తిరుపతిలో సాహితి, సంస్కృతి సభలు ప్రారంభం
న్యూస్‌టుడే, తిరుపతి:
తెలుగు భాషలోని ప్రత్యేకతను నిలుపుకోలేని ఖర్మ మనది. దాస్యం వీడినా భాష విషయంలో ఇంకా పరాధీనంలోనే ఉన్నామని జ్ఞానపీఠం అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో వారం రోజుల పాటు జరుగనున్న తెలుగు సాహితి, సంస్కృతి మహోత్సవాలను గురువారం ఉదయం జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏది మాట్లాడుతామో అదే రాస్తాం... ఏది రాశామో.. దానినే ఉచ్ఛరిస్తాం... తెలుగు గొప్పతనం ఇదేనని అన్నారు. పద్య నాటకం, అవధాన ప్రక్రియ తెలుగువారి సొంతమని, దక్షిణాదిలో తొలి వాగ్గేయకారుడు మన అన్నమయ్యేనన్న విషయాన్ని గుర్తు చేశారు. కూచిపూడి, పేరిణి తెలుగువారి సృష్టేనని చెప్పారు.
మానవీయ విలువల పునరుద్ధరణకే..
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తితిదే పాలక మండలి అధ్యక్షుడు భూమన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ మానవీయ విలువలను సమాజంలో పునరుద్ధరించడమే సాహితి, సంస్కృతి మహోత్సవాల నిర్వహణ లక్ష్యమని చెప్పారు. తమ పిల్లలు ఆర్థికంగా స్థిరపడితే చాలుననుకునే తల్లిదండ్రులు అనురాగం, ప్రేమ, మానవీయ విలువలును వారసత్వంగా అందించడాన్ని విస్మరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మన కళ్లముందే పతనమవుతున్న మానవీయ విలువలను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఈ కార్యక్రమాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమాజంలో మానవీయ విలువలను పాదుకొల్పేందుకు ఇది నాంది మాత్రమేనని... లక్ష్య సాధనలో విఫలమైనా తమ కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు. ఎస్వీయూ ఉపకులపతి ఎస్.జయరామిరెడ్డి మాట్లాడుతూ తిరుపతి అనగానే ఉన్నత విలువలు, మంచి నడవడిక కలిగిన ప్రజలు అనే భావం దేశ వ్యాప్తంగా ఉందని చెబుతూ, ఆ అభిప్రాయం సడల కుండా మరింత సత్ప్రవర్తనను అలవరచుకోవాలని హితవు పలికారు. తితిదే జేఈవో జి.బలరామయ్య మాట్లాడుతూ విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం పట్ల ఎలా వ్యవహరించాలో, మానవత్వం కలిగిన మనిషిగా ఎలా నడచుకోవాలో మన చదువు వల్ల పిల్లలకు అందాలని అభిప్రాయపడ్డారు.
అలరించిన కార్యక్రమాలు
తెలుగు సాహితి, సంస్కృతి మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు కార్యక్రమాలు వేలాది మంది సభికులను అలరించాయి. వేదార్థం- వర్తమానం అనేఅంశంపై డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, ఉపనిషత్సారంపై వాడ్రేవు చినవీరభద్రుడు, రామాయణ రమ్యతపై కసిరెడ్డి వెంకటరెడ్డి, భారతం-సమకాలినతపై నాగుళ్ల గురుప్రసాద్‌రావు, పోతన-భాగవతంపై డాక్టర్ హెచ్.ఎస్.బ్రహ్మానంద ప్రసంగించారు. తెలుగు భాష గొప్పతనం, వేదాల్లో విజ్ఞానం తదితరాలపై ప్రస్తావించినపుడు సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. కార్యక్రమాలను నిర్వహించిన మహతి ఆడిటోరియం నిండిపోయి వేలాది మంది నిలుచుని తిలకించాల్సి వచ్చింది. ఆడిటోరియం లోపల స్థలం లేక వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై సైతం కార్యక్రమాలను వీక్షించారు. మహోత్సవాల బ్యానర్లు, ప్రముఖ కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు ప్రవచించిన సూక్తుల కటౌట్లతో తిరుపతి వీధులు నిండిపోయాయి. సాహిత్య, సంస్కృతి సభలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
0 Comments:
Post a Comment
<< Home