ఇదీ తెలుగు వెలుగు
చిన్న సర్వేకు అద్భుత స్పందన
పరిరక్షణపై ప్రభుత్వ నిర్లక్ష్యం
హైదరాబాద్- న్యూస్‌టుడే
ఈ తాళపత్ర గ్రంథాన్ని చూడండి. వెయ్యేళ్ల కిందటిది. క్రీ.శ. 1049 నాటిది. అంటే ఆదికవిగా మనం కీర్తిస్తున్న నన్నయ కాలానికి చెందినది. ఇందులో చక్కని తెలుగులో రాసిన ఎన్నో కీర్తనలు ఉన్నాయి. ఇంతకాలం ఇది ఎవరి దగ్గర ఉందో తెలుసా? సికింద్రాబాద్ తార్నాకకు చెందిన చిన్నికృష్ణ అనే ఆయన ఇంట్లో.
ఎంతో విలువైన ఇలాంటి తాళపత్రాలు, రాత ప్రతులు మన తెలుగు నాట గ్రామగ్రామానా ఉన్నాయి. పాండిత్యం, సాహిత్యాభినివేశం ఉన్న వారి నివాసాల్లోనే కాదు... అక్షర జ్ఞానం లేని వారి ఇళ్లలో కూడా ఇవి బూజుపట్టిపోతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రాచ్య, లిఖిత గ్రంథాలయం, పరిశోధన కేంద్రం (ఓఎంఎల్‌ఆర్‌సీ) మూడు నెలల కిందట చిన్న సర్వే నిర్వహించగా ఇలాంటి వేలాది తాళపత్రాలు బయటపడ్డాయి. వీటితోపాటు మరెన్నో తాళపత్రాలు ఓఎంఎల్‌ఆర్‌సీలో ప్రస్తుతం దుమ్ము కొట్టుకుపోతున్నాయి. వీటిని సీడీలుగా చేసి భద్రపరచడానికి రూ.50 లక్షలు ఖర్చవుతుంది. కానీ ఆ సొమ్ము ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఫలితంగా దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ వీటిపై కన్నేసింది.
తాళపత్రాల్ని తమకు అప్పగిస్తే స్కాన్ చేసి సీడీల్లో నిక్షిప్తం చేసుకుని తిరిగి ఇచ్చేస్తామంటోంది. కోటి రూపాయలు వెచ్చించేందుకూ సిద్ధపడుతోంది. ఒక విదేశీ సంస్థ ఇంత ఆసక్తి చూపుతుండగా... ప్రాచీన భాషగా తెలుగుకు గుర్తింపు కోసం కేంద్రంతో పోరాడుతున్నామని చెబుతున్న మన ప్రభుత్వం మన అమూల్య వారసత్వ సంపదను ఇలా నిర్లక్ష్యం చేయడం వింత గొలుపుతోంది.
ఓఎంఎల్‌ఆర్‌సీ సర్వేకు అనూహ్య స్పందన
పరిరక్షిస్తేనే సంస్కృతికి మనుగడ
హైదరాబాద్ - న్యూస్‌టుడే
పాత బడినట్లున్న భవనం... దుమ్ము కొట్టుకుపోయిన గోడలు... వాటి మధ్యన అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు.... ఇదీ ఈ సంస్థ పరిస్థితి. తాళపత్రాల్ని సంరక్షించేందుకు తగినన్ని నిధులుగానీ, వసతులుగానీ ఇక్కడ లేవు. నిర్వహణ కోసం ఈ సంస్థకు ఏటా రూ.1.5 నుంచి రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నారు. కరెంటు బిల్లు సహా అన్ని ఖర్చులూ ఇందులోనే. ఉన్నంతలోనే సాధ్యమైనంత మేరకు తాళపత్రాల్ని ఈ సంస్థ కాపాడుకుంటూ వస్తోంది. గత ఏడాది రూ.4 లక్షలు, ఈ ఏడాది రూ.10 లక్షలు ప్రభుత్వం కేటాయించడంతో ఈ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ భావించింది. మన చరిత్రకు, వారసత్వానికి చిహ్నాలైన తాళపత్ర గ్రంథాలు, రాత ప్రతులు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు, వీలైతే సేకరించేందుకు ప్రయత్నించింది. మొన్న ఫిబ్రవరి 20 నుంచి 