అమెరికాలోనూ హమారా భారత్ మహాన్
డాలర్ల పంట పండిస్తున్న ఇండియన్లు
ప్రపంచంలో తెలివితేటలు ఎక్కువగా ఉన్న వారిలో మనం ప్రాచీన కాలం నుంచి ముందు వరుసలో ఉన్నాం. కష్టపడి పని చేయడం, ఓపికతో ఉండటం అనే గుణాలు మన తెలివితేటల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి. ఈ మేధో సంపత్తి మన దేశంలో ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నా యూఎస్ఏలో మాత్రం భారతీయుల్ని ఉన్నత స్థితికి తీసుకెళుతోంది. అమెరికన్ల కంటే ఎక్కువ సంపాదన పరులుగా చేస్తోంది. ఇతర వలస జాతులకు అసూయ కలిగిస్తోంది.
అమెరికాలో ఆసియన్ల సగటు సంపాదన 57,518 డాలర్లు. అదే సగటు అమెరికన్ సంపాదన 38,885 డాలర్లు. అమెరికన్ కంటే అక్కడికి వలస వెళ్లిన ఆసియావాసి వార్షిక సంపాదన సుమారు 30 శాతం ఎక్కువ. ఆసియన్లలో భారతీయులు అగ్రస్థానంలో నిలుస్తూ సగటున 60,093 డాలర్లు ఆర్జిస్తున్నారు. ఈ గణాంకాల్ని ఇటీవల విడుదలైన 2000 అమెరికా జనాభా లెక్కలు వివరిస్తున్నాయి. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్ ప్రాంతంలో భారతీయుల సంఖ్య బాగా ఉంది. ఇక్కడ సగటు ఇండియన్ సంపాదన 88,133 డాలర్లుగా ఉంది. అమెరికాలో వేగంగా వృద్ధి చెందుతున్న వారిలో భారత సంతతికి చెందిన వారు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. వీరి జనాభా సుమారు 1.7 మిలియన్లుగా ఉంది. పాతికేళ్లకు పైబడిన ఇండియన్ అమెరికన్లలో 58 శాతం మంది పట్టభద్రులుగా ఉన్నారు. అదే అమెరికన్లలో కేవలం 20 శాతం మంది మాత్రమే పట్టభద్రులుగా ఉన్నారు. రెండు దశాబ్దాల కిందట కొన్ని రంగాలకే పరిమితమైన భారతీయ అమెరికన్లు ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరిస్తున్నారు. వ్యాపారం, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, వ్యవసాయం, జర్నలిజం, మేనేజ్‌మెంట్ రంగాల్లోనూ నేడు భారతి సంతతికి చెందిన వారు కనిపిస్తున్నారు. వైద్యం, ఐటీ రంగాల్లో అయితే దశాబ్దాల కిందట నుంచే మనవారి ముద్ర బలంగా ఉంది.
ఐటీలో ఘనాపాఠీలు
తమ సత్తా చాటడానికి భారతీయులకు ఐటీ రంగం అద్భుతమైన వేదికగా నిలిచింది. అమెరికాలో ఈ రంగంలో పని చేస్తున్న వారిలో 3 లక్షల మంది ఇండియన్లు ఉన్నారు. వీరి సగటు సంపాదన 2,00,000 డాలర్లుగా ఉంది. ఇక్కడ కొత్తగా ఏర్పడుతున్న 100 ఐటీ సంస్థలో పదిహేనింటిని భారతీయులే స్థాపిస్తున్నారు. ఐటీ రంగంలోకి భారతీయ మహిళలు కూడా పెద్దఎత్తున ప్రవేశిస్తున్నారు. ఈ రంగంలో పురుషులు, మహిళల నిష్పత్తి 60:40 చొప్పున ఉంది. కాలేజీ చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరుతున్న మహిళల సంఖ్య బాగా పెరిగిందని సిటీ గ్రూపు వైస్ ప్రెసిడెంట్ మాలిని అరోరా చెప్పారు. అయితే ఉన్నత స్థానాల్లో వీరి సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ సమయం తమ చేతుల్లో ఉంటుందని ఎక్కువ మంది మహిళలు కన్సల్టింగ్ రంగాన్ని ఎంచుకుంటున్నారని ఆమె అభిప్రాయపడుతున్నారు.
మరో ఆకర్షణీయమైన ప్రొఫెషన్.. న్యాయవృత్తి
ఐటీ, వైద్యం తర్వాత న్యాయవృత్థిలో భారతీయులు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ వృత్తిలో సగటు సంపాదన 1,00,000 డాలర్లుగా ఉంది. భారతి సంతతి జనాభా పెరిగే కొద్దీ పాలసీ, లా, అంతర్జాతీయ అభివృద్ధి రంగాల్లోకి యువత వస్తోందని ఇండికార్ప్స్ వ్యవస్థాపకుడు సోనాల్ షా చెప్పారు. ఇండికార్ప్స్ అనేది లాభాపేక్ష లేని ఒక స్వచ్ఛంద సంస్థ. మాతృ దేశ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సహకారాన్ని పెంపొందించేందుకు సోనాల్ దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన 'గోల్డ్‌మ్యాన్ సాష్' అనే సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.
