తెలుగు భాషాభివృద్ధికి అడ్డుతగులుతున్నదెవరు?
- సి. రామచంద్రరావు
ఆంధ్రప్రదేశ్ అవతరించి 50 సంవత్సరాలు. ఈ అర్ధ శతాబ్దకాలంలో తక్కిన రంగాల్లోలాగే తెలుగు భాషాభివృద్ధి తీరుతెన్నుల్ని విశ్లేషించు కోవలసిన సందర్భం ఏర్పడింది. స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు భాష కనుమరుగైపోతుందని కొందరూ, అందుకు కారణమవుతున్న ఆంగ్ల భాషా ప్రభావాన్ని నిలవరించాలని మరికొందరూ, తెలుగింటి భాషను వాడాలని ఇం కొందరూ అనేకానేక కోణాలనుంచి వివరిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, బాధపడు తున్నారు. ఆంగ్లపదం లేకుండా 'అచ్చ తెలుగు'లో మాట్లాడాలని పోటీలు నిర్వ హిస్తున్న సంస్థలు కొన్ని.
తెలుగు గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటటానికి అందరూ చదివి వినిపించే పద్యం ఇది
'తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ,
ఎల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స'.
ఈ పద్యం లో ఒకే అర్థాన్ని సూచిస్తూ రెండు రూపాలతో ఓ పదం ఉంది. 'భాష, బాస' ఆ రూపాలు. 'భాష' సంస్కృత పదం. తద్భవరూపం 'బాస'! గుర్తించదగిన మార్పులు రెండు ఇందులో ఉన్నాయి. పదాది మహాప్రాణం 'భా' అల్పప్రాణంగా మారింది. పదాంత 'ష' కారం 'స' కారమయింది. ఒకరే రాసిన పద్యంలో, పక్క పక్కన పదరూపాలున్నాయి. ఈ మార్పు అందరికీ అంటే పండితులకూ, పామ రులకూ తెలిసినదే. భాషాభక్తిని చాటుకోవడానికి పదే పదే సదస్సుల్లో వల్లెవేసే వారు పద్యంలో కనిపించే భాషాపరమైన మార్పును గుర్తించారు గాని అనుసరిం చలేదు. కర్ణుడు చావుకి కారణాలనేకమన్నట్లు, తెలుగు భాషాభివృద్ధికి అడ్డంకులు వాటంతట అవి వచ్చినవి కావు. భాషాభిమానుల వల్ల ఏర్పడినవేగాని, భాషా వ్యవహర్తల వల్ల కలిగినవి కావు.
అందరూ ఎక్కి తిరిగే ఆర్టీసీబస్సుల నెంబర్లను తెలుగు అంకెల్లో రాయించి ఆంధ్రభాషామతల్లికి చేసిన సేవను ఆబాలగోపాలం గుర్తించే ఉంటారు. ప్రతి రోజూ వేలాది మంది ఆంధ్రప్రదేశ్ 'సచివాలయా'నికి వెళ్లివస్తుంటారు. వారిలో ఒక్కరైనా సచివాలయానికి వెళ్లి వచ్చామన్నవారు లేరు. 'సంవిధానాన్ని' అర్థం చేసుకున్నవారు లేరు. 'దూరదర్శన్' ఓ టీవీ ఛాన్‌ల్‌గా గుర్తింపేగానీ 'టీవీ'కి ప్రత్యామ్నాయంకాదు. కాలేదు. 'ఆంధ్రరాష్ట్రం' అన్నంత సులభంగా ' ఆంధ్రప్ర దేశ్' అని పలకలేకపోతున్నాం. కరెంటు షాకు కొట్టిందని జనం చెబుతుంటే 'విద్యుదాఘాతం'తో మరణించారని ప్రజల కోసం రాస్తున్నవారు, పాఠ్యపుస్తకాల్లో ప్రథమ స్వాతంత్య్రోద్యమకాలం నాటి వ్యాకరణ భాషనే వాడుతున్నా పట్టించు కోకుండా- 'ఇంటిభాషను, ప్రజల భాషను, జానపద భాషను, మాండలిక భాష ను' వాడాలని సెలవిచ్చేవారు కోకొల్లలు. బోధన బుర్రకెక్కక బడి వదిలి వెళ్లిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. అర్ధ శతాబ్దంగా జరుగుతున్న తంతును అందరం చూస్తూనే ఉన్నాం.
ఇక భాషాశాస్త్రాన్ని ఔపోసన పట్టిన మహానుభావులు ఎందరో ఆంధ్రదేశంలో ఉన్నారు. భాషాశాస్త్ర విషయాల అనువర్తన కంటే ఆంగ్లంలో ప్రకటించడాలూ, తద్వారా ఒనగూడే ప్రయోజనాలూ ముఖ్యమయ్యాయి. మార్గనిర్దేశనం చెయ్య వలసిన తమపని చెయ్యకుంటే భాషా వికాసం సహజంగా జరుగుతుందేగాని ప్రణాళికాబద్ధంగా ప్రజాహితంగా సాగదు. మందగిస్తుంది. ఫలితం భాషా సంక్షో భమేగాని సంక్షేమం మాత్రం గాదు.
