"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Tuesday, October 03, 2006

సరైన తెలుగువాచకమంటే ఇదేనా?

పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి తొలివాచకం ఒకటో తరగతి తెలుగువాచకం. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల తెలుగువాచకాలు దొరుకుతున్నాయి. వాటన్నిటిలో ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రచురణ. ప్రధానంగా అందరి దృష్టిలో ఉండేది ఇదే కాబట్టి విమర్శలూ దీని గురించే ఎక్కువ. ఈ విమర్శలు సరయినవా, కాదా? అన్నదాని గురించి పెద్దగా చర్చలేమీ జరగలేదు. స్థూలంగా విమర్శలయితే ఉన్నాయిగాని వాటికి సమాధానాలిచ్చిన సందర్భాలు తక్కువే. దీనికి కారణాలు ఏవయినా కావచ్చు. ఎవరికి పుట్టిన బిడ్డరా? అన్న ధోరణే ఉండవచ్చు.

విమర్శ చేసినవారిలో రంగనాయకమ్మ ఒకరు. ఈమె అన్ని వాచకాలనూ తమదైన ధోరణిలో అతివిపులంగా విమర్శించారు. విమర్శతో సరిపెట్టక శాస్త్రీయమైన ఒకటో తరగతి తెలుగువాచకం ఎలా ఉండాలో నిరూపించడానికి తామే వాచకరచనకు పూనుకోవడం ముదావహం. వాచకం తయారుచేయడం విమర్శచేసినంత తేలికకాదన్న ది ఈ పుస్తకం చూసినవారెవరికయినా అర్థమవుతుంది. 1991లో రంగనాయకమ్మ 'తెలుగు నేర్పడం ఎలా?' అని రాసిన పుస్తకం ఇప్పటికి మూడు ముద్రణలు పొందింది. పాఠకులు ఇంతగా దాన్ని ఆదరించారు కాబట్టే అదే శాస్త్రీయమన్న విశ్వాసంతో ఆమె ఈ వాచకాన్ని రూపొందించారేమో.

ఇంతకీ ఈ పుస్తకం చిన్నచిన్నమార్పులతో 50,60 ఏళ్ల కిందటి ఒకటో తరగతి తెలుగువాచకమే. "అక్షరమాలాలో నించి కొన్ని అనవసరపు అక్షరాల్ని వదిలివెయ్యడమూ, మొట్టమొదటే అన్ని రకాల శబ్దాలమాటల్నీ ఇచ్చే పద్ధతిని వదిలివెయ్యడమూ, వెనకటి మంచి వాచకాల్లో, పాఠాలు ఇవ్వడంలో ఉన్న సరైన క్రమాన్ని అనుసరించడ మూ' తప్ప తాను కొత్తగా చేసిందేమీ లేదని ఆమె చెప్పుకున్నారు. అయితే ఇందులోని అశాస్త్రీయతకు ఆ పాతపుస్తకాలను కారణంగా చూపించలేం.

ఈ పుస్తకంలో ముందు అక్షరమాల ఇచ్చి ఆ వెంటనే ఒత్తక్షరాలు తొలగించి అవి తర్వాత వస్తాయని చెప్పి మిగిలిన అక్షరాలతో ముందుగా మాటలను పరిచయం చేశారు. అక్షరమాలలో జంటలు, విడి అక్షరాలు అనివాడారు. అలా పిల్లలకు పరిచయం చేయాలన్నారు. అయితే ఎ ఏ ఐ, ఒ ఓ ఔ లలో ఎ ఏ, ఒ ఓ లు జంటలనీ, ఐ ఔ లు విడి అక్షరాలన్నీ అర్థం చేసుకోవాలా? క ఖ లు, గ ఘ లు జంటలయితే క గ లు, చ జ లు జంటలవుతా యా కావా? ఈ పుస్తకంలో ఆయా అక్షరాలను అచ్చువేసిన పద్ధతి చూస్తే సందిగ్ధతే కలుగుతుంది కానీ నిశ్చయత్వం కలగదు.

