మహాకవియే అనడంలో సందే హం లేదు. అందుకే వీరి ఐదవ స్కంధం ప్రవేశికలో 'ఈ మహా గ్రంథం పోతన భాగవతంగానే ప్రసిద్ధికెక్కింది' అని తెల్పినారు. మొట్టమొదటి తెలుగు భారతం వలెనే ఈ భాగవతం కూడా ఏక కవి కర్త­ృకం కాదనేది సర్వజన విదితమైన విష యం. భారతంలో ఎర్రన, తిక్కనలను వారికృతులను తెల్పుకున్న విధంగానే ఈ భావతం కూడా ఆయా స్కంధాలవద్ద ఆయా రచయితల పేర్లను చేరిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే పోతనగారు 1.4.7.8.9 స్కంధాలను అనువదించగా, ఎలిగందల నారయ తెనిగించిన దశమస్కంధం కూడా పోతన పేరనే ప్రసిద్ధమైం ది. ఎలిగందల నారయ 2.3.10.11.12 స్కంధాలను తెనిగించిన మహాకవి (వీటి ల్లో కొన్ని పోతన పేరున వ్యాప్తమైనాయి). దశమ స్కంధం ఉత్తర భాగం 'కాటుక నెఱయంగ...(23) పద్యం) నుండి నారయ రచనయైనా పోతన పేర గద్యం కలదు. ఇక మిగిలినవారిలో గంగన ఐదోస్కంధాన్ని సింగన ఆరవ స్కంధాన్ని పూర్తి చేసినారు.

ఈ విషయాలన్నీ చిరకాలంగా మన సాహిత్య విమర్శలో, భాగవత రచనా విషయంలో ప్రసిద్ధమైనవాదోపవాదాలే! ఐనా వీటన్నింటినీ అటుంచి మొత్తానికి మొత్తం 'పోతన భాగవతము' అని పేరుంచినారు. ఆయా స్కంధాల్లో లోపల ఎక్కడో కవుల పేర్లు తెల్పడం కన్నా ముఖపత్రంపైన తెల్పితే ఇంకా బాగుం డేది. ఇంతకూ ఈ సంశయమంతా రావటానికి 'పోతన భాగవతము' పేరు ముఖ్య కారణము. అందుకే 1968లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య ఎకాడమీ 'బహుపాఠాంతర పరిష్కార విపుల పీఠికా సహితం'గా ముద్రించిన గ్రంథానికి 'శ్రీ మహా భాగవతము' అని సరియైన పేరునే పెట్టినారు. నన్నయగారి శ్రీమహాభారతం- 'తెలుగు భారతం' కాకుండా ఎవరో ప్రకాశకుల పుణ్యమా అని 'శ్రీమదాంధ్ర మహా భారతము' ఐనది. అట్లే కొందరు భాగవతానికి పేరుంచినారు. పోతనగారు- ఆయన శిష్యులు- 'శ్రీ మహా భాగవతము' అనే అన్నారు. దీన్ని ఇప్పుడు తి.తి.దే.వారు వ్యాప్తినిబట్టి 'పోతన భాగవతము'అని- ఇతర స్కంధాలను తెనిగించిన వారిని లోపల పడవేసినారు. పోతనగారి స్కంధాల వరకు 'పోతన భాగవతము' అంటే బాగుండేది. ఇంకా ఈ వివాదాలు కలుగకుండా 'శ్రీ మహా భాగవతము' పేరు ఎంతో సమంజసంగా ఉండేది.

