తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలి: బాబు
హైదరాబాద్, అక్టోబర్ 31 (ఆన్‌లైన్): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏభై సంవత్సరాలు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పిస్తూ ప్రకటన చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి ఆయన ఇక్కడ తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏభై ఏళ్ళ క్రితం వరకూ వివిధ పాలనల కింద ఉన్న తెలుగువారిలో తామంతా కలిసి ఉండాలనే కోరిక బలంగా ఉండేదని, దానికోసం అన్ని ప్రాంతాల్లో పెద్ద ఉద్యమాలు జరిగాయని ఆయన చెప్పారు.
ఒకే భాష, సంప్రదాయాలు, సంస్కృతి కలిగిన తెలుగువారంతా ఒకచోట కలిసిన తర్వాత ఈ ఏభై ఏళ్ళలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని, తెలుగువారి కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయంగా ఇనుమడించాయని ఆయన చెప్పారు. బంద్ సరికాదు... రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు టిఆర్‌ఎస్ బంద్ పిలుపు ఇవ్వడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ టిఆర్‌ఎస్ రాజకీయ ఉద్దేశా లు ఏవైనా ప్రజలమనోభావాలు దెబ్బతినకుండా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఉద్యమాలు, త్యాగాలతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందని, అన్ని ప్రాంతాల వారు ఉమ్మడిగా దీనిని జరుపుకొంటారని, బంద్‌కు పిలుపు సరికాదని అన్నారు. వరదల బాధితులను ఆదుకోవాలి... రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వాటివల్ల ఏర్పడిన వరదల బాధితులను ఆదుకోవడానికి అధికార యంత్రాంగం తక్షణం రంగంలోకి దిగాలని చంద్రబాబు కోరారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu ancient classical language Andhra Pradesh Chandrababu Naidu tcld2006
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home