"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Tuesday, November 01, 2005

బంగారు తల్ల్లి


దీపావళి వెలుగుల పండగ... ఈ ఏటి దీపావళి తెలుగు వెలుగుల పండగ. ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ కాంతులు వెదజల్లుతోంది. తెలుగు తల్లి నేడు 'బంగారు తల్లి'గా వెలిగిపోతోంది. దేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ యాభయ్యో పడిలో అడుగుపెడుతోంది. కృష్ణశాస్త్రి కవితలా.. కృష్ణవేణి పొంగులా.. పాలలా... తేనెలా... దేశభాషలందు లెస్సగా మనన్నలందుకున్న తేట తెలుగు... తన అస్తిత్వాన్ని ప్రపంచానికి బలంగా చాటిన సుదినమిది. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలానికి విశాలాంధ్ర ఉద్యమ దీప్తులు తోడై సాకారమైన స్వప్నమిది. ఈ స్వర్ణోత్సవ వేళ, దీపావళి రోజున తెలుగువెలుగుల దీపాన్ని రెండు చేతులూ అడ్డుపెట్టి కాపాడుకుందాం!

అప్పుడే నిజమైన స్వర్ణోత్సవం
వేటూరి సుందరరామమూర్తి
ఆంధ్ర భాష అమృతమాంధ్రాక్షరమ్ములు
మురుగులొలుకు గుండ్ర ముత్తియములు
ఆంధ్రదేశ మాయురారోగ్యవర్ధకం
బాంధ్రజాతి నీతిననుచరించు

ని తెలుగు రుషిపుంగవులు ఏనాడో ఆశించారు. ఇక్ష్వాకులనాటి ఈ తెలుగు జాతికిది ఎన్నో శరత్తో చెప్పలేం కాని తెలుగువారంతా కలిసి ఒక గూటికిచేరి ఇప్పటికి 50 వసంతాలు. భారతదేశ చరిత్రలో భాషాపరమైన స్వాతంత్య్రం కోసం ఉద్యమం నిర్వహించి అర్ధశతాబ్దిపాటు భాషా సాంస్కృతిక కళాసాహితీ సంప్రదాయ పరిరక్షణకు సమరం సాగించిన తొలి భారతీయులు తెలుగువారే. ఈ తెలుగు సౌధ నిర్మాణంలో ఎన్నో పునాదిరాళ్లు.. మరెన్నో శిఖర శిలలు.. తెలుగుజాతి చైతన్యానికి శంఖారావం చేసిన ఆ మహనీయులు ఈ తరానికి కానరాని పునాదిరాళ్లు.

