ఆధునిక ప్రక్రియలకు ఆద్యుడు వీరేశలింగం
మంగు శివరామప్రసాద్
సంఘ సంస్కరణకు ఉపకరణగా సాహిత్యాన్ని చేపట్టి సాహిత్య ప్రయోజన దృష్టిని మార్చివేసిన వైతాళికుడు కందుకూరి వీరేశలింగం. సాహిత్యం సమాజ అభ్యున్నతికే అని చాటి చెప్పిన వీరేశలింగం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప విప్లవాన్ని తెచ్చాడు. సామాజిక అభ్యున్నతితో సాహిత్యాభ్యున్నతిని సమన్వయపర్చాడు. అందువల్ల ప్రబంధానంతర కాలానికి అభ్యుదయ కవితా కాలానికి మధ్య ఉన్న ఈ విప్లవాత్మకమైన సాహితీ యుగానికి వీరేశలింగం అనే పేరు పెట్టడంలో ఆనాటి కవులు, రచయితలపై వీరేశలింగం ప్రభావాన్ని ఊహించవచ్చు. వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజాన్ని స్థాపించి భాషా ప్రచారానికి ఎనలేని సేవ చేశాడు. ఒక వైతాళికుడిగా భవిష్యత్తులో వచనానికున్న ప్రాముఖ్యతను గుర్తించి వీరేశలింగం, వ్యాసం, నవల వంటి వచన సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టి ఆధునిక తెలుగు సాహిత్యానికి వెలుగుబాట వేశాడు. హృద్యమైన గద్య రచన చేసి 'గద్య తిక్కన'గా ప్రశంసలందుకున్నాడు. తెలుగు సాహితీ సరస్వతికి ఉన్న సంప్రదాయ శృంఖలాలను తెంచి, నవ్య సాహిత్య సృష్టి చేసిన కృషీవలుడు. గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, కృష్ణశాస్త్రి మొదలైన భావికాలపు కవులకు మార్గనిర్దేశం చేసే దీపధారుడు అయినాడు.
వీరేశలింగం రచనా శైలి, సంఘ సంస్కరణ భావాలతో పానుగంటి, చిలకమర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి రచయితలు ప్రభావితులే తమ గద్య రచనా శైలికి పదును పెట్టుకున్నారు. 'ఆంధ్రులు తామొక జాతివారమని ప్రకృతము చెప్పుకొనుటకు ఆత్మగౌరవము మనలో ముద్భవింప చేసినది పంతులుగారే' అని కట్టమంచి రామలింగారెడ్డి గారన్నారు. ఆచారాలు, నమ్మకాలు, మానవతా విలువలు అన్నీ కూడా కొత్త అర్థాలతో తెలుగువారి జీవితాన్ని ప్రకాశవంతం చేశాయి వీరేశలింగం దృష్టి కోణంతో. సాంప్రదాయికత వాతావరణంలో పుట్టి పెరిగిన వీరేశలింగం మొదట్లో సాంప్రదాయిక రచనలు చేసినా చిన్నయసూరిని తలదన్నేట్లుగా 'విగ్రహం', 'సంధి' అనువదించాడు. ఓష్ట్యాలు లేకుండా, వచనం లేకుండా శుద్ధాంధ్రలో నైషధం వ్రాశాడు. ఈ ధోరణి ఆగిపోవడానికి కారణం సమాజ సంస్కరణోద్యమ అవసరాలు సాహిత్యం పట్ల కలిగించిన కొత్త దృష్టే. సులభ గ్రాంథికంలో నవలలు, ప్రహసనాలు, జీవిత చరిత్రలు, వ్యంగ్య, హాస్య రచనలూ, శాస్త్ర పుస్తకాలు, పత్రికా వ్యాసాలు ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో ఆధునిక దృక్పథానికి అభినివేశం, ప్రాచుర్యం కలిగించాడు వీరేశలింగం.