మొదట అక్షరమాలలో ఉన్న అక్షరాలతో అంటే గుణింతం లేకుండా కొన్నిమాటలు పరిచయం చేశారు. వాటి లో రెండు మాటలు 'ఉడత, ఎలకా. ఎలకకు వివరణ ఇస్తూ 'లూ అక్షరం అక్షరమాలలో ఉండదు కాబట్టి అది విద్యార్థులకు ఇప్పుడే తెలియదని చెప్పారు. అందుకే 'ఎలకా అని ఇచ్చారన్నమాట. ఉడత కూడా అంతే కదా. మరో ఉదాహరణగా ఎనుగు తీసుకొని ను, గు లు అప్పుడే తెలియవు కాబట్టి ఆ మాట ఇవ్వకూడదన్నారు. ఈ హేతువు అన్వయిస్తే 'ఏనగా అని ఇవ్వవచ్చు కదా. అది తప్పయితే ఎలక తప్పుకాదా?. 'ఊను పరిచయం చేసిన పాఠంలో ఉడుత, ఉడత రెండూ కనిపిస్తాయి. ఒకటో తరగతిలో ఇలా మాటలకు రూపాంతరాలుండాలా?

అక్షరమాలలో ఉన్న అక్షరాలతో మాటలిచ్చిన సందర్భంలో సున్నతో ఒక్కమాటకూడా లేదు. కాని అ/క పాఠంనుంచీ కంద, గంప మొ॥న విధంగా సున్నతో మాటలిస్తూ పోయారు. మరి ఆ తర్వాత ఎప్పుడో అం/కం పాఠంలో సున్నను పరిచయం చేయడమెందుకు?

అచ్చులన్నీ పరిచయం చేసిన తర్వాత గుణింతాల పట్టిక ఇచ్చారు. అయితే అచ్చుల పరిచయంతోనే గుణింతాలన్నీ పరిచయమవుతున్నాయి. అటువంటప్పుడు అక్షరమాలతో పాటుగానే గుణింతమూ చెప్తే సరిపోతుంది కదా. దానికి వేరేచోటెందుకు?

ప్రతిపాఠంలో అక్షరాల పరిచయానికి రెండక్షరాలమాటలు, మూడక్షరాల మాటలు, పదబంధాలు (రంగనాయకమ్మగారి భాషలో మాటల గుత్తులు) వాక్యాలు ఇవ్వడం సంప్రదాయం. రంగనాయకమ్మ కూడా ఈ సంప్రదాయాన్నే పాటించారు కాని వాటిని అచ్చువేసిన క్రమం గందరగోళంగానూ,అధ్వాన్నంగానూ ఉంది. పదబం ధాల వరసలో వాక్యాలు, కొన్ని చోట్ల వాక్యాల తర్వాత పదబంధాలూ ఇవ్వడం గందరగోళానికి దారి తీస్తుంది. ఉదాహరణకు పాఠంలోనే 'పండుటాకూ వంటి సంధిరూపంతో పదబంధాన్ని పరిచయం చేయడం ఎంతవరకూ సమంజసం?

అం/కం పాఠంలో రెండు, మూడక్షరాల మాటలు కాని, చిన్న పదబంధాలు కాని ఇవ్వలేదు. అంతకుముందే అనుచితమయినస్థానంలో పరిచయం చేసినందుకు ఇక్కడ వదిలివేశారేమో. అః/ కః పాఠంలో దుఃఖము ఇచ్చా రు. ఒత్తక్షరాల సమయం అప్పటికింకా రాలేదు కదా! మరి ఇక్కడ 'ఖా ఎలా వచ్చింది?

ఇక గుణింతం పరిచయం చేసిన పద్ధతి. క్+ అ= క, క్+ ఆ= కా అన్న విధంగా పరిచయం చేశారు. ఒకటో తరగిలో ఈ ప్లస్‌లు, ఈజ్ ఈక్వల్ టు లు ఏమిటి? పిల్లలకు తెలుస్తాయా? క్+ అం= కం, క్+ అః= కః అని వివరిం చారు. బాగానే ఉంది. అం, అః అని రాయడం, పలకడం సున్న, విసర్గలను ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం. అటువంటప్పుడు క+ అం= కం, క+ అః= కః అని చెప్పవలసి ఉంటుంది. లేకపోతే కుం= క్+ ఉం, దుః= ద్+ ఉః అని చెప్పాలి. అది కాదు కదా. ఉం, ఉఃలు అక్షరమాలలో చెప్పలేదు కదా.

