తెలుగు సబ్జెక్టు తప్పనిసరి - అమెరికా ఆంధ్రుల ఆకాంక్
హైదరాబాద్, జూలై 14 (ఆన్‌లైన్): తెలుగు జాతి ప్రజలలో తెలుగు భాష తెలియని తరం ఒకటి రూపొందడంపట్ల ఇక్కడే కాదు..ఖండాంతరాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలోని ప్రవాసాంధ్రులు మన పాఠశాల విద్యా శాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి చేసిన విన్నపమే ఇందుకు మంచి దృష్టాంతం. కార్పొరేట్ పాఠశాలలతో సహా రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదవడాన్ని తప్పనిసరి చేయాలని ప్రవాసాంధ్రులు మంత్రికి విన్నవించారు.
ఇటీవల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్ళిన మంత్రికి అక్కడి తెలుగు ప్రజలు చేసిన సూచనల్లో ఇది ప్రధానమైనది కావడం గమనార్హం. మన పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం అవసరమేనని కొందరు చెప్పినా, తెలుగు సబ్జెక్టు లేకుండా చదువులు ముగించడం అవాంఛనీయమని ముక్త కంఠంతో చెప్పారట..! తెలుగు రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలు, రాత కోతలన్నీ ఇంగ్లీషులోనే జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ఐ.ఎ.ఎస్.లు పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో పని చేస్తున్నందువల్ల ఇంగ్లీషు తప్పడంలేదని ప్రభువులు సెలవిస్తుంటారు. మరి విద్యలో తెలుగును తప్పనిసరి చేయడానికి ఏం తెగులు? అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. మన రాష్ట్రం కాని వ్యవసాయ శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య తొలిసారిగా వ్యవసాయ శాఖ వారాంతపు నివేదికలను తెలుగులో రూపొందిస్తున్నారు. దీన్ని మాత్రం ఎవరూ ఆదర్శంగా తీసుకోరు. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో..ముఖ్యంగా హైదరాబాద్‌లో తెలుగు చదవటం రాని, కనీసం తెలుగు మాటలు వినని పిల్లలు వేల సంఖ్యంలో ఉన్నారు.
ఇంటర్మీడియట్‌లో ద్వితీయ భాషగా తెలుగును ఎంచుకునేవారు సగం మందికంటే లేకపోవడం తెలిసిందే. తెలుగు రాకపోవడాన్ని (పూర్తిగా ఆంగ్లంలో సంభాషించడాన్ని) ఒక అర్హతగా భావించేవారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో తల్లిదండ్రులే అధికం. కానీ, ఈ పరిస్థితి పట్ల రాష్ట్రానికి దూరంగా విదేశాల్లో ఉన్న ఆంధ్రులు ఆందోళన చెందడమే ఇక్కడ విశేషం.
లెక్కల్లో భేష్..ప్రాక్టికల్స్ పూర్..!
మన భుజాన్ని మనమే తట్టుకోవడం అని అనుకోకపోతే లెక్కల్లో మన రాష్ట్రానికి చెందిన పిల్లలే ఎక్కువ ప్రతిభ చూపుతున్నారన్నది సత్యం. అయితే, ప్రాక్టికల్ నాలెడ్జ్ (ప్రత్యక్ష అనుభవం) మాత్రం మన విద్యార్థులకు లేదు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు మన రాష్ట్రంలో పాఠశాల విద్యగురించి వ్యక్తీకరించిన అభిప్రాయాలలో ఇదొకటి. లెక్కలుతోపాటు సైన్స్‌లో కూడా మనవారు ఫర్వాలేదని, సైన్స్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ సమస్య ఎక్కువని ప్రవాస భారతీయ నిపుణులు రాష్ట్ర మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి చెప్పారు.
0 Comments:
Post a Comment
<< Home