అయినప్పుడు తెలుగు భాషా హంతకులెవరు? ద్వేషించేవారెవరు? దూరంగా ఉంచేవారెవరు? తల్లిభాషకు పిల్లలను దూరం చేస్తున్నవారెవరు? తెలుగు భాషను పట్టి చూపించేదెవరు? ఒకవేళ చూపించినా పాటించేదెవరు? తెలుగుభాష కనుమరుగవుతుందంటున్నవారు ఎందుకు కనుమరుగవుతుందో చెప్పాలి గదా? తెలుగుభాషను మాతృభాషగా నిలపాలంటే ఏం చెయ్యాలో సూచించాలి గదా! తెలుగు భాషా సహజ ధ్వని నిర్మాణరీతులకి దూరం దూరంగా పోతున్నవారే తెలుగు భాషాభివృద్ధికీ, గౌరవానికీ, గౌరవ సాధనకూ నడుం కట్టుకొన్నట్టు గావుకేకలు పెడుతున్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు.
రైతులు గిట్టుబాటు ధరలు కావాలని తెలుగులోనే అడుగుతున్నారు. విని యోగదారులు ధరలు అందుబాటులో ఉండాలంటున్నారు. కూలి పెంచాలనీ కూలీలు గొంతెత్తుతున్నారు. కార్మికులు జీతాలు పెంచాలంటున్నారు. వాన కురిసి నా, మెరుపు మెరిసినా అందాన్నీ ఆనందాన్నీ ఇంటి భాషలోనే తెలుగు బాలలు పంచుకుంటున్నారు. ఎటొచ్చి విద్యావంతులు కావాలని బడికి చేరేసరికి ఇంటి భాషకూ బడిభాషకూ పొంతన కుదరక బిక్కమొహాలు వేస్తున్నారు. అంతరాలెం దుకో అర్థంకాక బడికి రాకుండా పోతున్నారు. అంటే జన జీవితంలో ముడివడిన తెలుగును కాకుండా, వారికందని, అంతుబట్టని తెలుగు నేర్పుతున్నారు. బాలలు మన భాష కాదని బడివైపు రావడానికి భయపడుతున్నారు.
'తెనుగునకు వర్ణములు ముప్పదియాఱు' అని చిన్నయసూరి చెబితే యాభై య్యారు వర్ణాలు నేర్పుతున్నారు. బండి 'ఱ'ను సూరి చెప్పలేదు 'చ, జ'లు సవర్ణా లన్నాడు. 'ఐ ఔ'లు లేవు. సున్న- వర్గ పంచమాక్షరాలకు ప్రత్యామ్నాయం మాత్ర మే. విసర్గ సంస్కృత పదాల్లో తప్ప తద్భావాలలో లేదు. వాడుకలో హకారాది పదాలు లేవు. ఇవిపోగా మిగిలిన తెలుగు వర్ణాలు 29. అవి- అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ, క, గ, చ, జచ ట, డ, ణ, డ, ణ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, స, ళ- వీటినే నేర్పించాలి. వీటిలో ఏర్పడిందే అచ్చ తెలుగు, ఆంగ్ల భాషా పదాలు లేనిది అనికాదు.
ఏ భాషకైనా ఆదాన ప్రదానాలు సహజం. అవసరానికి తగినట్టు ఇతర బాషా పదాల స్వీకరణఉంటుంది. తనదైన భాషాంతర్గత ధ్వని నిర్మాణ పద్ధతులనను సరించి రకరకాల మార్పులతో పదాలను స్వీకరిస్తుంది. ఆంగ్లపదం 'ఏౌటఞజ్ట్చీజూ' ను 'ఆసుపత్రి'గా మార్చిన తెలుగు భాషా వ్యవహర్తల విజ్ఞతే మనకాదర్శం కావా లి. ఆదానపదాలు అర్థ పరిణామం పొందవచ్చు. విశేషార్థాలను సూచించవచ్చు. పరిమితార్థాన్ని బోధించవచ్చు. వర్ణలోపాది వికారాలను పొంది సమీకరణ చెంది, తెలుగుభాషాపదమే అన్నంతగా రూపాంతరంపొందుతుంది. నోటికి పండుతుం ది. ఇది ప్రపంచ భాషలన్నింటిలోనూ జరిగే ప్రకియేగాని ఏ ఒక్కభాషకో పరిమి తమయింది కాదు. సంస్కృతం నుంచి అనేక పదాలను తెలుగు స్వీకరించింది. ఆ పదాలను తెలుగు భాషా ధ్వని నిర్మాణ సూత్రాలననుసరించి తెలుగు మాట్లేడే వారు మార్చుకొన్నారు. సాహిత్య భాషావాదులు ఒప్పుకున్నారు. స్థూలంగా చెప్పాలంటే నాటి నేటి తెలుగు మహాప్రాణాలన్నీ అల్పప్రాణాలయ్యాయి. సంయుక్తవర్ణాలు ద్విరుక్తంగానో, అసంయుక్తంగానే మార్పు పొందాయి. 'శ,ష'లు 'స'కారంగా మారాయి. వట్రుసుడి అవసరం లేదు. 'జ్ఞ' 'న'కారంగానూ, 'ఙ, ః' (విసర్గ)లు అనుస్వారంగానూ రూపాంతరం చెందాయి. ఇటువంటి సహజమైన మార్పులను గుర్తించి ఆచరించి తెలుగును తెలుగుగా బతికిద్దాం. ఇవే సూత్రాలు ఆంగ్లభాషాపదాల స్వీకరణకు నప్పుతాయి. ఇదే ఆంధ్రరాష్ట్ర స్వర్ణోత్సవ వేళ తెలుగు భాషాభిమానులు చెయ్యవలసిన ప్రతిన.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Telugu , Andhra Pradesh formation 50 years , language , literature , Chinnayyasuri , P. Ramachandra Rao , Andhra Jyothi November 2005
0 Comments:
Post a Comment
<< Home