ఇక రెండో విషయం- 'సరళ గద్యానువాద సహితం' ఒకరు చెప్పిన దానిని మరల చెప్పటం లేదా భాషాంతరీకరణం అనేవి 'అనువాదము' అనేదానికి నిఘం టువులు అర్థములనిచ్చినాయి. సామాన్యంగా అనువాదం అనగానే ఒక భాష నుం డి మరొక భాషలోనికి పరివర్తన చేయడం అనేది రూఢియైనప్పుడు, ఇంతమంది పెద్దలు కలిసి గద్యానువాద సహితం అనటానికి కారణమేమిటి? మామూలుగా ఐతే- సరళ/సులభ- తాత్పర్య లేదా భావయుక్తం అంటే అది ప్రహతమైన విష యం. ఆరవ స్కంధానికి 'ప్రతిపద్య భావార్థసహితము' అని. 'సరళ సుందర గద్యంలో అనువదించినవారు'- అని కూడా ప్రవేశికలో చెప్పినారు. కాండాంతం/ ఆశ్వాంతాల్లో గద్యలుంటాయి. ఆ గద్యలకు మనలాక్షణికులు భేదాలను కూడా చెప్పినారు. పద్యాలను పూర్తిగా వచనంలో చెపితే అది వచన భాగవతం/ వచన భారతం అనే విషయం ప్రసిద్ధమై- ఆ విధంగా వచ్చిన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వీరు 'గద్య'నే గాకుండా 'అనువాదము' అని కూడా అనటంలోని పరమా ర్థం ఏమి కావచ్చు? ఎక్కడ కూడా దీని వివరణ లేదు. తెలుగు పద్యాలకు వీరు వ్రాసిన భావమంతా అనువాద ప్రాయమని తలంచవలెనా? అది గద్యమా? వచనమా?

మూడవ విషయం- రెండవ సంపుటం ముఖ పత్రంపైన

చతుర్థ-పంచమ-షష్టమస్కంధములు అని వేసినారు. ఈ ముద్రాక్షరదోషాలను చూచినవారే లేరా? లోప లి పేజీల్లో మొదటి స్కంధం, రెండవ స్కంధం అని ఇట్లే ఐదవ, ఆరవ స్కంధం అని పెట్టిన వీరు ఏ సంపుటానికి ఎవరు అనువాదకులు అని తెల్పిన జాబితాలో 'షష్ఠమస్కంధము' 'తలమర్ల కళానిధి' అని మంచిగా కలదు. పంచమ-సప్తమ మధ్యన వచ్చేది కాబట్టి ముద్రాధికారులు 'షష్టమ'చేసినా చూడలేదే! అసలు షష్ఠ- ఆరు సంఖ్యను. షష్ట- 60 సంఖ్యను తెల్పుతాయి గదా! ఇంత అచ్చుతప్పు ముఖపత్రం మీదపడిన వేలకొద్ది పుస్తకాలు లోకం మీద వ్యాప్తి చెందుతుంటే- వీటిని చూచి శబ్ద విషయం తెలిసిన పెద్దలు ఎంత బాధపడుతారో? అది శ్రీ వేంకటేశ్వర స్వామివారే గమనిస్తారేమో! ఇకనైనా దేవస్థాన ప్రచురణల విభాగం వారు శ్రద్ధాళువులై మిగిలిన పుస్తకాల 'షష్టమ'ను 'షష్ఠ'గా మార్పించి అక్షర దోషాలను అక్షరత్వమందకుండా చేస్తారని ఆశిస్తాను. సాహితీలోక సుప్రసిద్ధుల సంపాదకత్వం-జగద్విఖ్యాత దేవస్థాన ప్రచురణమైన అత్యున్నత గ్రంథరాజం ఇట్లా దోషపూరిత ముఖపత్రంలో వ్యాప్తి చెందడం శాశ్వత బాధాకర విషయం.

ఇక- ఈ సంపుటాలను పూర్తిగా చదివితేనే పెద్దలు కూర్చిన భావముల తీరు అవగతమవుతుంది. దశమ స్కంధం (నాలుగవ సంపుటం) ప్రవేశిక ఆరవ పుటలో 'ఈ స్కంధాన్ని ఐదు సంపుటాలుగా వెలువరించటానికి'- అన్నారు. దశమ స్కం ధాన్ని ఐదు భాగాలుగా వేయరు కదా? బహుశా ఇది (ఈ గ్రంథాన్ని) అని సవరించుకోవలెనేమో! తెలుగువారి అక్షయ సాహిత్యనిధులు- సంస్క­ృతికి పట్టుగొమ్మలైన- శ్రీ మహా భారతం (వ్యాఖ్యతో) శ్రీ మహా భాగవతాలను చూడముచ్చటైన సంపుటాలలో- అద్భుత రీతిగా అందించి- ఈజాతి కృతజ్ఞతలనందుకుంటున్న తి.తి.దే. వారి కృషి నిరంతర స్మరణీయమనడంలో సందేహం లేదు.

- శ్రీరంగాచార్య

Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh Nannayya Andhra Mahabharatam Pothana Sri Rangacharya Jyothi Jyothy


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home