కంప్యూటర్‌లో తెలుగుదనం
ఫాంట్స్, సాఫ్ట్‌వేర్ విడుదల
హైదరాబాద్- న్యూస్‌టుడే
గ్రామీణుల ముంగిటిలోకి కంప్యూటర్ సేవలను అందించడంలో భాగంగా రూపొందిన తెలుగు ఫాంట్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు. సీడాక్ తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్ సీడీలను... కేంద్ర ఐటీ మంత్రి దయానిధి మారన్ సమక్షంలో వైఎస్ విడుదల చేశారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులు, ప్రతినిధులకు వాటిని అందించారు. తొలి సీడీని 'ఈనాడు' చీఫ్ ఎడిటర్ రామోజీరావుకు అందచేశారు. తెలుగు సాఫ్ట్‌వేర్ విడుదలతో మేలు జరుగుతుందని, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరముందని వైఎస్ అభిప్రాయపడ్డారు. రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ కార్యక్రమం ఇందుకు ఊతమిస్తుందన్నారు. కంప్యూటర్ సేవలను గ్రామీణులకు అందించేందుకు త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నట్లు మారన్ తన ప్రసంగంలో తెలిపారు. తక్కువ ధరకే కంప్యూటర్లు, అన్ని భారతీయ భాషల్లో కంప్యూటర్ ఫాంట్లు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పన ఇందులో భాగమని చెప్పారు. ప్రస్తుతం తమిళం, హిందీ, తెలుగు కంప్యూటర్ ఫాంట్ల రూపకల్పన పూర్తయిందని... ఈ ఏడాది చివరికల్లా మిగిలిన అన్ని భాషల్లో రూపొందించి ప్రజలకు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్, బ్రాండ్ బ్యాండ్ సేవలు అందించేందుకు 2 దశలుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మారన్ తెలిపారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్త ఏరియా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని, రెండోదశలో 'ఈ-గవర్నెన్స్' అమలు చేస్తామనిచెప్పారు. ఇది పూర్తయితే ప్రతిపౌరుడు ఇంటినుంచే ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుని అవసరమైన సర్టిఫికెట్లు, పత్రాలు పొందవచ్చని తెలిపారు.
తెలుగును గౌరవిద్దాం...దాసరి: కార్పొరేటు పాఠశాలల చదువుతో పిల్లలు, మర్చిపోతున్నారని కేంద్రమంత్రి దాసరి నారాయణరావు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ పాఠశాలల్లోనూ తెలుగు చెప్పకుండా ఆంగ్లం బోధించనున్నారని ప్రచారం జరుగుతోందని... ఇది నిజమోకాదో ముఖ్యమంత్రే చెప్పాలని కోరారు. 2వేల ఏళ్ల చరిత్రగల తెలుగును 'క్లాసిక్ భాష'గా గుర్తించేందుకు సహకరించాలని మారన్‌కు విజ్ఞప్తి చేశారు. ''క్లింటన్, బిల్‌గేట్స్ వంటి వారు తమిళనాడులో పుడితే తమిళం, కర్ణాటకలో పుడితే కన్నడం మాట్లాడేవారు. ఆంధ్రప్రదేశ్‌లో పుడితే మాత్రం తెలుగు మాట్లాడేవారు కాదు'' అని వ్యాఖ్యానించారు. కంప్యూటర్ అభివృద్ధిపైనే దృష్టి సారించడం ఆపి... ఆ పరిజ్ఞానాన్ని గ్రామీణ భారతానికి చేరువచేసే పనులు ప్రారంభించాలని ఎంపీ జైరాం రమేశ్ సూచించారు. తెలుగు సాఫ్ట్‌వేర్ రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక అని కేంద్ర, రాష్ట్ర మంత్రులు పనబాక లక్ష్మి, సబితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో భారత్ అత్యున్నత స్థాయికి చేరినా, ఈ రంగంలో గ్రామీణ ప్రజల భాగస్వామ్యం అతితక్కువగా ఉందని సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు పేర్కొన్నారు. సొంతభాషలో సాఫ్ట్‌వేర్ అందించడం ద్వారా వారిని ప్రపంచ వాణిజ్యంలో భాగస్వాములను చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
స్పెల్‌చెక్‌తో సహా ఎన్నో ఉపయోగాలు
కంప్యూటర్లలో తెలుగు ఫాంట్లు ఇప్పటికే ఉన్నాయి. వీటిని పలురకాలుగా ఉపయోగించుకుంటూనే ఉన్నాం. మరి... శుక్రవారం విడుదల చేసిన తెలుగు ఫాంట్లు, సాఫ్ట్‌వేర్ ఉపకరణాల ప్రత్యేకత ఏమిటి? ఈ ప్రశ్నకు నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సాంకేతిక డైరక్టర్ రాజశేఖర్ ఇచ్చిన సమాధానాలివి...
