నెట్ అంతా మీ జేబులో!
ఒకప్పుడు విజ్ఞాన సర్వస్వాలు చేసిన పనిని ఈరోజు సెర్చింజిన్లు చేస్తున్నాయి. దేని గురించి సమాచారం కావాలన్నా క్షణాల్లో మనముందు తెచ్చిపెడుతున్నాయి. కానీ, అవసరం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఇంటర్నెట్ మనకు అందుబాటులో ఉంటుందని చెప్పలేం. అలాంటప్పుడు సెర్చింజిన్ కావాలంటే... వెబరూవైపు చూడాల్సిందే.
సాఫ్ట్‌వేర్ ప్రపంచానికి భారతీయ మేథస్సు అందించిన కానుక వెబరూ. ఐఐటీ ముంబై ఇంజనీరింగ్ విద్యార్థులు దీన్ని రూపొందించారు. దైనందిన జీవితంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో రెండు ఉదాహరణల ద్వారా చూద్దాం.
* ఏదో పనిమీద హైదరాబాద్ వెళ్లారు. కాస్త సమయం ఉండటంతో అలా తిరిగొద్దామని బయల్దేరారు. చార్మినార్ చేరుకున్నారు. చూస్తూ ఉంటే ఆ చారిత్రక కట్టడం నేపథ్యం, విశేషాలు తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే జేబులోంచి సెల్‌ఫోన్ తీసి వెబరూ సాఫ్ట్‌వేర్‌ను ఒపెన్ చేసి చార్మినార్ అని టైప్ చేశారు. అంతే క్షణాల్లో సమస్త విశేషాలు మీ ముందు ప్రత్యక్షం.
* కాలేజీలో మీరూ, మీ మిత్రుడూ ఒక పుస్తకంపైన మాట్లాడుకుంటున్నారు. ఆ పుస్తకం రచయిత, రచనా కాలం గురించి మీ ఇద్దరి అభిప్రాయాలు కలవట్లేదు. ఏది సరైందో తెలుసుకోవటానికి మీ దగ్గరున్న పీడీఏ (పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్)ను తీసి ఆ పుస్తకం పేరుతో సెర్చ్ చేశారు. వివరాలన్నీ వచ్చేశాయి.
అంటే విజ్ఞానసర్వస్వం మీ జేబులోకి వచ్చేసిందన్నమాట. మరోమాటలో చెప్పాలంటే నెట్ కనెక్షన్‌తో పని లేకుండా మీతోపాటే ఎక్కడంటే అక్కడికి వచ్చే సెర్చింజిన్ ఇది. ఎలా సాధ్యమైంది?
సొంత అనుభవంలోంచి...
మూడేళ్లక్రితం రాకేష్ మాథుర్ తన మిత్రుడు బ్రాడ్లీ హుసిక్‌తో కలిసి అమెరికాలోని అలస్కాలో పర్యటించారు. అక్కడి విశేషాలు వారికి ఆసక్తి కలిగించాయి. వివరాలేమిటో తెలుసుకుందామంటే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదు. అప్పుడే నెట్‌తో సంబంధం లేని సెర్చింజిన్ అన్న ఆలోచన తట్టింది. దాన్ని ముంబై ఐఐటీ విద్యార్థులతో పంచుకున్నారు. అందరి ప్రయత్నాల వల్ల వెబరూ సాఫ్ట్‌వేర్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం దీన్ని అమెరికా, భారత్‌లను కేంద్రంగా చేసుకొని విస్తృత వినియోగంలోకి తేవటానికి రాకేష్ సారథ్యంలోని వెబరూ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను www.webaroo.com సైట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది నడవటానికి కంప్యూటర్‌లో విండోస్ ఎక్స్‌పీ లేదా విండోస్ 2000 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సెల్ తదితర మొబైల్ పరికరాలయితే విండోస్ పాకెట్ పీసీ 2003 ఎస్‌ఈ లేదా విండోస్ మొబైల్ 5.0 ఉండాలి. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ నడిచేలా వెబరూ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
వెబరూ పని చేసేదిలా
వెబరూ కంపెనీకి చెందిన సర్వర్లు ఇంటర్నెట్‌ను వెదికి వివిధ అంశాలకు సంబంధించిన అసంఖ్యాక వెబ్‌సైట్లను, పేజీలను పట్టుకుంటాయి. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఆల్గరిథమ్స్ ఈ సమాచారాన్నంతటినీ విశ్లేషిస్తాయి. తద్వారా ఒక్కో అంశానికి సంబంధించిన అప్రధాన సమాచారాన్ని తొలగించి ముఖ్యమైన సమాచారాన్ని ఒక దగ్గర పోగుచేస్తాయి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఆ సమాచారాన్ని కుదించి 'వెబ్‌ప్యాక్' రూపంలో సిద్ధం చేస్తుంది. ఈ విధంగా తయారైన వెబ్‌ప్యాక్‌లు వెబరూ సైట్లో దాదాపు 400 వరకూ ఉన్నాయి. వీటిని రాజకీయాలు, సంస్కృతి, వార్తలు, క్రీడలు, వ్యక్తులు, ఆరోగ్యం, పర్యాటకస్థలాలు, టెక్నాలజీ, వికిపిడియా వంటి వివిధ విభాగాల కింద వర్గీకరించారు. వీటిల్లోంచి నచ్చిన వాటిని ముందుగా కంప్యూటర్లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ల్యాప్‌టాప్, పీడీఏ, సెల్‌ఫోన్ వంటి మొబైల్ పరికరాల్లోకి మార్చుకోవచ్చు. దీంతో సెర్చింజిన్ మీతోపాటు ఎక్కడికంటే అక్కడికే వచ్చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించిన తాజా సమాచారం కావాలనుకున్నప్పుడు వెబరూ సైట్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఏ రంగంలోనైనా మౌలికమార్పులను తీసుకొచ్చినప్పుడు అవి గొప్ప సంచలనాలను నమోదు చేస్తాయి. సెర్చింజిన్ రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టటం వల్లనే గూగిల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజంగా ఎదిగింది. వెబరూ కూడా అంతటి ప్రాధాన్యత ఉన్న సేవలనే తీసుకొచ్చింది. మరి, ఇంటర్నెట్ ప్రపంచం వీటిని ఎలా ఆదరిస్తుందో చూడాల్సిందే.
|
|
Courtesy: ఈనాడు
1 Comments:
hi kiran, i tried webaroo many days back. their idea is good, but not so innovative. to avail the features, first we must download the entire site, so that it cld be indexed into our COMP or PDA.
This can be easily donw with website downloaders, and indexing cld be automatically done with windows indexing tool. But only thing is they hav interface with mobiles and PDAs.
Post a Comment
<< Home