ఇంగ్లీషు నాటకాలను అనుసరిస్తూ సంస్కృత నాటకాలను అనువదించాడు. సాహితీ ప్రమాణాల కన్నా ఉన్నత ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ బహుళ జనాదరణ పొందాయి. 20 సంవత్సరాల వయసులో రెండు శతకాలు వ్రాశాడు. వాటితో సంతృప్తి చెందక 'శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నైషధం' అనే అచ్చ తెలుగూ, నిర్వచనమూ, నిరోష్ఠ్యము కలసిన మిశ్రకావ్యం వ్రాశాడు. కోరంగిలో స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న రోజుల్లో శుద్ధాంధ్రోత్తర రామాయణాన్ని రచించి, బందరులోని 'పురుషార్థ ప్రదాయిని'లో భాగాలుగా ప్రకటించాడు. పిల్లల కోసం సంగ్రహ వ్యాకరణం, నీతులు బోధించే గీత పద్యాల 'నీతి దీపిక'ను ప్రచురించాడు. ధవళేశ్వరంలో 1874లో ఆంగ్లో దేశ భాషా పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ తెలుగులో మొదటి వచన కావ్యం 'విగ్రహ తంత్రం' రచించి ప్రచురించినప్పుడు పండితులు ప్రశంసలు కురిపించారు. ఈ వచన కావ్యం మెట్రిక్ పాఠ్య పుస్తకంగా గుర్తింపు పొందడం విశేషం. తన భావాలు ప్రచారం చేయడానికి, స్త్రీలంతా చదువుకోవాలనీ, తన రచనల మీద విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలనీ, తనకు కూడా ఇతర పండితుల వలె ఒక పత్రిక ఉండాలనీ 1874 అక్టోబర్‌లో 'వివేకవర్ధని' మాస పత్రికను ప్రారంభించాడు వీరేశలింగం.
విద్యా విషయాలు, దేశ వ్యవహారాలు, కులాచారాలు, నీతి, మతం మొదలైన అంశాలతో మంచిని పెంచే విధంగా వివేకవర్థని ఆవిర్భవించి, అభివృద్ది చెందింది. దీనికి అనుబంధంగా 'హాస్య సంజీవిని' వెలిసింది. ఇందులో 'బ్రహ్మ వివాహం' వాడుక భాషలో రాస్తే, 'పెద్దయ్యగారి పెళ్ళి'ని జనం మెచ్చుకున్నారు. 'ప్లీడర్ నాటకం' వ్యవహార ధర్మబోధిని అనే పేరుతతో వీరేశలింగం ప్రకటించాడు. పోలీసుల దొంగతనాలు, న్యాయవాదుల అన్యాయాలు, అధికారుల దురహంకారాలు ఈ ప్రహసనంలో చోటు చేసుకున్నాయి. వీరేశలింగం పిల్లల చేత వేషాలు వేయించి ఈ ప్రహసనాన్ని ప్రదర్శించాడు. జడ్జిమెంట్ల ఫార్స్ గూర్చి, మునసబు తీర్పుల గురించి దుమారం చెలరేగి ప్రభుత్వాన్ని సచేతనం చేసింది. సంఘ సంస్కరణ ప్రధాన లక్ష్యంగా, అక్రమాలపై విజృంభిస్తూ తెలుగు మాగాణిని పసిడి పంటగా చేశాడు. పత్రిక ద్వారా దురాచారాలను రూపు మాపడానికి, దేశాభివృద్ధికి ఉద్యమించడం, తెలుగులో కొత్త ప్రక్రియ వచన కావ్యాన్ని, ఇతర ప్రక్రియల్ని సమన్వయపర్చి తెలుగు భాషను సుసంపన్న చేయడం వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ, సాహితీ సంస్కరణ కార్యక్రమాలు.