* బయట అందుబాటులో ఉన్న తెలుగు ఫాంట్లు ఏవీ ఉచితం కాదు. కానీ... సీడాక్ తయారు చేసిన ఉపకరణాలు పూర్తి ఉచితం. www.ildc.gov.in ద్వారా పేరు నమోదు చేసుకుని 150 ఫాంట్స్ పొందొచ్చు.
* సాఫ్ట్‌వేర్‌సాయంతో సులభంగా తెలుగుస్పీచ్ ఇంజిన్ రూపొందించుకోవచ్చు. అంటే... తెరపై వివరాలను కంప్యూటర్ చదివి వినిపిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ ఉత్తర్వులు తదితరాలను నిరక్షరాస్యులు సైతం వినితెలుసుకోవచ్చు.
* సాఫ్ట్‌వేర్ మరో ప్రత్యేక ప్రయోజనం 'తెలుగు ఓసీఆర్' ఓ పేజీని స్కాన్ చేసి కంప్యూటర్‌లో పెడితే... అందులో పదాలన్నీ స్క్రీన్‌పై టెక్ట్స్ ఫార్మాట్‌లోకి మారతాయి.
* తెలుగులోనూ స్పెల్ చెక్‌ను లభ్యం.
* హిందీ, తమిళం, కన్నడ, ఆంగ్ల పదాలకు తెలుగులో అర్థాలు తెలుసుకోవచ్చు.
* తెలుగు ఫాంట్లతో ఇచ్చిన కీబోర్డు డ్రైవర్లను వాడి విండోస్ - 9ఎక్స్, 2000, ఎక్స్‌పీలతో వివిధ అప్లికేషన్లలో తెలుగును వాడుకోవచ్చు.
* తెలుగులో వివిధ అప్లికేషన్లను రూపొందించుకోవచ్చు. వెబ్‌పేజీలను, వెబ్ సమాచారాన్నీ తయారుచేసుకోవచ్చు.
* ఆఫీసు సూట్లు, నోట్‌ప్యాడ్, వర్డ్, కంటెంట్ క్రియేషన్ టూల్స్, వంటి అనేక అప్లికేషన్లలో తెలుగును వాడుకునేలా కీబోర్డు డ్రైవర్లున్నాయి.
* మల్టీ ఫాంట్ కీబోర్డు ఇంజిన్ ద్వారా వివిధ ఫాంట్లను, కీ బోర్డులను ఒకచోట ఉంచవచ్చు. దీనివల్ల తెలుగులో వివిధ సంస్థలు రూపొందించిన ఫాంట్లను వాడి, సమాచారాన్ని చూపడం వీలవుతుంది.
*ట్రాన్స్‌లిటరేషన్ సౌకర్యంతో ఇంగ్లిషు పేర్లను తెలుగులోకి మార్చుకోవచ్చు.ఫాంట్ డిజైనింగ్ టూల్‌తో వివిధ డిజైన్లను, బ్యాక్‌గ్రౌండ్, షేడ్స్‌ను పదాలకు ఆపాదించవచ్చు.
e
Courtesy: ఈనాడు
0 Comments:
Post a Comment
<< Home