ద్విత్వాక్షరాలను పరిచయం చేసిన తీరు కూడా ఇటువంటిదే. క్+క్+అ=క్క అనీ, పక్కనే క+క= క్క అనీ, మరోచోట క్+క=క్క అనీ చెప్పారు. క+క=కక అవుతుంది కానీ 'క్కా ఎలా అవుతుంది?

థ, ధ లు అక్షరమాలలో ఉన్నాయి. వాటిని పరిచయం చేసేచోట సరయినమాటలే ఇచ్చారు. కాని ఈ పుస్తకం లో ఎక్కడా రంగనాయకమ్మ వాటిని పాటించలేదు. అర్థం/ అర్ధం, విద్యార్థి/ విద్యార్ధి, కథ/ కధ ఇష్టం వచ్చినట్లు వాడారు. ఎక్కువచోట్ల తప్పుగానే వాడారు. అసలు పుస్తకం అట్టమీద 'ప్రాధమిక పాఠశాలా అని ఉంది. 'ప్రాథమికా అని కదా ఉండవలసింది.

'ఋ'ని రకారంగా సంయుక్తాక్షరాలలో పరిచయం చేశారు. గ్రు-గృ, క్రూ-కౄ, మ్రు-మృ రూపాంతరాలని వివరించారు. వీటిని ఎలా రాసినా ఒకటేననీ రాసేవారి ఇష్టాయిష్టాలకు వదిలేయాలనీ చెప్పారు. తెలుగు మాట ల్లో ఋ, బుఊలు ఉండవు. ఇక వాటిలోనూ ఎక్కడపడితే అక్కడ ఇవి వాడవచ్చా? సంస్క­ఋతపదాల్లో రు, ఋ/ రూ, బుఊలకు అర్థభేదం ఉన్న సందర్భాలెన్నో ఉంటాయి. అక్కడ కూడా ఈ అవ్యవస్థ కల్పించవలసిందేనా? చిన్న తరగతుల్లో సరయిన రూపాలే నేర్పాలి. భాషావ్యవహారం పట్ల సమగ్రమయిన అవగాహన కలిగిన తర్వాత మన ఇష్టాయిష్టాలు. ముకారాంత పదాలను ఆధునిక భాషలో 'ం'తో రాయ డం అలవాటు. ఈ పుస్తకంలో కొన్ని చోట్ల సున్నతోనూ, దాదా పు అన్నిచోట్లా ముకారాంతంగానూ ఇచ్చారు. కారణం అనూ హ్యం.

వాక్యాలు వాడుకభాషలో ఉండాలి. చాలావరకు అట్లా ఉన్నా 'కోకిల తీయగ కూయునూ, 'ఆవు తౌడు తినునూ, 'నౌక నీటి మీద నడచునూ, 'ఢంకా ఢమ ఢమ మోగునూ, 'గుర్రము వేగముగా పరిగెత్తునూ, 'కవ్వముతో మజ్జిగ చేయుదురూ, వంటి వాక్యాలు ఎందుకు చేరాయో రచయిత్రికే తెలి యాలి. ఇటువంటి మిశ్రభాష నేర్పి పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారో!

అక్షరమాలలో ఙ, ఞ లు లేవుకాని 58, 59 పేజీల్లోని 'అందరినీ అలరించే మంత్రం' అన్న కథలో అజ్ఞానినా, విజ్ఞుడు, జ్ఞానులు అనే మాటలున్నాయి. అలాగే అక్షరమాలలో లేని ఱా, 'కూరిమికలదినములలో..' అన్న పద్యంలో కనిపిస్తుంది. ఇవి ఈ పుస్తకంలో ఉండకూడనివి.