బ్రహ్మ సమాజ భావాలతో పాటు సంఘ సంస్కరణ భావాలు వీరేశలింగం స్వకీయ జీవిత తత్వానికి మేలిమి మెరుగులు దిద్దాయి. వితంతు పునర్వివాహ కార్యక్రమాల్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడం, స్త్రీ విద్య కోసం కృషి చేయడం, దళితుల విద్యా, సంక్షేమాల కోసం శ్రమించడం, ఉన్నత కులాల నీచ ప్రవృత్తులను బట్టబయలు చేయడం, భోగం మేళాలను నిరసించడం, మతపరంగా ఏకేశ్వరారాధనను ప్రచారం చేయడం వీరేశలింగం సంఘ సంస్కరణ కార్యక్రమాల్లోని ప్రధానాంశాలు. 1878లో నవలా రచనకు ఉపక్రమించి అలీవల్ గోల్డ్‌స్మిత్ నవల వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్‌ని అనుసరిస్తూ కొత్త కల్పనలతో 'రాజశేఖర చరిత్రం' అనే నవల వీరేశలింగం వ్రాశాడు. ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబ జీవితంలోని ఒడిదుడుకులను వర్ణిస్తూ ఆనాటి తెలుగువారి ఆచార వ్యవహారాలు, సామాన్య మానవుణ్ణి కేంద్ర బిందువుగా, కథానాయకుడిగా చేసుకుని ఒక సమగ్ర సామాజిక చిత్రణ చేసే ప్రయత్నం ఈ మొట్టమొదటి తెలుగు నవలలో కనిపిస్తుంది. భూస్వామ్య వ్యవస్థకు భరతవాక్యం పలకడం, ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది ప్రస్తావన చేయడం వంటి ఈ నవలలోని అద్భుత సన్నివేశాలు వీరేశలింగం అభ్యుదయ మనస్తత్వానికి నిదర్శనాలు.
వీరేశలింగానికి ముందు గోపాలకృష్ణమ్మ చెట్టి, నవలా రచనకు తొలి ప్రయత్నంగా 'శ్రీరంగరాజ చరిత్ర'ను వ్రాస్తే దానిని మద్రాస్ గెజిట్ మొదటి నవలగానే పేర్కొంది. 1872లో ముద్రితమైన ఈ వచన ప్రబంధంలో శైలి, శిల్పం, పాత్ర చిత్రణలో విశేషాలు కనబడవు. తెలుగు సాహిత్యంలో నవల, కథ, నాటకం, వ్యాసం, విమర్శ, వచన కవిత వంటి ప్రక్రియలకు తానే ఆద్యుడనని వీరేశలింగం తన స్వీయ చరిత్రలో వ్రాసుకోవడంలో అతిశయోక్తి లేదు. 1880లో వీరేశలింగం కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలా'న్ని తెలుగులోకి అనువదించాడు. ధార్వాడ్ నాటక కంపెనీ వాళ్ళు రాజమండ్రిలో నాటకాలాడినప్పుడు వేసిన పాకలలో తన శిష్యులకు శిక్షణనిచ్చి, వాళ్ళ చేత షేక్స్‌పియర్ రచన 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్'కి తన తెలుగు అనువాదం 'చమత్కార రత్నావళి' అనే నాటకం ప్రదర్శించాడు వీరేశలింగం. శ్రీహర్షుడి సంస్కృత నాటకం 'రత్నావళి'ని తెలుగులోకి అనువదించాడు. తెలుగు నాటకాలను మొదటిసారిగా ప్రదర్శించిన వాడు వీరేశలింగం. అందుకే వీరేశలింగం జయంతిని 'తెలుగు రంగస్థల దినోత్సవం'గా జరుపుకుంటున్నారు. తొలి నాటకం, తొలి ప్రహసనం, తొలి వ్యాసం రాసిన తెలుగు రచయిత వీరేశలింగం.
షెరిడన్ వ్రాసిన 'ది రైవల్స్', 'డ్యుయన్నా' అనే నాటకాలను తెలుగులో 'కళ్యాణ కల్పవల్లి', 'రాగమంజరి' అనే పేర్లతో అనువదించి, ఇంగ్లీషు పద్య కావ్యాలు, కాపర్ వ్రాసిన 'జాన్ గిల్సిన్', అలీవర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన 'ది ట్రావెలర్'ను అనువదించాడు. ఇంగ్లీషు, సంస్కృతాల నుంచి ప్రసిద్ధ నాటకాలను అనువదించడమే కాక, 'ప్రహ్లాద', 'సత్యహరిశ్చంద్ర', 'దక్షిణ గోగ్రహణం' అనే సొంత నాటకాలను కూడా వీరేశలింగం రచించాడు. ఏ గ్రంథం వ్రాసినా, ఏదో ఒక సందర్భంలో సంఘ సంస్కరణ అవసరాన్ని, బ్రహ్మ సమాజ ప్రబోధాలను తన రచనల్లో ప్రవేశ పెట్టాడు వీరేశలింగం. 'దక్షిణ గోగ్రహణం'లో ఆనాటి సాంఘిక సమస్యలు, వాటి నివారణ గూర్చి, 'సత్యహరిశ్చంద్ర' నాటకంలో స్త్రీ విద్య, భక్తి ప్రపత్తులను గూర్చి, సత్య, ధర్మ, దయా గుణాల గూర్చి ప్రస్తావించాడు. సంస్కృతం నుండి శాకుంతలం కాక మాళవిక ప్రబోధ చంద్రోదయం కూడా అనువదించాడు. 1883లో స్త్రీల కోసం 'సతీహిత బోధిని' ప్రారంభించాడు. 'పతిత యువతీ రక్షణశాల'ను ఏర్పరచాడు. రాజమండ్రిలో పుర మందిరాన్ని, విద్యా వ్యాప్తికై ఉన్నత పాఠశాలను స్థాపించాడు. బ్రహ్మ సమాజ వ్యాప్తికి రఘుపతి వెంకటరత్నం నాయుడుతో కలిసి పని చేశాడు. వ్యావహారిక భాషా వ్యాప్తి కోసం గిడుగు రామమూర్తి ఏర్పర్చిన వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజానికి వ్యవస్థాపక అధ్యక్షుడు. 'హితకారిణీ సమాజం' అనే సంస్థను స్థాపించి తన ఆస్తినంతటినీ ఆ సంస్థకు జన కళ్యాణార్థం దానం చేశాడు.