తప్పులన్నీ ఈ తరానివి కావు. రాజకీయవేత్తల్లో పెరిగిపోతున్న స్థానిక దేశభక్తి.. (Local Patriotism)తెలుగు భాషపై, సాహితీ సంప్రదాయాలపై, కళలపై పెరిగిపోతున్న విరక్తి వల్ల మన రాష్ట్రంలో ఏ కళా జీవించలేదు. ఒక్క సినిమా సమాశ్రితమైన శ్రుతిమించిన సంగీత, నాట్యకళలు తప్ప శుద్ధమైన తెలుగు చిత్రానికి బహుళ ప్రజాదరణ లేదు. కూచిపూడి నాట్యానికి, కర్ణాటక సంగీతానికి ఆస్కారమే లేదు. రానురాను పెరిగిపోతున్న విదేశీ, విజాతీయ ధోరణులను అరికట్టకపోతే మన వర్తమాన చరిత్ర మన కళ్ల ముందే పురావస్తు శిథిలాల్లో మూగ రాగాలు తీస్తూ, దీనాలాపాలు చేస్తూ గతంలో కలిసిపోతుంది.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి సంతోషం ఈనాటికీ కళ్లకు కట్టినట్టు ఉంటుంది. 1953 అక్టోబరు 1న కర్నూలులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. విశాలాంధ్రోద్యమం ఫలించి 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. రెంటికీ నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వహస్తాలతో అంకురార్పణ చేశారు. 'జయస్తే విశాలాంధ్ర జననీమతల్లికా' అంటూ కవులు ఎలుగెత్తి పాడిన పల్లవినే నాటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు రంగురంగుల పతాక శీర్షికగా తీర్చిదిద్దారు. ఆనాటి కవిగాయక జననాయక ప్రజాగీతమది. రానురాను కేసరి, సింహం ఒకటి కాదని.. ఆంధ్ర, తెలంగాణలు వేరని.. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ఉమ్మడి కుటుంబంలోనే వేర్పాటు రాగాలు వినిపించసాగాయి. ప్రజలు, పత్రికలు సంఘటితంగా సాధించిన ఈ విశాలాంధ్ర.. విషాదకర పరిణామాల మధ్య తన భాషలో తాను మాట్లాడుకోలేక, తన బిడ్డలకు తాను నేర్పలేక దాస్యంలో మగ్గిపోతున్నది. తలకట్టుతో తలఎత్తుకుని తిరిగే యోగం తెలుగు భాషకు లేదా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకని స్థితిలో ఆంధ్ర పురాణంలో 50వ పర్వం గడిచిపోతోంది. అసలీ గోడు ఏమిటో నాయకులకు పట్టదు, అధినాయకులకు గిట్టదు. తత్ఫలితంగానే భాషంటూ బలపం కట్టుకు తిరిగేవాళ్లకు గుక్కెడు నీరైనా పుట్టదు. పరిపాలన అన్నా, అభ్యుదయమన్నా, ప్రజాసంక్షేమమన్నా ప్రాజెక్టులు, భూపంపిణీలు మాత్రమే కాదు. భాషా సంప్రదాయాల పరిరక్షణ కూడా. తెలుగు జాతికి గీటురాయిగా నిలిచిపోయిన ఈ భాషా సాహితీ సంప్రదాయాలు పునరుజ్జీవనం పొందినప్పుడే ఈ గడచిన యాభైఏళ్లూ సార్థకమవుతాయి. పాలకుల్లో భాషాభిమానం పెరగాలి. అప్పుడే నిజమైన స్వర్ణోత్సవం జరుపుకొనే అర్హత మనకు కలుగుతుంది.

మదరాసీ నుంచి... ఆంధ్రుడి దాకా
ప్రత్యేక ఆంధ్ర ఆవిర్భావం వెనుక 50 సంవత్సరాల కృషి, చరిత్ర, ఉద్యమం దాగి ఉన్నాయి. పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడిన మీదటే ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆ తర్వాత.. విశాలాంధ్ర స్వప్నం సాకారమైంది. 'మదరాసీ'గా ముద్రపొందిన ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు సిద్ధించింది. ఇదీ ఆ నేపథ్యం...

స్టిండియా కంపెనీ మద్రాసు, బొంబాయి, కలకత్తా వంటి ప్రధాన నగరాలను ఆక్రమించుకుని... వాటి పేరిటే రాష్ట్రాలను ఏర్పరిచింది. మద్రాసు రాష్ట్ర పరిధిలో మలయాళీలు, తమిళులు, ఆంధ్రులు, కన్నడిగులు ఇలా అనేక భాషలు మాట్లాడేవారుండేవారు.

మద్రాసు రాష్ట్రంలోని తెలుగుమాట్లాడే ప్రాంతాలు వెనుకబడి ఉండేవి. సంయుక్తరాష్ట్రంలో ఇమడలేక ఆంధ్రులు ప్రత్యేకరాష్ట్రాన్ని కోరారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొదలైంది. 1903లో గుంటూరులో ఏర్పాటైన యువజన సాహితీ సమితి ఆంధ్రజాతి పురోగతికి అవలంబించాల్సిన సూత్రాలను రూపొందించింది. ప్రత్యేకాంధ్ర ఆవిర్భావంతోనే ఆంధ్రులకు న్యాయం జరుగుతుందనేదే వీటి సారాంశం.

1907లో మచిలీపట్నంలో ఆంధ్ర మహాసభ జరిగింది. అందులో నిజాం రాష్ట్రంలోని తెలంగాణ నేతలు కూడా పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ ఆశయాలను తెలుసుకున్నారు. తర్వాత తెలంగాణలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలను నిర్వహించారు.

1911లో ఆంధ్ర రాష్ట్ర స్వరూప స్వభావాలను తెలియచేసే పటం సిద్ధమైంది. ఇందులో... ఉమ్మడి మద్రాసు, మైసూరు, ఒరిస్సా, నిజాం రాష్ట్రం, మహారాష్ట్రల్లో తెలుగు ప్రాంతాలన్నింటినీ మ్యాప్‌లో పొందుపరిచారు. ఇది 'విశాలాంధ్ర' స్వరూపాన్ని సూచిస్తుంది.