24 తేదీ వరకూ చిన్న సర్వే నిర్వహించింది. ఒక్కో జిల్లాకు ఇద్దరు సమన్వయకర్తల్ని, మండలానికో వాలంటీర్‌ను ఏర్పాటు చేసింది. వీరు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి తెలిసిన వారితో మాట్లాడి పురాతన తాళపత్రాలు, రాతప్రతులు ఎవరి దగ్గరైనా ఉన్నాయా అని ఆరా తీశారు. కనీసం 75 ఏళ్ల కిందట చేతిరాతతో ఉన్న పత్రాల వివరాలు సేకరించారు. అవి తమకు చూపితే చాలని, ప్రభుత్వానికి విధిగా ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని చెప్పడంతో దీనికి అనూహ్య స్పందన లభించింది. చాలామంది స్వచ్ఛందంగా చూపడమే కాకుండా వాటిని ఇక తాము భద్రపరచలేమంటూ వాలంటీర్లకు అందజేశారు. నామమాత్రపు సిబ్బందితో తొలిసారిగా నిర్వహించిన ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను చూసి అధికార యంత్రాంగం బిత్తరపోయింది. ఏ మాత్రం అక్షర జ్ఞానం లేని పామరులు, నిరక్షరాస్యుల వద్ద సైతం అత్యంత విలువైన చారిత్రక, సాహితీ విలువలున్న తాళపత్రాలు, రాతప్రతులు పడి ఉన్నాయని ఈ క్షేత్ర సర్వేలో వెల్లడైనట్లు ఓఎంఎల్‌ఆర్‌సీ అధిపతి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఇప్పుడు నిరక్షరాస్యులైన కుటుంబాల పూర్వీకులు విద్యావంతులు, సాహిత్యాభిమానులు కావడం వల్లే వారి ఇళ్లలో తాళపత్రాలు, పురాతన రాతప్రతులు ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు. వాటిలో ఎలాంటి సమాచారం ఉందో కూడా వాటిని భద్రపరిచిన ఇప్పటి తరం వారికి పూర్తిగా తెలియదని ఆయన చెప్పారు. ఇప్పటికీ చాలామంది ఆ తాళపత్రాల్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇష్టపడటం లేదు. అయినా వాటిని కాపాడాలన్న సద్దుదేశంతో ప్రత్యేకంగా రసాయనాలు, పరికరాలతో ఓ కిట్‌ను ఓఎంఎల్‌ఆర్‌సీ రూపొందించింది. దీనిని తాళపత్రాలు, రాతప్రతులున్న ప్రతి కుటుంబానికీ ఉచితంగా అందజేస్తోంది. ఈ కిట్ కావాలనుకునేవారంతా తమను సంప్రదించవచ్చని జయధీర్ సూచించారు.
ఇవిగో విశేషాలు
సర్వేలో లభించిన సమాచారాన్ని ఓఎంఎల్‌ఆర్‌సీ ప్రస్తుతం క్రోడీకరిస్తోంది. ఇంకా రెండు జిల్లాల సమాచారం అందాల్సి ఉంది. అది కూడా అందితే సమగ్ర నివేదికను రూపొందిస్తామని జయధీర్ చెప్పారు. ఈ సర్వేలో ప్రజల వద్ద లభించిన కొన్ని తాళపత్రాలు, రాత ప్రతుల వివరాల్ని 'న్యూస్‌టుడే' సేకరించింది.
* దాదాపు 1500 ఏళ్ల నాటి ప్రాచీన లిపిలో రచించిన 69 తాళపత్ర గ్రంథాలు నల్గొండ జిల్లాలో ఓ మారుమూల కుగ్రామంలో ఒక కుటుంబం వద్ద లభించాయి. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన అన్నెపర్తి వెంకటరామశర్మ దంపతులు వీటిని భద్రపరిచారు. వేదాలు, ఉపనిషత్తులు, ఆత్మజ్ఞానం, వైద్యశాస్త్రం, సంఖ్యల ఉపయోగ శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలివి.
