అమెరికాలో నోరూరిస్తున్న తెలుగురుచులు !
అమెరికాలో ఓ తెలుగు ఆడపడుచు హోటల్ నడపడమంటే ఆషామాషీ కాదు.. ఇబ్బందులకు ఎదురొడ్డి నిలిచి అనుకున్నది సాధించారామె. ప్రస్తుతం అమెరికన్లకు ఆంధ్రా వంటకాల రుచిచూపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె 'వసుంధర'తో తన అనుభవాలు పంచుకున్నారు.
చికాగోలో హేమాస్ కిచెన్‌కు మంచిపేరే ఉంది. అచ్చతెనుగు ఆడపడుచు హేమ పోట్ల దాని యజమాని. ఆమెది రాజమండ్రి దగ్గరి ధవళేశ్వరం. ఎకనమిక్స్‌లో పీజీచేశారు. వ్యాపారం చేయాలనేది ఆమెకల. కానీ పెద్దల ప్రోత్సాహం లభించలేదు.
జీవితాన్ని మలుపు తిప్పిన పెళ్లి
వివాహమయ్యాక ఊరికే ఉండడం ఇష్టంలేక హైదరాబాద్‌లో బ్యూటీ పార్లర్, కాస్మటిక్స్ షాప్ నడిపించారు హేమ. టైలరింగూ చేశారు. అప్పట్లో పార్లర్‌కు వచ్చే అమెరికన్లు కొందరితో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయి. అమెరికాలో బిజినెస్ ఎందుకు చేయకూడదు? అని అడిగారు వారు. ఆ ఆలోచన హేమకూ నచ్చింది. భర్త పద్మనాభం వద్దన్నారు. పోనీ తను వెళ్తానన్నారామె. ఒంటరిగా నిలదొక్కుకోలేవన్న ఆయన మాటలు హేమలో పట్టుదల పెంచాయి.
అమెరికాలో తెలిసిన వాళ్లను సంప్రదించి వారు రమ్మనడంతో 1988లో చికాగో చేరుకున్నారు హేమ. ఏదైనా స్టోర్స్ పెట్టాలని ఆమె ఆలోచన. తెలిసినవాళ్లు రమ్మన్నారే తప్ప తీరా వెళ్లాక పట్టించుకోలేదు. దాంతో సొంతంగా ప్రయత్నాలు ప్రారంభించారు.. బిజినెస్‌పై అవగాహనకని ఓ రెస్టారెంట్‌లో హెల్పర్‌గా చేరారు. ఆరునెలల్లో వంటల్లో ఆమె ప్రతిభకు మంచి గుర్తింపే వచ్చింది. ఇతర రెస్టారెంట్లవాళ్లు తమవద్దకు రమ్మని కోరారు.
సొంత వ్యాపారం
అక్కడా ఇక్కడా పనిచేసే రోజుల్లోనే చికాగోలోని దివాన్ ఎవెన్యూలో (భారతీయులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని లిటిల్ ఇండియా అంటారు) ఓ చిన్న రెస్టారెంట్ అమ్మకానికి వచ్చింది. దానిపేరు ఢిల్లీ దర్బార్. నానా ఇబ్బందులు పడి దాన్ని కొని 'హేమాస్ కిచెన్'గా పేరు మార్చారామె. అప్పట్లో రెస్టారెంట్లో 38 సీట్లు ఉండేవి. రోజుకు 25 శాతం బిజినెస్ మాత్రమే జరిగేది. మొదటిరోజు ఆదాయం 147 డాలర్లు. దాన్ని నూరుశాతం బిజినెస్ ఇవ్వగలిగే స్థాయికి తేవడానికి హేమకు పదకొండేళ్లు పట్టింది. ఇప్పుడా రెస్టారెంట్‌లో 80 సీట్లున్నాయి.
