అన్నమయ్య కీర్తనలకు 'ప్రసార' సహకారం
కేఎస్ శర్మ
చెన్నై, జూలై 1 (న్యూస్‌టుడే): పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కీర్తనలపై తిరుమల-తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ నిర్వహించే సంకీర్తనా గాన కార్యక్రమాలకు దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా ప్రసార సహకారం అందిస్తామని 'ప్రసారభారతి' ప్రధాన కార్యాచరణ అధికారి (సీఈఓ) కె.ఎస్. శర్మ పేర్కొన్నారు. తితిదే అన్నమాచార్య ప్రాజెక్ట్, నగరంలోని తితిదే స్థానిక సలహా మండలి, అభినయ ఆర్ట్ ఆకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అన్నమయ్య 597వజయంత్యుత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆళ్వారుపేటలోని నారదగాన సభ సద్గురు జ్ఞానానంద హాలులో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కె.ఎస్. శర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 12 రేడియో స్టేషన్ల ద్వారా తితిదే తమ ప్రసార సహకారం పొందవచ్చని తెలిపారు. దూరదర్శన్ రూపొందించనున్న ఓ ఆధ్యాత్మిక ధారావాహికకు తితిదే ఆర్థిక సహాయం కూడా అందించనుందని తెలిపారు. ఈ విధమైన పరస్పర సహకారం తితిదే లక్ష్యాలు ప్రజలకు చేరేందుకు తోడ్పడుతుందని అన్నారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహావిద్వాంసులు రేడియో, దూరదర్శన్ కోసం చేసిన కచేరీల సీడీలను ప్రసార భారతి విక్రయిస్తోందని గుర్తు చేశారు. తితిదే వంటి సంస్థలకు అవి ఎంతో ఉపయుక్తంగా ఉండగలవని పేర్కొన్నారు. భారతీయ సంగీతం పాశ్చాత్య సంగీతంలా కాకుండా.. ఆధ్యాత్మికతతో మమేకమై ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చెన్నై నగర పోలీస్ కమిషనర్ ఆర్. నటరాజ్ తన ప్రసంగంలో కర్ణాటక సంగీత త్రిమూర్తులకు సుమారు రెండు శతాబ్దాల ముందు వెలసిన అన్నమయ్య కీర్తనలు ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. కేవలం త్రిమూర్తులే కాకుండా మన వాగ్గేయకారులందరూ భక్తిమార్గంలోని ఔన్నత్యాన్నే చాటారని గుర్తు చేశారు. 'భజ గోవిందం...' అన్న శంకరాచార్యుల అంతర్యం కూడా అదేనని వ్యాఖ్యానించారు. తమిళ సాహిత్యంలోని తిరుమూలర్, తిరువళ్ళువర్ వంటి వారూ ఇదే చెప్పారని సోదాహరణగా వివరించారు. ఆ విధంగా దేశంలోని అన్ని భాషలు, మతాలు భక్తి మార్గం ఔన్నత్యాన్నే చాటుతున్నాయని పేర్కొన్నారు. 'పరిత్రాణాయ సాధునాం...' అన్నట్టు ప్రజలలో భక్తి మార్గం నశించి హింసా ప్రవృత్తి ప్రబలినప్పుడు ఓ అన్నమయ్యలా విష్ణువు అవతరిస్తాడని వ్యాఖ్యానించారు. ముందుగా ఈ కార్యక్రమం తితిదే పురోహితులు శ్రీనివాసాచారి, హరిహరనాధాచారీల 'వేదాశీర్వచనం'తో ప్రారంభమైంది. ఇంకా ఈ ప్రసంగ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఆనంద్‌కుమార రెడ్డి, తితిదే చెన్నై కేంద్ర మాజీ అధ్యక్షుడు జయప్రసాద్, అధ్యక్షుడు మునుస్వామి పాల్గొన్నారు. అభినయ ఆర్ట్ అకాడమి వ్యవస్థాపకురాలు భాగవతుల రమాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Courtesy: ఈనాడు
0 Comments:
Post a Comment
<< Home