"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Friday, December 23, 2005

మాతృభాష గొప్పదనాన్ని చాటిన సిటిఎస్‌ఎస్‌

కాలిఫోర్నియా, డిసెంబర్‌ 21: మాతృభాష చేదవుతున్న నేటి రోజుల్లో ఎక్కడో దేశంగాని దేశంలో మన తెలుగు భాష గొప్పదనం గురించి, దాని తియ్యదనం గురించి మన తెలుగువారందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక తెలుగు సాహితీ సదస్సు నిర్వహించారు. కుమార్‌ కలగర ఆధ్వర్యంలో 'మొట్ట మెదటి కాలిఫోర్నియా తెలుగు సాహితీ సదస్సు' రాజధాని శాక్రమెంటోలో డిసెంబర్‌ 17న జరిగింది. ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో కాలి ఫోర్నియాలోని పలు ప్రాంతాలతో పాటు హ్యూస్టన్‌, టెక్సాస్‌ నుండి కూడా ప్రముఖ సాహితీ వేత్తలు హాజరయ్యారు. సదస్సుకు ప్రముఖ సాహితీ వేత్త, సుజన రంజని పత్రిక సంపాదకులు కిరణ్‌ ప్రభ అధ్యక్షుత వహించగా, ప్రముఖ రచయిత, సంపాదకులు, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథ రె డ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

శృతి మోడెకూడి పాడిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ'' పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభోపన్యాసంలో సదస్సు ఆశయాలను, భవిష్యత్తు ప్రణాళికను కుమార్‌ కలగర వివ రించారు. ఇలాంటి సదస్సులు కాలిఫోర్నియాలోని పలు నగరాలలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలన్న తన కోరికను వెలిబుచ్చారు. సభాధ్యక్షులు కిరణ్‌ ప్రభ మాట్లాడుతూ సమాజంలో సాహిత్యం ప్రముఖ పాత్ర వహిస్తుందనీ, సంస్క­ృతి వైభవాలు సాహిత్యంలో నిక్షిప్తమై ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. చరిత్ర పునరావృతమవుతుందని, సాహిత్యానికి మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ప్రవాసాంధ్రులు-తెలుగు భాషపై వారికర్తవ్యం'' అనే అంశంపై ప్రముఖ పాత్రికేయురాలు హిమబిందు మాట్లాడుతూ, భాష మన జీవన విధానంతో ముడిపడి ఉందని, పిల్లలు తెలుగు నేర్చుకునేలా చేయడం తల్లిదండ్రుల కర్తవ్యమనీ, అందులో తల్లి ప్రముఖ పాత్ర వహిస్తుందని అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మకమైన, అనుసరణీయమైన పద్దతులను ఆమె విశదీకరించారు.

' అలుసవుతున్న అమ్మ భాష'' అనే అంశంపై కథా, గేయ రచయిత డా. సురేంద్ర దారా మాట్లాడారు. సాంకేతిక అభివృద్ధి, ప్రపంచీకరణ తెలుగు భాషపై అభిమానం, ఆదరణ తగ్గడానికి ఎలా దోహదం చేస్తున్నాయో వివరించారు. భాషాభివృద్ధికి అవసరమైన పరిష్కార మార్గాలను కూడా సూచించారు.

ముఖ్య అతిథి డా. కేతు విశ్వనాధ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో తెలుగు వారికి గుర్తింపు వచ్చే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే భారతీయుల సాహిత్యం పదికాలాలపాటు వర్థిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికాలో తెలుగు నేర్పడంలో గల సాధక బాధకాలను, అనుభవాలను తాటిపాముల మృత్యుంజయం సభికులకు వివరించారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాశాలను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పిల్లలను తెలుగు పాఠాలు నేర్చుకొమ్మంటూ తరగతులకు పంపడమే కాకుండా, ఇండ్లలో కూడా తెలుగు మాట్లాడుతూ భాషా ఙ్ఞానాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భాష మార్పు చెందుతుంది కాని అంతరించి పోద న్నారు.

విశేష అథితి చెరువు రామ్మోహన్‌ పిల్లల్లో భాషాభిమానాన్ని పెంపొందిచడం తల్లి దండ్రుల కర్తవ్యమని అన్నారు. తెలుగు భాషతో పాటు మారుతున్న కుటుంబ వ్యవస్థ గురించి శ్రీమతి దుర్భ సరస్వతి ప్రసంగించారు.

"సిరివె న్నెల సినీ గీతాలపై ఆశావాదం'' అన్న అంశంపై కిరణ్‌ ప్రభ ప్రసంగిస్తూ, సినీ సాహిత్యంలోని సాధక భాధ కాలను గురించి కూడా వివరించారు. సిరివెన్నెల గీతాల్లోని భావోద్రేకం, ఆశావాదం సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయని, ఆయన రాసే పాటలు నిరాశావాదుల్లో ఉత్సాహాన్ని నింపి ఆశావాదం వైపు పయనించేలా చేస్తాయని ఆయన వివరించారు.

స్వీయ రచ నా పఠనంలో భాగంగా ధారా సురేంద్ర, పిల్లారిశెట్టి సులోచన, దుర్భ సరస్వతి, వంగూరి చిట్టెన్‌ రాజు, చెరువు రామ్మోహన్‌, ఆరణి శివకుమార్‌, కలగర కుమార్‌, నేమాల గోపాల్‌ రావు కథలు, కవితలు, పాటలు చదివి వినిపించారు.

చిట్టెన్‌ రాజు 'ఈమెయిలోపాఖ్యానం' హాస్యకథ సభను నవ్వులతో ముంచెత్తింది. సదస్సులో పాల్గొన్నవారిలో ప్రముఖ రచయితలు వేమూరి వెంకటేశ్వరరావు, గొర్తి బ్రహ్మానందం తదితరులు ఉన్నారు. సదస్సుకు విచ్చేసి విజయవంతం చేసిన సాహిత్యాభిమానులందరికీ కుమార్‌ కలగర కృతఙ్ఞతలు తెలుపారు. తరువాత సదస్సు సిలికాన్‌ వ్యాలిలో నిర్వహించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Andhra Pradesh , California Telugu Samithi , Sacramento Telugu Sahiti Sahithi Sadassu , December 2005 , CTS


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home