చదువే కీలకం
అందిపుచ్చుకోవాలే గానీ అమెరికాలో అడుగడుగునా అవకాశాలే. అయితే వీటిని అందుకోవడానికి ప్రాథమిక అర్హత చదువు. 1950, 60లలో అమెరికాకు వచ్చిన వారు నేరుగా సేవారంగంలో ఎక్కువగా అవకాశాలు పొందారు. వీరితో పాటు ఇతర రంగాల్లో స్థిరపడిన భారతీయులు కూడా పిల్లల చదువుకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.. ఇస్తున్నారు. తమ పిల్లల్ని గొప్ప గొప్ప కాలేజీల్లో చదవించేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వీరు వెనుకాడటం లేదు. మంచి కాలేజీల్లో చదువుతుండటం వల్ల ఉన్నత స్థానాల్లోకి సులభంగా వెళ్లగలుగుతున్నారు. ఫలితంగా సంపాదన కూడా ఎక్కువగానే ఉంటోంది. చదువుకు శ్రమించే గుణం తోడు కావడం, వీటిని గుర్తించి ప్రతిఫలం అందించే వాతావరణం అమెరికాలో ఉండటం వల్ల ఇండియన్ అమెరికన్లు విజయవంతమైన వలసజాతిగా వినుతికెక్కుతున్నారని వాషింగ్టన్ డీసీలో ఉన్న 'బ్యాంక్ వరల్డ్ ఇంక్' ప్రెసిడెంట్ భరత్ భార్గవ అభిప్రాయపడ్డారు. సీనియర్ బుష్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈయన వాణిజ్యశాఖలోని మైనార్టీ బిజినెస్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు.
అబ్బురపరిచే గణాంకాలు
* 1990తో పోలిస్తే 2000 సంవత్సరంలో అమెరికాలోని భారతి సంతతి చెందిన వారి సంఖ్య 106 శాతం పెరిగి 16,78,000లకు చేరింది.
* ఇండియన్ అమెరికన్లలో రెండు లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు.
* అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారత సంతతిలో 43.6 శాతం మంది మేనేజర్లుగా లేదా ఇతర ప్రొఫెషనల్స్‌గా ఉన్నారు.
* 35 వేల మంది ఇండియన్ అమెరికన్ వైద్యులున్నారు.
* అమెరికన్ ఐటీ రంగంలో 3 లక్షల మంది భారతీయులు ఉన్నారు.
* 5 వేల కంటే ఎక్కువగా ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్లు ఉన్నారు.
* సిలికాన్ వ్యాలీలో కొత్తగా ఏర్పాటవుతున్న సంస్థల్లో 15 శాతం భారత సంతతికి చెందిన వారివే ఉంటున్నాయి.
వారి సంపాదనతో మనకూ మేలు
మేధో వలస వల్ల దేశం నష్టపోతోంది.. విదేశాలకు వెళ్లిపోతున్న వారి వల్ల వారి చదువుల కోసం ప్రభుత్వం వెచ్చించిన సొమ్ముకు ప్రతిఫలం దక్కటం లేదు.. అనే అభిప్రాయాల్లో వాస్తవం ఉన్నప్పటికీ ఎన్నారైల వల్ల మనకూ మేలు కలుగుతోందన్న విషయాన్ని విస్మరించలేం. ఎన్నారైల నుంచి వస్తున్న నిధులు 1990లో 2.1 బిలయన్ డాలర్లు ఉండగా ఇది 2000 సంవత్సరంలో ఆరు రెట్లు పెరిగి 12.3 బిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం ఎఫ్‌డీఐల్లో ఎన్నారైల వాటా 3 శాతం ఉంటోంది. ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనేదాని కన్నా అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ నైపుణ్యాన్ని, సాంకేతిక సామర్థ్యాన్ని తీసుకువస్తుండటం వల్ల దేశానికి ఎక్కువ మేలు జరుగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, మతపరమైన, సామాజిక పరమైన కార్యాక్రమాలకు ఎన్నారైలు ఉదారంగా నిధులు ఇస్తున్నారు. ఈ ఉదారత క్రమంగా పెరుగుతూ వస్తోంది. బాగా సంపాదిస్తున్న వారే కాక ఓ మాదిరిగా సంపాదిస్తున్న వారు కూడా సేవా కార్యక్రమాలకు చేతనైనంతగా సాయం చేస్తున్నారని భారతీయ వలసదారులపై అధ్యయనం చేసిన ఐవోవా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్‌సైడల్ తెలిపారు.
Courtesy: ఈనాడు
0 Comments:
Post a Comment
<< Home