వాచకాలలో కొన్ని అక్షరాలను పరిచయం చేసేటప్పుడు, మాటలను వాక్యాలను కృతకంగా కల్పిస్తారన్న విమ ర్శలు ఎన్నో. ముఖ్యంగా రంగనాయకమ్మగారు తమ వ్యంగ్యబాణాలను వదలడంలో ప్రసిద్ధులు. 'ఈనెల ఎం డలు మెండుగా, కాశాయీ, 'ఎద్దు పెద్ద చిట్టుబుట్ట పడదోసిందీ, 'దుశ్శాసనుడు అహ్హహ్హా అని నవ్వాడూ వంటి వాక్యాలు కృతకం కావా? 'గాలికి దొండపాదు ఒరిగిందీ. పాదు ఎలా ఒరుగుతుంది? 'కాకి కూసిందీ కాకి అరి చిందంటాం. కూసిందని ఏ ప్రాంతంలో అంటారో పరిశీలించాలి. 'మా తాత రోజూ దగ్గుతాడూ తాతలు దగ్గా ల్సిందేనా? రంగనాయకమ్మగారి పాఠంలో కూడా.

పీఠికలో పాఠాల చివర ఉన్న వాక్యాల్లో చుక్కలు పెట్టలేదని చెప్పి దానికి కారణం వివరించారు. అయితే ఆమె కళ్లుగప్పి ఒకటీ అరా ఫుల్‌స్టాపులు చేరనే చేరాయి. ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు కూడా ఉన్నాయి. కామాలయితే లెక్కపెట్టలేనన్ని. 'నాన్న, గోడకు సున్నము వేశాడూ, 'కప్ప, గడ్డికుప్పలో దూరిందీ, 'అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడూ. మొదటి రెండు వాక్యాల్లో కామాలెందుకో? మూడో వాక్యంలో కామా ఎందుకు లేదో చెప్పడం కష్టం. ఇటువంటి సందర్భాలనేకం.

'దుశ్శాసనుడు ఒక చెడ్డవాడూ ఈ వాక్యంలో 'ఒకా ఎందుకు? మామూలు మాటలు కాక ఉదాహరణ కోసం ప్రత్యేకంగా వాడిన మాటలకు అర్థం ఇవ్వాలని రంగనాయకమ్మగారు ప్రయత్నించారు. కొన్నిచోట్ల ఉదాహరణ వాక్యంలో అర్థమిచ్చారు. కొన్నిచోట్ల ప్రశ్నవేసి వదిలేశారు. కొన్ని అర్థాలు ఆమె తప్ప మరొకరు ఇవ్వలేనివి. 'తప స్సు అంటే ఎక్కడా లేనిదాని కోసం పూజా అన్న వాక్యం ఒక ఉదాహరణ. 'అంతఃపురము అంటే తెలుసునా?' అన్నది మరో ఉదాహరణ. ఇది ప్రశ్నే. సమాధానం తెలియవలసింది ఒకటో తరగతి పిల్లవాడికా? 'ఆయుష్షు అంటే బతికిన కాలమూ మరో ఉదాహరణ.