సులభ శైలిలో స్త్రీ విద్యావశ్యకత గూర్చి, దేహ పరిశుభ్రత గూర్చి 'సతీ హితబోధిని'లో ప్రచురించిన తన నవల 'చంద్రమతీ చరిత్ర'లో చెప్పారు. 240 మంది కవులు నన్నయ మొదలుకొని తన కాలం వరకు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన వారి చరిత్రను మూడు సంపుటాలుగా ఆంధ్రావనికి అందించిన శాశ్వత కీర్తి, ఘనత వీరేశలింగానిది. చనిపోతున్నప్పుడు కూడా, కవుల చరిత్ర ద్వితీయ భాగపు ముద్రిత ప్రతి ప్రూఫులు దిద్దుతూ, కలం చేతిలో పట్టుకునే కనులు మూయడం సాహిత్య సంస్కరణకు, సంఘ సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేసిన యుగకర్తగా వీరేశలింగం పూజలందుకోవడం మరువలేని సంఘటనలు. భాషా సాహిత్యాలనే కాక సామాజిక జీవితాన్ని కూడా ఊహాతీతంగా మార్చివేయగల శక్తి సామర్ధ్యాలు గల వ్యక్తులు సమాజంలో కనిపించే అరుదైన వ్యక్తుల్లో అగ్రగణ్యులు. ఈనాటికి ఏనాటికీ తెలుగుజాతి, తెలుగు సంస్కృతి వీరేశలింగానికి రుణపడి ఉంటాయనడంలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. అటువంటి తెలుగు తేజోలింగం కందుకూరి.
వీరేశలింగం ఇంతటి చారిత్రక మార్పుని తీసుకు రాగలిగాడంటే, తాను ఎంత వజ్ర సంకల్పుడైనా, ఎందరి సహాయ సహకారాలను సమకూర్చుకున్నాడో మరెందరి దూషణ, ఛీత్కారాలను ఎదుర్కొన్నాడో ఊహించవచ్చు. భూస్వామ్య వ్యవస్థకు అనుగుణమైన పండిత సంప్రదాయాన్ని వీరేశలింగం ప్రయత్నపూర్వకంగా పడగొడుతూ, నవ్య సామాజిక జీవిత దశకు అనుకూలించే సాహితీపథాన్ని సుసంపన్నం చేశాడు. సాధారణ వ్యక్తులు కాలానికి అనుగుణంగా నడుచుకుంటారు. కాని కొందరు అసాధారణమైన వ్యక్తులు కాలాన్నే తమ వెంట నడిపిస్తారు. అటువంటి అసాధారణ వ్యక్తులలో ఆద్యుడు వీరేశలింగం. కాలాన్ని జయించి తెలుగువారి హృదయాలలో శాశ్వత నివాసం ఏర్పర్చుకున్నాడు. తెలుగు కీర్తికేతనమైనాడు.
Courtesy: ఆంధ్ర ప్రభ
Veerasalingam Pantulu Andhra Pradesh Telugu India language poet freedom fighter Andhra Prabha April 2006
0 Comments:
Post a Comment
<< Home