1911లో భారత గవర్నర్ జనరల్ హార్డింగ్స్ బెంగాల్ రాష్ట్రంలో హిందీ మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను విడదీశారు. బీహార్‌గా ఏర్పాటు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ఇది నాంది పలికింది. ఇది ఆంధ్ర ఉద్యమానికి ఊతమిచ్చింది.

1911లో న్యాపతి నారాయణరావు మద్రాసు నుంచి ఆంధ్ర భూభాగాలను విడదీసి ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుచేయాలని వ్యాసం రాశారు.

1912లో తీరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ సమావేశం నిడదవోలులో జరిగింది. ప్రత్యేకరాష్ట్రమే ఆంధ్రుల అభ్యున్నతికి మార్గమని తీర్మానించారు.

1913లో బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై వేమవరపు రామదాసు తీర్మానంపెట్టారు. భిన్నాభిప్రాయాలు రావడంతో.. తర్వాతి సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు.

కొండా వెంకటప్పయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరు కృష్ణారావు తదితరులు ప్రత్యేక రాష్ట్రంపై విస్తృతంగా ప్రచారం చేశారు.

1914లో విజయవాడలో ఆంధ్రమహాసభ జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేశారు. ఇదే సమయంలో ఆంధ్ర ఉద్యమం, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన గ్రంథాలు అనేకం వచ్చాయి.

1915 నుంచి ప్రతి ఆంధ్ర మహాసభ సమావేశంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంపై చర్చ జరిగింది.

1917లో మాంటేగ్, చెమ్స్‌ఫర్డ్‌లకు ఆంధ్ర నాయకులు ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రజాభిప్రాయం ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరవచ్చని మాంటేగ్, చెమ్స్‌ఫర్డ్‌లు అభిప్రాయ పడ్డారు.

1917లో కలకత్తా కాంగ్రెస్ మహాసభలలో ఆంధ్రరాష్ట్ర నిర్మాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో మదరాసీలుగా పిలుస్తున్న ఆంధ్రులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది.

శాసనసభలు ఆమోదిస్తే కేంద్ర కార్యదర్శే ప్రత్యేకరాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కల్పిస్తూ 1919లో జరిగిన రాజ్యాంగాన్ని సవరించారు.

1926లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీనిని వాల్తేరులో ఏర్పాటు చేశారు.

1931 తర్వాత మద్రాసు శాసనసభలో ప్రత్యేకాంధ్రకు అనుకూలంగా రెండు తీర్మానాలు చేశారు.

1938లో కొండా వెంకటప్పయ్య ప్రతిపాదించిన ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.

1938లో మద్రాసులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. బ్రిటిష్ ప్రభుత్వ కార్యదర్శితో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చించారు. మరుసటిఏడాదే రెండో ప్రపంచ యుద్ధం మొదలుకావడంతో ఈ అంశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పక్కన పెట్టింది.

1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం లభించింది. భాషాపర రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతపై థార్ కమిషన్ ఏర్పడింది. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో... భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయడం మంచిదని కమిషన్ సూచించింది.

థార్ కమిషన్ సూచనతో ఆంధ్ర నాయకులు నిరుత్సాహ పడ్డారు. పదేపదే విన్నవించిన తర్వాత... సర్దార్ పటేల్, నెహ్రూ, భోగరాజు పట్టాభిరామయ్యలతో ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది.

1949లో త్రిసభ్య కమిటీ తన నివేదిక సమర్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సమయం ఆసన్నం కాలేదని తెలిపింది. ఒకవేళ ఆంధ్రులు... మద్రాసు నగరంలోని వివాదాస్పద ప్రాంతాలను వదిలివేస్తే, వివాదరహిత ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరవచ్చని పేర్కొంది. కొంత తర్జనభర్జనల తర్వాత ఆంధ్ర నాయకులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు.

1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వీలుగా... మద్రాసు విభజనసంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ సంఘం సభ్యుల్లోనే అభిప్రాయబేధాలు తలెత్తాయి.