* హిందువుల్లో ప్రతి మనిషికీ ఇంటిపేరు, గోత్రం ఉండడం సహజం. అసలు ఈ గోత్రాలు ఎందుకు, ఎలా పుట్టాయి? వాటి ప్రకారం మనుషుల్ని ఎలా విభజించారు? అనే పురాతన సమాచారం ఉన్న వంద తాళపత్రాలు నిజామాబాద్‌లో లభించాయి.
* ఇదే జిల్లా గడివేముల మండల గని గ్రామ చరిత్రపై 1426లో తెలుగులో రాసిన 'గని చరిత్ర గ్రంథం' లభ్యమైంది.
* క్రీ.శ. 1105 సంవత్సరానికి చెందిన కొన్ని తాళపత్రాలు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దూదెకొండ గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డిల వద్ద ఉన్నాయి. వారువీటిని వాలంటీర్లకు అందజేశారు. వీటిలో ఉన్న సమాచారంపై అధ్యయనం సాగుతోంది.
* మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో రెండువేల తెలుగు రాతప్రతులు లభించాయి. భాగవతం, ఉద్యోగ పరిషత్, రుక్మీణీ కళ్యాణం మొదలైనవి వీటిలో ఉన్నాయి.
* ఇదే జిల్లా నారాయణపేటలో 1724 నాటి తెలుగు రాతప్రతులు లభించాయి. అప్పటి లోకాయపల్లి సంస్థానంలో నివసించిన భాస్కరాచార్యులు రాసిన లలితా సహస్రనామం, 24 మంత్ర శ్లోకాలు ఇందులో ఉన్నాయి.
* కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరుకు చెందిన వెంకటరమణశర్మ వద్ద వెయ్యి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వేదాలు, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన సమాచారం వీటిలో తెలుగులో ఉంది.
* రామాయణాన్ని బొమ్మల పుస్తకంగానో, టీవీ సీరియల్‌గానో చూసి ఆనందిస్తున్నారు నేటి పిల్లలు. మరి 250 ఏళ్ల కిందట ఓ చిత్రకారుడు తాళపత్రాలపై చిత్రించిన అచ్చ తెలుగు బొమ్మల రామాయణం ఒకటి ఉంది. ఆకుల రసాలనే సిరాగా వాడి ఈ చిత్రాలు గీశారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడేనికి చెందిన ఒక వ్యక్తి వద్ద ఇది లభించింది.
* నల్గొండ మండలం ఆలేరు సీతారామాలయం పూజారి యాదగిరి స్వామి వద్ద 1235-1302 మధ్యకాలం నాటి లిఖిత సాహిత్యం, వస్త్ర పత్రాలు రాత ప్రతుల రూపంలో దొరికాయి.
* ఇదే జిల్లా రాజాపేట గ్రామంలోని వెంకటేశ్వర మఠానికి 1783లో భూమిని విరాళంగా ఇస్తూ ఓ దాత రాసి ఇచ్చిన తాళపత్రం ఇప్పటికీ భద్రంగా ఉంది.
* ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యుడు పూర్ణచంద్రరాజు వద్ద వెయ్యేళ్లనాటి నాలుగు కిలోల తామ్ర పత్రాలు లభించాయి.
* దేశ్‌ముఖ్, దేశ్‌పాండే రాజులకు సంబంధించిన సమాచారాన్ని 1773లో ఇనుప రేకులపై తెలుగు, ఉర్దూ భాషల్లో రాశారు. ఈ ఇనుప రేకులు ఇటీవల సర్వేలో వేములపల్లి మండలం ఆమనగల్లులోని దొరల గడిలో లభించాయి.
Courtesy: ఈనాడుTelugu Andhra Pradesh ancient manuscripts classical palm leaf treasure historic historical Eenadu may 2006
0 Comments:
Post a Comment
<< Home