నోరూరించే వంటకాలు
మొదట్లో భారతీయ ఆహారం మాత్రమే వడ్డించిన హేమ క్రమంగా పాకిస్థానీ వంటకాలనూ చేర్చారు. రెస్టారెంట్‌లో ఆంధ్రా వంటకాలు 25 శాతం, ఉత్తరభారత వంటకాలు 75శాతం ఉంటాయి. ఆంధ్రా వంటకాల్లో ఆలు జీరామటన్, ఆలు బైంగన్, పప్పు, దాల్‌పాలక్, దాల్ బైంగన్ వంటివి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మోడిఫైడ్ ఆంధ్రా చేపలపులుసు. ఇంకా రొయ్యల బిరియానీ, హైదరాబాద్ బిరియానీ, వెజిటబుల్ బిరియానీ వంటి రకరకాల బిరియానీలు లభిస్తాయి.
వంటకు కావలసిన పదార్థాలు ఏఏ పాళ్లలో ఉండాలో సహాయకులకు చెప్పి దగ్గరుండి చూసుకుంటారు హేమ. మనం అందించే ఆహారం తాజాగా.. రుచిగా ఉండాలి. అప్పుడే మనకి గిరాకీ అంటారామె. చికాగోలో 150 రెస్టారెంట్లున్నా ఇండియన్‌ఫుడ్ కావాలంటే అమెరికన్లు తన రెస్టారెంట్‌కే వస్తారంటారు హేమ. అమెరికన్లు భారతీయ వంటకాలను ఇష్టపడుతున్నారని, మసాలాలూ లాగిస్తున్నారని చెప్పారు. 'కారాలు తినడంలో వారికి తేడాలున్నాయి. అందుకే వాళ్లకోసం స్పైసీ, మీడియం, బ్లాండెడ్ రకాల మసాలాలు చేస్తా'మన్నారు. తమవద్ద చైనీస్, జపనీస్, యూరోపియన్ దేశాల వంటకాలూ ఉంటాయంటున్న ఆమె అమెరికన్లు చైనీస్‌ఫుడ్‌తోపాటు ఇండియన్ ఫుడ్‌ను ఇష్టపడతారన్నారు.
పాకశాస్త్ర బోధకురాలిగా..
వంట చేయడం.. చేయించడమే కాదు హేమ నేర్పిస్తారు కూడా. యాజమాన్యాల కోరికపై అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లి వంటలు ఎలా చేయాలో బోధిస్తారు.
రెండో రెస్టారెంట్
మొదట్లో అంతంత మాత్రంగా ఉన్న వ్యాపారం క్రమంగా పెరగడంతో ఇప్పుడు హేమ హేమాస్ కిచెన్‌కాక మరో రెస్టారెంట్‌నూ నిర్వహిస్తున్నారు. తమ రెస్టారెంట్లలో ఈవెనింగ్ డిన్నర్‌కు రద్దీ ఎక్కువని ఆమె చెప్పారు. ఆరోగ్యపరంగా ఏమాత్రం తేడా వచ్చినా అక్కడ కేసుల తలనొప్పులు ఎక్కువే. అందుకే పరిశుభ్రత విషయంలో తామెప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటామని ఆమె అన్నారు. చికాగోలో ఆమెను కల్నరీ జెమ్ హేమ, లెజెండరీ ఛెఫ్ హేమ అనీ అంటారు. రెస్టారెంట్‌లే కాక, గ్రోసరీ స్టోర్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారు.
సేవా కార్యక్రమాల్లోనూ..
రోజుకు 14 గంటలు పనిచేసే హేమ రంజాన్ మాసంలో ముస్లింలకు ఉచితంగా ఆహారం ఇస్తారు. ఏటా జూన్ 23న చికాగో ఫుడ్‌డిపాజిటర్స్ సంస్థ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తారు. జూన్ 27న అంధులకు విరాళాలు సేకరించే లైట్‌హౌస్ సంస్థకు తన వంతు సాయంగా భోజనం పంపిస్తారు. ఈ రెండు సేవాసంస్థలకు కలిసి ఆమె పదివేలమంది వరకు అన్నదానం చేస్తారు. తన సేవలకు గుర్తింపుగా అమెరికాలోని కర్ణాటక కమ్యూనిటీ వారు భారతరత్న-2003 అవార్డును, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ వారు ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2002 అవార్డును ఇచ్చార'ని హేమ సంతోషంగా చెప్పారు.
- సితార
Courtesy: ఈనాడు
0 Comments:
Post a Comment
<< Home