ఈ ఒకటవ తరగతి వాచకంలో ఏడు 'కధాలున్నాయి. మొదటిది 'తాతలు అందరికీ ఉంటారు!' అనేది. టోపీ ల వ్యాపారి- కోతుల కథకు తిరగవేసిన ముగింపు కథ. రెండు పేజీల ఈ కథ ఏమి బోధిస్తున్నదో ఒకటో తరగతి పిల్లలకు అది ఏ విధంగా సముచితమో చర్చనీయం. తక్కిన కథల్లోనూ ఇటువంటి మలుపులే ఉన్నాయి. పేద రైతు అన్న కథ ఒకటో తరగతి విద్యార్థి ఎలా అర్థం చేసుకుంటాడు? 'పులి పలాయనం' అన్న కథకూడా తిర గవేసిన కథే. పులి- ఆవు అన్న ప్రసిద్ధ కథకు మరో వంకర మలుపు. ఇటువంటి కథలు ముగించకుండా సగంలో వదిలితే పిల్లలు తమ ఊహాశక్తితో ఇష్టమొచ్చిన ముగింపులు ఇస్తారు. అది మేలైన పద్ధతి. ఆవు ఎంత ప్రార్థించినా వినకుండా పులి చంపితినేసి ఉంటే ఏమయ్యేది? 'బుద్ధి అదీ అన్న కథ హంస-తేలు కథ. మరి ఈ కథకు కొత్త మలుపు ఇవ్వకపోవడానికి కారణమేమిటి? సామాజిక న్యాయమే ప్రధానమయితే మన దృష్టి అంతా ఒకే విధం గా ఉండాలి కదా. అట్లాగే 'అందరినీ అలరించే మంత్రం' అన్న కథ పొగడ్త ఎటువంటి వ్యక్తినయినా లోబరుచు కుంటుందని చెప్పే కథ. ఏమి నీతిని అందిస్తుంది. ఈ కథలు ఒకటో తరగతి విద్యార్థుల స్థాయికి మించినవి. కథ ల నిడివి కూడా ఎక్కువ. వాక్యాలు దీర్ఘంగా ఉన్నాయి. ఒక కథను రెండు పేజీల్లో నాలుగు కాలముల్లో అచ్చు వేశారు. ఈ వాచకంలో చివరి పాఠం 'పద్యములూ. 6 పద్యాలున్నాయి. అయిదు పద్యాలకు వివరణలున్నాయి. ఆరో పద్యం కొంచెం పెద్ద అచ్చులో వివరణ లేకుండా ఉంది, కారణం తెలియదు. ఇక ఇచ్చిన పద్యాలలో ఒకటి కులం కంటే గుణం ప్రధానమని చెప్తే మరొకటి కులం, గోత్రం, విద్య ఉన్నవారు కూడా 'పసిడిగల్గువాని బానిస కొడు కులూ అని చెప్తుంది. వేమన పద్యాలను తప్పుపట్టడం కాదుకాని ఈ పద్యాల ద్వారా ఒకటో తరగతి పిల్లలకు రచయిత్రి ఏం చెప్పదలచుకుంది? శబ్దం అన్నమాటను ధ్వని, ఉచ్చారణ అన్న అర్థంలోనూ, అక్షరం అన్న మాటను లిపి సంకేతం అన్న అర్థం లోనూ రంగనాయకమ్మగారు ఉపయోగించారు. శబ్దానికి బదులు ధ్వని అన్న ప్రచారంలో ఉన్న మాటను వాడితే స్పష్టత ఉండేది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే పిల్లల చదువు ఒకటో తరగతితోనే మొదలవుతుంది. మొట్టమొదటిసారిగా వాచకం చేత పట్టుకునే పిల్లలకు అది దోషరహితంగా, ఆకర్షణీయంగా ఉండాలి. అందుకే ప్రస్తుతం ప్రభుత్వం ఖర్చు ఎక్కువే అయినా ప్రాథమిక తరగతుల వాచకాలను రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా ప్రచురిస్తూ ఉంది. పుస్తకంలో తగినన్ని బొమ్మలు, కంటికి ఇబ్బంది కలగని విధంగా అచ్చు ఉండాలి. అటువంటి ప్రయో గాలతో చూసినప్పుడు, ఈ వాచకం అసంతృప్తినే మిగిలిస్తుంది. భాష నేర్పడం, వాచకం తయారు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. రంగనాయకమ్మ వంటి ప్రముఖ రచయిత్రి వాచకాలమీద విస్త­ఋత విమర్శలు చేసిన రచయిత్రి తయారు చేసిన వాచకమే ఇలా ఉంది. దీన్ని సరయిన వాచకమని ఆమె అభివర్ణిస్తూ ఉంది. సర యిన తెలుగు వాచకమంటే ఇలానేనా ఉండేది?

- డి. చంద్రశేఖర రెడ్డి/


Courtesy: ఆంధ్ర జ్యోతి
learning Telugu kids curriculum school schools alphabet alphabets andhra jyothy jyothi D. Chandrasekhara Reddy


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home