బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతాం : గీతారెడ్డి
విజయపురిసౌత్, మాచర్ల, డిసెంబరు 26 (న్యూస్‌టుడే): రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డి సోమవారం వి.పి.సౌత్ లాంచి స్టేషన్‌లో రూ.12 లక్షలతో మరమ్మతులు చేసిన ఎం.ఎల్. విజయలక్ష్మి లాంచీని ప్రారంభించారు. హోం మంత్రి కె.జానారెడ్డి లాంచి మోటర్ స్విచ్‌ను ఆన్ చేశారు. 10 నిమిషాలు పాటు జలాశయంలో విహరించారు. అనంతరం విలేకరులతో శాంతిసిరి లాంచీలో మాట్లాడారు. మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ ఎ.పి. టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేసిందన్నారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్‌లో బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రూ.24 కోట్లతో 270 ఎకరాల స్థలంలో ఏడు జోన్లుగా విభజించి బౌద్ధారామం పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.12 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామన్నారు. ప్రపంచ పర్యాటకుల ఆహార అభిరుచులకు అనుగుణంగా అన్ని వంటకాలు సిద్ధం చేసేందుకు ఫుడ్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాగార్జునకొండ లోయ నుంచి ఆచార్య నాగార్జునుడు ప్రపంచ దేశాలకు బౌద్దమతాన్ని వ్యాప్తి చేసిన ఘనత ఉందని చెప్పారు. హోం మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక పలువురు వలస బాట పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడి, ఎడమ ప్రాంతాలలో బౌద్దవనం, విహార కేంద్రాల నిర్మాణాలు చేపడుతుందన్నారు. నాగార్జునకొండ బౌద్ద ప్రాధాన్యత తెలిపే నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందన్నారు. విజయపురిని విజ్ఞాన కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, నల్గొండ జడ్.పి. ఛైర్‌పర్సన్లు పాతూరి నాగభూషణం, సీతాలక్ష్మమ్మ, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి, సహకార బ్యాంకు ఛైర్మన్ కుర్రి పున్నారెడ్డి, మాచర్ల ఎంపీపీ చామకూర రాజారెడ్డి, స్థానిక నాయకులు సి.హెచ్.నాగిరెడ్డి, డాక్టర్ బసివిరెడ్డి, తోటకూర పరమేష్, సురేష్, ఉన్నూర్ సాహెబ్, టూరిజం అధికారులు, డ్యామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005, Nagarjuna University
0 Comments:
Post a Comment
<< Home