ప్రత్యేక రాష్ట్రానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో... 1951లో గొల్లపూడి సీతారామ శాస్త్రి (స్వామి సీతారాం) నిరాహారదీక్షకు కూర్చున్నారు. వినోభాజీ సలహాతో 38 రోజుల తర్వాత విరమించారు.

1952... స్వతంత్ర భారతంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల హామీల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కూడా ఒకటి. కానీ... ఇది అమలుకాలేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం 1952 అక్టోబరు 10న పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షకు దిగారు. 58 రోజుల నిరశన తర్వాత... ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మరణించారు.

పొట్టి శ్రీరాములు మరణంతో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. క్విట్ ఇండియా ఉద్యమంకంటే ఉద్ధృతంగా సాగింది. ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. అనేకమంది నాయకులు జైలుపాలయ్యారు. లాఠీ ఛార్జీలు, కాల్పుల్లో ఎందరో మరణించారు. మరెందరో గాయపడ్డారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో భారత ప్రభుత్వం... నిర్వివాద ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక ఆంధ్ర ఆవిర్భావం దిశగా... సూచనలు ఇచ్చేందుకు న్యాయమూర్తులు వాంఛూ, మిశ్రాలను నియమించారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారాన్ని ఆంధ్ర నాయకులకే వదిలేశారు.

1953 సెప్టెంబరులో ప్రత్యేకాంధ్ర ఏర్పాటుకు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించింది. 1953 అక్టోబరు 1న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.

విశాలాంధ్ర...
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో ఆంధ్రుల చిరకాలవాంఛ నెరవేరింది. ఇక సమగ్రాంధ్ర నిర్మాణమే తదుపరి ఆశయంగా మారింది.

నిజాం రాష్ట్రంలోని తెలంగాణ, మైసూరు రాష్ట్రంలోని ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాలలో తెలుగువారు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలన్నీ కలిపి సమగ్రాంధ్రను నిర్మించాలని ఉద్యమం మొదలైంది.

తాము మాట్లాడే భాషల ప్రకారం ఆయా భాషా రాష్ట్రాలలో కలిపివేయాలని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు భారత ప్రభుత్వాన్ని కోరారు.అయితే... హైదరాబాద్ ప్రత్యేక సంస్కృతిగల రాష్ట్రమని, దీనిని విభజించడం తగదని కొందరు భావించారు.

1953 డిసెంబరు 22న ఫజులలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘాన్ని ఏర్పాటైంది. ఫజులలీ కమిషన్ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. 1955 అక్టోబరు 10న సమగ్ర నివేదికను సమర్పించింది. కమిషన్ సిఫారసు ప్రకారం... హైదరాబాద్ స్టేట్‌లోని బీదర్, గుల్బర్గా, రాయచూరు జిల్లాలను మైసూరు రాష్ట్రంలో... ఉస్మానాబాద్, బీఢ్, ఫర్భిణి, నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలను మహారాష్ట్రలో చేర్చాలి. తెలంగాణలోని 8జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపక్షంలో..ఆరాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండొంతుల మంది తీర్మానిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగనివ్వాలి. ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏడాదిపాటు బలంగా జరిగింది. అటు విశాంలాంధ్ర, ఇటు ప్రత్యేక తెలంగాణలకు అనుకూలంగా పలువురు ప్రముఖులు ప్రచారం చేశారు. ఆందోళనలు, లాఠీఛార్జీలు, కాల్పులు జరిగాయి. అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, వల్లూరి బసవరాజు, సురవరం ప్రతాపరెడ్డి, ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలు సమగ్రాంధ్ర వాదనను బలపరిచారు. 1956 మార్చి 6న నిజామాబాద్‌లో భారత్‌సేవక్ సమాజ్ ఉత్సవంలో నెహ్రూ పాల్గొన్నారు. 'విశాలాంధ్ర ఏర్పాటుకు భారత ప్రభుత్వం సుముఖంగా ఉంది' అని ప్రకటించారు. నెహ్రూ ప్రకటనతో ప్రత్యేకతెలంగాణ ఉద్యమం చల్లబడింది. కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి 'ఆంధ్రప్రదేశ్' అనే పేరు ఉండాలని ఆంధ్ర, తెలంగాణ నాయకులు కర్నూలులో సమావేశమై నిర్ణయించారు. 1956 నవంబరు 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తొలి సీఎం నీలం సంజీవరెడ్డి.Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home