తొలి తెలుగు తీర్పు
నిజామాబాద్ న్యాయమూర్తి ఘనత
నిజామాబాద్ - న్యూస్‌టుడే
నిజామాబాద్ - న్యూస్‌టుడే
రాష్ట్ర చరిత్రలోనే న్యాయస్థానంలో తొలి తెలుగు తీర్పు బుధవారం వెలువడింది. ఈ ఘనతను నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ సివిల్ న్యాయమూర్తి మంగారి రాజేందర్ (జింబో) సాధించారు. బుధవారం జిల్లా కోర్టులో ఒకకేసు గురించి తెలుగులో తీర్పు చదివిన న్యాయమూర్తి రాజేందర్ తన తెలుగు భాషాభిమానాన్ని చాటారు. అధికార భాషగా తెలుగు అమలులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని న్యాయస్థానంలో ఈ రకంగా తెలుగులో తీర్పు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాహితీప్రియులకు జింబో పేరుతో సుపరిచితులైన రాజేందర్ ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చారు. వాద ప్రతివాదులకు వారి సొంత భాషలో తీర్పును వినిపించిన ఆయన ఆశ్చర్యపరిచారు.
తెలుగులోనే మేలు:
రాజేందర్
రాజేందర్
రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్ సభ్యులు కాలువ మల్లయ్యల ప్రయత్నాలను చూసి తాను ప్రేరణ పొందానని, తెలుగులో తీర్పు చదవడం వల్ల కేసులో వాది ప్రతివాదులకు మేలు జరుగుతుందని న్యాయమూర్తి మంగారి రాజేందర్ 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు. గ్రామీణుల భాషలోనే అందరూ తీర్పులను వెలువరించితే తల్లి భాషకు మేలు చేసినవారమవుతామన్నారు. రాష్ట్ర అధికార భాష సంఘం ఆధ్వర్యంలో 12వ తెలుగు వికాసం సదస్సు నిజామాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా జిల్లాలో తొలి తెలుగు తీర్పు వెలువడడం గొప్ప విషయమని ఎ.బి.కె. ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి మంగారి రాజేందర్ ఈ తీర్పు వెలువరించడం అభినందనీయమన్నారు. ఈ తీర్పుతో ఇలా జిల్లా కోర్టుల్లో అందరూ తెలుగులోనే వాద ప్రతివాదాలు, రికార్డులు, అర్జీలు రావడానికి ప్రయత్నించాలని కోరారు.
Courtesy: ఈనాడు
first Telugu judgement court Nizamabad judge Rajendar
1 Comments:
నేను గర్విస్తున్నాను.
Post a Comment
<< Home